Monday, June 30, 2008

ఎస్కలేటరోఫోబియా...

నాకు చిన్నప్పడో చిన్న కల వుండేది. నేను ఐయ్యేస్ అవ్వాలని. నా కారుని ఓ పది పదిహేను కార్లు పొలోమంటూ రయ్యి రయ్యిమని ఫాలో అయిపోవాలని. ఆ చిన్న కలని సాకరం చేసుకోవడానికి పెట్టుబడిగా రోజూ దిన పత్రిక పై నుంచి కింద దాకా కసి కసిగా చదివి చించి పారేసేదాన్ని.

చెరువులో పడి రెండు చేపలు గల్లంతు - అప్పటి నుంచి చెరువోఫోబియా
పిట్టగోడ కూలడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పది పిట్టలు - పిట్టగోడోఫోబియా
తాగి పెళ్ళాన్ని కొడుతున్న మొగుడు - మొగుడోఫోబియా
ఎస్కలేటర్లో పడి ఎలుకకి గాయాలు - "ఎస్కలేటరోఫోబియా"

ఇలాంటి వార్తలు చదివి చదివి బోలెడన్ని ఫోబియాలు వచ్చేసాయి. ఇంక చివరకి న్యూస్ పేపరోఫోబియా కూడా వచ్చేసింది. దాంతో దిన పత్రికలు చదవడం మానేసి, దిన ధారావాహికలు చూడటం మొదలు పెట్టాను. దెబ్బకి నా భయాలన్నీ పోయి జనాల్ని భయపెట్టడం వచ్చేసింది. కానీ కానీ.. నాకు తెలీకుండా ఒక్కటి మాత్రం నాలో కరిగిపోయి, కల్సిపోయి, నాలో భాగం అయిపోయింది. అదే అదే .. "ఎస్కలేటరోఫోబియా".
*****
ఆ రోజు మా సూపర్ ట్రైనర్ పుట్టిన రోజు. మాకు పండుగ రోజు. ఆ పర్వ దినాన ఐమేక్సులో సినిమా అన్నారు. రంగ్ దే బసంతి అని ఆశగా బయలుదేరిటే, మా మానసిక పరిస్థితిని బట్టి మా వయసుని అంచనా వేసి మరీ హనుమాన్, చిన్న పిల్లల ఏనిమేషన్ సినిమాకి టికెట్లు తీసారు. పోనిలే గుడ్డిలో మెల్ల, ట్రైనింగ్ కన్నా ఎదో ఒక సినిమా మిన్న అని నన్ను నేను ఓదార్చుకుంటూ లోపలకి అడుగుపేట్టానో లేదో ఒక భయంకరమైన కదులుతున్న యంత్రం కనిపించింది. నాలో నిద్దరోతున్న "ఎస్కలేటరోఫోబియా" లేచి బుసలు కొట్టింది. "నేను ఎక్కను ఎక్కలేను ఎక్కబోను" అని ఏడిచినంత పని చేసి నా కన్నీటి గాధని రీళ్ళుగా రీళ్ళుగా వెళ్ళబోసుకున్నాను. మా వాళ్ళంతా నా బరువైన ఫ్లాష్ బ్యాక్ విని, చున్నీలతో, జేబు రుమాళ్ళతో, అవి లేని వాళ్ళు టిష్యూ పేపర్లు కొనుక్కుని మరీ కార్చిన లీటర్ల లీటర్ల కన్నీరుని ఎండగట్టి, వాటితోనే బర్రు బర్రుమంటూ ముక్కు చీదుకున్నారు.

"ఇదో ఇమేజనరీ భయ్యం, నిజ్జంగా ఎక్కావంటే నిజ్జంగా నీ భయ్యం పోతుంది." అని బలవంతంగా లాక్కుపోయి దాని ముందు నిలబెట్టారు.కళ్ళు మూసుకుని జై భజరంగ్ భళీ అనుకుంటూ వెళ్ళెళ్ళి ఎస్కలేటర్ రెండో మెట్టు ఎడ్జ్ మీద అతి సుకుమారంగా అడుగేసాను. ఎడ్జ్ మీద వెయ్యటం వల్ల బ్యాలన్స్ తప్పేసింది. న్యూటన్ మూడో సూత్రం ప్రకారం నేను చేసిన ఓవరేక్షనికి ఆ బండ ఎస్కలేటర్ ఒళ్ళు మండి నా మూతి పళ్ళు విరగొట్టడం ద్వారా రియాక్షన్ ఇచ్చుండాలి. కానీ వున్నాడుగా దేవుడు, సరిగ్గా నా ముందే బండ సుధీర్ని నిలబెట్టాడు. నేను పడిపోతుంటే నా చెయ్యి పట్టుకుని ఆపి, వాడి బలాన్నంతా ఎస్కలేటరుకి వ్యతిరేక దిశలో ప్రయోగించి మొత్తానికి గండం గట్టెకించాడు. అలా రియల్ టైము ఎస్కలేటర్ ఎక్కగానే,నిజ్జంగానే నాకదంటే ఇమేజనరీ భయం పోయి రియల్ భయం వచ్చేసింది.
*****
కొన్నాళ్ళకి ఎదో సరదాగా బెంగుళూర్ వెళితే, ఫోరం అనే ఘోరమైన షాపింగ్ మాలుకి తీసుకెళ్ళారు. అక్కడ ఆ సోది ఎస్కలేటర్ తప్పిటే మెట్లు ఎంత వెతికినా కనపడల్లే. మా హైదరాబాదోళ్ళే నయ్యం. నాలాంటి దద్దోజనం మొకాలు వుంటాయని ఊహించి, మెట్లు కూడా పెట్టి దొబ్బించుకుంటారు. "ఎస్కలేటర్ నేను ఎక్కనంటే ఎక్కను, ఇక్కడే బయట సెక్యూరిటీ గార్డుకి తోడుగా కూర్చుని, అవసరమైతే చెకింగులు గట్రా చేసి పెడతాను. మీరెళ్ళి షాపింగ్ చెయ్యండి" అని తెగేసి చెప్పాను. కానీ మా అన్నయ్య మాత్రం "ఆ గార్డుకి యూరో లాటరీ తగిలి, ఇంక ఈ ఉద్యోగం అవసరం లేదు అనుకున్నపుడు నీ సాయం తీసుకుంటాదులే.కానీ చూడు రెప్పొద్దున్న నిన్ను మీ ఆఫీసోళ్ళు వేరే దేశానికి పంపిస్తే, ఎయిర్ పోర్టులో నువ్విలాగే తింగరి వేషాలేస్తే, మీ కొలీగ్స్ నిన్ను కామెడీ చేసుకుంటారే, రా" అనగానే నా బంగారు భవిష్యత్తు గురించి అంత డీపుగా ఆలోచిస్తున్న వాడిని చూడగానే రక్త సంబంధం సినేమా గుర్తొచ్చింది. నీ కోసం నిప్పుల్లో దూకడానికైనా ఈ చెల్లెమ్మ సిద్దమన్నాయ్!ఇంక ఈ బోడి ఎస్కలేటర్ ఎంత అని మా వాడ్ని ఫాలో అయిపోయా.

