Wednesday, April 2, 2008

మనిషి గెలవాలంటే మనసు ఓడిపోవాలా..? (నేనొప్పుకోను)

మొన్న సాక్షి పత్రికలో ఆదివారం అనుబంధంలో ఒక పెద్దాయన ఒక వ్యాసం రాసాడు. దాని సారాంశం ఏంటంటే ఈ సమాజంలో బతకాలంటే, జీవితంలో గెలవాలంటే అంతరాత్మ అబద్దం, ఆత్మ వంచన నిజం నమ్మాలట. నాకైతే ఇవా గెలుపు సూత్రాలు..? ఎటు పోతున్నాము మనం అనిపించింది.

ఎవడు భూమి మీద విత్తనాలు చల్లి, కష్టపడి సాగు చేసుకుంటాడో వాడికే పంట చేతికొస్తుంది. దేవుడు మంచివాడా, చెడ్డవాడా అని చూడడు. మనిషి కష్టం బట్టి ఫలితం వుంటుంది. ఇదీ అంతే. గెలిచిన వాడు చెడ్డ వాడు ఐతే కావచ్చు, కానీ గెలుపుకి కావాల్సిన ధైర్యం, చొరవ మాత్రం కావాల్సినంత వుండి వుండొచ్చు. అదే చొరవ, తెగువ చూపిస్తే మంచివాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. మంచి వేరు, చెడు వేరు, సమర్ధత వేరు, అసమర్ధత వేరు.గెలవాలంటే సమర్ధత కావాలి. ప్రశాంతంగా, సంతోషంగా వుండాలంతే మంచి మనసు వుండాలి. గెలుపు,మంచితనం ఈ రెండింటినీ కలిపి చూడకూడదు అన్నది అని నా నమ్మకం. కానీ ఎక్కడ చూసినా కాలం మారింది. మనమూ మారాలి. విలువలు అంటూ కూర్చోకూడదు. అనుబంధాలు, ఆత్మీయతలు అనీ ట్రాష్ ఎంతొ మంది నమ్మకంగా బల్ల గుద్ది మరీ వాదించేస్తుంటే,నాలో ఈ నమ్మకం నిలబడటానికి పెద్ద యుద్దమే జరిగింది. నాలో ఒకప్పుడు ఒక సందేహం వుండేది. మంచితనం అంటే అసమర్ధతా అని..? అపుడు దానికి సమాధానంగా నాకో పుస్తకం దొరికింది. అదే Stephen Covey రాసిన The 7 habits of highly effective people.

ఆ పుస్తకం ఇంట్రడక్షన్ లో రచయిత చెప్తాడు. రెండొందల ఏళ్ళ క్రితం సక్సెస్
మానేజ్ మెంట్ పుస్తకాలు గెలవడానికి నిజాయితీ,నమ్మకం,హ్యుమానిటీ, ధైర్యం, సహనం ఇవన్నీ కావాలని చెప్తే, ఇప్పటి పుస్తకాలు చెప్పే గెలుపు సూత్రాలు మాత్రం తాత్కాలికంగా ఉపయోగపడేవే కానీ శాశ్వతంగా కాదు అని. నా నమ్మకాలకి చాలా దగ్గరగా అనిపించింది. ఈ పుస్తకంలో కొత్త విషయాలు ఏమీ వుండవు. ఎన్ని శతాబ్దాలు ఐనా మనిషి, మనసు, అంతరాత్మ అనీ నిజాలే. అవెప్పటకీ మారవు. కానీ వాటిని ఫాలో అయ్యే ఓపిక, సమయం లేక మనమే అడ్డదార్లు తొక్కి, తల బొప్పి ఎలా కట్టించుకుంటున్నాం. ఎన్నో ప్రణాళికలు వేసేసి,గెలుపు కోసం తెగ పరిగెట్టేసి అలిసిపోయి ఆగి చూసి ప్లాను పక్కాగానే వుంది కానీ ట్రాకే ఎక్కడొ తప్పేసాము అని తెల్సీ మళ్ళీ మొదట నుంచీ ఎలా మొదలుపెడతాము అనే విషయాన్ని చాలా కన్విన్సింగా చెప్తారు.

ఇనీషియల్ చాఫ్టర్స్ లో నీ సమస్యలకి వేరే వాళ్ళని భాధ్యులని చేసి నీ ఆనందాన్ని, జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టకు అంటూ మనం మనలా వుండే అవసరాన్ని చెప్పి, అలా అని జీవితంలో ఒంటరిగా వుండేవాళ్ళు, ఏ అభిప్రాయం లేకుండా వేరొకరి మీద ఆధారపడే వాళ్ళు ఆనందంగా వుండరు. ఒకరి కోసం ఒకరి జీవిస్తూ, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకునే వాళ్ళే ఎప్పడూ సంతొషంగా వుంటారు అంటూ చివరి చాప్టర్స్ లో జీవితంలో బంధాల, అనుబంధాల అందాన్ని వివరిస్తాడు. చాలా మంచి పుస్తకం.

