Thursday, August 7, 2008

నేనుగానీ..బొమ్మగానీ..గీసానంటే..!

బొమ్మలు గియ్యడానికి ఓ తెల్ల కాగితం, ఓ HP పెన్సిల్, నటరాజ్ రబ్బరు, అప్సరా మర వుంటే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా..? ఎంత అమాయకులండి మీరు.. అలా ఎలా అనేసుకుంటారు? వీటితోపాటూ సమాజం అందించే ప్రోత్సాహం, గుర్తింపు కూడా కావాలి...ఈ సమాజం వుందే, అది కొంచెం విచిత్రమన్న మాట.దానికి ఇష్టం లేకపోతే మనలో అడవి బాపిరాజు/రాణి, రవి వర్మ/వర్మిణి వున్నా సరే కావాలనే అన్యాయంగా గుర్తించదు... నా విషయంలో అదే... అదే.. జరిగింది.

నాకో జీవితాశయం వుండేది/వుంది/వుంటుంది. అదే జనాల దిమ్మ తిరిగి, కళ్ళు చెమ్మగిల్లి, సంతోషంతో సొమ్మసిల్లేలా చేసే ఒక్క బొమ్మైనా ఈ జన్మలో నేను గియ్యగలగాలి. . అలాని నేను ఊరికే కలలు కని ఊరుకునే అమ్మాయిని కాదు. నేను గీసిన కుక్క నక్కలా వున్నా, నక్క కుక్కలా వున్న సరే నా కలల్ని నిజం చేసుకోవాలనే గట్టి పట్టుదల వున్నదాన్ని. అందుకే ఎనిమిదో తరగతిలో వుండగానే (అబ్బో అంత తొందరగానా అనకండి. దిష్టి తగులుతుంది) నా మొదటి ప్రయత్నంగా రాత్రిపగలూ కష్టపడి కత్తిలాంటి ఓ బొమ్మ గీసాను. ఓ చిన్న పూరిల్లు, ఉదయిస్తున్న సూర్యుడు, రెండు కొబ్బరి చెట్లు, ఇంటి ముందు సన్నగా ప్రవహించే ఓ ఏరు..! ఓస్ ఇదా.. నేను ఒకటో తరగతిలో గీసాను అనకండి.నాలో వున్న కళాకారిణి హర్ట్ అవుతుంది. ఆ బొమ్మ చూడగానే మా అమ్మ పొంగిపొరలుతున్న పుత్రికోత్సాహాన్ని తనలో దాచుకోలేక పంచుకోవడానికి పక్కింటికెళ్ళింది.నాకు తెల్సు నన్నావిడ పొగడ్తలతో ముంచేస్తుందని... అలా అని ఆవిడ ముందు నుంచుంటే ఫ్రీగా పొగడలేదు కదా.. అందుకని గోడ పక్కన నుంచున్నాను...ఆవిడ ఆ బొమ్మని పరీక్షగా చూసి "బావుంది.. ఈ మర్రి చెట్లు బాగా గీసింది" మర్రి చెట్లా... అవెక్కడ వున్నాయి..? అయినా పొడుగ్గా, సన్నగా వుండే కొబ్బరి చెట్లెక్కడ..?పొట్టిగా, గుబురుగా వుండే మర్రి చెట్లెక్కడ..? మరీ విడ్డూరం కాకపోతే.. ఈ సమాజం అంతే.. ముఖ్యంగా మా డ్రాయింగ్ మేడం. ఆవిడకి బాగా బొమ్మలెయ్యడం వచ్చని, అందుకే పిలిచి ఉద్యోగం ఇచ్చారని బాగా గర్వం...