తీరా లొపలికెళ్ళాక, సేం వణుకుడు."పర్లేదు, జాగ్రత్త. జాగ్రత్త, పర్లేదు" అంటూ మొదటి ఫ్లోర్ విజయవంతంగా దాటించేసాడు. దానికే నా గుండెకాయ నిముషానికి కొన్ని వేల లబ్బుడబ్బుల స్పీడుతో కొట్టేసుకుంటుంది. "ఇంక చాలు బాబు పద వెళ్దాము" అని బతిమాలాను.కానీ ఆక్కడ ఎక్కడానికి/ఎక్కకపోవడానికి చాయిస్ వుంటుంది. కానీ ఎక్కాక, దిగి తీరలిగా..అప్పుడు ఆ దిక్కుమాలిన యంత్రారాక్షసమే దిక్కుగా..! అందుకని నా చేత దిగడం కూడా ప్రాక్టీసు చెయ్యించాలని బలవంతంగా పైకెక్కే యంత్రంతో పై... దాకా తీసుకెళ్ళిపోయాడు. నాకేమో ఎక్కే ఎస్కలేటర్ కన్నా దిగే డెస్కలేటర్ ఇంకా అరివీర భయంకరంగా అనిపించేసి,నాకున్న ఒకే ఒక "రెండు జతల" కళ్ళూ సవ్య దిశలో(క్లాక్ వైసు) పది సార్లు, అపసవ్య దిశలో ఇరవై సార్లు చకా చకా గిరా గిరా తిరిగేసాయ్. ఆ తర్వాత కిందకి ఎలా వచ్చానో నాకస్సలు గుర్తు లేదు. పాపం నా పిచ్చి మెదడు భయంతో బిగుసుకుపోయి ఆ చారిత్రాత్మక ఘఠనల్ని రికార్డ్ చేసుకోవడం మర్చిపోయినట్టుంది. అలా ఫైరు డ్రిల్లులా ఎస్కలేటర్ డ్రిల్లు పూర్తయ్యేసరికి ఎస్కలేటర్ అంటే భయం పోలేదు సరి కదా భయం వల్ల వచ్చిన దడతో కూడిన అసహ్యమొచ్చేసింది.
*****
నా "ఎస్కలేటరోఫోబియా" చిదంబర రహస్యాన్ని నాలో దాచుకుని గుట్టుగా బతుకుతుంటే ఊరి నుంచి మా సైన్యం దిగింది. సరే కదా అని అందరం సర్దాగా అమీర్ పేట వెళ్ళాము. అక్కడ మా మంద మొత్తం బిగ్ బాజార్లో దూరిపోబోతుంటే, వాళ్ళని ఆపి "మీకు తెలుసా...అక్కడ లోపల... ఎస్కలేటర్ వుంటుంది" అన్నా అదేదో లోపల పులి వుందన్నట్టు. "ఓస్ అంతేనా..!విజయవాడ రైల్వే స్టేషనులో అమ్మమ్మ కూడా ఎక్కింది తెల్సా. నీకు భయమా విద్యక్కా..?" అని అడిగింది మా పిన్నికూతురు. దానికి మేటర్ మొత్తం అర్థం అయిపోయింది. మన పరువు మొత్తం గంగలో కల్సిపోయింది. అయినా "అమ్మమ్మ..ప్చ్..! ఆఖరికి అమ్మమ్మ కూడా ఎక్కేసి నాకు అన్యాయం చేసేసాక ఈ పరువు గంగలో కలిస్తే ఏంటి, దొంగలెత్తికెళ్తే ఏంటి...? విద్యా ఈ జగమంతా మిధ్య.." అని నా బుజ్జి మనసు తెగ కుమిలిపోయింది.గుండెల్లో ఒకలాంటి ఆక్రోశం మొదలై, ఆవేశం వచ్చేసింది.మా వాళ్ళు ఎవ్వరూ పక్కన లేకుండా మొదటిసారి ఎస్కలేటర్ మీద అడుగేసాను. అలా ఎస్కలేటరోఫోబియా పోయి, ఎస్కలేటరోమేనియా వచ్చేవరకు ఆపకుండా మళ్ళీ మళ్ళీ ఎక్కడం, దిగడం ఇదే పని. అలా మా అమ్మమ్మ దెబ్బకి నా "ఎస్కలేటరోఫోబియా" ఎగిరి...చంచల్ గూడా పక్కనున్న ఎస్కల్ గూడాకి పారిపోయింది.
*****
ఇప్పుడు ఎస్కలేటర్ చూసి పారిపోయేంత విపరీతమైన భయం లేదు కానీ దాన్ని చూడగానే ఒక్క క్షణం కాళ్ళు చిన్నగా వణుకుతాయి. ఇంకో విషయం "ఎస్కలేటర్", ఈ ఆంగ్ల పదానికి మంచి తెలుగు పదం చెప్పి పుణ్యం కట్టుకోండి.ఎంత కొట్టుకున్నా నా మట్టిబుర్రకి తట్టట్లేదు.

