Saturday, July 12, 2008

రాజులనాటి కారులో జోరుగా హుషారుగా....!

మా టీములో "మా ఇంటికొస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేం పెడతారు" టైపులో ఓ సోది సాంప్రదాయం వుంది. కొత్తవాళ్ళంతా పాతవాళ్ళతో కల్సిపోవాలంటే పార్టీ ఇచ్చి తీరాలట. పార్టీ ఇచ్చి మరీ కొత్త పోగొట్టేసుకుని పాతబడిపోయి పని మొత్తం నెత్తిన రుద్దించుకోవడానికి నేనేమైనా చిన్నదాన్నా..? చితకదాన్నా..? కాదు కదా... అయినా సరే ఏమాత్రం భయ్యం,బత్తి లేకుండా వాళ్ళంతట వాళ్ళే అలుసు, బచ్చలి పులుసు తీసేసుకుని పార్టీకి మాంచి(?) ముహూర్తం పెట్టేసారు.
***
డబ్బులు, మబ్బులు, సబ్బులు ఎక్కువ కాలం వుండవు.అలాంటి అశాశ్వతమైన వాటి కోసం అనవసర హైరానా పడితే మాత్రం లేనిపోని జబ్బులు వస్తాయి.జరగాల్సింది జరగక మానదు.వదలాల్సింది వదల..కా.. మానదు. అందుకే వదిలించుకోవడాన్ని, విదిలించుకోవడాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించగలగాలి. అదే జీవిత పరమార్ధం.ఇదే ఈ విద్యా అమ్మాజీ ఉపదేశం. సందేశం. ఆదేశం. పాటించండి. సంతోషంగా జీవించండి.
***
అసలే నా సబ్బుల ఫిలాసఫీకి నేనే ఏకైక ఫాలోయర్నాయే..అందుకే బుద్దిగా బిల్లు విషయం మర్చిపోయి,పార్టీ పేరుతో పని ఎగ్గొట్టి షికారుకెళ్ళడం,రెస్టారెంటులో పీకల దాకా మెక్కడం, తిని తిరిగి అలిసిపోయి ఆఫీసుకొచ్చి సీట్లో అడ్డంగా పడి నిద్దరోవడం. ఇలా మంచి మంచి ఊహల గుంపుని ఆస్వాదిస్తున్నాను.వాటిని చెదరగెడుతూ మా టీం లీడ్ వచ్చాడు."శ్రీవిద్యా, మన టీములో ముగ్గురికి కార్లున్నాయి. మేము పదిమందిమి రెండు కార్లలో ఇరుక్కుని,సర్దుకుని,కష్టపడి రెస్టారెంటుకి వచ్చేస్తాము. నువ్వు, చందూ(ఇంకో అమ్మాయి) మాత్రం విశాలంగా, ఫ్రీగా ఇంకో కారులో రండే." అనగానే ఆ మాకోసం వాళ్ళు చేస్తున్న "త్యాగానికి" మా మనసు కరిగి నీరై వరదగా మారి మా ఆఫీసుని ముంచేయ్యబోతుంటే "సీనియర్ మేనేజర్ మీటింగు నుంచి బైటకి రాగానే, ఆయనతో కల్సి వచ్చేయండే.. ఇంచక్కా(!)" అని బాంబు పేల్చాడు. ఆ ఇమానమంత ఇశాలమైన కారు "SM"దా..? ఆయనతో రావాలా..? అంతే దెబ్బకి కరిగిన మనసు గబ గబా భయంతో బిగుసుకుపోయింది.ఇశాలం ట్రాపులో అంత దారుణంగా ఇరుక్కుపోయాక ఏం చేస్తాం..? ఆయన కోసం మా ఎదురుచూపులు ఫలించి, ఆయన లోపల చర్చలు ముగించేసరికి , ఓ గంట మా కళ్ళ ముందే కర్పూరంలా కరిగిపోయింది.ఈ పెద్దతలకాయలు వున్నాయే, వాటికి మాలాంటి బుడ్డి తలకాయల మనసు ఎప్పటికీ అర్ధం కాదు. ఎంత సేపు పని.. పని.. పని...హు..