ఒకసారి నా సృజనాత్మకతకి బాగా పదును పెట్టి అరటి పండుని గీసుకెళ్ళి చూపించానా..? పదికి రెండేసింది..నేను ఊరుకుంటానేంటి..? ఏంటింత అన్యాయమని ప్రశ్నించాను.. "అది అరటిపండులా వుందా అసలు..? అక్కడక్కడ ఉబ్బిన సైకిల్ ట్యూబులా వుంది. అయినా అరటి పండు ఎక్కడైనా ఎర్ర రంగులో వుంటుందా..? మళ్ళీ ముచ్చికకి ఆకుపచ్చ రంగు..కింద బొడిపకి నీలం రంగు.. ఎన్ని రంగులుంటే అన్నీ పూసేస్తావా..?" అని అవమానించేసి నా క్రివేటివిటీని అర్ధం చేసుకోకుండా వ్యర్ధం చేసేసింది.

ఇకపోతే ముగ్గులు.. ఎవరు చెప్పారసలు..ముగ్గంటే నాలుగు వైపులా ఒకేలా వుండాలని.. చుక్కలు సమాన దూరంలో వుండాలని.. పోత పోస్తే సన్నగా, నాజూగ్గా వుండాలని..ముగ్గుకి కూడా ఇన్ని రూల్సా..? నా ముగ్గు అయితే వెరైటీగా రెండు పక్కలా రెండు రకాలుగా, మూడో పక్క వేరే విధంగా, నాలుగో పక్క ఇంకో విధంగా చాలా బావుండేది. పోత కూడా ఒకచోట సన్నగా, ఒకచోట లావుగా చాలా డిఫరెంటుగా వుండేది. అయినా ఏ పనైనా కొత్తగా చేస్తే ఈ సుత్తి జనాలకి నచ్చుతుందేంటి..? మా అమ్మయితే మరీను "ముగ్గు కింద బై "శ్రీవిద్య" రాసుకోవే. లేకపోతే నేను పెట్టానేమో అనుకుంటున్నారు" అనేది. అర్ధం చేసుకోరూ......

అలా అలా సమాజం దృష్టిలో నేనో మంచి చిత్రకారిణిగా గుర్తింపబడాలని గట్టి పోరాటం చేస్తుండగా పదోతరగతి పరీక్షలు వచ్చేసాయి. మా జీవశాస్త్రం మేడం పిలిచి "శ్రీవిద్యా.. నీ మీద మన స్కూలు మొత్తం చాలా ఆశలు పెట్టుకున్నాము. పరీక్షల్లో మేటర్ మొత్తం బ్రహ్మాండంగా రాస్తావు.. బొమ్మలు మాత్రం మరీ ఎవరూ గుర్తుపట్టకుండా వేస్తావేంటసలు..? ఈ విషయం మీద కొంచెం శ్రద్ద పెట్టు తల్లీ.." అంది. ఆ క్షణంలో నా గుండె ఎన్ని ముక్కలు, చెక్కలు అయ్యిందో నేనే లెక్కపెట్టలేకపోయాను.ఆ రోజు అర్ధరాత్రి రెండుగంటల ఇరవై రెండు నిముషాల రెండు సెకన్లకి నా టాలెంటుని గుర్తించని సమాజం అంటే పిచ్చ కోపమొచ్చింది.ఇంక జీవితంలో బొమ్మలెయ్యకూడదని ఒక సంచలనాత్మకైన నిర్ణయం తీసుకున్నాను. అలా ప్రపంచం మొత్తం గాఢనిద్రలో వుండగా తనకి తెలీకుండానే ఓ గొప్ప చిత్రకారిణిని కోల్పోయింది.

ఇక పరీక్షల్లో ఎలా..? అందుకే "బాగు చెయ్యి-బాగుపడు" అనే సూత్రాన్ని ఫాలో అయిపోయా.. పరీక్షల్లో నా పక్కబ్బాయి అంత బాగా చదవడు. బొమ్మలు కూడా నా అంత స్టైలుగా, డిఫరెంటుగా గియ్యడం రాదు. ఏదో వున్నదున్నట్టు గీసేస్తాడు అంతే.. వాడి దగ్గరకి వెళ్ళి "ఒరేయ్ బాబు.. నీకు మొత్తం అన్ని సబ్జెక్ట్లు బిట్లతో సహా చూపిస్తాను. స్కూల్ ఫస్టు నా బదులు నీకొచ్చేసినా అస్సలేమనుకోను. నాకు మాత్రం నువ్వేసే బొమ్మలు చూపించి గట్టెకించు తండ్రీ" అని ఓ ఒప్పందాన్ని పకడ్బందీగా కుదుర్చుకున్నాను.