Tuesday, June 17, 2008

హిడింబి హిడింబి నడుమ నేను

అవి నేను అమీర్ పేటలో హాస్టల్ వెతుక్కుంటున్న రోజులు. అక్కడ కనక మనగలిగితే ఆఫ్రికా అడవుల్లో, అఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల్లో సైతం ఆనందంగా బతికేయొచ్చని పుకారు.నేను బాగ ఆలోచించి, చించీ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు వుంటున్న హస్టల్ రూములో చేరిపోయాను.ఇక్కడ నా ప్లానింగ్ ఏంటంటే అక్కని పడేసామనుకోండి చెల్లి పడి వుంటుంది లేదా చెల్లిని లైనులో పెట్టేస్తే అక్క నోరుమూసుకుని వుంటుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటారే అలా అన్న మాట. అప్పటికీ మానవతా విలువులన్న పక్క రూమమ్మాయి మంజు నన్ను పరామర్శినించడానికి సారీ... పలకరించడానికి వచ్చి "మీ రూములో వుండే అక్కా, చెల్లి తెగ తేడా, నువ్వు వేగలేవు" అని హెచ్చరించింది కూడా. "ఇక్కడ.. ఇక్కడ.. సెవెన్ ఇయర్స్, సెవెన్ ఇయర్స్ హాస్టల్లో వున్నా, నేను తలుచుకుంటే వాళ్ళిద్దరిని ఈ హాస్టల్ చుట్టుపక్కలే లేకుండా చెయ్యగలను" అని కారు కూతలు కూసేసాను. కానీ నాకారోజు రాత్రే "ముందున్న గోతుల లోతు తెలీకుండా కోతలు కోయాకూడదు" అన్న విషయం బాగా అర్థం అయ్యింది.

ఆ అర్ధ రాత్రి నేను గాఢ నిద్రలో వున్నాను. సడెనుగా ఎవరిదో భయంకరమైన నవ్వు వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే అక్క రెండు చేతులు చాపి, వంగి హ్హ, హ్హ, హ్హ అంటూ షోలే సినిమాలో గబ్బర్ సింగులా నవ్వుతోంది. అది చూడగానే గుండె ఒక్కక్షణం ఆగిపోయింది. ఒళ్ళంతా చమటలు పట్టేసాయి. మంజు చెప్పినట్టు తేడా అంటే పిచ్చేమో. మమ్మీ... నాకు పిచ్చోళ్ళంటే చచ్చేంత భయం.ఇంక ఆ నవ్వు భరించలేక వాళ్ళ చెల్లిని లేపి "పాప నవ్వుతుంది" అని చెప్పాను. "ఓస్ అదా మా అక్క రాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది. పొద్దునే లేవలేదు. అందుకే రాత్రే యోగా చేసుకుని పడుకుంటుంది. ఇది నవ్వాసనం " అనేసి మళ్ళీ పడుకుంది. నా బొందాసనం...అయినా పొద్దున కుదరదని రాత్రే చేసి పడుకోవడానికి ఇదేమైనా ఇస్త్రీనా...? వంకాయ,టెంకాయ కలిపితే వచ్చే హైబ్రీడుకాయ మొహం అదీను.
*******
అలారం మోగింది.టైం ఆరు.ఈ సారి చెల్లి లేచింది.ఇంక మళ్ళీ నిద్ర పట్టక ఈ సైతాను మొకాలతో వేగడం బెటరా, లేక తిరుగుతున్న ఖేతాన్ ఫ్యానుకి ఉరేసుకుని చావడం బెటరా అని కళ్ళు తెరిచి దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అదే నేను చేసిన పే...ద్ద తప్పు.చెల్లి అల్మారాలోంచి ఓ భయంకరమైన వస్తువు తీసింది. అది కత్తో, గన్నో, వేటకొడవలో అయితే నేనసలు భయపడేదాన్ని కాదు.కానీ.. కానీ... అది ఒక వయొలిన్.