కారు దగ్గరికెళ్ళగానే, మా టీం మొత్తం కల్సికట్టుగా మా కోసం త్యాగం చేసేసిన ఆ అద్భుతమైన కళాఖండాన్ని చూడగానే కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు అర్జెంటుగా టపా టపా రాలిపోయాయి.ఆ కారు బంగారు, మా మేనేజరు గారి నాన్నగారిదట. మారుతీ కంపనీ వారి మొదటి మోడలట. ఏది పట్టుకుంటే, ఏది ఊడిపోతుందో అని భయంభయంగా డోరు తీసి చా..లా.. జాగ్రత్తగా లోపల కూర్చున్నాను. అవసాన దశలో వున్న సీట్లు, కారు పార్టులు, నట్లు, బోల్టులు అన్నిటినీ తనివితీరా మళ్ళీ మళ్ళీ చూసాను.రేప్పొద్దున్న దీన్ని ఏ లండన్ మ్యూజియంలోనో పెట్టేసారనుకోండి.అప్పుడు చూడ్డానికి మన ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అందుకే ఇప్పుడే ఫ్రీగా చూసేసాను. ఎన్ని తెలివి తేటలో కదా..! దిష్టి కొట్టకండే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కారు హుషారుగా వెళ్తుంది.కానీ.. కానీ.. ఆరిపోయే దీపానికే వెలుగెందుకు ఎక్కువ..? తుఫాను ముందు ఎందుకంత ప్రశాంతత..? డబ్..డబా..డబా..డబ్.. కచా.. ఇచా.. లబా.. టకాల్..డిమేల్..డబా.డబా.....ఎందుకంత డబడబలాడించుకుంటూ బండిని నడుపుతావని పక్కనున్న స్కూటరోడుని చిరాగ్గా చూసాను.ఆ సంగీతం మీ పుష్పక విమానం నిర్వాకమే తల్లీ అని నా వంక ఇంకా... బోల్డంత చిరాగ్గా చూసాడు.

ఇంక నాన్న గారి బుజ్జిముండ డబడబలు భరించలేక ఒక పక్క కారుని ఆపి, ఏదో ఒకటి చేద్దామని చూసి ఇంకేమీ చెయ్యలేక ఆటో కోసం ఎదురు చూపులు మొదలెట్టాము.ఈలోపు మా SM ఒక పేద్ద బండరాయిని తీసాడు. హ్హా.. హ్హా..హెహ్హే... నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందం కారుని ఎవ్వరూ ఎత్తుకెళ్ళకుండా ఇంజన్ని రాయితో కొట్టడం గుర్తొచ్చింది. కానీ ఎప్పట్లానే మా అంచనాలని తల్లక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకుని సూటిగా మా వైపుకి వస్తున్నాడాయన. పగలకి ప్రతీకరాలకి సమయమా ఇదీ.నేను చెప్పిన పని చెయ్యను, సాకులు చెప్పి పని ఎగ్గొడ్తాను, పని చేస్తున్నట్టు ఏక్ట్ చేస్తాను. చేసిన కూసింత పని కూడా సవ్యంగా చెయ్యను. అంతమాత్రానికే బండరాయితో బుర్ర పగులగొట్టేస్తారా..? మాళ్ళీ నా అంచనాలని తలక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకెళ్ళి వెనక టైరుకి అడ్డంగా పెట్టారు,నాన్న గారి చిట్టికొండని ఎవ్వరూ గుద్దేయకుండా.. నాకు మల్లే తెలివితేటలు ఎక్కువ ఆయనక్కూడా..

అక్కర్లేనపుడు బస్సులు, ఆటోలు బొయ్యి బొయ్యిమంటూ హారన్ మోగించుకుంటూ రయ్యిరయ్యిమని తెగ తిరగేస్తాయి. ఆ రోజు మాత్రం రోడ్డు మీద మేము ముగ్గురం, చుట్టూ చెట్లు,గుట్టలు తప్పితే వేరే ఒక్క పిట్ట కూడా లేదు.ఈ లోపు ఏ దేవదూతలో పంపినట్టు భాషాలో రజినీలా, ఆటో డ్రైవర్లో నాగార్జునలా, హీరోలకే హీరోలా ఒక ఆటోవాడు వచ్చాడు. బంజారాహిల్స్ వస్తావా అని అడిగాము. మమ్మల్ని చూసాడు అసహనంగా. ఆగి వున్న కారుని చూసాడు ఆరాగా. మా మెళ్ళో వేళ్ళాడుతున్న ఐడెంటిటీ బిళ్ళలని చూసాడు ఆశ్చర్యంగా...వెంటనే ఏదో అర్ధమైనవాడిలా తల ఊపుతూ వంద అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ.. రెండు సందులకి వందేమిటి నాయనా అన్నాము. అంత దగ్గరయితే నడిచివెళ్ళండి అన్నాడు మీళ్ళో బిళ్ళలని తీక్షణంగా చూస్తూ..ఛీ ఛీ ఈ మెళ్ళో బిళ్ళల బదులు పాములేసుకుని తిరగడం నయం . చేసేదేమీ లేక నీవే మాకు దిక్కిప్పుడు అని గాట్టిగా మొక్కి, ఆటోలో కూలబడి అయ్యవారికి వంద దక్షిణగా సమర్పించుకున్నాము. అయినా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే ప్రతీవాడికీ లోకువే..పది రూపాయల సరుక్కి వంద లాగుతారు.మనలో మన మాట ఆఫీసు బయట ఆ బిళ్ళేసుకుని ఫొజులు ఇవ్వమాకండే.పర్సు ఖాళీ అయిపోతుంది జాగ్రత్త.

