Monday, June 22, 2009

బొమ్మని చూస్తే .......

దీనికి ఆ బొమ్మలుంటే చాలు, తిండి, నిద్ర ఏమక్కర్లేదు అని ముద్దుగా విసుక్కునే అమ్మ.. ఏమ్మా మీ బొమ్మల పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావా అని నవ్వుతూ అడిగే నాన్న... మీ అమ్మాయిని మా మనవడి కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేస్తావా అని వేళాకోళం ఆడుతూ ఏడిపించే ఎదురింటి తాతయ్య... అసలు నాకు ఊహ తెల్సిన దగ్గర్నుంచీ నా ప్రియనేస్తాలు నా బుజ్జి బొమ్మలే.. నేను స్కూలుకెళ్ళాలంటే వాటిని వదిలి వెళ్ళాలని బెంగ.. స్కూల్ నుంచి రాగానే వాటి ముందు వాలిపోయేదాన్ని.దాన్నే మిస్ అవ్వడం అంటారని నాకప్పడు తెలీనే తెలీదు.

ఆ బొమ్మల్ని నాన్న తాటాకులతో చేసేవారు.కొబ్బరాకులతో కూడా చెయ్యొచ్చు. కానీ వారానికే ఎండిపోయి అదోలా అయిపోయేవి. అందుకే తాటాకు బొమ్మలకే నా ఓటు. తాటాకులేమో ఓ పట్టాన దొరికేవి కావు. వున్న బొమ్మలు ఎన్నున్నా మనకి సరిపొయేవి కావు. అమ్మా, నాన్నా, ఇద్దరు బుడ్డి బుడ్డి పిల్లలు, మళ్ళీ బుడ్డోళ్ళు ఆడుకోవడానికి ఫ్రెండ్స్, తాతయ్య, అమ్మమ్మ, మావయ్యలు, పిన్నులు మరి ఇంత పెద్ద ఫేమిలీ అంటే మాటలా..దానికి తోడు వాటికేమయినా జబ్బు చేసినా(వాటితో 24*7 ఆడ్డం వల్ల శిధిలావస్థకి వచ్చేయడమన్న మాట),ఇంకా వాటికి ఏమన్నా ఏక్సిడెంట్స్ గట్రా (అంటే పక్కింటి సుధ తనకి లేవనే ఉడుకుమోత్తనంతో వాటిని చించేయ్యడం, ఎదురింటి శ్రీలక్ష్మి నా మీద కోపంతో వాటిని దొబ్బేయడం, కుదరకపొతే కాలి కింద వేసి తొక్కేయ్యడం లాంటివి) జరిగినా మళ్ళీ కొత్త బొమ్మలు రావల్సిందే.. అందుకే తాటాకుల కోసం నాన్న బుర్ర తెగ తినేసేదాన్ని. నా గోల భరించలేక నాన్నయితే పెద్ద తాటాకు కొమ్మ తెచ్చి దొడ్లో పడేసేవారు.. అయినా మనకి కరువేననుకోండి. అది వేరే విషయం.

నాకు అమ్మ చక్కగా మంచి గౌన్లు వేసి, జడేసి పూలు పెట్టి, రంగుల రంగుల పూసల దండలు, గాజులు వేసి భలే రెడీ చేసేది. మరి నేను అలానే నా బొమ్మల్ని రెడీ చెయ్యాలి కద...అందుకని చీరలు, నగలు అంటూ ఒకటే హడావిడి. ఊ అంటే, ఆ అంటే బొమ్మలకి కొత్త బట్టలు అంటావు అని అమ్మ కోప్పడేది. మరి ప్రతీ ఆదివారం బొమ్మల పెళ్ళి. పెళ్ళంటే ఫేమిలీ ఫేమిలీ మొత్తానికి కొత్త బట్టలు కావాలి కదా. ఈ
పెద్దోళ్ళున్నారే.. అర్ధం చేసుకోనే చేసుకోరు. దానికోసమని వారం మొత్తం టైలరింగ్ షాప్ చుట్టూ ప్రదక్షిణలు. మా అన్నయ్యేమో అమ్మా ఇది చిరాగ్గా ఎప్పుడూ చూసినా అక్కడే వుంటుందే అని తొక్కలో చాడీలు.అయినా మనం తగ్గుతాము ఎంటి..? పై పెచ్చు అమ్మా నెను అడిగితే టైలరబ్బాయు నాకివ్వటం లేదే, నువ్వొచ్చి రికమండ్ చెయ్యవే అని రివర్సులొ అమ్మ బుర్ర తినేసేదాన్ని.ఏ మాటకి ఆ మాట ప్పుకోవాలి.అమ్మని
బలవంతంగా తోడు తీసుకెళ్తే మంచి మంచివి (పట్టువి,జిగేల్ జిగేల్ అని మెరిసేవి) ఇచ్చేవాడు.

