Monday, September 1, 2008

ఓం రుబ్బుడాయ నమహా --- ఓం బాదుడాయ నమహా

అది నేను "జూ"నియర్ ఇంటర్ కాలేజీలో చేరబోతున్న రోజు.అంటార్టికా ఖండం నుంచి తీతువు పిట్ట నీకు మూడిందే అన్నట్టు భయంకరంగా సింగుతోంది. ఆటోవాడ్ని కాలేజీ ముందు ఆపమనగానే, వాడు సడెన్ బ్రేక్ సడెన్ గా వేసి, కాలేజి వంక అసహ్యంగా, నా వంక అత్యంత జాలిగా చూసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు.

ఫార్మాలిటీస్ అయ్యాక, మా ప్రిన్సిపాల్ నా చేతిలో ఒక పేపర్ పెట్టాడు. హాలిడేస్ లిస్టేమో అని ఆత్రంగా తెరిచిచూసాను. అది.. అది.. టైం టేబుల్. దాని సారాంశం నా భాషలో క్లుప్తంగా చెప్తా."పొద్దున్నే నాలుగింటికి లేచి ఓం రుబ్బుడాయ నమహా అనుకుంటూ రోలు చుట్టూ వందసార్లు తిరిగి, పుస్తకాలు ముందేసుకుని రుబ్బాలి. తర్వాత ఓం బాదుడాయ నమహా అనుకుంటూ రోకలి ముందు వెయ్యిసార్లు పొర్లాక క్లాసుకెళ్ళాలి. అక్కడ సారు సాంబారు, నల్లతారు కలిపితే సెలయేరు అవుతుందని బోధించినా నోర్మూసుకుని బాదించుకోవాలి. సాయత్రం మళ్ళీ ఓం రుబ్బుడాయ నమహా అని లక్షసార్లు అనుకుని సారు చెప్పినవి, చెప్పనవి, చెప్పబోయేవి, చెప్పలేనివి అన్నీ కలిపి అర్ధరాత్రి వరకు రుబ్బేయాలి.సరిగ్గా రుబ్బని మొండిపిల్లలకి క్రిమీభోజనం, కుంభీపాకం లాంటి లైటువెయిట్ శిక్షలు విధించబడతాయి".అది చూసి కళ్ళు తిరిగిపడిపోయాను.

కొన్ని యుగాల తర్వాత కళ్ళు తెరిచి "నేనెక్కడ వున్నాను. నాకేమయ్యింది" అన్నాను తెలుగు సినిమా హీరోయిన్లా.. "క్లాసురూములో వున్నావు. నువ్వు పడిపోయినా, ఈ సబ్ కాన్షస్ మైండ్ పాఠాలు వింటుందని ఇక్కడకి తీసుకొచ్చారు" అంది పక్కనమ్మాయి మెరుస్తున్న కళ్ళతో. ఇంతలో ఎవరివో ఆర్తనాదాలు వినిపించాయి. ఆ కేకలు..ఆ కేకలు ఇంతవరకు పాఠాలు విన్న నా సబ్ కాన్షస్ మైండ్వి. ..అలా మొదలయ్యాయి నా రుబ్బుడు కష్టాలు.

ఆ కష్టాలు భరించలేక క్లాసులొ నాకు తలనొప్పి వచ్చేసేది. స్టడీ అవర్స్లో చెవి నొప్పి, స్లిప్ టెస్టులొ నాకేమి రాకపోతే పంటి నొప్పి. అప్పుడప్పుడు వెరైటీ కోసం కాలినొప్పి, వేలినొప్పి, గోరునొప్పి, జడనొప్పి వగైరా వగైరా.... ఇలా నేను నొప్పులు, వాటి గొప్పలు, తప్పుగా వాడితే నెత్తికి కట్టే బొప్పులు అనే విషయం Ph.D చేసి ఝండు బాం, అమృతాంజనం వారు సంయుక్తంగా అందించే డాక్టరేట్ అందుకోబోయే సమయంలో నా కర్మకాలి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసాయి. మా ప్రిన్సిపాల్ సారు పిలిచారు. లొపలకెళ్ళగానే "ఏంటి తల్లీ.. ఇలా చేసావు. లెక్కల్లో 150 కి 160 (???) వస్తాయి అనుకుంటే 140 మాత్రమే తెచ్చుకున్నావు. ప్రాక్టీసు సరిగ్గా చెయ్యలేదా..? చెప్పు" అని కిచ్ కిచ్ వేసుకోని గరగరమనే గొంతుతో గద్దించాడు.

ఊరికే సర్దాకి చదవాలినిపించక చదవలేదని చెప్తే చీరేస్తాడని నా ఆత్మసీత హెచ్చరించింది. అందుకని ఎందుకొచ్చిన గొడవలే అని మౌనంగా వుంటే నా మౌనాన్ని అపార్ధం చేసుకుని "సర్లే తల్లీ. బాధపడకు. బెటర్మెంట్ కట్టేసేయ్. ఈ సారి మంచి మార్కులు తెచ్చుకో" అనగానే సముద్రాలు పొంగుతున్న ఫీలింగ్, భూకంపం వచ్చినంత షేకింగ్, హెడ్ బ్రేకింగ్. నేను పరీక్షలకి కష్టపడి చదివేదే ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలని. పాసయిపోయాక కూడా మళ్ళీ పరీక్ష ఎందుకు రాయాలి..? ఆ క్షణంలో నాకు అర్జెంటుగా ఆడ సన్యాసుల్లో కల్సిపోవాలి అన్నంత విరక్తి వచ్చింది.

రూముకెళ్ళి ఏం చెయ్యాలో తోచక దీనంగా కూర్చున్నా. శ్రావ్య వచ్చి " ఏంటి విద్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు" అని అడిగింది."ఏముంది శ్రావ్యా.. బెటెర్మెంట్ ఎలా ఎగ్గోట్టాలా అని" అన్నా మరింత దీనంగా మొహం పెట్టి."ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది. ఎప్పట్లానే మళ్ళీ మోకాలి నొప్పి అని చెప్పు" అంది నవ్వుతూ.ఆక్షణంలో దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తొందర్లోనే నేను సన్యాసుల్లో చేరబోతున్న విషయం గుర్తు వచ్చి శాంతం శాంతం అనుకుంటూ ఎలానో నిగ్రహించుకున్నా. "మళ్ళీ నొప్పంటే చెప్పు తీసి కొడతారే. మీరేదైనా మంచి కత్తిలాంటి జబ్బు పేరు పుణ్యం కట్టుకోండే" అని బతిమాలుకున్నా."ట్యూమరో, కాన్సరో అని చెప్పు. భయపడిపోయి ఇంటికి పంపేస్తారు" అంది నాకుమల్లే GKలో జీరో లెవెల్ కి కింద , CK(సినిమా నాలెడ్జ్)లో ఇనిఫినిటీ కి పైన వుండే రేణు."చీ నోర్ముయ్.. ట్యూమర్, కాన్సర్ అని మనం చెప్పకూడదు. డాక్టర్ చెప్పాలి.." అంది ఇంకో అమ్మాయి..ఆ లోపు Bi.P.C పిల్ల నిషా అవిడియా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది."అప్పుడెప్పుడో ఊపిరి ఆడట్లేదని మాధురి అంటే దానికి పదిరోజులు సెలెవిచ్చారు. నువ్వు ఊపిరి ఆడట్లేదని నటించు." అంది విజయగర్వంతో...

నిజం చెప్పొద్దూ.. నాకూ ఆ అవిడియా పిచ్చపిచ్చ్గగా నచ్చేసింది. నొప్పి నొప్పి అని చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. అసలే ఆలస్యం చిరంజీవి బాలకృష్ణ అని సెట్టింగ్స్, కాస్ట్యూంస్ అన్నీ చకా చకా సిధ్ధం చేసి రిహార్సల్స్ కూడా చేసేసాం. నటించడం కూడా సుళువు. గాలి కొంచెం గాట్టిగా.... గబా గబా.... పీల్చాలి అంతే. కానీ.. కానీ... ఊపిరి ఊరికే ఊసుపోక ఆందకుండా పోదని,దానికీ కొన్ని బలమైన కారణాలు వుంటాయన్న విషయం ఆ ఊపులో మ ఎవ్వరి ఊహకి అందలేదు. మనమొకటి తలిస్తే మాస్టార్లొకటి తలుస్తారని మా ఫిజిక్స్ సారు మా డ్రామా లొకేషన్ హాస్పిటల్ కి మార్చేసారు. లొకేషన్ ఏదైనా డెడికేషన్ తో చెయ్యగల సత్తా నాకున్నా బలంగా ఎత్తుగా ఎస్వీ రంగారెడ్డిలా వున్న డాక్టరుని చూస్తే కొంచెం దడ పుట్టింది.

ఆయన విషయం కనుక్కుని స్టెతస్కోపుతో నా గుండె ఇంకా కొట్టుకుంటుందని నిర్ధారించేసుకుని "పరీక్షలు ఏమైనా వున్నాయా" అని అడగ్గానే.. మేటర్ తెల్సిపోయిందేమొనని టెన్షన్ వచ్చేసి గబుక్కున స్టూల్ మీంచి జారిపడబోయాను. ఈలోగా మా ప్రిన్సిపాల్ చేతిలో ఏదో ఇంజెక్షన్ పట్టుకుని దిగాడు. "డాక్టరు గారు మా పిల్లకి ఊపిరాడటం లేదని డెరిబిలీన్ ఇంజెక్షన్ తెచ్చా. చేసేయండి." అంటుంటే ఆయన్ని ఎత్తి గిర గిరా తిప్పి అవతల పడేయాలన్నంత కోపం వచ్చింది. దిక్కుమాలిన కంగారు . అవతల డాక్టరు చూసున్నాడుగా. "ఏమీ అవసరం లేదు. పరీక్షల టెన్షన్ అంతే" అంటున్నా సరే ఆగకుండా "పర్లేదు చేసెయ్యండి. పడి వుంటుంది.అసలే వారంలో పరీక్షలు" ఆయన అంటుంటే నిషా వంక దీనంగా చూసా..అదేమో అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అన్నట్టు ఇంకా దీనంగా చూసింది.

ఈలోపు నర్స్ లైటేసింది. అవసరమైనపుడు అసలు పని చెయ్యని నా బుర్ర ఆ క్షణం అడక్కుండానే పని చేసి ఒక తొక్కలో థియరీని కనిపెట్టి చచ్చింది.. "ఆరివున్న బల్బ్ స్విచ్ నొక్కితే వెలిగింది. అదే వెలుగుతున్న బల్బ్ స్విచ్ నొక్కితే ...... ఆరిపోతుంది. అలానే ఊపిరి లక్షణంగా ఆడుతున్న నాకు ఆ ఇంజెక్షన్ ఇస్తే నా ఊపిరి... ఆగిపోతుందా" అంత వెధవ లాజిక్ వర్క్అవుట్ చేసిన నా బుర్ర మీద నాకే వెర్రి కోపమొచ్చింది. పోనీలే నా బుర్రని డైవర్ట్ చేద్దామని గోడల వంక, వాటి సున్నాల వంక చూడ్డం మొదలెట్టా. మరేమో గోడ మీద దండేసి వున్నడాక్టర్ గారి నాన్నారి ఫొటో ప్లేసులో నా మొకం కనిపించింది. నాకంత ఊహాశక్తి ఇచ్చిన దేవుడి మీద ఇంకా కోపం వచ్చింది.

ఈలోపు "మేస్టారు. మీరు కంగారుపడకండి. మై హూ నా" అని డాక్టరంకుల్ అంటుంటే ఆయన కృతజ్ఞత వరద నీరులా పొంగి పొర్లింది. "చూడమ్మా పరీక్షలు రిక్షాల్లాంటివి. మనం రిక్షాలాగేటోళ్ళమన్న మాట. అసలు రిక్షావోళ్ళు మన రిక్షా బక్కోడు ఎక్కుతాడా,బండోడు ఎక్కుతాడా, మనం తొక్కగలామా లేదా ఇలాంటి బెంగలు అసలు పెట్టుకోరు. అలాగే మనం కూడా మనం చదివెలగబెట్టిన ఒకే ఒక చాప్టర్లో నుంచి ప్రశ్నలు వస్తాయా, రావా మనం పాసవుతామా లేదాలాంటి వెర్రి సందేహాలు పెట్టుకోకూడదు. అర్ధమయ్యిందా... కాసేపు బయటికెళ్ళికూర్చో " అన్నారాయన. నాకు చిరాకేసింది. పాసయిపోయిన పరీక్ష గురించి నేనెందుకు బెంగ పెట్టుకుంటాను. కాసేపటికి మా ప్రిన్సిపాల్ బయటకి వచ్చాడు.డాక్టరంకుల్ ఏం చెప్పాడో కానీ "సర్లే తల్లీ.. ఈ పరీక్షలు గురించి పూర్తిగా మర్చిపో.. టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు" అంటుంటే నాకు డెబ్యూట్ సినిమాకే "నటీముత్యం" బిరుదు ఇచ్చినంత సంబరం వేసింది.

మొత్తానికి అలా పరీక్షల లంపటం అంత కష్టపడి వదిలించుకుని ఆటోలొ కూలబడి ఓ రెండుగంటల హైడ్రామా తర్వతా ప్రశాంతంగా, స్వేచ్చగా గాలి పీల్చుకున్నాను. అదొట్టి అనుమానపు గాలేమో, వెంటనే నాకో పిచ్చి డౌట్ వచ్చింది. "నిషా.. నాది ఏక్షన్ అని సారుకి అనుమానం వచ్చిందంటావా.." అని అడిగాను కుతూహలంగ...."నీ మొహం. ..నువ్వలా జీవించేస్తూ అరకొరగా ఊపిరి పీల్చడం వల్ల నిజంగా ఊపిరాడటంలేదేమో అని.. నాకేభయం వేసింది" అంది కోపంగా.

సరిగ్గా అప్పుడే ఆటో ఆగింది. ఆటోవాడు వెనక్కి తిరిగాడు. వాడు.. వాడు మొదటి రోజు కాలేజీలో డ్రాప్ చేసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయినోడు. "చెల్లెమ్మా. ఈ డొక్కు కాలేజీలో చదివి ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటున్నాను. నిన్ను చూస్తే గర్వంగా వుందమ్మా. ఆ ఆ రుబ్బుడు భూతం ప్రిన్సిపాల్ .......ని నమ్మించగలిగావంటే నీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. నీ రాక సీరియళ్ళకి స్వర్ణ యుగం, సువర్ణ యోగం తెస్తాయమ్మా..." అంటూ ఆటొ అన్నయ్య ఊగిపోతుంటే ఆ షాకుకి నాకు నిజంగానే ఊపిరాడటం మానేసింది.

Thursday, August 7, 2008

నేనుగానీ..బొమ్మగానీ..గీసానంటే..!

బొమ్మలు గియ్యడానికి ఓ తెల్ల కాగితం, ఓ HP పెన్సిల్, నటరాజ్ రబ్బరు, అప్సరా మర వుంటే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా..? ఎంత అమాయకులండి మీరు.. అలా ఎలా అనేసుకుంటారు? వీటితోపాటూ సమాజం అందించే ప్రోత్సాహం, గుర్తింపు కూడా కావాలి...ఈ సమాజం వుందే, అది కొంచెం విచిత్రమన్న మాట.దానికి ఇష్టం లేకపోతే మనలో అడవి బాపిరాజు/రాణి, రవి వర్మ/వర్మిణి వున్నా సరే కావాలనే అన్యాయంగా గుర్తించదు... నా విషయంలో అదే... అదే.. జరిగింది.

నాకో జీవితాశయం వుండేది/వుంది/వుంటుంది. అదే జనాల దిమ్మ తిరిగి, కళ్ళు చెమ్మగిల్లి, సంతోషంతో సొమ్మసిల్లేలా చేసే ఒక్క బొమ్మైనా ఈ జన్మలో నేను గియ్యగలగాలి. . అలాని నేను ఊరికే కలలు కని ఊరుకునే అమ్మాయిని కాదు. నేను గీసిన కుక్క నక్కలా వున్నా, నక్క కుక్కలా వున్న సరే నా కలల్ని నిజం చేసుకోవాలనే గట్టి పట్టుదల వున్నదాన్ని. అందుకే ఎనిమిదో తరగతిలో వుండగానే (అబ్బో అంత తొందరగానా అనకండి. దిష్టి తగులుతుంది) నా మొదటి ప్రయత్నంగా రాత్రిపగలూ కష్టపడి కత్తిలాంటి ఓ బొమ్మ గీసాను. ఓ చిన్న పూరిల్లు, ఉదయిస్తున్న సూర్యుడు, రెండు కొబ్బరి చెట్లు, ఇంటి ముందు సన్నగా ప్రవహించే ఓ ఏరు..! ఓస్ ఇదా.. నేను ఒకటో తరగతిలో గీసాను అనకండి.నాలో వున్న కళాకారిణి హర్ట్ అవుతుంది. ఆ బొమ్మ చూడగానే మా అమ్మ పొంగిపొరలుతున్న పుత్రికోత్సాహాన్ని తనలో దాచుకోలేక పంచుకోవడానికి పక్కింటికెళ్ళింది.నాకు తెల్సు నన్నావిడ పొగడ్తలతో ముంచేస్తుందని... అలా అని ఆవిడ ముందు నుంచుంటే ఫ్రీగా పొగడలేదు కదా.. అందుకని గోడ పక్కన నుంచున్నాను...ఆవిడ ఆ బొమ్మని పరీక్షగా చూసి "బావుంది.. ఈ మర్రి చెట్లు బాగా గీసింది" మర్రి చెట్లా... అవెక్కడ వున్నాయి..? అయినా పొడుగ్గా, సన్నగా వుండే కొబ్బరి చెట్లెక్కడ..?పొట్టిగా, గుబురుగా వుండే మర్రి చెట్లెక్కడ..? మరీ విడ్డూరం కాకపోతే.. ఈ సమాజం అంతే.. ముఖ్యంగా మా డ్రాయింగ్ మేడం. ఆవిడకి బాగా బొమ్మలెయ్యడం వచ్చని, అందుకే పిలిచి ఉద్యోగం ఇచ్చారని బాగా గర్వం...