అలా పడుతూ లేస్తూ కాళ్ళీడ్చుకుంటూ నీరసంగా రెస్టారెంటుకెళ్ళేసరికి మా ముందెళ్ళిన పదిమంది మస్తుగా కుమ్మేసి,ఆవలించుకుంటూ, ఈగలు తోలుకుంటూ సొల్లు కొట్టుకుంటూ మాకోసం ఎదురు చూస్తున్నారు (??). ఎంత రెండు గంటలు లేట్ అయితే మాత్రం మాకోసం ఆగకుండా తినేస్తారా..? నా హృదయం తీవ్రంగా గాయపడింది. ఆ తిక్కలో కసి కసిగా అక్కడున్నవన్నీ ఊడ్చి తినేద్దామని ఆవేశంగా ప్లేట్ తీసుకుని ఫీల్డులోకి దూకాను.తీరా చూస్తే ఏమున్నాయి అక్కడ, నా తలకాయ్.టమాటా తొక్కులు, దోసకాయ ముక్కలు, క్యాబేజీ తొక్కలు, నిమ్మకాయ చెక్కలు. ఇవ్వన్నీ రైతుబాజార్లో సరసమైన ధరలకి దొరుకుతాయిగా.. ఇంకోపక్క క్యాలీ ఫ్లవర్ పుల్సు, కుక్కగొడుగుల పులావు, చల్లారిపోయిన చపాతీలు. ఏం తినాలో తెలియక, అస్సలు తినే ధైర్యం లేక, అలా అని తినకుండా వుండలేక నోర్మూసుకుని పెరుగన్నం పెట్టుకొచ్చాను.బిల్లులో నా వాటా గుర్తు తెచ్చుకుంటూ, గుడ్లనీరు కక్కుతూ,వెక్కుతూ పెరుగన్నం బలవంతంగా కుక్కుకుంటుంటే అర్ధమయ్యింది నాకు. జూనియర్లుగా వున్నపుడు ర్యాగింగ్ చేసారని ఏడ్చి, సీనియర్లయ్యాక వాళ్ళే మళ్ళీ ర్యాగింగ్ ఎందుకు చేస్తారో....!హ్హి హ్హీ.. రాబోయే కొత్తవాళ్ళు పార్టీ ఇవ్వడానికి నా స్వహస్తాలతో మాంచి మూహుర్తం పెట్టడం నా భవిష్య దర్శినిలో దివ్యంగా, మనోహరంగా కనిపిస్తుంది మరి.

18 comments:

ప్రపుల్ల చంద్ర said...

బాగా నవ్వించారు,
మీ సబ్బు ఫిలాసఫి బాగుంది, ఇప్పటి నుండి నేను ఫాలో అవుతాను :)

గీతాచార్య said...

Ha hha hha hha. Good comedy.

Kranthi M said...

oh meerena adi meeru vachhina hotel ke memu vachham.Evaru babu ee vida tinadaniki kuda intha baada paduthundi anukunnam(daani venaka inta flash back undani teleedandi sry).
Just joking.bagunnayandi mee tapaalu.annitilo comedy ni balega insert cheyyagaluguthunnaru.mee thitle hilet mee tapallo.keep it up.

http://srushti-myownworld.blogspot.com

Kathi Mahesh Kumar said...

