Thursday, July 31, 2008

నేను స్కూలుకెందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే........!

చదువు వచ్చి మన మీద పడినా మనం వెళ్ళి చదువు మీద పడినా మనకే నష్టం.
చదువు రాకపోవటం ఒక యోగం
చదువుకోనక్కర్లేకపోవటం ఒక భోగం
చదువుకోవాల్సిరావడం ఒక త్యాగం
*************************************************
చిన్నప్పుడు ఇలా పైత్యం కలిపిన కపిత్వాన్ని చెప్పేంత తెలుగు రాదాయే... అందుకే బడి అన్న మాట వినగానేకాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ, కింద పడి దొర్లేస్తూ చదువు మీద నా నిరసనని తీవ్రంగా తెలిపేదాన్ని. అయినా సరే ఏ మాత్రం జాలి లేకుండా మా నాన్న ఎత్తి ఏట్లో పడేసినట్టు ఎత్తుకుని మరీ బళ్ళో పడేసేవారు.అదీ కాకుండా, మా అన్నయ్యకి ఎప్పుడూ వంద జ్వరం వుండేది. అందుకే ఎవరైనా మీ అన్నయ్య స్కూలుకెందుకు వెళ్ళట్లేదని అడిగితే "మరేమో మా అన్నయ్యకి జ్వరం ఇంచక్కా" అని చెప్పేదాన్ని. మా అమ్మేమో "చీ తప్పు ఇంచక్కా అనకూడదు. మా అన్నయ్యకి జ్వరం పాపం అని చెప్పాలి" అని కోప్పడేది.

అప్పటికీ తెలివిగా పొద్దున్న లేవగానే "అమ్మోయ్.. అమ్మోయ్..! నాకు జ్వరం వచ్చేసింది. నేను స్కూలుకెళ్ళను" అనేదాన్ని. వెంటనే నాన్న వచ్చి "బాబోయ్.. బాబోయ్ జ్వరమా అమ్మలు" అని ధర్మామీటరు తీసుకొచ్చేసేవాళ్ళు. ఆ దొంగ ధర్మామీటర్ ఎప్పుడూ అన్నయ్య పార్టీనే..వాడికి పాపం (ఇంచక్కా) 100 జ్వరం చూపించేది. నాకు మాత్రం అస్సలు జ్వరమే లేదని చూపించేదాన్ని. జ్వరం వుందని చూపించవా.. చూపించవా అని బతిమాలినా సరే చూపించేది కాదు. అందుకే దాని మీద బోలెడు కోపం వచ్చేసి డామ్మని కింద పడేసాను. అప్పుడు నాన్న "అల్లరిపిల్లకానా..! నీకు గారం ఎక్కువయిపోయింది. అసలు చెప్పిన మాట వినట్లేదు. పద స్కూలుకి" అని కళ్ళెర్రచేసి నన్ను భయపెట్టేసారు.

ఇంక అప్పట్నుంచి పోనిలే అని వాళ్ళ కోసం స్కూలుకెళ్ళేదాన్ని. అప్పుడు కూడా నా అభిప్రాయాలకి విలువిచ్చేవాళ్ళు కారు. "స్కూలుకెళ్ళడానికి నాకు బలం కావాలి. గిన్నెలో వున్నదంతా నా ప్లేట్లో పెట్టేయ్. మొత్తం నేనే తింటాను" అని గాట్టిగా ఏడ్చినా సరే అమ్మేమో "నువ్వు తినవు. ఏడ్వవు. అంతా ఎంగిలి చేసి అక్కడ పెడతావు." అని కొంచెమే పెట్టేది.
స్కూలుకెళ్ళాక బోలెడు సమస్యలు, ఆకలేస్తే బొటనవేలు నోట్లో వేసి చీక్కూడదు. నిద్రొస్తే బరా బరా బుర్ర గోక్కోకూడదు. ఇంకా తిక్క లేస్తే పక్కన కూర్చున్న పిల్లని గట్టిగా గిల్లకూడదు. నెమ్మదిగా కూడా గిల్లకూడదు అనుకోండి. పలకం, బలపం అరిగిపోయి, చేతులు నొప్పెట్టేవరకూ అక్షరాలు దిద్దుతూనే వుండాలి.ఒకసారి అలానే ఏదో దిద్దుతున్నాను. ఈలోపు మేస్టారు బయటకి వెళ్ళారు. ఎందుకో నా పక్కన పిల్ల నన్ను గిల్లుతుందేమోనని అనుమానంగా అనిపించింది. అందుకే ముందుజాగ్రత్తగా నేనే గట్టిగా గిల్లేసాను. అదేమో మేస్టారు చూసేసారు.