ఒకసారి నా సృజనాత్మకతకి బాగా పదును పెట్టి అరటి పండుని గీసుకెళ్ళి చూపించానా..? పదికి రెండేసింది..నేను ఊరుకుంటానేంటి..? ఏంటింత అన్యాయమని ప్రశ్నించాను.. "అది అరటిపండులా వుందా అసలు..? అక్కడక్కడ ఉబ్బిన సైకిల్ ట్యూబులా వుంది. అయినా అరటి పండు ఎక్కడైనా ఎర్ర రంగులో వుంటుందా..? మళ్ళీ ముచ్చికకి ఆకుపచ్చ రంగు..కింద బొడిపకి నీలం రంగు.. ఎన్ని రంగులుంటే అన్నీ పూసేస్తావా..?" అని అవమానించేసి నా క్రివేటివిటీని అర్ధం చేసుకోకుండా వ్యర్ధం చేసేసింది.

ఇకపోతే ముగ్గులు.. ఎవరు చెప్పారసలు..ముగ్గంటే నాలుగు వైపులా ఒకేలా వుండాలని.. చుక్కలు సమాన దూరంలో వుండాలని.. పోత పోస్తే సన్నగా, నాజూగ్గా వుండాలని..ముగ్గుకి కూడా ఇన్ని రూల్సా..? నా ముగ్గు అయితే వెరైటీగా రెండు పక్కలా రెండు రకాలుగా, మూడో పక్క వేరే విధంగా, నాలుగో పక్క ఇంకో విధంగా చాలా బావుండేది. పోత కూడా ఒకచోట సన్నగా, ఒకచోట లావుగా చాలా డిఫరెంటుగా వుండేది. అయినా ఏ పనైనా కొత్తగా చేస్తే ఈ సుత్తి జనాలకి నచ్చుతుందేంటి..? మా అమ్మయితే మరీను "ముగ్గు కింద బై "శ్రీవిద్య" రాసుకోవే. లేకపోతే నేను పెట్టానేమో అనుకుంటున్నారు" అనేది. అర్ధం చేసుకోరూ......

అలా అలా సమాజం దృష్టిలో నేనో మంచి చిత్రకారిణిగా గుర్తింపబడాలని గట్టి పోరాటం చేస్తుండగా పదోతరగతి పరీక్షలు వచ్చేసాయి. మా జీవశాస్త్రం మేడం పిలిచి "శ్రీవిద్యా.. నీ మీద మన స్కూలు మొత్తం చాలా ఆశలు పెట్టుకున్నాము. పరీక్షల్లో మేటర్ మొత్తం బ్రహ్మాండంగా రాస్తావు.. బొమ్మలు మాత్రం మరీ ఎవరూ గుర్తుపట్టకుండా వేస్తావేంటసలు..? ఈ విషయం మీద కొంచెం శ్రద్ద పెట్టు తల్లీ.." అంది. ఆ క్షణంలో నా గుండె ఎన్ని ముక్కలు, చెక్కలు అయ్యిందో నేనే లెక్కపెట్టలేకపోయాను.ఆ రోజు అర్ధరాత్రి రెండుగంటల ఇరవై రెండు నిముషాల రెండు సెకన్లకి నా టాలెంటుని గుర్తించని సమాజం అంటే పిచ్చ కోపమొచ్చింది.ఇంక జీవితంలో బొమ్మలెయ్యకూడదని ఒక సంచలనాత్మకైన నిర్ణయం తీసుకున్నాను. అలా ప్రపంచం మొత్తం గాఢనిద్రలో వుండగా తనకి తెలీకుండానే ఓ గొప్ప చిత్రకారిణిని కోల్పోయింది.

ఇక పరీక్షల్లో ఎలా..? అందుకే "బాగు చెయ్యి-బాగుపడు" అనే సూత్రాన్ని ఫాలో అయిపోయా.. పరీక్షల్లో నా పక్కబ్బాయి అంత బాగా చదవడు. బొమ్మలు కూడా నా అంత స్టైలుగా, డిఫరెంటుగా గియ్యడం రాదు. ఏదో వున్నదున్నట్టు గీసేస్తాడు అంతే.. వాడి దగ్గరకి వెళ్ళి "ఒరేయ్ బాబు.. నీకు మొత్తం అన్ని సబ్జెక్ట్లు బిట్లతో సహా చూపిస్తాను. స్కూల్ ఫస్టు నా బదులు నీకొచ్చేసినా అస్సలేమనుకోను. నాకు మాత్రం నువ్వేసే బొమ్మలు చూపించి గట్టెకించు తండ్రీ" అని ఓ ఒప్పందాన్ని పకడ్బందీగా కుదుర్చుకున్నాను.

వాడు అప్పుడప్పుడు "నాకు మెడ నొప్పెడుతుంది. చాల్లే" అన్నా సరే తెలుగు నుంచి లెక్కల వరకూ అన్నీ జాగ్రత్తగా కాపీ కొట్టించాను. ఎదురుచూసినరోజు రానే వచ్చింది. అది నేను కాపీ కొట్టాల్సిన రోజు. చేతులు వణుకుతుంటే పేపర్ నెమ్మదిగా వెనక్కి తిప్పాను.. తీరా చూస్తే "ఉమ్మెత్త ఆకు నిర్మాణం గీసి భాగాలు గుర్తించుము" అని వుంది. అది చూడగానే నా మెదడులొ లైటు వెలిగింది. ఆ వెలుగులో ఉమ్మెత్తా ఆకు, గుర్తించాల్సిన భాగాలు మిలా మిలా మెరిసిపోతూ కనిపించేసాయి. అది చూసి అప్పటిదాకా నాలో అలిగి నిద్దరోతున్న చిత్రకారిణి నిద్రలేచింది. "వీజీ బొమ్మే కదా..నేను గీస్తా, గీస్తా" అని సరదాపడింది."సరే" అన్నా.. అయినా నా పిచ్చిగానీ నాలా మోడర్న్ ఆర్ట్ చేతిలో వున్నవాళ్ళకి మామూలుగా గియ్యడం ఎలా వస్తుంది.. ఎంత కష్టపడ్డా నా బుర్రలొ వెలుగుతున్న ఉమ్మెత్తకి, నా పేపర్ కనపడుతున్న ఉమ్మెత్తకి పోలికే కనపడలేదు. మెదడులో టింగుటింగుమంటూ మెరుస్తున్న అయిదు భాగాలు ఎక్కడ గుర్తించాలో అర్ధం కాక జుట్టు పీక్కుంటూ పక్కకి తిరిగాను. నా పక్కబ్బాయి నీ ఋణం తీర్చుకోనీ.. నా పేపర్లో కాపీ కొట్టు అన్నట్టు దీనంగా మొహం పెట్టి పేపర్ నా వైపు తిప్పి వుంచాడు. మరీ కళ్ళతో అంతలా బతిమాలేస్తుంటే కాదనలేకపోయా.. సరే అని చూసి గీసేసా..

పదో తరగతి రిజల్ట్స్ వచ్చాయి..నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. అది కాదు నా బాధ.. నా పేపర్లో చూసి కాపీ కొట్టినోడికి సెకండ్ క్లాసు వచ్చింది. అదీ ఫస్ట్ క్లాస్ ఒక్క మార్కులో పోయింది.వాడు నా దగ్గరికి వచ్చి "థాంక్స్. ఈసారి పరీక్ష పోతుందనుకున్నాను. నీ వల్ల 359 మార్కులు వచ్చాయి. అసలు NS కూడా చూపిస్తే తప్పకుండా 360 దాటేవి. నీకేమో ఆ బొమ్మ గీసి చెరపడంతోనే సరిపోయింది. అయినా నీకు బొమ్మలు గియ్యడం రాదని తెలీదా..? తెల్సీ అలా చేస్తావా..?" అనేసి వెళ్ళిపోయాడు. చీ ఎదవ జీవితం.. అయినా నాకు తెల్సు నాలో వున్న అపరిమితమైన టాలెంటుని, అర్ధం కాకుండా అద్భుతంగా గీసే మోడర్న్ ఆర్టుని ఈ పిచ్చి సమాజం ఎప్పటికీ గుర్తించలేదు. అందుకే ఎప్పటికైనా నేనూ ఈటీవీ సుమన్ లా ఒక టీవీ పెడతా.. నా బొమ్మలకి నేనే గుర్తింపు తెచ్చుకు తీరతా........!

Thursday, July 31, 2008

నేను స్కూలుకెందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే........!

చదువు వచ్చి మన మీద పడినా మనం వెళ్ళి చదువు మీద పడినా మనకే నష్టం.
చదువు రాకపోవటం ఒక యోగం
చదువుకోనక్కర్లేకపోవటం ఒక భోగం
చదువుకోవాల్సిరావడం ఒక త్యాగం
*************************************************
చిన్నప్పుడు ఇలా పైత్యం కలిపిన కపిత్వాన్ని చెప్పేంత తెలుగు రాదాయే... అందుకే బడి అన్న మాట వినగానేకాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ, కింద పడి దొర్లేస్తూ చదువు మీద నా నిరసనని తీవ్రంగా తెలిపేదాన్ని. అయినా సరే ఏ మాత్రం జాలి లేకుండా మా నాన్న ఎత్తి ఏట్లో పడేసినట్టు ఎత్తుకుని మరీ బళ్ళో పడేసేవారు.అదీ కాకుండా, మా అన్నయ్యకి ఎప్పుడూ వంద జ్వరం వుండేది. అందుకే ఎవరైనా మీ అన్నయ్య స్కూలుకెందుకు వెళ్ళట్లేదని అడిగితే "మరేమో మా అన్నయ్యకి జ్వరం ఇంచక్కా" అని చెప్పేదాన్ని. మా అమ్మేమో "చీ తప్పు ఇంచక్కా అనకూడదు. మా అన్నయ్యకి జ్వరం పాపం అని చెప్పాలి" అని కోప్పడేది.

అప్పటికీ తెలివిగా పొద్దున్న లేవగానే "అమ్మోయ్.. అమ్మోయ్..! నాకు జ్వరం వచ్చేసింది. నేను స్కూలుకెళ్ళను" అనేదాన్ని. వెంటనే నాన్న వచ్చి "బాబోయ్.. బాబోయ్ జ్వరమా అమ్మలు" అని ధర్మామీటరు తీసుకొచ్చేసేవాళ్ళు. ఆ దొంగ ధర్మామీటర్ ఎప్పుడూ అన్నయ్య పార్టీనే..వాడికి పాపం (ఇంచక్కా) 100 జ్వరం చూపించేది. నాకు మాత్రం అస్సలు జ్వరమే లేదని చూపించేదాన్ని. జ్వరం వుందని చూపించవా.. చూపించవా అని బతిమాలినా సరే చూపించేది కాదు. అందుకే దాని మీద బోలెడు కోపం వచ్చేసి డామ్మని కింద పడేసాను. అప్పుడు నాన్న "అల్లరిపిల్లకానా..! నీకు గారం ఎక్కువయిపోయింది. అసలు చెప్పిన మాట వినట్లేదు. పద స్కూలుకి" అని కళ్ళెర్రచేసి నన్ను భయపెట్టేసారు.

ఇంక అప్పట్నుంచి పోనిలే అని వాళ్ళ కోసం స్కూలుకెళ్ళేదాన్ని. అప్పుడు కూడా నా అభిప్రాయాలకి విలువిచ్చేవాళ్ళు కారు. "స్కూలుకెళ్ళడానికి నాకు బలం కావాలి. గిన్నెలో వున్నదంతా నా ప్లేట్లో పెట్టేయ్. మొత్తం నేనే తింటాను" అని గాట్టిగా ఏడ్చినా సరే అమ్మేమో "నువ్వు తినవు. ఏడ్వవు. అంతా ఎంగిలి చేసి అక్కడ పెడతావు." అని కొంచెమే పెట్టేది.
స్కూలుకెళ్ళాక బోలెడు సమస్యలు, ఆకలేస్తే బొటనవేలు నోట్లో వేసి చీక్కూడదు. నిద్రొస్తే బరా బరా బుర్ర గోక్కోకూడదు. ఇంకా తిక్క లేస్తే పక్కన కూర్చున్న పిల్లని గట్టిగా గిల్లకూడదు. నెమ్మదిగా కూడా గిల్లకూడదు అనుకోండి. పలకం, బలపం అరిగిపోయి, చేతులు నొప్పెట్టేవరకూ అక్షరాలు దిద్దుతూనే వుండాలి.ఒకసారి అలానే ఏదో దిద్దుతున్నాను. ఈలోపు మేస్టారు బయటకి వెళ్ళారు. ఎందుకో నా పక్కన పిల్ల నన్ను గిల్లుతుందేమోనని అనుమానంగా అనిపించింది. అందుకే ముందుజాగ్రత్తగా నేనే గట్టిగా గిల్లేసాను. అదేమో మేస్టారు చూసేసారు.

"ఓయ్ అమ్మాయి పలక తీసుకుని ఇటు రా.." అని పిలిచారు. వెళ్ళాక, పలక తీసుకుని దాని మీద అక్షరాలన్నీ చెరిపేసి " నేను దిద్దించిన అక్షరాలు ఇప్పుడు చూడకుండా రాయి" అన్నారు. నాకేమైనా భయమా..! గబా గబా రాసేసి ఆయనకి చూపించాను. "ఏంటివి" అని అదిగారు. ""అ ఆ"లు అని చెప్పాను ధైర్యంగా. "అక్షరాలు రాయమంటే పిచ్చి గీతలు గీస్తావా..? మొద్దు పిల్ల. చెయ్యి పెట్టు" అన్నారు. చెయ్యి పట్టాక స్కేలిచ్చుకుని టపీ టపీమని రెండు కొట్టారు. దాంతో మేస్టారి మీద కోపం వచ్చి ఆ రోజంతా ఏడుస్తూనే వున్నా..అమ్మకి చెప్తే అయ్యోపాపం అనకపోగా "నువ్వు బాగా చదువుకోవాలి అని కొట్టారు." అంది.నన్ను మొద్దు పిల్ల అన్నారన్నా పట్టించుకోలేదు. వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదని ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను.చించగా చించగా బంగారంలాంటి అవిడియా బుర్రలోకి వెలిగేసింది......

మర్నాడు అమ్మ చూడకుండా నా పుస్తకాల సంచీలో కొన్ని బొమ్మలేసుకుని బుద్దిగా స్కూలుకి బయదేరేసాను. మా ఇంటి సందు దాటి, కొంచెం దూరం నడవగానే సుధ పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చింది. వాళ్ళింట్లోకి వెళ్ళాను. సుధ పిన్నితో "పిన్నీ నాకు బోల్డు జ్వరం. అమ్మ మీ ఇంటికెళ్ళి గిరీషుతో(వాళ్ళ రెండేళ్ళ బాబు) ఆడుకొమ్మంది" అని చెప్పాను. ఇంచక్కా నా బొమ్మలతో,ఆ బాబుతో ఆడుకుని నా తెలివితేటలకి మురిసిపోతూ, ఎగురుకుంటూ ఆనందంగా స్కూలు వదిలే టైముకి ఇంటికొచ్చేసాను. ఆ ప్లానేదో భలే వుందనిపించేసి,రోజూ వెళ్ళిపోతే పిన్నికి అనుమానం వస్తుందన్న భయం కూడా లేకుండా, రెచ్చిపోయి రెండో రోజు కూడా వెళ్ళిపోయాను.కానీ ఆ రోజే నా జీవితం ఒక దారుణమైన మలుపు తిరగబోతుందని నాకు తెలీదు..తెలిస్తే వెళ్ళేదాన్ని కాదేమో..! ఇంటికెళ్ళేసరికి అమ్మ గుమ్మం దగ్గరే నుంచుంది.

ఎత్తుకుని డైరెక్టుగా చీకటి గదిలోకి తీసుకెళ్ళింది. నాకు విషయం అర్ధమయ్యేలోపే "అబద్దాలు ఆడతావా..? అబద్దాలు ఆడి స్కూల్ మానేస్తావా..? అని చేతుల మీద, కాళ్ళ మీద, వీపు మీద ఒకటే బాదుడు. అసలే నాకు తెల్సీ మా అమ్మ కొట్టడం మొదటిసారి, దెబ్బలు తప్పించుకోవడంలో పెద్దగా అనుభవం లేదు. అందునా చీకటి గది. నెక్స్ట్ దెబ్బ ఎక్కడ పడుతుందో ఊహించి చేతులు అడ్డు పెట్టుకుంటూ, మెలికలు తిరిగిపోతూ,గాట్టిగా ఏడుస్తూ కాసేపు డిస్కో డాన్సే డిస్కో డాన్స్. కాసేపటకి నీరసం వచ్చి డాన్స్ ఆపేసి, ఏడుపు మానేసి, తప్పు ఒప్పేసుకుని "ఇంకెప్పుడూ స్కూల్ మానను. అబాద్దాలు ఆడను. ఇంక కొట్టద్దమ్మా..!" అని బతిమాలటంతో బతికిపోయాను.

అలా నా మాస్టర్ ప్లానులోని ఒక బుల్లి ఫ్లా వల్ల,సుధ పిన్ని నాకు చేసిన అన్యాయం వల్ల, స్కూలో జైలులా, చదువో కష్టాల చెరువులా ఎంత అనిపించినా మా అమ్మ వీర ఉతుకుడుని దృష్టిలో వుంచుకుని అప్పట్నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్దిగా స్కూలుకెళ్ళాల్సి వచ్చింది పాపం నేను......

Saturday, July 12, 2008

రాజులనాటి కారులో జోరుగా హుషారుగా....!