వాడు అప్పుడప్పుడు "నాకు మెడ నొప్పెడుతుంది. చాల్లే" అన్నా సరే తెలుగు నుంచి లెక్కల వరకూ అన్నీ జాగ్రత్తగా కాపీ కొట్టించాను. ఎదురుచూసినరోజు రానే వచ్చింది. అది నేను కాపీ కొట్టాల్సిన రోజు. చేతులు వణుకుతుంటే పేపర్ నెమ్మదిగా వెనక్కి తిప్పాను.. తీరా చూస్తే "ఉమ్మెత్త ఆకు నిర్మాణం గీసి భాగాలు గుర్తించుము" అని వుంది. అది చూడగానే నా మెదడులొ లైటు వెలిగింది. ఆ వెలుగులో ఉమ్మెత్తా ఆకు, గుర్తించాల్సిన భాగాలు మిలా మిలా మెరిసిపోతూ కనిపించేసాయి. అది చూసి అప్పటిదాకా నాలో అలిగి నిద్దరోతున్న చిత్రకారిణి నిద్రలేచింది. "వీజీ బొమ్మే కదా..నేను గీస్తా, గీస్తా" అని సరదాపడింది."సరే" అన్నా.. అయినా నా పిచ్చిగానీ నాలా మోడర్న్ ఆర్ట్ చేతిలో వున్నవాళ్ళకి మామూలుగా గియ్యడం ఎలా వస్తుంది.. ఎంత కష్టపడ్డా నా బుర్రలొ వెలుగుతున్న ఉమ్మెత్తకి, నా పేపర్ కనపడుతున్న ఉమ్మెత్తకి పోలికే కనపడలేదు. మెదడులో టింగుటింగుమంటూ మెరుస్తున్న అయిదు భాగాలు ఎక్కడ గుర్తించాలో అర్ధం కాక జుట్టు పీక్కుంటూ పక్కకి తిరిగాను. నా పక్కబ్బాయి నీ ఋణం తీర్చుకోనీ.. నా పేపర్లో కాపీ కొట్టు అన్నట్టు దీనంగా మొహం పెట్టి పేపర్ నా వైపు తిప్పి వుంచాడు. మరీ కళ్ళతో అంతలా బతిమాలేస్తుంటే కాదనలేకపోయా.. సరే అని చూసి గీసేసా..

పదో తరగతి రిజల్ట్స్ వచ్చాయి..నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. అది కాదు నా బాధ.. నా పేపర్లో చూసి కాపీ కొట్టినోడికి సెకండ్ క్లాసు వచ్చింది. అదీ ఫస్ట్ క్లాస్ ఒక్క మార్కులో పోయింది.వాడు నా దగ్గరికి వచ్చి "థాంక్స్. ఈసారి పరీక్ష పోతుందనుకున్నాను. నీ వల్ల 359 మార్కులు వచ్చాయి. అసలు NS కూడా చూపిస్తే తప్పకుండా 360 దాటేవి. నీకేమో ఆ బొమ్మ గీసి చెరపడంతోనే సరిపోయింది. అయినా నీకు బొమ్మలు గియ్యడం రాదని తెలీదా..? తెల్సీ అలా చేస్తావా..?" అనేసి వెళ్ళిపోయాడు. చీ ఎదవ జీవితం.. అయినా నాకు తెల్సు నాలో వున్న అపరిమితమైన టాలెంటుని, అర్ధం కాకుండా అద్భుతంగా గీసే మోడర్న్ ఆర్టుని ఈ పిచ్చి సమాజం ఎప్పటికీ గుర్తించలేదు. అందుకే ఎప్పటికైనా నేనూ ఈటీవీ సుమన్ లా ఒక టీవీ పెడతా.. నా బొమ్మలకి నేనే గుర్తింపు తెచ్చుకు తీరతా........!