"ఓయ్ అమ్మాయి పలక తీసుకుని ఇటు రా.." అని పిలిచారు. వెళ్ళాక, పలక తీసుకుని దాని మీద అక్షరాలన్నీ చెరిపేసి " నేను దిద్దించిన అక్షరాలు ఇప్పుడు చూడకుండా రాయి" అన్నారు. నాకేమైనా భయమా..! గబా గబా రాసేసి ఆయనకి చూపించాను. "ఏంటివి" అని అదిగారు. ""అ ఆ"లు అని చెప్పాను ధైర్యంగా. "అక్షరాలు రాయమంటే పిచ్చి గీతలు గీస్తావా..? మొద్దు పిల్ల. చెయ్యి పెట్టు" అన్నారు. చెయ్యి పట్టాక స్కేలిచ్చుకుని టపీ టపీమని రెండు కొట్టారు. దాంతో మేస్టారి మీద కోపం వచ్చి ఆ రోజంతా ఏడుస్తూనే వున్నా..అమ్మకి చెప్తే అయ్యోపాపం అనకపోగా "నువ్వు బాగా చదువుకోవాలి అని కొట్టారు." అంది.నన్ను మొద్దు పిల్ల అన్నారన్నా పట్టించుకోలేదు. వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదని ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను.చించగా చించగా బంగారంలాంటి అవిడియా బుర్రలోకి వెలిగేసింది......

మర్నాడు అమ్మ చూడకుండా నా పుస్తకాల సంచీలో కొన్ని బొమ్మలేసుకుని బుద్దిగా స్కూలుకి బయదేరేసాను. మా ఇంటి సందు దాటి, కొంచెం దూరం నడవగానే సుధ పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చింది. వాళ్ళింట్లోకి వెళ్ళాను. సుధ పిన్నితో "పిన్నీ నాకు బోల్డు జ్వరం. అమ్మ మీ ఇంటికెళ్ళి గిరీషుతో(వాళ్ళ రెండేళ్ళ బాబు) ఆడుకొమ్మంది" అని చెప్పాను. ఇంచక్కా నా బొమ్మలతో,ఆ బాబుతో ఆడుకుని నా తెలివితేటలకి మురిసిపోతూ, ఎగురుకుంటూ ఆనందంగా స్కూలు వదిలే టైముకి ఇంటికొచ్చేసాను. ఆ ప్లానేదో భలే వుందనిపించేసి,రోజూ వెళ్ళిపోతే పిన్నికి అనుమానం వస్తుందన్న భయం కూడా లేకుండా, రెచ్చిపోయి రెండో రోజు కూడా వెళ్ళిపోయాను.కానీ ఆ రోజే నా జీవితం ఒక దారుణమైన మలుపు తిరగబోతుందని నాకు తెలీదు..తెలిస్తే వెళ్ళేదాన్ని కాదేమో..! ఇంటికెళ్ళేసరికి అమ్మ గుమ్మం దగ్గరే నుంచుంది.