మా టీములో "మా ఇంటికొస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేం పెడతారు" టైపులో ఓ సోది సాంప్రదాయం వుంది. కొత్తవాళ్ళంతా పాతవాళ్ళతో కల్సిపోవాలంటే పార్టీ ఇచ్చి తీరాలట. పార్టీ ఇచ్చి మరీ కొత్త పోగొట్టేసుకుని పాతబడిపోయి పని మొత్తం నెత్తిన రుద్దించుకోవడానికి నేనేమైనా చిన్నదాన్నా..? చితకదాన్నా..? కాదు కదా... అయినా సరే ఏమాత్రం భయ్యం,బత్తి లేకుండా వాళ్ళంతట వాళ్ళే అలుసు, బచ్చలి పులుసు తీసేసుకుని పార్టీకి మాంచి(?) ముహూర్తం పెట్టేసారు.
***
డబ్బులు, మబ్బులు, సబ్బులు ఎక్కువ కాలం వుండవు.అలాంటి అశాశ్వతమైన వాటి కోసం అనవసర హైరానా పడితే మాత్రం లేనిపోని జబ్బులు వస్తాయి.జరగాల్సింది జరగక మానదు.వదలాల్సింది వదల..కా.. మానదు. అందుకే వదిలించుకోవడాన్ని, విదిలించుకోవడాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించగలగాలి. అదే జీవిత పరమార్ధం.ఇదే ఈ విద్యా అమ్మాజీ ఉపదేశం. సందేశం. ఆదేశం. పాటించండి. సంతోషంగా జీవించండి.
***
అసలే నా సబ్బుల ఫిలాసఫీకి నేనే ఏకైక ఫాలోయర్నాయే..అందుకే బుద్దిగా బిల్లు విషయం మర్చిపోయి,పార్టీ పేరుతో పని ఎగ్గొట్టి షికారుకెళ్ళడం,రెస్టారెంటులో పీకల దాకా మెక్కడం, తిని తిరిగి అలిసిపోయి ఆఫీసుకొచ్చి సీట్లో అడ్డంగా పడి నిద్దరోవడం. ఇలా మంచి మంచి ఊహల గుంపుని ఆస్వాదిస్తున్నాను.వాటిని చెదరగెడుతూ మా టీం లీడ్ వచ్చాడు."శ్రీవిద్యా, మన టీములో ముగ్గురికి కార్లున్నాయి. మేము పదిమందిమి రెండు కార్లలో ఇరుక్కుని,సర్దుకుని,కష్టపడి రెస్టారెంటుకి వచ్చేస్తాము. నువ్వు, చందూ(ఇంకో అమ్మాయి) మాత్రం విశాలంగా, ఫ్రీగా ఇంకో కారులో రండే." అనగానే ఆ మాకోసం వాళ్ళు చేస్తున్న "త్యాగానికి" మా మనసు కరిగి నీరై వరదగా మారి మా ఆఫీసుని ముంచేయ్యబోతుంటే "సీనియర్ మేనేజర్ మీటింగు నుంచి బైటకి రాగానే, ఆయనతో కల్సి వచ్చేయండే.. ఇంచక్కా(!)" అని బాంబు పేల్చాడు. ఆ ఇమానమంత ఇశాలమైన కారు "SM"దా..? ఆయనతో రావాలా..? అంతే దెబ్బకి కరిగిన మనసు గబ గబా భయంతో బిగుసుకుపోయింది.ఇశాలం ట్రాపులో అంత దారుణంగా ఇరుక్కుపోయాక ఏం చేస్తాం..? ఆయన కోసం మా ఎదురుచూపులు ఫలించి, ఆయన లోపల చర్చలు ముగించేసరికి , ఓ గంట మా కళ్ళ ముందే కర్పూరంలా కరిగిపోయింది.ఈ పెద్దతలకాయలు వున్నాయే, వాటికి మాలాంటి బుడ్డి తలకాయల మనసు ఎప్పటికీ అర్ధం కాదు. ఎంత సేపు పని.. పని.. పని...హు..

కారు దగ్గరికెళ్ళగానే, మా టీం మొత్తం కల్సికట్టుగా మా కోసం త్యాగం చేసేసిన ఆ అద్భుతమైన కళాఖండాన్ని చూడగానే కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు అర్జెంటుగా టపా టపా రాలిపోయాయి.ఆ కారు బంగారు, మా మేనేజరు గారి నాన్నగారిదట. మారుతీ కంపనీ వారి మొదటి మోడలట. ఏది పట్టుకుంటే, ఏది ఊడిపోతుందో అని భయంభయంగా డోరు తీసి చా..లా.. జాగ్రత్తగా లోపల కూర్చున్నాను. అవసాన దశలో వున్న సీట్లు, కారు పార్టులు, నట్లు, బోల్టులు అన్నిటినీ తనివితీరా మళ్ళీ మళ్ళీ చూసాను.రేప్పొద్దున్న దీన్ని ఏ లండన్ మ్యూజియంలోనో పెట్టేసారనుకోండి.అప్పుడు చూడ్డానికి మన ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అందుకే ఇప్పుడే ఫ్రీగా చూసేసాను. ఎన్ని తెలివి తేటలో కదా..! దిష్టి కొట్టకండే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కారు హుషారుగా వెళ్తుంది.కానీ.. కానీ.. ఆరిపోయే దీపానికే వెలుగెందుకు ఎక్కువ..? తుఫాను ముందు ఎందుకంత ప్రశాంతత..? డబ్..డబా..డబా..డబ్.. కచా.. ఇచా.. లబా.. టకాల్..డిమేల్..డబా.డబా.....ఎందుకంత డబడబలాడించుకుంటూ బండిని నడుపుతావని పక్కనున్న స్కూటరోడుని చిరాగ్గా చూసాను.ఆ సంగీతం మీ పుష్పక విమానం నిర్వాకమే తల్లీ అని నా వంక ఇంకా... బోల్డంత చిరాగ్గా చూసాడు.

ఇంక నాన్న గారి బుజ్జిముండ డబడబలు భరించలేక ఒక పక్క కారుని ఆపి, ఏదో ఒకటి చేద్దామని చూసి ఇంకేమీ చెయ్యలేక ఆటో కోసం ఎదురు చూపులు మొదలెట్టాము.ఈలోపు మా SM ఒక పేద్ద బండరాయిని తీసాడు. హ్హా.. హ్హా..హెహ్హే... నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందం కారుని ఎవ్వరూ ఎత్తుకెళ్ళకుండా ఇంజన్ని రాయితో కొట్టడం గుర్తొచ్చింది. కానీ ఎప్పట్లానే మా అంచనాలని తల్లక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకుని సూటిగా మా వైపుకి వస్తున్నాడాయన. పగలకి ప్రతీకరాలకి సమయమా ఇదీ.నేను చెప్పిన పని చెయ్యను, సాకులు చెప్పి పని ఎగ్గొడ్తాను, పని చేస్తున్నట్టు ఏక్ట్ చేస్తాను. చేసిన కూసింత పని కూడా సవ్యంగా చెయ్యను. అంతమాత్రానికే బండరాయితో బుర్ర పగులగొట్టేస్తారా..? మాళ్ళీ నా అంచనాలని తలక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకెళ్ళి వెనక టైరుకి అడ్డంగా పెట్టారు,నాన్న గారి చిట్టికొండని ఎవ్వరూ గుద్దేయకుండా.. నాకు మల్లే తెలివితేటలు ఎక్కువ ఆయనక్కూడా..

అక్కర్లేనపుడు బస్సులు, ఆటోలు బొయ్యి బొయ్యిమంటూ హారన్ మోగించుకుంటూ రయ్యిరయ్యిమని తెగ తిరగేస్తాయి. ఆ రోజు మాత్రం రోడ్డు మీద మేము ముగ్గురం, చుట్టూ చెట్లు,గుట్టలు తప్పితే వేరే ఒక్క పిట్ట కూడా లేదు.ఈ లోపు ఏ దేవదూతలో పంపినట్టు భాషాలో రజినీలా, ఆటో డ్రైవర్లో నాగార్జునలా, హీరోలకే హీరోలా ఒక ఆటోవాడు వచ్చాడు. బంజారాహిల్స్ వస్తావా అని అడిగాము. మమ్మల్ని చూసాడు అసహనంగా. ఆగి వున్న కారుని చూసాడు ఆరాగా. మా మెళ్ళో వేళ్ళాడుతున్న ఐడెంటిటీ బిళ్ళలని చూసాడు ఆశ్చర్యంగా...వెంటనే ఏదో అర్ధమైనవాడిలా తల ఊపుతూ వంద అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ.. రెండు సందులకి వందేమిటి నాయనా అన్నాము. అంత దగ్గరయితే నడిచివెళ్ళండి అన్నాడు మీళ్ళో బిళ్ళలని తీక్షణంగా చూస్తూ..ఛీ ఛీ ఈ మెళ్ళో బిళ్ళల బదులు పాములేసుకుని తిరగడం నయం . చేసేదేమీ లేక నీవే మాకు దిక్కిప్పుడు అని గాట్టిగా మొక్కి, ఆటోలో కూలబడి అయ్యవారికి వంద దక్షిణగా సమర్పించుకున్నాము. అయినా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే ప్రతీవాడికీ లోకువే..పది రూపాయల సరుక్కి వంద లాగుతారు.మనలో మన మాట ఆఫీసు బయట ఆ బిళ్ళేసుకుని ఫొజులు ఇవ్వమాకండే.పర్సు ఖాళీ అయిపోతుంది జాగ్రత్త.

అలా పడుతూ లేస్తూ కాళ్ళీడ్చుకుంటూ నీరసంగా రెస్టారెంటుకెళ్ళేసరికి మా ముందెళ్ళిన పదిమంది మస్తుగా కుమ్మేసి,ఆవలించుకుంటూ, ఈగలు తోలుకుంటూ సొల్లు కొట్టుకుంటూ మాకోసం ఎదురు చూస్తున్నారు (??). ఎంత రెండు గంటలు లేట్ అయితే మాత్రం మాకోసం ఆగకుండా తినేస్తారా..? నా హృదయం తీవ్రంగా గాయపడింది. ఆ తిక్కలో కసి కసిగా అక్కడున్నవన్నీ ఊడ్చి తినేద్దామని ఆవేశంగా ప్లేట్ తీసుకుని ఫీల్డులోకి దూకాను.తీరా చూస్తే ఏమున్నాయి అక్కడ, నా తలకాయ్.టమాటా తొక్కులు, దోసకాయ ముక్కలు, క్యాబేజీ తొక్కలు, నిమ్మకాయ చెక్కలు. ఇవ్వన్నీ రైతుబాజార్లో సరసమైన ధరలకి దొరుకుతాయిగా.. ఇంకోపక్క క్యాలీ ఫ్లవర్ పుల్సు, కుక్కగొడుగుల పులావు, చల్లారిపోయిన చపాతీలు. ఏం తినాలో తెలియక, అస్సలు తినే ధైర్యం లేక, అలా అని తినకుండా వుండలేక నోర్మూసుకుని పెరుగన్నం పెట్టుకొచ్చాను.బిల్లులో నా వాటా గుర్తు తెచ్చుకుంటూ, గుడ్లనీరు కక్కుతూ,వెక్కుతూ పెరుగన్నం బలవంతంగా కుక్కుకుంటుంటే అర్ధమయ్యింది నాకు. జూనియర్లుగా వున్నపుడు ర్యాగింగ్ చేసారని ఏడ్చి, సీనియర్లయ్యాక వాళ్ళే మళ్ళీ ర్యాగింగ్ ఎందుకు చేస్తారో....!హ్హి హ్హీ.. రాబోయే కొత్తవాళ్ళు పార్టీ ఇవ్వడానికి నా స్వహస్తాలతో మాంచి మూహుర్తం పెట్టడం నా భవిష్య దర్శినిలో దివ్యంగా, మనోహరంగా కనిపిస్తుంది మరి.

Monday, June 30, 2008

ఎస్కలేటరోఫోబియా...

నాకు చిన్నప్పడో చిన్న కల వుండేది. నేను ఐయ్యేస్ అవ్వాలని. నా కారుని ఓ పది పదిహేను కార్లు పొలోమంటూ రయ్యి రయ్యిమని ఫాలో అయిపోవాలని. ఆ చిన్న కలని సాకరం చేసుకోవడానికి పెట్టుబడిగా రోజూ దిన పత్రిక పై నుంచి కింద దాకా కసి కసిగా చదివి చించి పారేసేదాన్ని.

చెరువులో పడి రెండు చేపలు గల్లంతు - అప్పటి నుంచి చెరువోఫోబియా
పిట్టగోడ కూలడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పది పిట్టలు - పిట్టగోడోఫోబియా
తాగి పెళ్ళాన్ని కొడుతున్న మొగుడు - మొగుడోఫోబియా
ఎస్కలేటర్లో పడి ఎలుకకి గాయాలు - "ఎస్కలేటరోఫోబియా"

ఇలాంటి వార్తలు చదివి చదివి బోలెడన్ని ఫోబియాలు వచ్చేసాయి. ఇంక చివరకి న్యూస్ పేపరోఫోబియా కూడా వచ్చేసింది. దాంతో దిన పత్రికలు చదవడం మానేసి, దిన ధారావాహికలు చూడటం మొదలు పెట్టాను. దెబ్బకి నా భయాలన్నీ పోయి జనాల్ని భయపెట్టడం వచ్చేసింది. కానీ కానీ.. నాకు తెలీకుండా ఒక్కటి మాత్రం నాలో కరిగిపోయి, కల్సిపోయి, నాలో భాగం అయిపోయింది. అదే అదే .. "ఎస్కలేటరోఫోబియా".
*****
ఆ రోజు మా సూపర్ ట్రైనర్ పుట్టిన రోజు. మాకు పండుగ రోజు. ఆ పర్వ దినాన ఐమేక్సులో సినిమా అన్నారు. రంగ్ దే బసంతి అని ఆశగా బయలుదేరిటే, మా మానసిక పరిస్థితిని బట్టి మా వయసుని అంచనా వేసి మరీ హనుమాన్, చిన్న పిల్లల ఏనిమేషన్ సినిమాకి టికెట్లు తీసారు. పోనిలే గుడ్డిలో మెల్ల, ట్రైనింగ్ కన్నా ఎదో ఒక సినిమా మిన్న అని నన్ను నేను ఓదార్చుకుంటూ లోపలకి అడుగుపేట్టానో లేదో ఒక భయంకరమైన కదులుతున్న యంత్రం కనిపించింది. నాలో నిద్దరోతున్న "ఎస్కలేటరోఫోబియా" లేచి బుసలు కొట్టింది. "నేను ఎక్కను ఎక్కలేను ఎక్కబోను" అని ఏడిచినంత పని చేసి నా కన్నీటి గాధని రీళ్ళుగా రీళ్ళుగా వెళ్ళబోసుకున్నాను. మా వాళ్ళంతా నా బరువైన ఫ్లాష్ బ్యాక్ విని, చున్నీలతో, జేబు రుమాళ్ళతో, అవి లేని వాళ్ళు టిష్యూ పేపర్లు కొనుక్కుని మరీ కార్చిన లీటర్ల లీటర్ల కన్నీరుని ఎండగట్టి, వాటితోనే బర్రు బర్రుమంటూ ముక్కు చీదుకున్నారు.

"ఇదో ఇమేజనరీ భయ్యం, నిజ్జంగా ఎక్కావంటే నిజ్జంగా నీ భయ్యం పోతుంది." అని బలవంతంగా లాక్కుపోయి దాని ముందు నిలబెట్టారు.కళ్ళు మూసుకుని జై భజరంగ్ భళీ అనుకుంటూ వెళ్ళెళ్ళి ఎస్కలేటర్ రెండో మెట్టు ఎడ్జ్ మీద అతి సుకుమారంగా అడుగేసాను. ఎడ్జ్ మీద వెయ్యటం వల్ల బ్యాలన్స్ తప్పేసింది. న్యూటన్ మూడో సూత్రం ప్రకారం నేను చేసిన ఓవరేక్షనికి ఆ బండ ఎస్కలేటర్ ఒళ్ళు మండి నా మూతి పళ్ళు విరగొట్టడం ద్వారా రియాక్షన్ ఇచ్చుండాలి. కానీ వున్నాడుగా దేవుడు, సరిగ్గా నా ముందే బండ సుధీర్ని నిలబెట్టాడు. నేను పడిపోతుంటే నా చెయ్యి పట్టుకుని ఆపి, వాడి బలాన్నంతా ఎస్కలేటరుకి వ్యతిరేక దిశలో ప్రయోగించి మొత్తానికి గండం గట్టెకించాడు. అలా రియల్ టైము ఎస్కలేటర్ ఎక్కగానే,నిజ్జంగానే నాకదంటే ఇమేజనరీ భయం పోయి రియల్ భయం వచ్చేసింది.
*****
కొన్నాళ్ళకి ఎదో సరదాగా బెంగుళూర్ వెళితే, ఫోరం అనే ఘోరమైన షాపింగ్ మాలుకి తీసుకెళ్ళారు. అక్కడ ఆ సోది ఎస్కలేటర్ తప్పిటే మెట్లు ఎంత వెతికినా కనపడల్లే. మా హైదరాబాదోళ్ళే నయ్యం. నాలాంటి దద్దోజనం మొకాలు వుంటాయని ఊహించి, మెట్లు కూడా పెట్టి దొబ్బించుకుంటారు. "ఎస్కలేటర్ నేను ఎక్కనంటే ఎక్కను, ఇక్కడే బయట సెక్యూరిటీ గార్డుకి తోడుగా కూర్చుని, అవసరమైతే చెకింగులు గట్రా చేసి పెడతాను. మీరెళ్ళి షాపింగ్ చెయ్యండి" అని తెగేసి చెప్పాను. కానీ మా అన్నయ్య మాత్రం "ఆ గార్డుకి యూరో లాటరీ తగిలి, ఇంక ఈ ఉద్యోగం అవసరం లేదు అనుకున్నపుడు నీ సాయం తీసుకుంటాదులే.కానీ చూడు రెప్పొద్దున్న నిన్ను మీ ఆఫీసోళ్ళు వేరే దేశానికి పంపిస్తే, ఎయిర్ పోర్టులో నువ్విలాగే తింగరి వేషాలేస్తే, మీ కొలీగ్స్ నిన్ను కామెడీ చేసుకుంటారే, రా" అనగానే నా బంగారు భవిష్యత్తు గురించి అంత డీపుగా ఆలోచిస్తున్న వాడిని చూడగానే రక్త సంబంధం సినేమా గుర్తొచ్చింది. నీ కోసం నిప్పుల్లో దూకడానికైనా ఈ చెల్లెమ్మ సిద్దమన్నాయ్!ఇంక ఈ బోడి ఎస్కలేటర్ ఎంత అని మా వాడ్ని ఫాలో అయిపోయా.