ఈ కంప్యూటర్ యుగం లో పుస్తకాలు చదవడం అంటేనే తేడా. పర్సనాలిటీ డెవలప్ మెంట్ పుస్తకాలు చదివే వాళ్ళు
అంటే మరీ తేడా. ఆ బాగా తేడా మనుష్యుల జాబితాలో మీరూ వుంటే, లేదా చేరాలని అనుకుంటే తప్పకుండా చదవండి.
రోగాలు రాకుండా టీకాలు వేయించుకున్నట్టు, సమాజం ఓ అబద్దం, మనిషో అబద్దం, మనసు అంత కన్నా పెద్ద అబద్దం అంటూ దాడి చేసే నిరాశా వాదుల బారిన పడకుండా మన జీవితంలో ప్రశ్నా, సమాధానం, సంతోషం, బాధ అన్నీ మనమే (కానీ ఆ బాద్యతని వేరే వాళ్ళ మీదకి తోసేసి మనల్ని మనమే అబద్దం గా మార్చుకుంటున్నాము) అనే నమ్మకం కలిగించడానికి ఇలాంటి పుస్తకాల తోడు చాలా అవసరం.


6 comments:

uma said...

మీరన్నది ముమ్మాటికి నిజం. కాని నేటి సమాజంలో బతకాలంటే కొన్ని సార్లు మనల్ని మనం మోసగించుకోక తప్పదు.

నాకు రాబిన్ శర్మ "The Greatness Guide" స్టీవ్ పేవ్లీనా సైట్ "www.stevepavlina.com" బాగ నచ్చుతాయి.

Anonymous said...

"ఈ సమాజంలో బతకాలంటే, జీవితంలో గెలవాలంటే అంతరాత్మ అబద్దం, ఆత్మ వంచన నిజం నమ్మాలట"

కొంచెం అటు ఇటుగా ఇది అక్షరాలా నిజం.ఈ సమాజం ఒద్దు అనుకుంటే సొంతంగా నిలబడే శక్తి కావాలి, సమాజం లో మామూలుగా వుండాలి అనుకుంటే అప్పుడప్పుడు అంతరాత్మని వంచించి ఏమీ మాట్లాడకుండా వుండాలి. ఇక సమాజం లో నాయకుడిగా చలా మణి అవ్వాలంటే తన అంతరాత్మని వదులుకోవాలి, వీలయినన్ని అబద్ధాలు చెప్పాలి. విజయాలు సాధించిన వాడెవ్వడూ నిజాలు చెప్పడు. తనెంత కష్టపడ్డాడో చెబుతాడు. ఆ కష్టమంటే ఇలాంటి వాటిని తన అనుకూలత కోసం ఆత్మాభిమానాన్ని వదిలేసుకోవడం.

-- విహారి

ఓ బ్రమ్మీ said...

విహారిగారితో నేను ఏకీభవించను.. సమాజం గురించి నాది ఒక స్పష్టమయిన అభిప్రాయం .. దానిని తెలుగులోకన్నా english లో ఇక్కడ మీముందు ఉంచుతాను.

Society exists for the benifit of it's members, but not the members for the benifit of the society

సమాజం అనేది, దాని సభ్యుల ఉపయోగ మరియు ప్రయోగాల కోసం మాత్రమే గాని.. సభ్యులకు ఉపయోగపడని సమాజం గానీ.. సంఘం గానీ .. ఎందుకు ఉండాలి??

మీతో వాదనకు దిగుతున్నాను అని తమరు భావించకపోతే.. నా స్వగతం నుంచి.. పూర్తిగా ఒక వ్యక్తిగా, నా.. ఓ అభిప్రాయం..

"ఎలాగో ఒకలా బ్రతకాలి అని అనుకుంటే ఎలాగయినా బ్రతికేయవ్వచ్చు, కానీ ఇలాగే బ్రతకాలీ అనుకుంటేనే అస్సలు కష్టాలన్నీ.. "

తప్పుగా అనిపిస్తే .. ముందస్తుగా .. మన్నించగలరు..

ఇట్లు,
భవదీయుడు,
చక్రవర్తి
PS: అన్యధా అపార్దం చెసుకోరని మనవి

Srividya said...

@ఉమా గారు: నేను కూడా రాబిన్ శర్మ అభిమానిని. మీరు చెప్పిన పుస్తకం ఇంకా చదవలేదు. బావుంది అని చెప్పారుగా. ఇప్పుడు చదువుతా.

@విహారి గారు: నిజమే ఒక్కోసారి తప్పదు.నేను కూడా నాకు నచ్చని పనులు చేస్తూ వుంటా. చేసేది ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు అనే పరిస్థితులు అందరికి సహజం. ఐతే ఇక్కడ తప్పు అని తెలుస్తుందంటే అంతరాత్మ పని చేస్తుందని అన్నమాట.కాబట్టి మళ్ళీ మళ్ళీ కావాలని అదే తప్పు చెయ్యము.కానీ అంతరాత్మే అబద్దం, ఆత్మ వంచన నిజం, అస్సలు అలా చెయ్యటం తప్పే కాదు ,అదే విజయ రహస్యం అని మనసా, వాచా, కర్మణా నమ్మేసి అంతరాత్మ నోరు నొక్కేస్తే, గెలవొచ్చేమొ. కానీ మనల్ని మనం పూర్తిగా కోల్పోతాము.గెలుపు నాదే కానీ గెలిచింది నేను కాదు అనిపించే గెలుపుని గెలుపు అనగలమా..?

కొత్త పాళీ said...

It's a great book.

HarshaBharatiya said...

Nice work srividya gaaru..