Saturday, April 5, 2008

కుళ్ళిపోయిన టమాటాలకి కూడా ఇంత చరిత్ర వుంటుందా..?

చాల రోజుల క్రితం ఒక సీరియల్ చూసాను. అందులో అత్తాకోడళ్ళు వంట గదిలో కూర్చుని జీవితంలో టమాటాల పాత్ర, ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటుంటే వినే భాగ్యం నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు లభించింది. ఇంక సోది ఆపి అసలు విషయంలోకి వెళ్ళిపోతే..........

కోడలు: అత్తయ్యా, టమాటాలు కుళ్ళిపొయినట్టు వున్నాయి.మంచివి అమ్మటం లేదు .కూరల అబ్బాయిని మార్చేద్దాము.

అత్త: అమ్మా, మనం కూరగాయలు అతని దగ్గరే గత ముప్పయి ఏళ్ళగా కొంటున్నాము. మనం రోజూ కొంటామనే ఆశా, నమ్మకం వాడివి. వాడు వస్తాడు , వాడి దగ్గరే కొంటున్నాము అనే తృప్తి మనది. ఇక్కడ అనుబంధం, ఆత్మీయత ముఖ్యం.
గమనిక: పైది సారాంశం మాత్రమే. ఆ నీతి భోధ పొడవు, పొడవు భారీ డైలాగులతో పావు గంట పైనే నడిచింది.

కోడలు: అత్తయ్యా, ఆ కుళ్ళిపోయిన టమాటాలతోనే ఈ రోజు వంట చెయ్యండి. ఆ అనుబంధం, ఆత్మీయతల రుచి నేనూ చూస్తా.

కుళ్ళిపోయిన టమాటాలతో కూరా..? మొత్తం ఈ సోదిభారతంలో నాకస్సలు మింగుడుపడని ట్విస్టు ఇదే . అత్తగారి అమూల్యమైన లాజిక్కుకి కోడలిగారి అద్భుతమైన రెస్పాన్స్. ఐనా కుళ్ళిపోయిన టమాటాల గురించి అంత భారీ డైలాగులు అవసరమా..? వద్దమ్మా చాలాకాలంగా కొంటున్నాం, ఒక్కరోజు మంచివి అమ్మలేదని, అలా మానిపించేయకూడదు అంటే పోయేదిగా. ఏమో అవసరమేమో.. నాకే కూరల అబ్బాయి - అనుబంధం, పుచ్చు కూరలు - ఆత్మీయత లాంటి కాన్సెప్ట్స్ లోతుని అర్థం చేసుకునేంత విశాల హృదయం లేదేమో... మీకు ఏమైనా అర్థం అయితే నాకు కొంచెం చెప్పండి.

3 comments:

శాంతి said...

ఆ సీరియల్/డైలాగులు ఏ ఛానెల్ లోనుంచో తెలియజేస్తే కొంచెం దూరం గా వుంటాము :).
ఇవాళ కూడలి లో మీ పోస్టు చూసి ఇక్కడకి వచ్చి చదవబోతూ, మీ 1000 అతిథుల బ్లాగు గుర్తు వచ్చి, మీ కౌంటర్ కేసి చూద్దును కదా!! - సంపూర్ణం గా 2000 చూపిస్తోంది. ఉగాది మరియు 2000 హిట్ల శుభాకాంక్షలు :).

Srividya said...

ఆ చానల్, ఈ చానల్ అని ఏమీ లేదండీ. అన్నీ ఒకటే బాపతు, సాగదీతే లక్ష్యంగా ముందుకెళ్ళిపోతున్నయి. వీక్ డేస్ లో టీవీ చూడకుండా వుండటమే బెటర్.

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇక 2000 గురించి, మీరన్నట్టే 0-1000 తీసుకున్నంత సమయం పట్టలేదు ఈ సారి :).

Naga said...

:)