ఎత్తుకుని డైరెక్టుగా చీకటి గదిలోకి తీసుకెళ్ళింది. నాకు విషయం అర్ధమయ్యేలోపే "అబద్దాలు ఆడతావా..? అబద్దాలు ఆడి స్కూల్ మానేస్తావా..? అని చేతుల మీద, కాళ్ళ మీద, వీపు మీద ఒకటే బాదుడు. అసలే నాకు తెల్సీ మా అమ్మ కొట్టడం మొదటిసారి, దెబ్బలు తప్పించుకోవడంలో పెద్దగా అనుభవం లేదు. అందునా చీకటి గది. నెక్స్ట్ దెబ్బ ఎక్కడ పడుతుందో ఊహించి చేతులు అడ్డు పెట్టుకుంటూ, మెలికలు తిరిగిపోతూ,గాట్టిగా ఏడుస్తూ కాసేపు డిస్కో డాన్సే డిస్కో డాన్స్. కాసేపటకి నీరసం వచ్చి డాన్స్ ఆపేసి, ఏడుపు మానేసి, తప్పు ఒప్పేసుకుని "ఇంకెప్పుడూ స్కూల్ మానను. అబాద్దాలు ఆడను. ఇంక కొట్టద్దమ్మా..!" అని బతిమాలటంతో బతికిపోయాను.

అలా నా మాస్టర్ ప్లానులోని ఒక బుల్లి ఫ్లా వల్ల,సుధ పిన్ని నాకు చేసిన అన్యాయం వల్ల, స్కూలో జైలులా, చదువో కష్టాల చెరువులా ఎంత అనిపించినా మా అమ్మ వీర ఉతుకుడుని దృష్టిలో వుంచుకుని అప్పట్నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్దిగా స్కూలుకెళ్ళాల్సి వచ్చింది పాపం నేను......

Saturday, July 12, 2008

రాజులనాటి కారులో జోరుగా హుషారుగా....!

మా టీములో "మా ఇంటికొస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేం పెడతారు" టైపులో ఓ సోది సాంప్రదాయం వుంది. కొత్తవాళ్ళంతా పాతవాళ్ళతో కల్సిపోవాలంటే పార్టీ ఇచ్చి తీరాలట. పార్టీ ఇచ్చి మరీ కొత్త పోగొట్టేసుకుని పాతబడిపోయి పని మొత్తం నెత్తిన రుద్దించుకోవడానికి నేనేమైనా చిన్నదాన్నా..? చితకదాన్నా..? కాదు కదా... అయినా సరే ఏమాత్రం భయ్యం,బత్తి లేకుండా వాళ్ళంతట వాళ్ళే అలుసు, బచ్చలి పులుసు తీసేసుకుని పార్టీకి మాంచి(?) ముహూర్తం పెట్టేసారు.
***
డబ్బులు, మబ్బులు, సబ్బులు ఎక్కువ కాలం వుండవు.అలాంటి అశాశ్వతమైన వాటి కోసం అనవసర హైరానా పడితే మాత్రం లేనిపోని జబ్బులు వస్తాయి.జరగాల్సింది జరగక మానదు.వదలాల్సింది వదల..కా.. మానదు. అందుకే వదిలించుకోవడాన్ని, విదిలించుకోవడాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించగలగాలి. అదే జీవిత పరమార్ధం.ఇదే ఈ విద్యా అమ్మాజీ ఉపదేశం. సందేశం. ఆదేశం. పాటించండి. సంతోషంగా జీవించండి.
***
అసలే నా సబ్బుల ఫిలాసఫీకి నేనే ఏకైక ఫాలోయర్నాయే..అందుకే బుద్దిగా బిల్లు విషయం మర్చిపోయి,పార్టీ పేరుతో పని ఎగ్గొట్టి షికారుకెళ్ళడం,రెస్టారెంటులో పీకల దాకా మెక్కడం, తిని తిరిగి అలిసిపోయి ఆఫీసుకొచ్చి సీట్లో అడ్డంగా పడి నిద్దరోవడం. ఇలా మంచి మంచి ఊహల గుంపుని ఆస్వాదిస్తున్నాను.వాటిని చెదరగెడుతూ మా టీం లీడ్ వచ్చాడు."శ్రీవిద్యా, మన టీములో ముగ్గురికి కార్లున్నాయి. మేము పదిమందిమి రెండు కార్లలో ఇరుక్కుని,సర్దుకుని,కష్టపడి రెస్టారెంటుకి వచ్చేస్తాము. నువ్వు, చందూ(ఇంకో అమ్మాయి) మాత్రం విశాలంగా, ఫ్రీగా ఇంకో కారులో రండే." అనగానే ఆ మాకోసం వాళ్ళు చేస్తున్న "త్యాగానికి" మా మనసు కరిగి నీరై వరదగా మారి మా ఆఫీసుని ముంచేయ్యబోతుంటే "సీనియర్ మేనేజర్ మీటింగు నుంచి బైటకి రాగానే, ఆయనతో కల్సి వచ్చేయండే.. ఇంచక్కా(!)" అని బాంబు పేల్చాడు. ఆ ఇమానమంత ఇశాలమైన కారు "SM"దా..? ఆయనతో రావాలా..? అంతే దెబ్బకి కరిగిన మనసు గబ గబా భయంతో బిగుసుకుపోయింది.ఇశాలం ట్రాపులో అంత దారుణంగా ఇరుక్కుపోయాక ఏం చేస్తాం..? ఆయన కోసం మా ఎదురుచూపులు ఫలించి, ఆయన లోపల చర్చలు ముగించేసరికి , ఓ గంట మా కళ్ళ ముందే కర్పూరంలా కరిగిపోయింది.ఈ పెద్దతలకాయలు వున్నాయే, వాటికి మాలాంటి బుడ్డి తలకాయల మనసు ఎప్పటికీ అర్ధం కాదు. ఎంత సేపు పని.. పని.. పని...హు..