తీరా లొపలికెళ్ళాక, సేం వణుకుడు."పర్లేదు, జాగ్రత్త. జాగ్రత్త, పర్లేదు" అంటూ మొదటి ఫ్లోర్ విజయవంతంగా దాటించేసాడు. దానికే నా గుండెకాయ నిముషానికి కొన్ని వేల లబ్బుడబ్బుల స్పీడుతో కొట్టేసుకుంటుంది. "ఇంక చాలు బాబు పద వెళ్దాము" అని బతిమాలాను.కానీ ఆక్కడ ఎక్కడానికి/ఎక్కకపోవడానికి చాయిస్ వుంటుంది. కానీ ఎక్కాక, దిగి తీరలిగా..అప్పుడు ఆ దిక్కుమాలిన యంత్రారాక్షసమే దిక్కుగా..! అందుకని నా చేత దిగడం కూడా ప్రాక్టీసు చెయ్యించాలని బలవంతంగా పైకెక్కే యంత్రంతో పై... దాకా తీసుకెళ్ళిపోయాడు. నాకేమో ఎక్కే ఎస్కలేటర్ కన్నా దిగే డెస్కలేటర్ ఇంకా అరివీర భయంకరంగా అనిపించేసి,నాకున్న ఒకే ఒక "రెండు జతల" కళ్ళూ సవ్య దిశలో(క్లాక్ వైసు) పది సార్లు, అపసవ్య దిశలో ఇరవై సార్లు చకా చకా గిరా గిరా తిరిగేసాయ్. ఆ తర్వాత కిందకి ఎలా వచ్చానో నాకస్సలు గుర్తు లేదు. పాపం నా పిచ్చి మెదడు భయంతో బిగుసుకుపోయి ఆ చారిత్రాత్మక ఘఠనల్ని రికార్డ్ చేసుకోవడం మర్చిపోయినట్టుంది. అలా ఫైరు డ్రిల్లులా ఎస్కలేటర్ డ్రిల్లు పూర్తయ్యేసరికి ఎస్కలేటర్ అంటే భయం పోలేదు సరి కదా భయం వల్ల వచ్చిన దడతో కూడిన అసహ్యమొచ్చేసింది.
*****
నా "ఎస్కలేటరోఫోబియా" చిదంబర రహస్యాన్ని నాలో దాచుకుని గుట్టుగా బతుకుతుంటే ఊరి నుంచి మా సైన్యం దిగింది. సరే కదా అని అందరం సర్దాగా అమీర్ పేట వెళ్ళాము. అక్కడ మా మంద మొత్తం బిగ్ బాజార్లో దూరిపోబోతుంటే, వాళ్ళని ఆపి "మీకు తెలుసా...అక్కడ లోపల... ఎస్కలేటర్ వుంటుంది" అన్నా అదేదో లోపల పులి వుందన్నట్టు. "ఓస్ అంతేనా..!విజయవాడ రైల్వే స్టేషనులో అమ్మమ్మ కూడా ఎక్కింది తెల్సా. నీకు భయమా విద్యక్కా..?" అని అడిగింది మా పిన్నికూతురు. దానికి మేటర్ మొత్తం అర్థం అయిపోయింది. మన పరువు మొత్తం గంగలో కల్సిపోయింది. అయినా "అమ్మమ్మ..ప్చ్..! ఆఖరికి అమ్మమ్మ కూడా ఎక్కేసి నాకు అన్యాయం చేసేసాక ఈ పరువు గంగలో కలిస్తే ఏంటి, దొంగలెత్తికెళ్తే ఏంటి...? విద్యా ఈ జగమంతా మిధ్య.." అని నా బుజ్జి మనసు తెగ కుమిలిపోయింది.గుండెల్లో ఒకలాంటి ఆక్రోశం మొదలై, ఆవేశం వచ్చేసింది.మా వాళ్ళు ఎవ్వరూ పక్కన లేకుండా మొదటిసారి ఎస్కలేటర్ మీద అడుగేసాను. అలా ఎస్కలేటరోఫోబియా పోయి, ఎస్కలేటరోమేనియా వచ్చేవరకు ఆపకుండా మళ్ళీ మళ్ళీ ఎక్కడం, దిగడం ఇదే పని. అలా మా అమ్మమ్మ దెబ్బకి నా "ఎస్కలేటరోఫోబియా" ఎగిరి...చంచల్ గూడా పక్కనున్న ఎస్కల్ గూడాకి పారిపోయింది.
*****
ఇప్పుడు ఎస్కలేటర్ చూసి పారిపోయేంత విపరీతమైన భయం లేదు కానీ దాన్ని చూడగానే ఒక్క క్షణం కాళ్ళు చిన్నగా వణుకుతాయి. ఇంకో విషయం "ఎస్కలేటర్", ఈ ఆంగ్ల పదానికి మంచి తెలుగు పదం చెప్పి పుణ్యం కట్టుకోండి.ఎంత కొట్టుకున్నా నా మట్టిబుర్రకి తట్టట్లేదు.

Tuesday, June 17, 2008

హిడింబి హిడింబి నడుమ నేను

అవి నేను అమీర్ పేటలో హాస్టల్ వెతుక్కుంటున్న రోజులు. అక్కడ కనక మనగలిగితే ఆఫ్రికా అడవుల్లో, అఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల్లో సైతం ఆనందంగా బతికేయొచ్చని పుకారు.నేను బాగ ఆలోచించి, చించీ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు వుంటున్న హస్టల్ రూములో చేరిపోయాను.ఇక్కడ నా ప్లానింగ్ ఏంటంటే అక్కని పడేసామనుకోండి చెల్లి పడి వుంటుంది లేదా చెల్లిని లైనులో పెట్టేస్తే అక్క నోరుమూసుకుని వుంటుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటారే అలా అన్న మాట. అప్పటికీ మానవతా విలువులన్న పక్క రూమమ్మాయి మంజు నన్ను పరామర్శినించడానికి సారీ... పలకరించడానికి వచ్చి "మీ రూములో వుండే అక్కా, చెల్లి తెగ తేడా, నువ్వు వేగలేవు" అని హెచ్చరించింది కూడా. "ఇక్కడ.. ఇక్కడ.. సెవెన్ ఇయర్స్, సెవెన్ ఇయర్స్ హాస్టల్లో వున్నా, నేను తలుచుకుంటే వాళ్ళిద్దరిని ఈ హాస్టల్ చుట్టుపక్కలే లేకుండా చెయ్యగలను" అని కారు కూతలు కూసేసాను. కానీ నాకారోజు రాత్రే "ముందున్న గోతుల లోతు తెలీకుండా కోతలు కోయాకూడదు" అన్న విషయం బాగా అర్థం అయ్యింది.

ఆ అర్ధ రాత్రి నేను గాఢ నిద్రలో వున్నాను. సడెనుగా ఎవరిదో భయంకరమైన నవ్వు వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే అక్క రెండు చేతులు చాపి, వంగి హ్హ, హ్హ, హ్హ అంటూ షోలే సినిమాలో గబ్బర్ సింగులా నవ్వుతోంది. అది చూడగానే గుండె ఒక్కక్షణం ఆగిపోయింది. ఒళ్ళంతా చమటలు పట్టేసాయి. మంజు చెప్పినట్టు తేడా అంటే పిచ్చేమో. మమ్మీ... నాకు పిచ్చోళ్ళంటే చచ్చేంత భయం.ఇంక ఆ నవ్వు భరించలేక వాళ్ళ చెల్లిని లేపి "పాప నవ్వుతుంది" అని చెప్పాను. "ఓస్ అదా మా అక్క రాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది. పొద్దునే లేవలేదు. అందుకే రాత్రే యోగా చేసుకుని పడుకుంటుంది. ఇది నవ్వాసనం " అనేసి మళ్ళీ పడుకుంది. నా బొందాసనం...అయినా పొద్దున కుదరదని రాత్రే చేసి పడుకోవడానికి ఇదేమైనా ఇస్త్రీనా...? వంకాయ,టెంకాయ కలిపితే వచ్చే హైబ్రీడుకాయ మొహం అదీను.
*******
అలారం మోగింది.టైం ఆరు.ఈ సారి చెల్లి లేచింది.ఇంక మళ్ళీ నిద్ర పట్టక ఈ సైతాను మొకాలతో వేగడం బెటరా, లేక తిరుగుతున్న ఖేతాన్ ఫ్యానుకి ఉరేసుకుని చావడం బెటరా అని కళ్ళు తెరిచి దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అదే నేను చేసిన పే...ద్ద తప్పు.చెల్లి అల్మారాలోంచి ఓ భయంకరమైన వస్తువు తీసింది. అది కత్తో, గన్నో, వేటకొడవలో అయితే నేనసలు భయపడేదాన్ని కాదు.కానీ.. కానీ... అది ఒక వయొలిన్.

"విద్యా నీకు నిద్ర పట్టటం లేదు అనుకుంటా. వయొలిన్ క్లాసుకి వెళ్ళడానికి ఇంకో అరగంట టైం వుంది. ఈలోపు నేనో పాట వాయిస్తాను. అదేంటో నువ్వు చెప్పాలే" అంది గారాలు పోతూ.చీ ఎదవ జీవితం సునామీ, సైక్లోను కలిపొస్తే ఎలా వుంటుందో అంత కన్న భయంకరంగా తయారయ్యింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టల మాట దేవుడెరుగు, ఒక్క పిట్టకి రెండు దెబ్బల్లా అక్క, చెల్లి కలిపి నన్ను ఎడా,పెడా కుమ్మేస్తున్నారు అని తాళం తప్పకుండా నాలో నేను కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఈలోపు సంగీత పిపాసి గారు కచేరి మొదలెట్టేసారు.

కుయ్.. ఇంకో కుయ్.....
కుయ్యో... ఇంకో కుయ్యో.

నేనో పిచ్చి శ్రోతని దొరికేసరకి, ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ రెచ్చిపోయి ...రెండో కుయ్యో లెంగ్త్,స్ట్రెంగ్త్,వేవ్ లెంగ్త్ అన్నీ పెంచేసింది. అది కాస్త కీచుమంటూ కీచుమంటూ వచ్చేసరకి నా పీచు జుత్తు భయపడి లేచి నుంచుంది. "కుయ్యో.. కుయ్యో.. కుయ్.. కుయ్.. కూ... కో......" ఇలా చెల్లి గారు జీవితం మీద రోత పుట్టేలా మోత మోగించేస్తుంటే, అక్కగారు కదలకుండా, మెదలకుండా పడుకున్నారు. పాపం పిచ్చి తల్లికి మళ్ళీ మళ్ళీ ఈ చెల్లి లొల్లి విని చెవులు చిల్లులు పడి, మెదడు మొద్దుబారిపోయినట్టుంది. ఆ క్షణంలో చెల్లెమ్మ వయొలిన్ వైలెన్స్ కన్నా అక్కయ్య గబ్బరు సింగే నవ్వే కాస్త వినసొంపుగా వుందనిపించింది.

ఇంకో పక్క చెల్లి ఆపకుండా తీగల్ని లాగి లాగి సాగదీసి లేని రాగాలు పుట్టించేస్తోంది.కొన్ని వేల ఏళ్ళ తర్వాత ఆ వయొలిన్ వాయింపుడు ఆపి"ఇప్పుడు చెప్పుకో చూద్దం" అంది. కుయ్యోలని నా జీవిత కాలంలో విన్న ఏదో ట్యూనులోకి ఇరికించేద్దామని ఎంత జుట్టు పీక్కున్నా కుదిరి చావదే...!అమ్మో ఈ వయొలిన్ వైడూర్యం, సంగీత వజ్రం ఏదో కొత్త(చెత్త) ట్యూన్ కనిపెట్టేసినట్టు వుంది. "నీకు తెలీట్లేదా...? ఇది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్" అంది. వామ్మో.. వాయ్యో.. ఇది అదా.. అదే ఇదని ఏమాత్రం అనుమానం రాకుండా ఎంత అద్బుతంగా ఖూనీ చేసింది. తగలెట్టడంలో కూడా ఎంత పర్ఫెక్షనో...! "నేను బాగా వాయించలేదు కదా..! నువ్వు గుర్తు పట్టలేదు" అని దీనంగా మొహం పెట్టి అడిగేసరికి నా వెధవ గుండెకాయ కరిగిపోయింది. కళాకారుల్ని నిరుత్సాహపరచకూడదనే పెద్దమనుసుతో "చీ అలా కాదు, నేను తెలుగు మీడియం. అందుకే నాకు ఇంగ్లీష్ రైంస్ అస్సలు తెలీవు" అన్నాను. "అయ్యో పాపం" అంది. కోతి మొకం,పీత కళ్ళేసుకుని వెధవ జాలొకటి మళ్ళీ.

"సరేలే నీ కోసం మంచి తెలుగు పాట బాగా నేర్చుకుని పది రోజులకి వినిపిస్తానే..అప్పుడు కరెక్ట్ గా చెప్పాలమ్మా..! " అంది.వెంటనే మంజు దగ్గరకి వెళ్ళి వలా వలా ఏడిస్తే "చా ఊరుకో. కష్టాలు మనుషులకి కాపోతే మానులకి వస్తాయా..! అయినా నా మాట విని వేరే హాస్టల్ కి వెళ్ళిపో" అని సలహా ఇచ్చింది. ఇంక హాస్టల్లో వుండే దమ్ము లేక, రూం వేటలో పడ్డా. అయినా నా పిచ్చి కానీ, హైదరాబాదులో అద్దెకి ఇళ్ళు, ఆడపిల్లలకి మొగుళ్ళు అంత వీజీగా దొరికేస్తారేంటి? రోజులు గబా, గబా గడిచిపోతున్నాయి. మా వాళ్ళందరికీ ఫోను చేసి మాట్లాడాను. అప్పులన్నీ తీర్చేసాను.నాకెవరైనా ఇవ్వాల్సివుంటే, ఇలాంటి దశలో తుచ్చమైన డబ్బు మీద మమకారం ఎందుకని ఆ బాకీలన్నీ మాఫీ చేసేసాను.బాకీలు మాఫీ చేసిన పుణ్యఫలమో,పూర్వజన్మ సుకృతమో,దేవుడి దయో కానీ చెల్లి భీకరమైన ప్రాక్టీసుకి తట్టుకోలేక వయోలిన్ తీగ తెగింది (ఎవరో తెంపేసారు!).చెల్లెమ్మ మారణాయుధం దెబ్బకి చిరుగులు పడ్డ నా జీవితం మళ్ళీ కొత్త చిగురులు వేసింది.

Thursday, June 12, 2008

ఇంగ్లీషన్నయ్య -- సులక్షణక్కయ్య

నేను ఇంటర్ చదివేటప్పుడు నేను ఇంటరే చదవాల్సి వచ్చేది. కనీసం వేరే పేపర్ ముక్క కూడా చదివే టైం ఇవ్వకుండా మా తొక్కలో కాలేజీ వాళ్ళు మా చేత వీర రుబ్బుడు రుబ్బించేవాళ్ళు.అలాంటి కాలేజీలో ఎడారిలో ఎండమావిలా ఓ ఇంగ్లీష్ సార్. ఆయన ఇంగ్లీష్ కత్తి. మాట కత్తి. పాడే పాట కత్తి. వేసే బొమ్మ కత్తి. మనసు కత్తి.చూడ్డానికి మనిషి కత్తి. మొత్తానికి ఆయన కత్తో కత్తి. మా కాలేజీలో మొత్తం అమ్మాయిలంతా ఆయన అభిమాన సంఘానికి శాశ్వత సభ్యులం. ఒక రాఖీ పౌర్ణమి నాడు మా అభిమానాన్ని చాటుకోవడానికి కొట్టుకుంటూ, తోసుకుంటూ,పోటీ పడి రాఖీ కట్టేసాం. అలా ఇంగ్లీష్ సార్ కాస్త ఇంగ్లీషన్నయ్య అయిపోయారు. ఇంత మంది వీరాభిమానులున్న ఇంగ్లీషన్నయ్యకి ఓ శతృవు బయలుదేరింది. అదీ సులక్షణక్కయ్య రూపంలో.........

చిన్ని చిన్ని కళ్ళు, బూరె బుగ్గలు, ముద్దుగా బొద్దుగా వుండే సులక్షణక్కయ్య మా కాలేజీకి మెడికల్ ఎంట్రన్స్ కి లాంగ్ లాంగ్ లాంగ్ టెర్మ్ కోచింగుకని వచ్చింది. అంటే ఆల్రెడీ రెండు లాంగ్ టెర్ములు దొబ్బేసాయి. ఇది మూడోది. వచ్చిన రెండు రోజులకే మన అక్కయ్య విశ్వరూపం చూపించటం మొదలెట్టింది. మన అక్కయ్య మాటల పుట్ట, కబుర్ల తుట్ట, విషయాల తట్ట, విజ్ఞానపు బుట్ట ( చదువులో కాదు!). మా దిక్కుమాలిని హాస్టల్లో ఎంటెర్టైన్ మెంటే లేకుండా చదువులో మగ్గిపోయి, మసయిపోతున్న మా మొద్దు మొకాలకి ఈ సులక్షణక్కయ్య అడవిలో ఆదిత్య ఛానల్లా, ఎడారిలో ఎం టీవీలా కనిపించేసింది. నాసామి రంగా ఇంక చూసుకోండి, హాస్టలంతా సులక్షణక్కయ్య మాకు కావాలంటే మాకు కావాలి అని తెగ కొట్టుకు చచ్చిపోయేవాళ్ళం.

ఇలా కొంచెం చప్పగా, కొంచెం చేదుగా, కొంచెం తియ్యగా సాగిపోతున్న మా కాఫీ కప్పులాంటి జీవితాల్లో మా సులక్షణక్కయ్య వల్ల చిన్న తుఫాను రేగింది. స్టడీ అవర్స్ లో మా ఇంగ్లీషన్నయ్యని చూసి ప్యూనా అని అడిగింది. మాధవన్లా వుండే మా ఇంగ్లీషన్నయ్యని ప్యూనని అనేసరికి నా గుండె ముక్కలయిపోయింది. సులక్షణక్కయ్యకి ఇంగ్లీషన్నయ్య గుణ గణాలు, కళలు, కాంతులు, ఆమె భ్రాంతులు అన్ని అజెండాగా తీసుకుని అందరం కల్సి స్పెసల్ క్లాసు తీసుకుని బుర్ర రామ కీర్తన పాడించేసాము. అయినా మన అక్కయ్య అభిప్రాయంలో మార్పు రాలేదు. టేస్టు లేని వేస్టు ఫెలో అని వదిలేసాము.