ఇంక నగలు.వాటి తయారీకి మన హస్తకళా ప్రావీణ్యం తెగ చూపించేసేవాళ్ళం. పక్కింటి ఆంటీ పాపం చిప్స్ కుడుతుంటే ఆ ఆంటీ పక్కన కూర్చుని సోది కబుర్లు చెప్తూ ఓ నాలుగు, పది, ఇరవై చిప్స్ గుమ్మం ముందున్న డోర్ మ్యాట్ కిందకి తోసేసి ఆ తర్వత తీరిగ్గా పేద్ద దండ (కాసుల పేర) గుచ్చి బొమ్మలకి వేసేదాన్ని. అయ్యో అది దొంగతనం కదా అనకండి. అప్పట్లో నా బొమ్మ తల్లి హృదయం దాన్ని నా బొమ్మలకి కాలవల్సినవి సమకూర్చుకోడం, సేకరించుకోడం అనేసుకునేది అన్న మాట. అదన్న మాట సంగతి. పిన్ని దగ్గర తీసుకుని గుచ్చిన మిలమిలా మెరిసే నీలం పూసల గొలుసు, ఎర్ర పూసల వడ్డాణం, రెండంటే రెండు గోల్డు పూసల మంగల సూత్రం... ఇంకా పచ్చ పూసల దండ అవన్నీ ఎంత ముద్దుగా వుండేవో!!! కాకి పిల్ల కాకికి ముద్దు అనకండి. నా బొమ్మ తల్లి హృదయం తల్లడిల్లిపోద్ది.

చెప్పడం మర్చిపోయాను. నా పెళ్ళికూతురు బొమ్మకి జడ కుడా వుండేది.నకప్పట్లో పెద్ద పెద్ద బారు జడలు వుండేవి. ఊడిపోయిన నా జుట్టుని దాచి ఆ జుట్టుతో దానికి అమ్మ జడేసింది. దాన్ని అందంగా అల్లి చివర్ని సన్నని రిబ్బన్ ముక్క కట్టేది. దానికి కూడా నాతొ పాటు రోజూ జడేయాల్సిందే. పాపం అమ్మ, నీకూ నీ బొమ్మలకి సేవలు చెయ్యలేకపోతున్ననే తల్లీ అంటూ నవ్వుతూ కోప్పడేది.పెరట్లో మొల్ల, మల్లె,
కనకంబరాలు, విష్ణు వర్ధనాలు, మందారం రేకలు ఏదో ఒకటి తెచ్చి మా హీరోయిన్ కి సింగారించేదాన్ని.

నా బొమ్మలు కింద పడుకుంటున్నాయి, వాటికి నొప్పెడుతుంది. వాటికి పరుపు కొంటావా, లేక నన్ను కింద పడుకోమంటావా అని తిక్క పేచీ పెడితే నా పోరు పడలేక,అమ్మ ఇంట్లో వున్న పాత బట్టలన్నీ పోగేసి వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి జాగ్రత్తగా బొంత కుడుతుంటే ఏదో అద్భుతం చూస్తున్న అనుభూతి, ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం. ఒకసారయితే మా చిన్నక్క నా బొమ్మలకని బుల్లి బుల్లి గౌన్లు, చిట్టి చిట్టి చొక్కాలు కుట్టి తీసుకొచ్చింది.గాల్లో తేలినట్టుందే,గుండె పేలినట్టుందే అన్నంత సంబరం. ఆ రోజు మొత్తం నా కళ్ళల్లో ఆనందం కన్నీరై ప్రవహించేసింది.వాటినే ఆనందభాష్పాలు అంటారని ఆ తర్వాత తెలుగు సినిమాలు చూసి తెల్సుకున్నానులెండి.

అలా వాటితో ఆడీ ఆడి, రాజ్య ప్రజల కోరిక మేరకు ఏడో తరగతి చదివి లోకాన్ని ఉద్దరించాలన్న వారి విన్నపంతో నా నేస్తాల్ని మా ఇంట్లోంచి పంపించేసి నా మనసులో చోటుతో సరిపెట్టుకోమనాల్సి వచ్చింది.I miss those days so much.I miss my tiny n beautiful family members so much. ఆ చిన్ని చిన్ని సంతోషాలు, చిట్టి చిట్టి బంధాలు మళ్ళీ రమ్మన్నా రావేమో!!!