హహహ...అనుకుంటూనే ఉన్నా! ఏమిటబ్బా ఇన్నాళ్ళైనా హాస్యపు తునకలు బ్లాగులో కనిపించడం లేదేమిటా? అని.
లేటుగా రాయలేదుగానీ, చాలా లేటెస్టుగా మాత్రం ఇరగదీసావ్. ఇక సబ్బు ఫిలాసఫీ చాలా పాప్యులర్ అయ్యేటట్టుంది.ఎంచక్కా పేటెంట్ తీసేసుకో!

Sujata M said...

good. laughable joke (anukoakundaa oka roaju lo tyushan meshaari dialogue)

చైతన్య.ఎస్ said...

చాలా బాగుంది. మీకు తత్వాలు కుడా వచ్చా!. అయితె మీ దగ్గర శిష్యరికం చెయ్యాల్సిందే.
1. డబ్బులు , మబ్బులు, సబ్బులు ఎక్కువ కాలం వుండవు. చాలా బాగ చెప్పారు. ఇక ఆటో వాడి.
2.విదిలించుకోవడాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించగలగాలి. అదే జీవిత పరమార్ధం. చాల బాగున్నాయి.
ఇక ఆటొ వాడు మీ వైపు చూడ్డం. "అసహనంగా, ఆరాగ, అశ్చర్యంగా నిజంగా చాలా బాగా రాసారు. మొత్తానికి చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు అన్న మాట బకరాల కోసం ముహుర్తం పెట్టడానికి!!!.

Anonymous said...

చాలా బాగుంది.బాగా నవ్వించారు.

Anonymous said...

Hehehe... :)
Auto vadu nee vaipu inka chirragga chudatam bagundhi...

Purnima said...

డబ్బులు, మబ్బులు, సబ్బులు ఎక్కువ కాలం వుండవు.అలాంటి అశాశ్వతమైన వాటి కోసం అనవసర హైరానా పడితే మాత్రం లేనిపోని జబ్బులు వస్తాయి.

ఈ వాక్యం దగ్గరే పడిపోయా.. జీవిత సత్యాన్ని ఎంత వీజీగా చెప్పేసావు!!

ఇది వరకూ చాలా సార్లు చెపాను.. మళ్ళా చెప్తున్నా... you got amazing word play. తెలుగు అందంగా ఉంటుందని అని ఎందుకు అంటారో.. నీ తెలుగు వల్ల తెలుస్తుంది. చిన్ని చిన్ని పదాలను సమకూర్చే విధానం.. సూపర్. రాస్తూనే ఉండు.. ఏది ఏమైనా!!

పూర్ణిమ (ఊహలన్నీ ఊసులై)

Rajendra Devarapalli said...

సరేగానీ లక్ష్మీసరస్వతి గారు..ఇన్నాళ్ళూ మీబ్లాగు నాకళ్ళ పడకుండా ఎలా దాచారో ముందు చెప్పండి.

మీనాక్షి said...

vidyaa ammaaji chaalaa baundi mee upadesham..ha ha ha ha..ippati nundi nenu ilage pilusta..ammaaji..

వేణూశ్రీకాంత్ said...

హ హ బావుందండీ, సబ్బోపదేశం కూడా సూపరో సుపరు....

సుజాత వేల్పూరి said...

నడిచైనా వస్తాను గానీ మారుతి మాత్రం ఎక్కను నేనైతే! నీ డబ్బుల థీరీ బాగుంది విద్యా, అందుకే డబ్బులెప్పుడూ దాచకూడదు, ఖర్చు పెట్టేస్తూ ఉండాలి.

రాధిక said...

:) :) keka

Kottapali said...

good one.

Unknown said...

డబ్బులు, మబ్బులు, సబ్బులు ఎక్కువ కాలం వుండవు.అలాంటి అశాశ్వతమైన వాటి కోసం అనవసర హైరానా పడితే మాత్రం లేనిపోని జబ్బులు వస్తాయి.


sooper aa mUDu padaalu chaala baavunnaayi chivara jabbulu

MURALI said...

మీ కొత్త టపా కోసం, మెగాస్టార్ సినిమాకి, 10 క్లాస్ రిజల్ట్స్ కి వెయిట్ చేసినట్టు ఫ్యాన్స్ వెయిటింగ్

Indian Minerva said...

చాలా బాగా రాశారు.
వరసపెట్టి మీ postలన్నీ చదువుతున్నాను.