ఓ రోజు మేమంతా ఇంగ్లీష్ సారు ఇచ్చిన మెటీరియల్ కళ్ళు మూసుకుని బట్టీ కొడుతుంటే, సులక్షణక్కయ్య ఆ మెటీరియల్ లాక్కుని మెటికలు విరుస్తూ, చిటికెలు వేస్తూ, బరువు బరువు నిట్టూర్పులు విడుస్తూ చివరగా "ఇలా అయితే లాభం లేదమ్మాయిలు. మీరు ఇంగ్లీష్ పాసవ్వడం కష్టం" అని పెదవి విరిచేసింది.నా జీవితం మీద, పరీక్షల మీద నాకున్న సందేహాలు చాలవన్నట్టు ఈ మిటమిటల రాణి శాపనార్ధాలేంటో...?."ఈ మెటీరియల్ నిండా తప్పులే. మీ ఇంగ్లీష్ సారుకేమి రాదు" అంది.ఎంత మాట.... మా అందరికి గుండెల్లో నొప్పి, బాధ, వేదన. అటు రాఖీ కట్టిన బంధం, ఇటు సోది వినిపించే అనుబంధం. అటు చదువు చెప్పే గురువు. ఇటు మా అజ్ఞాన్ని పారద్రోలే కల్పతరువు. ఇద్దరూ మధ్య సయోధ్య కుదర్చలేక, కుదర్చకుండా వుండలేక మేమెంత నరకం అనుభవించామో మీకు తెలీదు, మీకెవ్వరికి తెలీదు....... వీలయినపుడల్లా మా ఇంగ్లీష్ సారుని దెప్పుతూనే వుంది. మమ్మల్ని వుందిగా సెప్టెంబర్ మార్చ్ పైన అంటూ భయపెడుతూనే వుంది.

ఈ గొడవలో పడి మేము క్రుంగి, క్రుశించి, నలిగి, నశించిపోతున్న సమయంలో సులక్షణక్కయ్య ఓ సవాల్ విసిరింది. మా ఇంగ్లీషన్నయ్య ఇచ్చిన మెటీరియల్లో తప్పుల్ని ఎర్ర ఇంకుతో మార్క్ చేసి,ఇది మీ అన్నయ్యకి చూపించి ఇవి తప్పులు కాదు అనమనండి చూద్దాం అంది.వెంటనే మేము బుర్ర బుద్ది లేకుండా చీమల దండులా పోలోమంటూ లెఫ్ట్ రైట్ అనుకుంటూ సారు దగ్గరకి వెళ్ళి ఆ పేపర్ చూపించాము. పేపర్, ఆ ఎర్ర గుర్తులు చూసి "ఏంటిది..?" అన్నారు అయోమయంగా. ఇవన్నీ తప్పులట సార్."ఎవరు చెప్పారు" అన్నారాయన సీరియస్గా. "సులక్షణక్కయ్య" అన్నాము అందరూ ఒకేసారి. "ఇంకేమంది..?" అని అడిగారు.

ఆయన అడిగిందే తడువుగా అస్సలు ఆలస్యం చేయకుండా మొత్తం కథంతా చెప్పేసి, మా గురు భక్తిని, సోదర ప్రేమని నిరూపించేసుకుని, చేతులు దులిపేసుకున్నాము. కానీ తర్వాత తెల్సింది మేమో పద్మ వ్యూహంలోకి ఎరక్క....పోయి ఇరుక్కు....పోయామని. ప్రిన్సిపాల్, సార్స్ అందరూ మమ్మల్ని తలా తోకా లేని బోలెడు చెత్త ప్రశ్నలు అడిగారు. మేము కొన్ని నిజాలు, అబద్దాలు కలిపి చెప్పి ఎలాగోలా ఆ ప్రశ్నల వర్షాన్ని కష్టపడి గట్టెక్కించేసాము. అలా విచారణ పూర్తి చేసి, మా వార్డెనక్కయ్య సాక్ష్యం ఆధారంగా సొల్లు కబుర్లు చెప్పి, చిన్న పిల్లల (అంటే మేమే..!) చిట్టి మనసుల్ని, చదువుల్ని చెడగొడుతుందనే అభియోగం మీద సులక్షణక్కయ్యని హాస్టల్ నుంచి గెంటేసారు. అలా మా లైటుని మేమే ఆర్పేసుకున్నాము.

సులక్షణక్కయ్య నిష్క్రమణతో మా జీవితాల్లో చీకటి నిండింది. సోది కబుర్ల మీద బెంగతో దిగులు రేగింది. ఇలా నా బాధల్లో నేనుండగా ఓ రోజు ఫోన్ వచ్చింది.అది... అది.... సులక్షణ....... అక్కయ్య నుంచి. బోలెడంత ఆనదంతో నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే "మీ ఇంగ్లీషన్నయ్యకి నేనో క్షమాపణ లేఖ పంపాను. ఎవరూ లేనపుడు అందిందేమో అడుగు" అంది. "క్షమాపణ లేఖ..?ఎందుకక్కా..? లేని తప్పులు పట్టుకున్నా సారేమి అనుకోరు." అంటుంటే "నోరు ముయ్యి, చెప్పింది చెయ్యి" అని ఫోన్ పెట్టేసింది. నాకొళ్ళు మండింది.

కావాలనే సార్స్ అందరూ వున్నపుడే ఇంగీషన్నయ్యని అడిగాను "సార్ సులక్షణక్క మీకేదో క్షమాపణ లేఖ పంపిందట. మీకు అందిందో లేదో అడగమంది" అన్నాను మొహం వీలైనంత దీనంగా పెట్టి. ఒక్కసారిగా రూములో అందరూ నవ్వడం మొదలు పెట్టారు. సార్ మాత్రం కొంచెం ఏడుస్తూ, కొంచెం నవ్వుతూ, కొంచెం కోపంగా, కొంచెం కంగారుగా, కొంచెం వెర్రిగా అదో రకంగా ముఖం పెట్టారు. నాకేమి అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటే, మా ఫిజిక్స్ సారు "లేఖ కాదు, పుస్తకం అది. అందింది.దాన్ని అమ్మి బఠానీళ్ళు కొనుక్కున్నారని చెప్పు" అన్నారు. సరే అని అమాయకంగా తలకాయ ఊపి బయకొచ్చేసాక, ఆయన నవ్వుతూ అంటున్నారు "అంత పెద్ద ప్రేమలేఖ ఎన్ని రోజులు రాసిందో పాపం ఆ ఆమ్మాయి. ఎవరు పెట్టారో కానీ సులక్షణ అని, చాలా లక్షణమైన పేరు పెట్టారు" అని.

ప్రేమ లేఖా...! అమ్మనీ..... ఎంత కుట్ర. మనసులో ఇంత పెద్ద ప్లాను వేసి, స్కెచ్ గీసి, సారుని మా ముందు తిట్టి, రెచ్చగొట్టి మా అంతట మేమే రాయబారానికి వెళ్ళేలా చేసి, సారు దృష్టిలో ఈ రాణీ గారు పడేలా చేసుకుందన్న మాట. కొత్తగా ఫోన్ రాయబారాలు ఒకటి.మళ్ళీ క్షమాపణ లేఖంట.. చుంచు మొహంది ఎంత ఎదవల్ని చేసింది. తర్వాత తెల్సింది వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యిందని. అక్కకి ఓ అభాగ్యపు బావతో, అన్నయ్యకి వేరే అమాయకపు వదినతో. హమ్మయ్య నా కడుపు చల్లబడింది. గుడ్డిలో మెల్లలా, పొడుగు పొడుగు ప్రేమ లేఖలతో (పుస్తకాలతో) సారుని పడేసి, పెళ్ళి చేసేసుకుని మమ్మల్ని మరీ బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఎదవల్ని చేసెయ్యలేదు మా సులక్షణక్కయ్య కాదు... కాదు... సులక్షణవదిన.. ఛీ ఛీ ఏదో ఒకటిలే....

Thursday, June 5, 2008

ఆడుతూ.. పాడుతూ.. అల్లరి చేస్తూ...!

ట్రైన్ రాజమండ్రి వచ్చేసింది. గోదావరి గాలి మృదువుగా, చల్లగా తాకుతుంటే నా మనసుకి భలే హాయిగా అనిపించింది.ట్రైన్ దిగి అమ్మమ్మ ఊరు వెళ్ళడానికి ఎర్ర బస్ ఎక్కాము. హైదరాబాదులో దూరపు చుట్టంలా వున్న స్వేద బిందువులు నుదిటి పై చేరి పలకరింతలు మొదలెట్టాయి.

చుట్టాలొచ్చారు మర్యాద చెయ్యాలి అని కరెంటోడు టపీమని కరెంట్ తీసేసాడు.మాకు గాలి కావాలి దేవుడోయ్ అనుకుంటూ విసనకర్రలు తీసుకుని ఊపటం మొదలుపెట్టాము. ఇంక ఊపే ఒపిక లేదు అని ఏడుస్తుంటే, ఇప్పట్లో గాలే రాదన్న టీవీలో వచ్చే గాలి గన్నారావు గాలి తీసేస్తూ బోలెడంత గాలి వీచటం మొదలుపెట్టింది. అబ్బ ఎంత గాలో దాంతో నాకూ ఎగిరిపోవాలి అనిపించింది. గాలి మాత్రం ఏదో దుమ్ము,ధూళి, ఇలియానా, కరీనాలాంటి లైట్ వెయిట్ లేపమంటే లేపుతా కానీ నిన్ను లేపటం నా వల్ల కాదమ్మా అని చెప్పేసింది. సుత్తి గాలికి బొత్తిగా మొహమాటం లేదు.

నేను అలిగినానని నన్ను చల్లబర్చడానికి వర్షాన్ని పంపించింది. మండువాలో వర్షం, పెరట్లో వర్షం, వీధి అరుగుల మీద వర్షం. వెళ్ళి తడిసి ముద్ద అయిపోయాలి అనిపించింది. అలా వీధి అరుగు మీద అడుగుపెట్టానో లేదో జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు అని నన్ను ఆపేసారు. ఇంకేం చేస్తాం, కాళ్ళు, చేతులు తడుపుకుని సంతోషపడుతుంటే పడవలు వెయ్యాలన్న గ్రేట్ అవిడియా వచ్చింది. అప్పటికప్పుడు మరిచిపోయిన పడవల తయారీ విధానాన్ని మా పిన్ని కూతురి దగ్గర నేర్చేసుకుని వర్షం నీటిలో వేసేసాను. దొంగ పడవలు. వేసిన చోట నుంచి మిల్లీ మీటరు కూడా కదల్లేదు. టైటానిక్కే కాస్త నయం. కొంచెం దూరం అయినా వెళ్ళింది. మన పడవలు వేసిన చోటే మునిగిపోయాయి. తర్వాత అమ్మ చెప్పిద్ని కత్తి పడవలు వెయ్యవే కత్తిలా దూసుకెళ్తాయని. కానీ సోది వర్షం అప్పటికి ఆగిపోయింది. ఎంత కంగారో..!

ఇంక సరదాగా అందరం కల్సి నాలుగు గవ్వలాట గలగలలాడించాలని తీర్మానించేసాం. గవ్వలు నాలుగు, మన చెయ్యి పెద్దది. చెయ్యెందుకు పేర్చకుండా ఊరుకుంటుంది. ఎనిమిది పడాలంటే కొంచెం కష్టం కానీ నాలుగు అంటే మన చేతుల్లో పని. గవ్వల్ని అలా సుతారంగా చేతిలో కదిలిస్తూ, వాటి వంక చూస్తూ, చూడనట్టు నటిస్తూ, మన కావాల్సిన విధంగా అమరగానే, టక్కున నేల మీదకి వేసేయడమే. నేను అలా అలా మంచి మంచి (దొంగ) పందేలు వేస్తూ, మధ్యలో దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తూ విజయవంతంగా దూసుకువెళ్ళిపోతుంటే , మా కజిన్స్ ఇద్దరూ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు(ఇది కానీ చదివితే ఆ నిప్పులేవో నా మీద పోస్తారు) "విద్యక్కా నువ్వు బాగా మోసం చేస్తున్నావు" అని నా మీద లేని పోని అభాండాలేసేసి నా మీద అలిగి ఆడటం మానేసారు.

ఇలా కాదని మా అమ్మ ఒక ఉచిత సలహా ఇచ్చింది. ఎనిమిది గవ్వలాట ఆడదాము. ఎనిమిది పేర్చాలంటే విద్యక్కకి ఎలానూ చెయ్యి సరిపోదు అంది. సరే అని మొదలుపెట్టాము. నిజంగానే పేర్చడం పరమ కష్టంగా వుంది. ఎనిమిది ట్రై చేస్తే, ఏడు, ఆరు ట్రై చేస్తే అయిదు పడుతుంది ఘోరంగా. పోనీ ఆరు పడుతుందని ఏడు పేరిస్తే ఏడే పడుతుంది చెత్తగా.దానికి తోడు ఆకలిగా వున్న పులుల్లా ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకోడం ఒకటి. అనకూడదు కానీ మాలో ఒక మంచి ఫ్యాక్షనిష్టు దాగున్నాడు. మా పగలు, ప్రతీకారాలతో ఆట ఎంతకీ తెమలకపోయేసరికి మా అమ్మకి చిరాకేసి ఒక శాంతి ఒప్పందం చేసి పారేసింది. ఇంక చంపుకోవడాలు లేవని. అప్పుడు చూడాలి మా మొహాలు. ఫ్యాక్షనిష్టు చేతిలో కత్తులు, బాంబులు లాగేసుకుంటే ఎలా అవుతుందో అలా అయిపోయాయి. అలా మా ఆటని లేడీ విలన్ లేని డైలీ సీరియల్లా నీరసంగా ముగించేసాము. ఫలితాలు అడగొద్దు. ఎందుకంటే నేను పెద్ద మనసుతో పేర్చకుండా (పేర్చలేక) ఓడిపోయి వాళ్ళని గెలిపించాను అని గొప్పలు చెప్పుకోవడం నాకస్సలు ఇష్టం వుండదు.

గవ్వల గలగలలు అయ్యాయి.తర్వాత కేరం బోర్డ్ మీద పడ్డాము. మన ప్రతిభ ఎవ్వరూ గుర్తించటం లేదు కానీ లేకపోటే ఈ ఆటలో మనకి తోపుడు విభాగం కింద అర్జున అవార్డ్ ఇవ్వచ్చు. హోల్, కాయిన్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వున్నా ఆ రెండిటినీ ఒక చోటకి చేర్చే(తోసే) సమర్ధత నాకు (నా చేతికి) వుంది. నా ఇష్టారాజ్యంగా తోసేస్తుంటే మా మావయ్య కూతురికి మండిపోయి (కడుపు మంట!) వదినా ఎందుకంత కష్టపడిపోతావు, కాయిన్ని చేత్తో తీసి హోల్లో వేసెయ్ అంది. వీళ్ళు మరీను. మరీ అంత దారుణంగా నేనేలా.... ఆడ...గలను అసలు.నాకసలే మొహమాటం ఎక్కువ.

ఈలోపల మా అన్నయ్య బ్లఫ్ ఆడదాము రండి అన్నాడు. "పేకాటా శివా శివా, మన ఇంటా వంటా వుందా" అని చెంపలేసుకున్నాను. ఇంతలో పక్క నుంచి మా పిన్ని "జీవించింది చాల్లేవే, తాతయ్య బయటకి వెళ్ళారు" అంది. అంతే అందరం పేకముక్కలేసుకుని గుండ్రటి బల్ల సమావేశానికి సిద్దం అయిపోయాము. ఒక ముక్క వేసి వేరే ముక్క వేసామని అబద్దం చెప్పి, అందరిని అదే నిజమని నమ్మించి ముంచేయాలి. కానీ ఇక్కడా నాకు అన్యాయం జరిగింది.అందరూ కల్సి నాకు న్యాయంగా దక్కవల్సిన గుర్తింపు దక్కనివ్వలేదు. నేను ఎంతో ఆటబద్దంగా ఆడి గెలుస్తున్నా, "నువ్వే ఆటలోనైనా బాగా కిరికిరిలు చెయ్యగలవు. అందుకే ఈ అటలో నువ్వు గెలిచినా లెక్కలోకి రాదు" అని నన్ను... నన్ను... ఆటలో అరటిపండులా తీసిపారేసారు. ఇంత కన్నా పెద్ద ఘోరం నేనెక్కడా చూళ్ళేదమ్మా. అయినా వీళ్ళకి బొత్తిగా స్పోర్టివ్ స్పిరిట్ లేదు బాబు.అందుకే అన్నారు న్యాయంగా ఆడే రోజులు అస్సలు కాదని........ కలికాలం.

Wednesday, May 21, 2008

అపరిచితురాలు

నా మొదటి కంపనీలో మా బ్యాచ్ జాయిన్ అయ్యిన వెంటనే మాకేమీ రాదని అర్థం అయిపోయింది ఆ కంపనీవాళ్ళకి. మా బుర్ర బూజు దులిపి, కాస్త గ్రీజు రాసి వాటిని పనికొచ్చేలా చేసే బాధ్యతని లత అనే సూపర్ ట్రైనర్ చేతుల్లో పెట్టారు. మా లత ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు అరుస్తుందో, ఎప్పుడు ఏడిపిస్తుందో మా బుల్లి మెదళ్ళకి అంతు పట్టక ముద్దుగా అపరిచితురాలు అని పిలుచుకునే వాళ్ళం.మా లతకి రోజుకి నాలుగు సార్లు కోపం వచ్చేది. ఎందుకు వచ్చేది అంటే ఏం చెప్తాము. అదంతే. కొన్నిటికి కారణాలు వుండవు.కోపమొస్తే "మీకేమి రాధు. మీరెందుకు పనికి రారు" అంటూ ఆపకుండా చెవులు చిల్లులు పడేలా బండ బూతులు తిట్టేది.