"విద్యా నీకు నిద్ర పట్టటం లేదు అనుకుంటా. వయొలిన్ క్లాసుకి వెళ్ళడానికి ఇంకో అరగంట టైం వుంది. ఈలోపు నేనో పాట వాయిస్తాను. అదేంటో నువ్వు చెప్పాలే" అంది గారాలు పోతూ.చీ ఎదవ జీవితం సునామీ, సైక్లోను కలిపొస్తే ఎలా వుంటుందో అంత కన్న భయంకరంగా తయారయ్యింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టల మాట దేవుడెరుగు, ఒక్క పిట్టకి రెండు దెబ్బల్లా అక్క, చెల్లి కలిపి నన్ను ఎడా,పెడా కుమ్మేస్తున్నారు అని తాళం తప్పకుండా నాలో నేను కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఈలోపు సంగీత పిపాసి గారు కచేరి మొదలెట్టేసారు.

కుయ్.. ఇంకో కుయ్.....
కుయ్యో... ఇంకో కుయ్యో.

నేనో పిచ్చి శ్రోతని దొరికేసరకి, ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ రెచ్చిపోయి ...రెండో కుయ్యో లెంగ్త్,స్ట్రెంగ్త్,వేవ్ లెంగ్త్ అన్నీ పెంచేసింది. అది కాస్త కీచుమంటూ కీచుమంటూ వచ్చేసరకి నా పీచు జుత్తు భయపడి లేచి నుంచుంది. "కుయ్యో.. కుయ్యో.. కుయ్.. కుయ్.. కూ... కో......" ఇలా చెల్లి గారు జీవితం మీద రోత పుట్టేలా మోత మోగించేస్తుంటే, అక్కగారు కదలకుండా, మెదలకుండా పడుకున్నారు. పాపం పిచ్చి తల్లికి మళ్ళీ మళ్ళీ ఈ చెల్లి లొల్లి విని చెవులు చిల్లులు పడి, మెదడు మొద్దుబారిపోయినట్టుంది. ఆ క్షణంలో చెల్లెమ్మ వయొలిన్ వైలెన్స్ కన్నా అక్కయ్య గబ్బరు సింగే నవ్వే కాస్త వినసొంపుగా వుందనిపించింది.

ఇంకో పక్క చెల్లి ఆపకుండా తీగల్ని లాగి లాగి సాగదీసి లేని రాగాలు పుట్టించేస్తోంది.కొన్ని వేల ఏళ్ళ తర్వాత ఆ వయొలిన్ వాయింపుడు ఆపి"ఇప్పుడు చెప్పుకో చూద్దం" అంది. కుయ్యోలని నా జీవిత కాలంలో విన్న ఏదో ట్యూనులోకి ఇరికించేద్దామని ఎంత జుట్టు పీక్కున్నా కుదిరి చావదే...!అమ్మో ఈ వయొలిన్ వైడూర్యం, సంగీత వజ్రం ఏదో కొత్త(చెత్త) ట్యూన్ కనిపెట్టేసినట్టు వుంది. "నీకు తెలీట్లేదా...? ఇది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్" అంది. వామ్మో.. వాయ్యో.. ఇది అదా.. అదే ఇదని ఏమాత్రం అనుమానం రాకుండా ఎంత అద్బుతంగా ఖూనీ చేసింది. తగలెట్టడంలో కూడా ఎంత పర్ఫెక్షనో...! "నేను బాగా వాయించలేదు కదా..! నువ్వు గుర్తు పట్టలేదు" అని దీనంగా మొహం పెట్టి అడిగేసరికి నా వెధవ గుండెకాయ కరిగిపోయింది. కళాకారుల్ని నిరుత్సాహపరచకూడదనే పెద్దమనుసుతో "చీ అలా కాదు, నేను తెలుగు మీడియం. అందుకే నాకు ఇంగ్లీష్ రైంస్ అస్సలు తెలీవు" అన్నాను. "అయ్యో పాపం" అంది. కోతి మొకం,పీత కళ్ళేసుకుని వెధవ జాలొకటి మళ్ళీ.

"సరేలే నీ కోసం మంచి తెలుగు పాట బాగా నేర్చుకుని పది రోజులకి వినిపిస్తానే..అప్పుడు కరెక్ట్ గా చెప్పాలమ్మా..! " అంది.వెంటనే మంజు దగ్గరకి వెళ్ళి వలా వలా ఏడిస్తే "చా ఊరుకో. కష్టాలు మనుషులకి కాపోతే మానులకి వస్తాయా..! అయినా నా మాట విని వేరే హాస్టల్ కి వెళ్ళిపో" అని సలహా ఇచ్చింది. ఇంక హాస్టల్లో వుండే దమ్ము లేక, రూం వేటలో పడ్డా. అయినా నా పిచ్చి కానీ, హైదరాబాదులో అద్దెకి ఇళ్ళు, ఆడపిల్లలకి మొగుళ్ళు అంత వీజీగా దొరికేస్తారేంటి? రోజులు గబా, గబా గడిచిపోతున్నాయి. మా వాళ్ళందరికీ ఫోను చేసి మాట్లాడాను. అప్పులన్నీ తీర్చేసాను.నాకెవరైనా ఇవ్వాల్సివుంటే, ఇలాంటి దశలో తుచ్చమైన డబ్బు మీద మమకారం ఎందుకని ఆ బాకీలన్నీ మాఫీ చేసేసాను.బాకీలు మాఫీ చేసిన పుణ్యఫలమో,పూర్వజన్మ సుకృతమో,దేవుడి దయో కానీ చెల్లి భీకరమైన ప్రాక్టీసుకి తట్టుకోలేక వయోలిన్ తీగ తెగింది (ఎవరో తెంపేసారు!).చెల్లెమ్మ మారణాయుధం దెబ్బకి చిరుగులు పడ్డ నా జీవితం మళ్ళీ కొత్త చిగురులు వేసింది.