ఒక రోజు పని లేని మంగలోడు పిల్లి తల గొరికినట్టు, క్లాసులో ఓ తలకి మాసినోడు "లత నువ్వింకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు..?" అని అడిగి తగలడ్డాడు. లత ఒక్కక్షణం ఆగి గట్టిగా ఊపిరి తీసుకుంది. అర్థమయిపోయింది మాకారోజు మూఢిందని. మా ప్రాణాలు తోడేసే ప్రోగ్రామేదో ప్లాన్ చేసిందని. టైం మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. కథ (రొద) మొదలుపెట్టింది.

నేను ఎల్.కె.జిలో జాయిన్ అయ్యాను అంటూ ఎత్తుకుంది.డిటైల్స్ మరీ అంత చిన్నప్పట్నుంచీ వద్దని మేము మొత్తుకుంటున్నా, ఆవిడ ఏబీసీడీలు దిద్దుకుంటూ పదో తరగతి పాసయ్యేసరికి 2:00 అయ్యింది. కథ కాలేజీ గేటు దగ్గరకి వచ్చేసింది.కాలేజీ అంటే ఇంక పెళ్ళి ఎందుకు చేసుకోలేదో చెప్తుంది అని నోరు తెరిచి, ఒళ్ళు మరిచి ఆత్రుతగా అందరం ఎదురు చూస్తున్నాము. కానీ మాకంత అదృష్టం ఎక్కడ ఏడిచింది.మా గుండెల్ని ముక్కలు చేస్తూ, అసలు పెళ్ళి ప్రసక్తే లేకుండా కాలేజీ కూడా అయిపోయింది. టైం 2:30. కడుపులో ఎలుకలు క్రికెట్ ఆడేసుకుంటున్నాయి. లతకి జాబ్ వచ్చింది. వాళ్ళ తమ్ముడికి పెళ్ళి అయ్యింది. కజిన్స్ కీ పెళ్ళి అయ్యింది. కథ అవ్వటం లేదు. అందరూ నీరసంతో చచ్చేలా వున్నారు. తమ్ముడికి పిల్లలు పుట్టారు. వాళ్ళ కజిన్స్కీ పిల్లలు పుట్టారు. మళ్ళీ జాబ్ మారింది. కడుపులో ఆకలి మంటలు. ఇంక తెగించి "ఆపేయ్ తల్లోయ్ నీకో దణ్ణం" అని చేతులెత్తి మొక్కేసాం. దాంతో మా మీద దయ తలిచి చిద్విలాసంగా నవ్వుతూ 4:00 కి ఆ చిదంబర రహస్యం చెప్పి మాకు ముక్తి కలిగించింది. "నా జీవితంలో ఇన్ని సంఘటనలు జరిగాయి. ఏ ఒక్క క్షణంలోనూ, సందర్భంలోనూ నాకు పెళ్ళి చేసుకోవాలి అనిపించలేదు. అందుకే చేసుకోలేదు.." అంది చాలా వీజీగా.

వార్నీ సమరసింహా రెడ్డి, సింహాద్రి లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ వుంటుందని ఊహించుకున్నాను. ఒక్క డవిలాగుతో గాలి తీసేసింది.ఈ ముక్కేదొ ముందే చెప్తే నాలుగు అన్నం మెతుకులు తిని ఈ పాటికి సీట్లో పడి హాయిగా నిద్రోయేవాళ్ళం కదా..
దీనికి తోడు ఈ సోది భారతం విని ఒకడు మరీ కదిలిపోయి, కరిగిపోయి,రెచ్చిపోయి, లత నువ్వు నిజంగా త్యాగ మూర్తివి.నేను నీ జీవిత చరిత్ర రాసేద్దామని డిసైడ్ అయిపోయాను అన్నాడు. అంతే ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా మా క్లాస్ రూం మొత్తం షాకయ్యి, షేకయిపోయింది. ఈవిడ చిన్న చిన్న పిట్ట కథలు వినే మా మెదడులో రక్తం గడ్డ కట్టేస్తుంది.మొత్తం జీవిత చరిత్ర అంతా రాసి, జనాల మీదకి వదిలితే ఇంకేమన్నా వుందా....? జరిగే నరమేధాన్ని ఊహించడం నా తరం కాలేదు. ఏదో ఆవేశంలో నోరు జారాడని వాడి చేత బలవంతంగా రాయించుకుంటుందేమోన్న టెన్షన్ తో వాడి దగ్గరకి వెళ్ళి కొంపదీసి నిజంగానే రాస్తావా ఏంటి అని అడిగాను. వాడి నాలుకని అటూ ఇటూ ఆడించి లేదు ఉత్తుత్తినే, నాకింకా కొన్నాళ్ళు బతకాలని వుంది అన్నాడు. హమ్మయ్య బతికించాడు.వాడికా మాత్రం క్లారిటీ వుంది అది చాలు.

Wednesday, May 14, 2008

మనసున మనసై - III (కథ)

మూడేళ్ళు గడిచేసరికి రఘు ఖాతాలో రెండు సివిల్స్ దండయాత్రలు చేరాయి. మొదటిది ప్రిలింస్ లో తన్నితే, రెండోది మెయిన్స్ లో పల్టీ కొట్టింది. రెండు అపజయాలు, అనుభవాలుగా మారి మూడో సారి తప్పకుండా సాధించగలడన్న నమ్మకాన్ని కలిగించాయే తప్పితే నిరుత్సాహానికి గురి చెయ్యలేదు.చిన్నప్పుడు ఓ మాదిరిగా చదివే తన తోటి వాళ్ళంతా ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారు. వేరే దేశంలో వున్నారు.అంత సంపాదిస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారు అన్న ఊళ్ళో వాళ్ళ మాటలు కూడా అంత బాధపెట్టేవి కావు. కానీ ఆ మాటలు విన్నప్పడు తన తల్లితండ్రుల కళ్ళల్లో లీలగా కదలాడే నీలి నీడలు చూస్తుంటే, రఘుకి గుండెని ఎవరో రంపంతో కోస్తున్నట్టు అనిపించేది. అందరూ వెళ్ళే దారిని కాదని, తను కోరుకున్న దారిలో వెళ్ళడానికి కూడగట్టుకున్న ధైర్యం, పట్టుదల, శక్తి అంతా కరిగి నీరై తన చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపించేది. అలాంటి నిస్పృహలో, నిరుత్సాహంలో కీర్తి బాగా గుర్తుకి వచ్చేది. కీర్తి ఎంచుకున్న దారి వేరైనా, తనని అర్థం చేసుకోగలిగేదేమో అని రఘుకి బాగా అనిపించేది.

కానీ రఘు మనసులో ఎక్కడో చిన్న సందేహం."తన కోసం ఆశలు సౌధాలు దిగి, కలలు తీరాలని వదిలి వస్తుందా..? రేప్పొద్దున్న ఎన్ని ప్రయత్నాలు చేసినా, సివిల్స్ రాక మామూలు లెక్కల మాస్టారిగా వుండిపోతే, తన స్నేహితులతో పోల్చుకుని, తన అదృష్టాన్ని కొలుచుకోకుండా వుండగలదా ..? అలా జరిగితే కీర్తి కళ్ళల్లో విచారాన్ని, కాసుల వేటలో వెనకబడిపోయామన్న దిగులుని చూసి తను తట్టుకోగలదా..?". ఇలా సమాధానం లేని, రాని ఎన్నో ప్రశ్నలు, కీర్తి కూడా అందని ద్రాక్షే అనే భావాన్ని కలిగించాయి. దాంతో కీర్తి కథ తీరని కల అని తన మనసుకు సర్దిచెప్పుకోవడం మొదలుపెట్టాడు.

********

కీర్తికి ఒకప్పుడు రఘుతో భవిష్యత్తు అంటే కాలం కల్సి రాకపోతే లెక్కల మాస్టారుతో సాదా జీవితం అన్న దిగులు వుండేది. కనీ రఘుతో బంధంలోని అర్థం తెలిసాక,ఒకప్పుడు జీవిత పరమార్ధంగా అనిపించిన మంచి జీతం, పేరు, సుఖాలు, సౌకర్యాలు, స్నేహితుల ముందు పరువు అన్నీ వ్యర్ధంగా అనిపిస్తున్నాయి.రఘుతో జీవితం అంటే, కాలాలు కలిసొచ్చినా రాకున్నా కలకాలం కొంగొత్త మలుపుల, గెలుపుల దారులు తెరిచి కీర్తి తలపులకి పలికే ఆహ్వానంలా అనిపిస్తుంది.రఘు గురించి ఇలా మనసు చెప్పే తియ్యని ఊసుల, బాసల ఊగిసటలాటలో కీర్తికి రఘుని చూడాలన్న ఆరాటం, ఎప్పటికైనా చూస్తానన్న ఆశ, తనకి కాకుండా అయిపోతాడేమోనన్న దిగులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.రఘుకి కూడా కీర్తి తనతో జీవితాన్ని పంచుకుంటుందన్న ఆశ లేకపోయినా, ఇష్టం మాత్రం తగ్గలేదు.కీర్తిని చూడాలన్న తపన తరుముతూనే వుంది. తను వెళ్ళే ప్రతీ చోట కీర్తిని వెతుకుతూనే వుంది.


ఒక రోజు రఘు యధావిధిగా మది నిండా కీర్తి తలపుల బరువుని మోస్తూ వెళ్తుంటే దారిలో పుస్తకాల షాపు కనిపించింది.రఘు తన మనసుకి నచ్చిన పనిలో అలా మొండిగా, బండగా ముందుకెళ్ళడానికి స్పూర్తినిచ్చేవి పుస్తకాలే.మనసులో పేరుకున్న నిరుత్సాహాన్ని, దిగులుని బయటకి నెట్టి, కొత్త ఉత్సాహాన్ని నింపే పుస్తకాన్ని వెతుక్కోవడానికి లోపలకి వెళ్ళాడు.


అదే సమయంలో కీర్తి సంపాదించిన డబ్బుని కరిగించడానికి ఒంటరిగానే షాపింగుకని బయరుదేరింది. అలవాటు ప్రకారం రఘు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని వళ్ళంతా కళ్ళు చేసుకుని అడుగడుగునా అణువణువూ శోధించింది. అతను కనపించలేదు కానీ దారిలో ఒకచోట పుస్తకాల షాపు కనిపించింది. చదివే తీరిక, ఓపిక రెండూ లేవని తెల్సినా పుస్తకాలంటే వున్న ఇష్టం లోపలకి వెళ్ళేలా చేసింది.

"కలా నిజమా" అన్న టైటిల్ తో ఒక పుస్తకం కనపడగానే అదేంటో చూద్దమని, షెల్ఫ్ లో నుంచి ఆ పుస్తకాన్ని తియ్యబోయింది. అదే సమయంలో ఆ పుస్తకాన్ని ఇంకో చెయ్యి తాకింది. ఒక్కక్షణం తడబడి సారీ చెప్పడానికి తలెత్తి చూసింది.నిజంగానే కలా నిజమా అన్నట్టు, ఎదురుగా రఘు. ఇద్దరికి కళ్ళల్లో మాటల్లో చెప్పలేనంత ఆనందం, ఆశ్చర్యం.ఒకరి కళ్ళల్లోని మెరుపు, నవ్వులోని వెలుగు ఇంకొకరి ప్రశ్నలకి అడగకుండానే అందమైన సమాధానాల్ని చెప్పేసాయి. కలిసిన అభిప్రాయలు దగ్గర చేసాక, కలవని లక్ష్యాలు ఇద్దర్నీ దూరం చేసినా ఇంకా కల్సే వున్న ఆ మనసులకి, విధి అంత అందంగా కలిపిన తర్వాత కలకాలం కల్సి ఆనందంగా ఎలా వుండాలో బాగా తెల్సు.

********

మనసున మనసై - II (కథ)

ఆరు నెలలు గడిచేసరికి, ప్రతిఫలాలు ఆశించని పరిచయాల పరిమళాలు ఇద్దరి మనసులని అందంగా అల్లుకున్నాయి. ఇద్దరూ అభిప్రాయాలు పంచుకుని, అభిరుచులు తెల్సుకుని, ఒకరి మీద ఒకరికి అభిమానం ఒక బంధంగా మారబోయే సమయానికి,కీర్తికి అనుకోకుండా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ హైదరాబాదులో చేసే అవకాశం వచ్చింది.కంగారు కంగారుగా అంజలి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెప్పి,వాళ్ళూరు వెళ్ళి ఓ వారం అక్కడే వుండి, అట్నుంచి అటే భాగ్యనగరం బస్ ఎక్కేసింది. ఇంత హడావిడిలో రఘుకి చెప్పలేకపోయినందుకు కీర్తికి మనసు పీకుతూనే వుంది.

కీర్తికి హైదరాబాదు వచ్చాక కూడా జీవితంలో చాలా విలువైనది ఏదో కోల్పోయిన భావం వెంటాడుతూనే వుంది. రఘు ఎప్పుడూ తన పక్కనే వుంటే బావుంటుంది అని అనిపించింది.అలా అతనికై పడే ఆరాటం, పెంచుకున్న అనురాగం మనసుని మీటే ప్రతిసారీ, భవిష్యత్తు గురించి కోటి సందేహాలు చుట్టుముట్టేవి. "నలుగురూ నడిచే దారి నాకొద్దు అంటూ తనదైన బాటలో సాగే రఘుతో తను కలిసి నడవగలదా..? ఒకవేల రఘుకి సివిల్స్ రాకపొతే, అతను అన్నట్టుగానే లెక్కల మాస్టారిగా స్థిరపడిపోతే అప్పుడు పరిస్థితేంటి..? రేప్పొద్దున్న ఫ్రెండ్స్ అంతా గొప్ప గొప్ప పొజిషన్లో వుండి, బాగా సంపాదిస్తుంటే తను మాత్రం రఘుతో సాదా జీవితం, జీతంతో ఆనందంగా వుండగలదా..? దేనికీ అవును అనే సమాధానం ఖచ్చితంగా రాలేదు. దాంతో కీర్తి తన మనసుకి రఘు కథ కమ్మని జ్ఞాపకం అని నచ్చచెప్పటం మొదలుపెట్టింది. నెమ్మదిగా ప్రాజెక్ట్ గోలలో, జాబు వేటలో ఆ ఆలోచనలు మరుగునపడిపోయాయి.

కీర్తి ఆకస్మిక అదృశ్యం, రఘు గుండెల్లో ఆందోళనని,ఆవేదనని,ఆరాటాన్ని కలిపి రేపింది.ఎందుకు రావట్లేదో తెలీదు.ఏమి అయ్యిందో తెలీదు. కాసింత కంగారు, మరికొంత అసహనం. పోనీ ఎదురింటి వాళ్ళని డైరెక్టుగా అడుగుదామంటే, ఏమి అనుకుంటారో అని సందేహం. చివరకి ధైర్యం చేసి తను ట్యూషన్ చెప్పే అబ్బాయి చేత అంజలిని అడిగించాడు. అప్పుడు తెల్సింది కీర్తి ప్రాజెక్ట్ విషయం. చెప్పనందుకు మొదట కోపం వచ్చింది. మళ్ళీ తనకే అనిపించింది. కీర్తికి తను ఏమవుతాడని చెప్పాలి. ఒక పేరంటూ లేని పరిచయంలో అడిగే హక్కు తనకు లేదు. చెప్పాల్సిన బాధ్యత కీర్తికి అస్సలు లేదు అని గొప్పగా అనుకోడమైతే అనుకున్నాడు కానీ అదింకా భాధగా అనిపించింది.రోజూ నడిచే దారిలో, ఒక్కడే నడుస్తుంటే ప్రతి అడుగుకో జ్ఞాపకం పలకరిస్తూ కీర్తిని పదే పదే గుర్తు చేస్తుంటే భరించలేక వేరే దారిలో రావడం మొదలుపెట్టాడు.
*******
మూడేళ్ళు గడిచేసరికి కీర్తి చేతిలో మంచి ఉద్యోగం,కావాల్సినంత జీతం, కోరుకున్న జీవితం, దానితో పాటే అప్పుడప్పుడు గడిచిన అందమైన రోజుల్ని గుర్తు తెచ్చి, గుచ్చి గుచ్చ్చి వేధించి సాధించే ఒంటరితనం.స్నేహితులు అంతా పుట్టకొకరు, చెట్టుకొకరు అయిపోయారు. తనతో పని చేసే వాళ్ళంతా ఎవరికి యమునా తీరే అన్నట్టు వుంటారు.

అలా ఒంటరితం వేధించినపుడు,ఎడారిలో బ్రతుకున్నట్టు అనిపించినపుడు , తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని, అభద్రతా భావాల్ని తన కోణంలోంచి చూడగలిగే మనిషి, తన నిశ్శబ్దాన్ని, మూర్ఖత్వాన్ని, పిరికితనాన్ని అర్థం చేసుకునే మనసు కావాలని కీర్తికి బాగా అనిపించేది. బ్రతుకులో కష్టం,మనసులో వెలితి నిజమైన స్నేహాల విలువ తెలిసేలా చేస్తాయేమో.అందుకే అలా అనిపించినప్పుడల్లా ఎంతో కాలంగా పరిచయమైన స్నేహితులు, పక్కనే వున్న కొలీగ్స్ అందర్నీ దాటి చిత్రంగా కీర్తి ఆలోచన మళ్ళీ మళ్ళీ రఘు దగ్గరకే వెళ్ళి ఆగేది.

పదే పదే రఘు దగ్గరకే వెళ్ళి ఆగిన ఆ ఆలోచన, మొదట చిన్న అభిలాషై, నెమ్మదిగా ఆశగా మారి, క్రమంగా విడదీయలేనంత గాఢంగా మనసంతా అల్లుకుని, కీర్తి శ్వాసలో భాగం అయిపోయింది.రఘుతో జీవితం పంచుకుంటే, అరువు తెచ్చుకున్న ఆశలు, కలలు కరిగిపోయి, కీర్తి కీర్తిలానే వుండగలుగుతుందన్న భావం, దూరం అయిన మూడేళ్ళ తర్వాత కీర్తిని రఘుకి బాగా దగ్గర చెసింది.కానీ కీర్తికి ఒకటే సందేహం. "రఘు కూడా తన గురించి ఇలానే ఆలోచిస్తున్నాడా..? లేక నా ఆలోచనలకి, ఆశయాలకి కీర్తి సరిపడదు అనుకుని పూర్తిగా మర్చిపోయాడా..?".
*******

మనసున మనసై - I (కథ)

ఇది నా మొదటి కథ. మొదటి అడుగులో పొరపాట్లు, తడబాట్లు సహజం. వాటిని సరిచేసుకోవడానికి మీ అందరి అభిప్రాయాలు, సలహాలు, విమర్శలు అందిస్తారని ఆశిస్తూ...