Thursday, June 12, 2008

ఇంగ్లీషన్నయ్య -- సులక్షణక్కయ్య

నేను ఇంటర్ చదివేటప్పుడు నేను ఇంటరే చదవాల్సి వచ్చేది. కనీసం వేరే పేపర్ ముక్క కూడా చదివే టైం ఇవ్వకుండా మా తొక్కలో కాలేజీ వాళ్ళు మా చేత వీర రుబ్బుడు రుబ్బించేవాళ్ళు.అలాంటి కాలేజీలో ఎడారిలో ఎండమావిలా ఓ ఇంగ్లీష్ సార్. ఆయన ఇంగ్లీష్ కత్తి. మాట కత్తి. పాడే పాట కత్తి. వేసే బొమ్మ కత్తి. మనసు కత్తి.చూడ్డానికి మనిషి కత్తి. మొత్తానికి ఆయన కత్తో కత్తి. మా కాలేజీలో మొత్తం అమ్మాయిలంతా ఆయన అభిమాన సంఘానికి శాశ్వత సభ్యులం. ఒక రాఖీ పౌర్ణమి నాడు మా అభిమానాన్ని చాటుకోవడానికి కొట్టుకుంటూ, తోసుకుంటూ,పోటీ పడి రాఖీ కట్టేసాం. అలా ఇంగ్లీష్ సార్ కాస్త ఇంగ్లీషన్నయ్య అయిపోయారు. ఇంత మంది వీరాభిమానులున్న ఇంగ్లీషన్నయ్యకి ఓ శతృవు బయలుదేరింది. అదీ సులక్షణక్కయ్య రూపంలో.........

చిన్ని చిన్ని కళ్ళు, బూరె బుగ్గలు, ముద్దుగా బొద్దుగా వుండే సులక్షణక్కయ్య మా కాలేజీకి మెడికల్ ఎంట్రన్స్ కి లాంగ్ లాంగ్ లాంగ్ టెర్మ్ కోచింగుకని వచ్చింది. అంటే ఆల్రెడీ రెండు లాంగ్ టెర్ములు దొబ్బేసాయి. ఇది మూడోది. వచ్చిన రెండు రోజులకే మన అక్కయ్య విశ్వరూపం చూపించటం మొదలెట్టింది. మన అక్కయ్య మాటల పుట్ట, కబుర్ల తుట్ట, విషయాల తట్ట, విజ్ఞానపు బుట్ట ( చదువులో కాదు!). మా దిక్కుమాలిని హాస్టల్లో ఎంటెర్టైన్ మెంటే లేకుండా చదువులో మగ్గిపోయి, మసయిపోతున్న మా మొద్దు మొకాలకి ఈ సులక్షణక్కయ్య అడవిలో ఆదిత్య ఛానల్లా, ఎడారిలో ఎం టీవీలా కనిపించేసింది. నాసామి రంగా ఇంక చూసుకోండి, హాస్టలంతా సులక్షణక్కయ్య మాకు కావాలంటే మాకు కావాలి అని తెగ కొట్టుకు చచ్చిపోయేవాళ్ళం.

ఇలా కొంచెం చప్పగా, కొంచెం చేదుగా, కొంచెం తియ్యగా సాగిపోతున్న మా కాఫీ కప్పులాంటి జీవితాల్లో మా సులక్షణక్కయ్య వల్ల చిన్న తుఫాను రేగింది. స్టడీ అవర్స్ లో మా ఇంగ్లీషన్నయ్యని చూసి ప్యూనా అని అడిగింది. మాధవన్లా వుండే మా ఇంగ్లీషన్నయ్యని ప్యూనని అనేసరికి నా గుండె ముక్కలయిపోయింది. సులక్షణక్కయ్యకి ఇంగ్లీషన్నయ్య గుణ గణాలు, కళలు, కాంతులు, ఆమె భ్రాంతులు అన్ని అజెండాగా తీసుకుని అందరం కల్సి స్పెసల్ క్లాసు తీసుకుని బుర్ర రామ కీర్తన పాడించేసాము. అయినా మన అక్కయ్య అభిప్రాయంలో మార్పు రాలేదు. టేస్టు లేని వేస్టు ఫెలో అని వదిలేసాము.

ఓ రోజు మేమంతా ఇంగ్లీష్ సారు ఇచ్చిన మెటీరియల్ కళ్ళు మూసుకుని బట్టీ కొడుతుంటే, సులక్షణక్కయ్య ఆ మెటీరియల్ లాక్కుని మెటికలు విరుస్తూ, చిటికెలు వేస్తూ, బరువు బరువు నిట్టూర్పులు విడుస్తూ చివరగా "ఇలా అయితే లాభం లేదమ్మాయిలు. మీరు ఇంగ్లీష్ పాసవ్వడం కష్టం" అని పెదవి విరిచేసింది.నా జీవితం మీద, పరీక్షల మీద నాకున్న సందేహాలు చాలవన్నట్టు ఈ మిటమిటల రాణి శాపనార్ధాలేంటో...?."ఈ మెటీరియల్ నిండా తప్పులే. మీ ఇంగ్లీష్ సారుకేమి రాదు" అంది.ఎంత మాట.... మా అందరికి గుండెల్లో నొప్పి, బాధ, వేదన. అటు రాఖీ కట్టిన బంధం, ఇటు సోది వినిపించే అనుబంధం. అటు చదువు చెప్పే గురువు. ఇటు మా అజ్ఞాన్ని పారద్రోలే కల్పతరువు. ఇద్దరూ మధ్య సయోధ్య కుదర్చలేక, కుదర్చకుండా వుండలేక మేమెంత నరకం అనుభవించామో మీకు తెలీదు, మీకెవ్వరికి తెలీదు....... వీలయినపుడల్లా మా ఇంగ్లీష్ సారుని దెప్పుతూనే వుంది. మమ్మల్ని వుందిగా సెప్టెంబర్ మార్చ్ పైన అంటూ భయపెడుతూనే వుంది.

ఈ గొడవలో పడి మేము క్రుంగి, క్రుశించి, నలిగి, నశించిపోతున్న సమయంలో సులక్షణక్కయ్య ఓ సవాల్ విసిరింది. మా ఇంగ్లీషన్నయ్య ఇచ్చిన మెటీరియల్లో తప్పుల్ని ఎర్ర ఇంకుతో మార్క్ చేసి,ఇది మీ అన్నయ్యకి చూపించి ఇవి తప్పులు కాదు అనమనండి చూద్దాం అంది.వెంటనే మేము బుర్ర బుద్ది లేకుండా చీమల దండులా పోలోమంటూ లెఫ్ట్ రైట్ అనుకుంటూ సారు దగ్గరకి వెళ్ళి ఆ పేపర్ చూపించాము. పేపర్, ఆ ఎర్ర గుర్తులు చూసి "ఏంటిది..?" అన్నారు అయోమయంగా. ఇవన్నీ తప్పులట సార్."ఎవరు చెప్పారు" అన్నారాయన సీరియస్గా. "సులక్షణక్కయ్య" అన్నాము అందరూ ఒకేసారి. "ఇంకేమంది..?" అని అడిగారు.

ఆయన అడిగిందే తడువుగా అస్సలు ఆలస్యం చేయకుండా మొత్తం కథంతా చెప్పేసి, మా గురు భక్తిని, సోదర ప్రేమని నిరూపించేసుకుని, చేతులు దులిపేసుకున్నాము. కానీ తర్వాత తెల్సింది మేమో పద్మ వ్యూహంలోకి ఎరక్క....పోయి ఇరుక్కు....పోయామని. ప్రిన్సిపాల్, సార్స్ అందరూ మమ్మల్ని తలా తోకా లేని బోలెడు చెత్త ప్రశ్నలు అడిగారు. మేము కొన్ని నిజాలు, అబద్దాలు కలిపి చెప్పి ఎలాగోలా ఆ ప్రశ్నల వర్షాన్ని కష్టపడి గట్టెక్కించేసాము. అలా విచారణ పూర్తి చేసి, మా వార్డెనక్కయ్య సాక్ష్యం ఆధారంగా సొల్లు కబుర్లు చెప్పి, చిన్న పిల్లల (అంటే మేమే..!) చిట్టి మనసుల్ని, చదువుల్ని చెడగొడుతుందనే అభియోగం మీద సులక్షణక్కయ్యని హాస్టల్ నుంచి గెంటేసారు. అలా మా లైటుని మేమే ఆర్పేసుకున్నాము.

సులక్షణక్కయ్య నిష్క్రమణతో మా జీవితాల్లో చీకటి నిండింది. సోది కబుర్ల మీద బెంగతో దిగులు రేగింది. ఇలా నా బాధల్లో నేనుండగా ఓ రోజు ఫోన్ వచ్చింది.అది... అది.... సులక్షణ....... అక్కయ్య నుంచి. బోలెడంత ఆనదంతో నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే "మీ ఇంగ్లీషన్నయ్యకి నేనో క్షమాపణ లేఖ పంపాను. ఎవరూ లేనపుడు అందిందేమో అడుగు" అంది. "క్షమాపణ లేఖ..?ఎందుకక్కా..? లేని తప్పులు పట్టుకున్నా సారేమి అనుకోరు." అంటుంటే "నోరు ముయ్యి, చెప్పింది చెయ్యి" అని ఫోన్ పెట్టేసింది. నాకొళ్ళు మండింది.

కావాలనే సార్స్ అందరూ వున్నపుడే ఇంగీషన్నయ్యని అడిగాను "సార్ సులక్షణక్క మీకేదో క్షమాపణ లేఖ పంపిందట. మీకు అందిందో లేదో అడగమంది" అన్నాను మొహం వీలైనంత దీనంగా పెట్టి. ఒక్కసారిగా రూములో అందరూ నవ్వడం మొదలు పెట్టారు. సార్ మాత్రం కొంచెం ఏడుస్తూ, కొంచెం నవ్వుతూ, కొంచెం కోపంగా, కొంచెం కంగారుగా, కొంచెం వెర్రిగా అదో రకంగా ముఖం పెట్టారు. నాకేమి అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటే, మా ఫిజిక్స్ సారు "లేఖ కాదు, పుస్తకం అది. అందింది.దాన్ని అమ్మి బఠానీళ్ళు కొనుక్కున్నారని చెప్పు" అన్నారు. సరే అని అమాయకంగా తలకాయ ఊపి బయకొచ్చేసాక, ఆయన నవ్వుతూ అంటున్నారు "అంత పెద్ద ప్రేమలేఖ ఎన్ని రోజులు రాసిందో పాపం ఆ ఆమ్మాయి. ఎవరు పెట్టారో కానీ సులక్షణ అని, చాలా లక్షణమైన పేరు పెట్టారు" అని.