#######


చల్లగాలి, అందమైన ఆకాశం, ఎక్కడ నుంచో వస్తున్న మల్లెపూల సుగంధం అన్నీ కలగలిపిన అందమైన వేసవి సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ, నెమ్మదిగా నడుస్తుంది కీర్తి. రోడ్డుకి అవతల పక్కన కీర్తికి సమాంతరంగా ఒకబ్బాయి నడుస్తున్నాడు. ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. ముందు ఈ అబ్బాయిలంతా ఇంతే, ఒంటరిగా వున్న అమ్మాయిని అల్లరి పెట్టాలి అనిపిస్తుంది అని అనుకోగానే బోలెడంత కోపం వచ్చేసింది. మొహం చాలా చిరాగ్గా పెట్టి, నిప్పులు కక్కే చూపులతో ఆ అబ్బాయిని కాల్చేసేలా చూసింది. అయినా ఆ అబ్బాయి అదేమీ పట్టనట్టు అలానే వస్తున్నాడు. చూపుల చురకలు పనిచెయ్యకపోయేసరికి విపరీతమైన భయం వేసింది. దాంతో వడిగా వడిగా నడవటం మొదలుపెట్టింది.అవతలి మనిషి అడుగుల వేగం పెరగలేదు. వెనక్కి తిరిగి చూసింది.నడుస్తూ నిద్రపోతున్నాడో, నిద్రలో నడుస్తున్నాడో అతనికే తెలియనంత పరధ్యానంగా నడుస్తూ, ఆ అబ్బాయి లోకంలో అతను వున్నాడు.


వెంటనే కీర్తికి తన అనవసరమైన కంగారుకి నవ్వు, ఆ అబ్బాయంటే కాసింత జాలి, ఎందుకలా వున్నాడో అన్న కుతూహలం ఒకేసారి కలిగాయి.కీర్తి గురించి క్లుప్తంగా చెప్పాలంటే,హాస్టల్లో వుంటూ ఇంజినీరింగ్ ఆఖరి సవత్సరం చదువుతుంది.గోపాలరావుగారి అమ్మాయి అంజలికి స్కూలు తెరిచేనాటికి పాఠాలు బెంగ, తనకి కాలేజీ తెరిచేసరికి ఫీజులు బెంగ లేకుండా వుండేందుకు కీర్తి అంజలికి ట్యూషన్ చెప్పడానికి తన వేసవి శెలవలకి సెలువిచ్చేసి,హాస్టల్లోనే వుండిపోయింది. గోపాలరావుగారి ఇంటి లోపలకెళ్ళి, గేటు మూస్తున్నప్పుడు కీర్తి చూపులు మళ్ళీ తను వచ్చిన దారిని పరికించాయి. సరిగ్గా అదే సమయానికి ఆ అబ్బాయి ఎదురింటి గేటు తీసి లోపలికి వెళ్తున్నాడు. ఇతనేంటి, ఇప్పుడేంటి, ఇక్కడేంటి,అస్సలు సంగతేంటిలాంటి ప్రస్నలతో, కూతహలం ఇంకాస్త బలపడే క్షణంలో ముక్కొ మొహం తెలియనని వాడి కోసం ఇంత ఆలోచన అవసరమా అని అనిపించింది. దాంతో ఆ అలోచనలని గుమ్మం దగ్గరే వదిలిపెట్టేసి ఇంట్లోకి అడుగుపెట్టింది.


మర్నాడు మళ్ళీ అదే సమయానికి కీర్తి అదే దారిలో అంజలి వాళ్ళింటికి వెళ్తుంటే,ఆమె వెనకాలే ఆ అబ్బాయి. అప్పటి నుంచి ప్రతి రోజు ఒకరు ముందు, ఒకరు వెనక, లేకపోతే దారికి ఆ పక్క ఒకరు, ఈ పక్క ఒకరు.వెళ్ళే సమయం, వెళ్తున్న దారులు, వెళ్ళాల్సిన చోటు ఒకటే అవ్వడంతో, రోజూ మాటలు లేని మౌనంలో కలసి నడవడం ఇద్దరికి అలవాటు అయిపోయింది.


********

ఒక నెల రోజులకి,ఆ అబ్బాయి ఇద్దరి మధ్య వున్న మొహమాటం గోడల్ని దాటి, కీర్తిని చూసి చిన్నగా నవ్వాడు.నెల రోజుల ముఖ పరిచయం కీర్తికి అతనంటే కాస్త మంచి అభిప్రాయమే కలిగించటంతో, అతని నవ్వుల పలకరింపుకి ప్రతిగా తన చిరునవ్వుని సమాధానంగా పంపించింది. వెంటనే "హాయండీ, నా పేరు రఘు. మీ ఎదురింట్లో వుండే పిల్లలకి ట్యూషన్ చెప్తాను" అన్నాడు నవ్వుతూ. "అయ్యో అది మా ఇల్లు కాదండి. నేనూ వాళ్ళ అమ్మాయికి ట్యూషన్ చెప్తాను" అంది తెగ కంగారు పడిపోతూ. ఆ మాట వినగానే అతని ముఖంలోని నవ్వుల విస్తీర్ణం ఇంకాస్త పెరిగింది. "ఐతే ఒకే గూటి పక్షులం అన్న మాట. నేను ఎమ్మెస్సీ మాథ్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా" అన్నాడు.


"ఎమ్మెస్సీ మాథ్స్ ..!" అంది కాసింత ఆశ్చర్యం, మరికొంత నిరుత్సాహం కలగలిపిన కంఠంతో. కీర్తి కంఠంలో పలికిన నిరుత్సాహనికి అర్థం ఆమెకే అర్థం కాలేదు. రఘు మాత్రం ఇలాంటి ప్రశ్నలు, ప్రతిస్పందనలు తనకి కొత్తేమీ కాదన్నట్టు చిన్నగా నవ్వి చెప్పాడు "నాకు లెక్కలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం." "ఓహో. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?" ఈ విషయం తనకి అనవసరమేమో అనిపించినా అడిగింది.


"ఏముంది సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. నా సర్వశక్తులు ఉపయోగించి, చేయగలిగినన్ని దండయాత్రలు చేస్తాను. జయించానా సరే సరి. లేదా లెక్కల మాస్టారిని అవుతాను" అన్నాడు చాలా ఈజీగా. తనని తాను తెల్సుకుని,లోకంతో సంఘర్షణ పడకుండా, తన జీవిత గమ్యం, గమనం నిర్దేశించుకుని, ఆ దిశగా ప్రయాణించేవాళ్ళంటే కీర్తికి చాలా గౌరవం. అదే సమయంలో, తన మనసులోని వెలితిని వెలికి తీస్తారని కాసింత భయం.

"మరి మీ సంగెతేంటి..?" అని రఘు అడగ్గానే అర క్షణం కూడా ఆలోచించకుండా " ఏముంది. ఇంజినీరింగ్ అయిపోగానే,ఏదో ఐ.టి కంపనీలో ఉద్యోగం తెచ్చుకుని హాయిగా సెటిల్ అయిపోవడమే" అని మనసులో వున్నది మాటల్లోకి మార్చేసింది. ఆ మాట వినగానే నడుస్తున్న వాడల్లా ఆగి, ఓ చిన్న నిట్టూర్పు విడిచి "మిమ్మల్ని చూస్తే అందరిలా కాకుండా, కొంచెం భిన్నంగా ఆలోచిస్తారేమో అనిపించింది.కానీ మీరు కూడా అందరిలానే ఆలోచిస్తున్నారు. మీరు చదివే ఇంజనీరింగ్ మిమ్మల్ని ఇలా మార్చేస్తుందా..?" అన్నాడు.


ఆ మాటలు కీర్తి ఇగోని తాకాయి. తన గురించి ఏం తెల్సని అందరి కన్నా భిన్నం అని అనేసుకుంటాడు. ఇప్పుడు తన మాటల్లో ఏమి లేదని, అందరిలాంటిదే అని మొహం మీదే అనేస్తాడు అని కోపంతో ఉడికిపోతూ "ఎవ్వరి కలలు, ఆశలు వాళ్ళకుంటాయి. ఇన్నాళ్ళు కష్టపడ్డ వాళ్ళు, మంచి ఉద్యోగం తెచ్చుకుని సుఖపడాలి అనుకోవడంలో తప్పేంటి..? అయినా అందని ద్రాక్ష పుల్లన" అంది. "ఏమో కావచ్చు." అన్నాడు పరమ కూల్ గా. అలా అనడం కీర్తిని ఇంకా బాధపెట్టింది. వాదించడమో, తిరిగి తనని ఇంకో మాట అనడమో చేస్తే బావుణ్ణు అనిపించింది. ఆ రోజు అలా ఓ చిన్న భేధాభిప్రాయంతో ముగిసింది.


మరసటి రోజు పలకరింపుగా నవ్వాడు. ఏమీ జరగనట్టే వున్నాడు. కీర్తి కూడా నవ్వి, తనే మాటలు కలిపింది. ముందటి రోజు వాడి చర్చని దృష్టిలో పెట్టుకుని ఇద్దరూ సొంత విషయాల జోలికి పోలేదు. మామూలు విషయాలే మాట్లాడుకున్నారు. కొందరి పరిచయంలో మనకి మనమే కొత్తగా పరిచయం అవుతాము.రోజులు గడిచేకొద్దీ,రఘు విషయంలో కీర్తికి అలానే అనిపించింది. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు దగ్గరిగా వుండటంతో బోలెడన్ని విషయాలు దొరికేవి మాట్లాడుకోవడానికి. కొన్ని విషయాలు వివరించేది, కొన్ని వాదించేది, కొన్ని సార్లు అరిచి తనే కరెక్ట్ అని ఒప్పుకోవాలని గొడవ చేసేది. అప్పటివరకు తనలో అన్ని ఆలోచనలు, అభిప్రాయాలు, అంత ఆవేశం, ఆరాటం దాగి వున్నాయని కీర్తికే తెలియదు.

********

Saturday, April 5, 2008

కుళ్ళిపోయిన టమాటాలకి కూడా ఇంత చరిత్ర వుంటుందా..?

చాల రోజుల క్రితం ఒక సీరియల్ చూసాను. అందులో అత్తాకోడళ్ళు వంట గదిలో కూర్చుని జీవితంలో టమాటాల పాత్ర, ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటుంటే వినే భాగ్యం నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు లభించింది. ఇంక సోది ఆపి అసలు విషయంలోకి వెళ్ళిపోతే..........

కోడలు: అత్తయ్యా, టమాటాలు కుళ్ళిపొయినట్టు వున్నాయి.మంచివి అమ్మటం లేదు .కూరల అబ్బాయిని మార్చేద్దాము.

అత్త: అమ్మా, మనం కూరగాయలు అతని దగ్గరే గత ముప్పయి ఏళ్ళగా కొంటున్నాము. మనం రోజూ కొంటామనే ఆశా, నమ్మకం వాడివి. వాడు వస్తాడు , వాడి దగ్గరే కొంటున్నాము అనే తృప్తి మనది. ఇక్కడ అనుబంధం, ఆత్మీయత ముఖ్యం.
గమనిక: పైది సారాంశం మాత్రమే. ఆ నీతి భోధ పొడవు, పొడవు భారీ డైలాగులతో పావు గంట పైనే నడిచింది.

కోడలు: అత్తయ్యా, ఆ కుళ్ళిపోయిన టమాటాలతోనే ఈ రోజు వంట చెయ్యండి. ఆ అనుబంధం, ఆత్మీయతల రుచి నేనూ చూస్తా.

కుళ్ళిపోయిన టమాటాలతో కూరా..? మొత్తం ఈ సోదిభారతంలో నాకస్సలు మింగుడుపడని ట్విస్టు ఇదే . అత్తగారి అమూల్యమైన లాజిక్కుకి కోడలిగారి అద్భుతమైన రెస్పాన్స్. ఐనా కుళ్ళిపోయిన టమాటాల గురించి అంత భారీ డైలాగులు అవసరమా..? వద్దమ్మా చాలాకాలంగా కొంటున్నాం, ఒక్కరోజు మంచివి అమ్మలేదని, అలా మానిపించేయకూడదు అంటే పోయేదిగా. ఏమో అవసరమేమో.. నాకే కూరల అబ్బాయి - అనుబంధం, పుచ్చు కూరలు - ఆత్మీయత లాంటి కాన్సెప్ట్స్ లోతుని అర్థం చేసుకునేంత విశాల హృదయం లేదేమో... మీకు ఏమైనా అర్థం అయితే నాకు కొంచెం చెప్పండి.

Wednesday, April 2, 2008

మనిషి గెలవాలంటే మనసు ఓడిపోవాలా..? (నేనొప్పుకోను)

మొన్న సాక్షి పత్రికలో ఆదివారం అనుబంధంలో ఒక పెద్దాయన ఒక వ్యాసం రాసాడు. దాని సారాంశం ఏంటంటే ఈ సమాజంలో బతకాలంటే, జీవితంలో గెలవాలంటే అంతరాత్మ అబద్దం, ఆత్మ వంచన నిజం నమ్మాలట. నాకైతే ఇవా గెలుపు సూత్రాలు..? ఎటు పోతున్నాము మనం అనిపించింది.

ఎవడు భూమి మీద విత్తనాలు చల్లి, కష్టపడి సాగు చేసుకుంటాడో వాడికే పంట చేతికొస్తుంది. దేవుడు మంచివాడా, చెడ్డవాడా అని చూడడు. మనిషి కష్టం బట్టి ఫలితం వుంటుంది. ఇదీ అంతే. గెలిచిన వాడు చెడ్డ వాడు ఐతే కావచ్చు, కానీ గెలుపుకి కావాల్సిన ధైర్యం, చొరవ మాత్రం కావాల్సినంత వుండి వుండొచ్చు. అదే చొరవ, తెగువ చూపిస్తే మంచివాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. మంచి వేరు, చెడు వేరు, సమర్ధత వేరు, అసమర్ధత వేరు.గెలవాలంటే సమర్ధత కావాలి. ప్రశాంతంగా, సంతోషంగా వుండాలంతే మంచి మనసు వుండాలి. గెలుపు,మంచితనం ఈ రెండింటినీ కలిపి చూడకూడదు అన్నది అని నా నమ్మకం. కానీ ఎక్కడ చూసినా కాలం మారింది. మనమూ మారాలి. విలువలు అంటూ కూర్చోకూడదు. అనుబంధాలు, ఆత్మీయతలు అనీ ట్రాష్ ఎంతొ మంది నమ్మకంగా బల్ల గుద్ది మరీ వాదించేస్తుంటే,నాలో ఈ నమ్మకం నిలబడటానికి పెద్ద యుద్దమే జరిగింది. నాలో ఒకప్పుడు ఒక సందేహం వుండేది. మంచితనం అంటే అసమర్ధతా అని..? అపుడు దానికి సమాధానంగా నాకో పుస్తకం దొరికింది. అదే Stephen Covey రాసిన The 7 habits of highly effective people.

ఆ పుస్తకం ఇంట్రడక్షన్ లో రచయిత చెప్తాడు. రెండొందల ఏళ్ళ క్రితం సక్సెస్
మానేజ్ మెంట్ పుస్తకాలు గెలవడానికి నిజాయితీ,నమ్మకం,హ్యుమానిటీ, ధైర్యం, సహనం ఇవన్నీ కావాలని చెప్తే, ఇప్పటి పుస్తకాలు చెప్పే గెలుపు సూత్రాలు మాత్రం తాత్కాలికంగా ఉపయోగపడేవే కానీ శాశ్వతంగా కాదు అని. నా నమ్మకాలకి చాలా దగ్గరగా అనిపించింది. ఈ పుస్తకంలో కొత్త విషయాలు ఏమీ వుండవు. ఎన్ని శతాబ్దాలు ఐనా మనిషి, మనసు, అంతరాత్మ అనీ నిజాలే. అవెప్పటకీ మారవు. కానీ వాటిని ఫాలో అయ్యే ఓపిక, సమయం లేక మనమే అడ్డదార్లు తొక్కి, తల బొప్పి ఎలా కట్టించుకుంటున్నాం. ఎన్నో ప్రణాళికలు వేసేసి,గెలుపు కోసం తెగ పరిగెట్టేసి అలిసిపోయి ఆగి చూసి ప్లాను పక్కాగానే వుంది కానీ ట్రాకే ఎక్కడొ తప్పేసాము అని తెల్సీ మళ్ళీ మొదట నుంచీ ఎలా మొదలుపెడతాము అనే విషయాన్ని చాలా కన్విన్సింగా చెప్తారు.

ఇనీషియల్ చాఫ్టర్స్ లో నీ సమస్యలకి వేరే వాళ్ళని భాధ్యులని చేసి నీ ఆనందాన్ని, జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టకు అంటూ మనం మనలా వుండే అవసరాన్ని చెప్పి, అలా అని జీవితంలో ఒంటరిగా వుండేవాళ్ళు, ఏ అభిప్రాయం లేకుండా వేరొకరి మీద ఆధారపడే వాళ్ళు ఆనందంగా వుండరు. ఒకరి కోసం ఒకరి జీవిస్తూ, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకునే వాళ్ళే ఎప్పడూ సంతొషంగా వుంటారు అంటూ చివరి చాప్టర్స్ లో జీవితంలో బంధాల, అనుబంధాల అందాన్ని వివరిస్తాడు. చాలా మంచి పుస్తకం.