ప్రేమ లేఖా...! అమ్మనీ..... ఎంత కుట్ర. మనసులో ఇంత పెద్ద ప్లాను వేసి, స్కెచ్ గీసి, సారుని మా ముందు తిట్టి, రెచ్చగొట్టి మా అంతట మేమే రాయబారానికి వెళ్ళేలా చేసి, సారు దృష్టిలో ఈ రాణీ గారు పడేలా చేసుకుందన్న మాట. కొత్తగా ఫోన్ రాయబారాలు ఒకటి.మళ్ళీ క్షమాపణ లేఖంట.. చుంచు మొహంది ఎంత ఎదవల్ని చేసింది. తర్వాత తెల్సింది వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యిందని. అక్కకి ఓ అభాగ్యపు బావతో, అన్నయ్యకి వేరే అమాయకపు వదినతో. హమ్మయ్య నా కడుపు చల్లబడింది. గుడ్డిలో మెల్లలా, పొడుగు పొడుగు ప్రేమ లేఖలతో (పుస్తకాలతో) సారుని పడేసి, పెళ్ళి చేసేసుకుని మమ్మల్ని మరీ బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఎదవల్ని చేసెయ్యలేదు మా సులక్షణక్కయ్య కాదు... కాదు... సులక్షణవదిన.. ఛీ ఛీ ఏదో ఒకటిలే....

Thursday, June 5, 2008

ఆడుతూ.. పాడుతూ.. అల్లరి చేస్తూ...!

ట్రైన్ రాజమండ్రి వచ్చేసింది. గోదావరి గాలి మృదువుగా, చల్లగా తాకుతుంటే నా మనసుకి భలే హాయిగా అనిపించింది.ట్రైన్ దిగి అమ్మమ్మ ఊరు వెళ్ళడానికి ఎర్ర బస్ ఎక్కాము. హైదరాబాదులో దూరపు చుట్టంలా వున్న స్వేద బిందువులు నుదిటి పై చేరి పలకరింతలు మొదలెట్టాయి.

చుట్టాలొచ్చారు మర్యాద చెయ్యాలి అని కరెంటోడు టపీమని కరెంట్ తీసేసాడు.మాకు గాలి కావాలి దేవుడోయ్ అనుకుంటూ విసనకర్రలు తీసుకుని ఊపటం మొదలుపెట్టాము. ఇంక ఊపే ఒపిక లేదు అని ఏడుస్తుంటే, ఇప్పట్లో గాలే రాదన్న టీవీలో వచ్చే గాలి గన్నారావు గాలి తీసేస్తూ బోలెడంత గాలి వీచటం మొదలుపెట్టింది. అబ్బ ఎంత గాలో దాంతో నాకూ ఎగిరిపోవాలి అనిపించింది. గాలి మాత్రం ఏదో దుమ్ము,ధూళి, ఇలియానా, కరీనాలాంటి లైట్ వెయిట్ లేపమంటే లేపుతా కానీ నిన్ను లేపటం నా వల్ల కాదమ్మా అని చెప్పేసింది. సుత్తి గాలికి బొత్తిగా మొహమాటం లేదు.

నేను అలిగినానని నన్ను చల్లబర్చడానికి వర్షాన్ని పంపించింది. మండువాలో వర్షం, పెరట్లో వర్షం, వీధి అరుగుల మీద వర్షం. వెళ్ళి తడిసి ముద్ద అయిపోయాలి అనిపించింది. అలా వీధి అరుగు మీద అడుగుపెట్టానో లేదో జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు అని నన్ను ఆపేసారు. ఇంకేం చేస్తాం, కాళ్ళు, చేతులు తడుపుకుని సంతోషపడుతుంటే పడవలు వెయ్యాలన్న గ్రేట్ అవిడియా వచ్చింది. అప్పటికప్పుడు మరిచిపోయిన పడవల తయారీ విధానాన్ని మా పిన్ని కూతురి దగ్గర నేర్చేసుకుని వర్షం నీటిలో వేసేసాను. దొంగ పడవలు. వేసిన చోట నుంచి మిల్లీ మీటరు కూడా కదల్లేదు. టైటానిక్కే కాస్త నయం. కొంచెం దూరం అయినా వెళ్ళింది. మన పడవలు వేసిన చోటే మునిగిపోయాయి. తర్వాత అమ్మ చెప్పిద్ని కత్తి పడవలు వెయ్యవే కత్తిలా దూసుకెళ్తాయని. కానీ సోది వర్షం అప్పటికి ఆగిపోయింది. ఎంత కంగారో..!

ఇంక సరదాగా అందరం కల్సి నాలుగు గవ్వలాట గలగలలాడించాలని తీర్మానించేసాం. గవ్వలు నాలుగు, మన చెయ్యి పెద్దది. చెయ్యెందుకు పేర్చకుండా ఊరుకుంటుంది. ఎనిమిది పడాలంటే కొంచెం కష్టం కానీ నాలుగు అంటే మన చేతుల్లో పని. గవ్వల్ని అలా సుతారంగా చేతిలో కదిలిస్తూ, వాటి వంక చూస్తూ, చూడనట్టు నటిస్తూ, మన కావాల్సిన విధంగా అమరగానే, టక్కున నేల మీదకి వేసేయడమే. నేను అలా అలా మంచి మంచి (దొంగ) పందేలు వేస్తూ, మధ్యలో దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తూ విజయవంతంగా దూసుకువెళ్ళిపోతుంటే , మా కజిన్స్ ఇద్దరూ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు(ఇది కానీ చదివితే ఆ నిప్పులేవో నా మీద పోస్తారు) "విద్యక్కా నువ్వు బాగా మోసం చేస్తున్నావు" అని నా మీద లేని పోని అభాండాలేసేసి నా మీద అలిగి ఆడటం మానేసారు.

ఇలా కాదని మా అమ్మ ఒక ఉచిత సలహా ఇచ్చింది. ఎనిమిది గవ్వలాట ఆడదాము. ఎనిమిది పేర్చాలంటే విద్యక్కకి ఎలానూ చెయ్యి సరిపోదు అంది. సరే అని మొదలుపెట్టాము. నిజంగానే పేర్చడం పరమ కష్టంగా వుంది. ఎనిమిది ట్రై చేస్తే, ఏడు, ఆరు ట్రై చేస్తే అయిదు పడుతుంది ఘోరంగా. పోనీ ఆరు పడుతుందని ఏడు పేరిస్తే ఏడే పడుతుంది చెత్తగా.దానికి తోడు ఆకలిగా వున్న పులుల్లా ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకోడం ఒకటి. అనకూడదు కానీ మాలో ఒక మంచి ఫ్యాక్షనిష్టు దాగున్నాడు. మా పగలు, ప్రతీకారాలతో ఆట ఎంతకీ తెమలకపోయేసరికి మా అమ్మకి చిరాకేసి ఒక శాంతి ఒప్పందం చేసి పారేసింది. ఇంక చంపుకోవడాలు లేవని. అప్పుడు చూడాలి మా మొహాలు. ఫ్యాక్షనిష్టు చేతిలో కత్తులు, బాంబులు లాగేసుకుంటే ఎలా అవుతుందో అలా అయిపోయాయి. అలా మా ఆటని లేడీ విలన్ లేని డైలీ సీరియల్లా నీరసంగా ముగించేసాము. ఫలితాలు అడగొద్దు. ఎందుకంటే నేను పెద్ద మనసుతో పేర్చకుండా (పేర్చలేక) ఓడిపోయి వాళ్ళని గెలిపించాను అని గొప్పలు చెప్పుకోవడం నాకస్సలు ఇష్టం వుండదు.

గవ్వల గలగలలు అయ్యాయి.తర్వాత కేరం బోర్డ్ మీద పడ్డాము. మన ప్రతిభ ఎవ్వరూ గుర్తించటం లేదు కానీ లేకపోటే ఈ ఆటలో మనకి తోపుడు విభాగం కింద అర్జున అవార్డ్ ఇవ్వచ్చు. హోల్, కాయిన్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వున్నా ఆ రెండిటినీ ఒక చోటకి చేర్చే(తోసే) సమర్ధత నాకు (నా చేతికి) వుంది. నా ఇష్టారాజ్యంగా తోసేస్తుంటే మా మావయ్య కూతురికి మండిపోయి (కడుపు మంట!) వదినా ఎందుకంత కష్టపడిపోతావు, కాయిన్ని చేత్తో తీసి హోల్లో వేసెయ్ అంది. వీళ్ళు మరీను. మరీ అంత దారుణంగా నేనేలా.... ఆడ...గలను అసలు.నాకసలే మొహమాటం ఎక్కువ.

ఈలోపల మా అన్నయ్య బ్లఫ్ ఆడదాము రండి అన్నాడు. "పేకాటా శివా శివా, మన ఇంటా వంటా వుందా" అని చెంపలేసుకున్నాను. ఇంతలో పక్క నుంచి మా పిన్ని "జీవించింది చాల్లేవే, తాతయ్య బయటకి వెళ్ళారు" అంది. అంతే అందరం పేకముక్కలేసుకుని గుండ్రటి బల్ల సమావేశానికి సిద్దం అయిపోయాము. ఒక ముక్క వేసి వేరే ముక్క వేసామని అబద్దం చెప్పి, అందరిని అదే నిజమని నమ్మించి ముంచేయాలి. కానీ ఇక్కడా నాకు అన్యాయం జరిగింది.అందరూ కల్సి నాకు న్యాయంగా దక్కవల్సిన గుర్తింపు దక్కనివ్వలేదు. నేను ఎంతో ఆటబద్దంగా ఆడి గెలుస్తున్నా, "నువ్వే ఆటలోనైనా బాగా కిరికిరిలు చెయ్యగలవు. అందుకే ఈ అటలో నువ్వు గెలిచినా లెక్కలోకి రాదు" అని నన్ను... నన్ను... ఆటలో అరటిపండులా తీసిపారేసారు. ఇంత కన్నా పెద్ద ఘోరం నేనెక్కడా చూళ్ళేదమ్మా. అయినా వీళ్ళకి బొత్తిగా స్పోర్టివ్ స్పిరిట్ లేదు బాబు.అందుకే అన్నారు న్యాయంగా ఆడే రోజులు అస్సలు కాదని........ కలికాలం.