ఈ కంప్యూటర్ యుగం లో పుస్తకాలు చదవడం అంటేనే తేడా. పర్సనాలిటీ డెవలప్ మెంట్ పుస్తకాలు చదివే వాళ్ళు
అంటే మరీ తేడా. ఆ బాగా తేడా మనుష్యుల జాబితాలో మీరూ వుంటే, లేదా చేరాలని అనుకుంటే తప్పకుండా చదవండి.
రోగాలు రాకుండా టీకాలు వేయించుకున్నట్టు, సమాజం ఓ అబద్దం, మనిషో అబద్దం, మనసు అంత కన్నా పెద్ద అబద్దం అంటూ దాడి చేసే నిరాశా వాదుల బారిన పడకుండా మన జీవితంలో ప్రశ్నా, సమాధానం, సంతోషం, బాధ అన్నీ మనమే (కానీ ఆ బాద్యతని వేరే వాళ్ళ మీదకి తోసేసి మనల్ని మనమే అబద్దం గా మార్చుకుంటున్నాము) అనే నమ్మకం కలిగించడానికి ఇలాంటి పుస్తకాల తోడు చాలా అవసరం.


Let's salute these two brave and kind men....

I have read two good articles in times of India two days back.

One is about a man who went to gulf to save his wife who was trapped in flesh trade, knowing that he was risking his own life to get his wife out of that hell. Honestly, hats off to that man, a wonderful husband. Example of True love.

http://timesofindia.indiatimes.com/articleshow/2910469.cms

Second one is about a father who ensured that his son got punished for raping an eighteen old baby where there was plenty of chance for getting away... It is such eye opener for rich parents who are sending wrong signals to their children by defending their mistakes.

http://timesofindia.indiatimes.com/articleshow/2915039.cms

Wednesday, March 26, 2008

నింగి వంగి మరీ వెక్కిరించింది....

నింగి వంగి మరీ వెక్కిరించింది.
జాబిలమ్మ జాలిగా నవ్వింది.
పచ్చికేమో మొహం మీదే పక్కుమంది.
చల్లగాలి చిటపటలాడింది.
మబ్బులేమో మొహం ముడుచుకున్నాయి
నేలతల్లి మాత్రం అయ్యో నా బిడ్డ అంటూ బాధపడింది.
ఎందుకో తెలుసా...?
ఇంత అందమైన వేసవి రాత్రిని చూసి ఆస్వాదించే
ఓపిక లేదంటూ మొహం వేళ్ళాడేసుకుని, కాళ్ళీడ్చుకుంటూ
ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరిన నన్ను చూసి.......

Monday, March 24, 2008

గమ్యం - ఒక మంచి ప్రయాణం.

కొన్ని సినిమాలు చూసిన తర్వాత సినిమాలో అది బాలేదు,హీరో అలా చేస్తే బావుణ్ణు,ఆ పాటలో సెట్టింగ్ బావుంది ఇలా ఏదో ఒకటి తెగ విశ్లేషించబుద్దవుతుంది. కొన్ని సినిమాలు చూసాక మాత్రం అప్పుడే అయిపోయిందా,ఇంకాసేపు వుంటే బావుణ్ణు అనిపిస్తుంది.బయటకి వచ్చేసాక కూడా ఆ సినిమాలో నుంచి మనల్ని బయటకి రానీయకుండా కొన్ని సన్నివేశాలు మైండ్ లో మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతూ వుంటాయి. గమ్యం సినిమా అలానే వుంది.ఈ సినిమా అలా,ఇలా అంటూ సినిమా కథ సగం చెప్పేసి సినిమా చూడాలనుకుని ఇంకా చూడని వాళ్ళకి ఆ సినిమా చూసేటపుడు కలిగే అనుభూతిని అస్సలు చెడగొట్టదలుచుకోలేదు. సినిమా అంటె కేవలం వినోదానికే కాదు, అప్పడప్పుడు మనిషిని,జీవితాన్ని కొత్త కోణం లో చూపించి మనసుని తాకే ప్రయత్నం చెయ్యాలి అనే అభిప్రాయం వున్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. చివరగా, చస్తూ,చస్తూ బఫరింగ్అయ్యే ఇంటెర్నెట్ లోనో, చూస్తున్నది సినిమానో,లేకపోతే సినిమా నీడో అర్థం కాకుండా వుండే పైరసీ సీడీ లోనో కాకుండా, ఒక మంచి సినిమా తీసినందుకు దర్శకునికి బహుమతిగా,సినిమా హాలుకెళ్ళి చూస్తే బెటర్.

Friday, March 21, 2008

సన్యాసిరావు--సినిమా దర్శకుడు అయిపోవాలని వీడికో చిన్నకల

సన్యాసిరావుకి మణిరత్నంలా, బాలచందర్ లా అద్భుతమైన కథలు తెరకెక్కించేసి, పేద్ద సినిమా డైరక్టర్ అయిపోవాలని, స్టార్ మేకర్ అనిపించేసుకోవాలని ఓ చిన్న కోరిక. అందుకోసమని కథలు పట్టుకుని ఒక్కటంటే ఒక్క చాన్సు ఇవ్వంది, బాక్సాఫీసు బద్దలుకొట్టేస్తాను అని నిర్మాతల గడ్డం, చేతులు పట్టుకుని ఎంత బతిమాలినా మలుపు చుక్క(టర్నింగ్ పాయింట్) ఐతే రావటం లేదు.

ఇంకో పక్క ఘాటునిజం చానల్ వాళ్ళు, జనాలు వారి చానల్లో ఏ ప్రోగ్రాము వస్తే,ఒళ్ళు తెలియకుండా మైమరిచిపోయి చూస్తారు, ఏ ప్రోగ్రాము వస్తే ఛీ, థూ అనుకుంటూ నిర్దాక్షణ్యంగా చానల్ మార్చేస్తారు అని ఓ భారీ సర్వే ఒకటి నిర్వహిస్తారు. ఫలితంగా చేతికొచ్చిన వెయ్యి పజీల రిపోర్టులో ఒక చిన్న పరిశీలన ఏంటంటే చుట్టూ సమాజంలొ జరిగే నేరాలని విపరీతమైన వివరంగా వివరించి, జనాల్ని అనవసరంగా భయపెట్టి, అతిగా అప్రమత్తం చేసే జనాలు మెచ్చే, ఖర్చు లేని కార్యక్రమం ఒకటి ప్రసారం చెయ్యట్లేదని గుర్తించి, ఇంతవరకు అలా చెయ్యందుకు ప్రగాడంగా విచారించి,కాసేపటకి తేరుకుని ఇక నుంచి తమ చానల్లో వేసెయ్యాలని గట్టిగా నిర్ణయించేసుకుంటారు.

చానల్ పెద్ద తలకాయ అయిడాల అన్నవరం(అ.అ) ఆ కార్యక్రమం డైరక్ట్ చేసే అమూల్యమైన అవకాశాన్ని సన్యాసి రావుకి(స.రా) ఇవ్వాలని పెద్ద మనసుతొ నిర్ణయించేసుకుని సన్యాసి రావుని పిలిపించి బాబూ సన్యాసి ఆ ప్రోగ్రాము నీ చేతుల్లో పెడుతున్నా, ఎలా తీస్తే జనాలు పడీ పడీ చూస్తారు అన్న విషయం మీద లొతుగా పరిశోధన చేసి రా, విజయోస్తు అని దీవించి పంపించేస్తాడు.

అసలు నేనెందుకు ఈ ఊరు వచ్చాను, ఎలాంటి సినిమాలు తీద్దాము అనుకున్నను, చివరకి నా బ్రతుకు ఏంటి ఇలా తయారయ్యింది అని కాసేపు వేరు, వేరు ఏంగిల్స్ లో ముఖం పెట్టి మరీ భాదపడిన తర్వాత నిర్మాతల చుట్టూ తిరగడానికి బొలేడు బలం కావలని, అందుకు డబ్బులు కావాలని గుర్తొచ్చి అన్నవరం చెప్పిన పరిశోధన కార్యక్రమంలో భాగంగా వేరే చానల్స్ లో వచ్చే అన్ని క్రైం ప్రోగ్రాములు చూడ్డం మొదలుపెడతాడు. ప్రోగ్రాములు చూసి,వాటి తీవ్రతకి బాగా దడుచుకున్న సన్యాసి రావుకి మొదటిరోజే నూట ఇరవై డిగ్రీల చలి జ్వరం వచ్చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాన్ని నెత్తినేసి నడిపించే కన్నా, అమావాస్య రోజు,అర్థరాత్రి, శశ్మానంలో కాలక్షేపం చెయ్యడం నయం అనిపించినా మళ్ళీ నిర్మాతల చుట్టూ తిరగడానికి కావాల్సిన బలం గుర్తొచ్చి పరిశొధన లోతు పెంచి, తన బుర్రకెక్కినది అంతా ఏమిటి, ఎందుకు, ఎలా అంటూ డీటైల్డ్ రిపోర్టు ఒకటి రాసి, దాన్ని తీసుకుని పెద్ద తలకాయ దగ్గరకెళ్తాడు.

స.రా: సార్, ఈ కార్యక్రమం నిర్మించాడానికి నాకు కొన్ని వనరులు కావాలి. ముందుగా కల్పిత పాత్రల కోసం నటీనటులు.....
అ.అ: ఏంటి...? నటీ నటులా....? వెళ్ళవయ్యా వెళ్ళి, మహేషు బాబు , ఇలియానా డేట్లూ ఏమైనా దొరుకుతాయి ఏమో కనుక్కో. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు మా ప్రాణాలకి..? కల్పితపాత్రలకి ఎవరైతే ఏంటి..? ఏ దారి పోయే దానయ్యనో, ఊరక కూర్చుని వున్న బోడిలింగాన్నో తీసుకో

స.రా: సరేనండి, ఇంక స్క్రిప్టు రచయిత......
అ.అ: బాబు సన్నాసీ, సారీ సన్యాసి ఇది సినిమా కాదు. అంత భారీ బడ్జెట్టులు మన దగ్గర కుదరవు. మన క్రైం రిపోర్టర్లని అడుగు, చూసింది, చూడంది, వున్నవి, లేనివి అన్నీ కలిపి భయంకరమైన కథ, మాటలు అందించేస్తారు.

స.రా: సరే .ఇంక ప్రోగ్రాము వ్యాఖ్యాత.......
అ.అ: అది కూడా నేనే చెప్పలంటయ్యా....? మీ సినిమాల్లో వచ్చే రౌడీ మూకలో మంచి బొంగురు కంఠం వుండి, పిల్లల్ని ఎత్తుకుపోయేలా వుండే వాడు ఎవడైన వుంటే వాడిని సెట్ చేసేయ్.

స.రా: సరే .......ఇంక చివరగా ప్రోగ్రాము పేరు సార్. మన సమాజం తీరు తెన్నులు అని...
అ.అ: ఏంటీ...? సమాజం...... తీరూ........ తెన్నులా.....? ఇదేమైనా సాంఘిక శాస్త్రం పాఠం అనుకున్నావా..? పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకోవాలి.. ఉదాహరణకి నేరభేరి... ఆహా నేరం భేరి ఇదేదొ బావుంది. ఇదే వుంచేసేయ్.
స.రా: సరే సార్.

మొత్తానికి పెద్ద తలకాయ సౌజన్యంతో నేరభేరి కార్యకమాన్ని ఏదొ అలా ఈడ్చుకుంటూ ఓ మోస్తరు పేరు సంపాదించుకుంటాడు. కానీ ఒకటె బెంగ, క్రియేటివ్ డైరక్టరుతో సినిమా మొత్తం కాకుండా, ఒకటో, రెండో పాటలు తీయించినట్లుగా తన చేత కూడా హత్యలు, దొంగతనాలు మాత్రమే డైరెక్ట్ చేయిస్తారేమోనని.

ఇలా బెంగ పెట్టుకుని చిక్కిపోతుండగా, ఓ బడా నిర్మాత ఫోను చేసి, నాన్న సన్యాసీ నీకో ఫుల్ లెంగ్త్ సినిమా తీసే అవకాసం ఇద్దాము అనుకుంటున్నా అనగానే, మన సన్నీ ఆనందంతో కరెంట్ షాకు కొట్టిన కాకిలా చలనరహితం అయిపోతే, నిర్మాతే మళ్ళీ సినిమా పేరు వంద హత్యలు. సినిమ ప్రారంభం నుంచీ. ముగింపు వరకూ వరసగా హత్యలు జరుగుతూనే వుంటాయి. నీకు నేరభేరితో మంచి అనుభవం వచ్చిందిగా. కాబట్టి నువ్వైతే వంద హత్యలూ విభిన్నంగా, ఉత్కంఠభరితంగా చూపిస్తావని నిన్ను తీసుకోవాలని అనుకుంటున్నా అని అనగానే,సన్యాసేమో కానీ నాకు మణిరత్నంలా మంచి సినిమాలు తియ్యాలని...... అని నసుగుతుంటే నిర్మాతకి బోలెడంత కోపం వచ్చెసింది.మణిరత్నంలా తియ్యడానికి మణిరత్నం వున్నాడయ్యా.. మళ్ళీ నువ్వెందుకు...? ఈ సినిమా హిట్ చెయ్యి చాలు, తర్వాత నీ జాతకమే మారిపోద్ది. ఒక్క పోటు చాలు, చావాలని వుంది, దొంగ, దొంగ నడుమ హంతకుడు, చంపుకుందం రా, ఇలాంటి మంచి మంచి చాన్సులనీ నీకే ఇప్పిస్తాను. సరేనా..?రేపు విలేఖరుల సమావేశం వుంది వచ్చేయ్ అని ఫోను పెట్టేస్తాడు. కానీ విలేఖరుల సమావేశంలో అంత అద్భుతమైన అవకాశం పొందిన సన్యాసి రావు మాత్రం తన స్పందన తెలియచెయ్యటానికి విచ్చేయలేదు. అంతకు ముందు రోజే జీవితం మీద బా...గా.. విరక్తి చెంది, సన్యాసంలో కల్సిపోయి హిమాలయాల్లో తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు.

Saturday, March 15, 2008

మిస్టర్ మేధావి - నిజంగా మేధావేనా....!

సినిమాని థియేటర్ లో పీకేసే టైంకి, సినిమా గురించి రాయడంలో నీ ఉద్దేశ్యం ఏన్టని నన్ను ఎవ్వరైనా నిలదీయచ్చు.సినిమా అంటే థియేటర్ కి వెళ్లే ఛూడక్కర్లేదుగా. చక్కగా సీడీ తెచ్చుకుని, రాణిలా/ రాజాల ఇంట్లో కూర్చుని ఆకుపకోడిలో (అదే థియేటర్ ఐతే పాతిక పెట్టీ మరీ పాప్ కార్నో కొనుక్కుని మేకల్లా నమలాలి) తింటూ చూడచ్చు. అందుకని రాస్తున్నా అని నన్ను సమర్దించేసుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే, ఏమి చెయ్యను :( ?. నేను మొన్నే చూశాను. అందుకే ఇప్పుడు రాస్తున్నాను.

ఇంక సుత్తి లేకుండా, సూటిగా( ఇది స్ప్రైట్ ఏడ్ కాప్షన్ నాకు తెగ నచ్చేసింది) సినిమా గురించి చెప్పాలంటే, చూయింగ్ గమ్ అరగంట నమిలితే బానే ఉంటుంది నోటికి. దాన్నే గంటన్నర నమిలితే పరిస్థితేంటి....? నోరంతా పాడవుతుంది......... సినిమా కూడా అంతే, తీసుకున్న సబ్జెక్ట్ మంచిది. సాగదీయకుండా మంచి నవల్‌గానో రాస్తేనో ( రాస్తే కాలంలో ఎవరు చదువుతారు అని నన్ను అడగొద్దు), గంటన్నర నిడివి సినిమాగానో తీస్తే చాలా బావుండేది.కానీ దాన్ని రెండున్నర గంటల సినిమాగా సాగదీసెసరికి, కథలోని ఫీల్ పోయింది .కొంచెం బోర్ కొట్టింది.

ఇంక కథ విషయంలో కి వస్తే, మన హీరో రాజా గారు అనాథ.తాను బ్రతకటానికి వేరే వాళ్ళ బలహీనతల మీద
ఆడుకుని
అదే మేధావితనం అనుకుంటాడు. భ్రమ నుంచి ఎలా బయట పడ్డాడు, మానవ సంబంధాల గొప్పతనం ఎలా తీసుకున్నాడు అన్నదే కథ. రొటీన్ గా లవ్ ట్రాక్ కూడా ఉంది. రాజా కన్నింగ్ ఏక్షన్ చాలా బాగా చేశాడు.

ఇంక సినిమాలో నీతి(తెలుగు ప్రేక్షకులకి నచ్చాలంటే, అస్సలు నీతి అనే పదం కూడా సినిమాలో ఉండకూడదని దర్శకుడు నీలకంఠ కి ఎవరైనా చెప్పారో లేదో) ఏంటంటే కలసి పని చేస్తే కలదు సుఖం, కలిసి వచ్చును అదృష్టం అని
ఒకరి ఎదుగుదలకి ఇంకొకరు తోడ్పడాలి. అంతే కానీ పీతల్లా ఒకళ్ళని, ఒకళ్ళు కిందకి లాగేసుకోకూడదు.మనసనేది ఈర్ష, అసూయ, ద్వేషాలు లేకుండా అద్దంలా ఉండాలి అని. చూసి వదిలేయకుండా ఆచరిస్తే బానే ఉంటుంది (ఆచరించాలి కదా..!).

కమర్షియల్ ఫార్ములా ఫైట్లు, మాస్ పాటలు లేకపోయినా, బోర్ కొట్టించే సీన్లని ఓపిగ్గా చూసేసి, సినిమాలో ఉన్న మంచిని ఫీలయ్యి, ఆస్వాదించే విశాల హృదయం ఉన్న తెలుగు ప్రేక్షకుడు/ ప్రేక్షకురాలు మీరు ఐతే సినిమా తప్పకుండా చూడవచ్చు

P.S:
నేను ఇందాక ఆకుపకోడీలు టాపిక్ తెచ్చానుగా. మీకు ఎవ్వరికైనా తినాలానిపించి, అవి ఎలా చెయ్యాలో తెలియకపోతే నాకో కామెంట్ ముక్క( ఉత్తరం ముక్కలా) రాసీపడేయండి. మా అమ్మ సహాయ సహకారాలతో ఆకుపకొడీలు-తయారీ విధానం అని ఇంకో పోస్ట్ రాసేస్తాను.