కారు దగ్గరికెళ్ళగానే, మా టీం మొత్తం కల్సికట్టుగా మా కోసం త్యాగం చేసేసిన ఆ అద్భుతమైన కళాఖండాన్ని చూడగానే కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు అర్జెంటుగా టపా టపా రాలిపోయాయి.ఆ కారు బంగారు, మా మేనేజరు గారి నాన్నగారిదట. మారుతీ కంపనీ వారి మొదటి మోడలట. ఏది పట్టుకుంటే, ఏది ఊడిపోతుందో అని భయంభయంగా డోరు తీసి చా..లా.. జాగ్రత్తగా లోపల కూర్చున్నాను. అవసాన దశలో వున్న సీట్లు, కారు పార్టులు, నట్లు, బోల్టులు అన్నిటినీ తనివితీరా మళ్ళీ మళ్ళీ చూసాను.రేప్పొద్దున్న దీన్ని ఏ లండన్ మ్యూజియంలోనో పెట్టేసారనుకోండి.అప్పుడు చూడ్డానికి మన ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అందుకే ఇప్పుడే ఫ్రీగా చూసేసాను. ఎన్ని తెలివి తేటలో కదా..! దిష్టి కొట్టకండే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కారు హుషారుగా వెళ్తుంది.కానీ.. కానీ.. ఆరిపోయే దీపానికే వెలుగెందుకు ఎక్కువ..? తుఫాను ముందు ఎందుకంత ప్రశాంతత..? డబ్..డబా..డబా..డబ్.. కచా.. ఇచా.. లబా.. టకాల్..డిమేల్..డబా.డబా.....ఎందుకంత డబడబలాడించుకుంటూ బండిని నడుపుతావని పక్కనున్న స్కూటరోడుని చిరాగ్గా చూసాను.ఆ సంగీతం మీ పుష్పక విమానం నిర్వాకమే తల్లీ అని నా వంక ఇంకా... బోల్డంత చిరాగ్గా చూసాడు.

ఇంక నాన్న గారి బుజ్జిముండ డబడబలు భరించలేక ఒక పక్క కారుని ఆపి, ఏదో ఒకటి చేద్దామని చూసి ఇంకేమీ చెయ్యలేక ఆటో కోసం ఎదురు చూపులు మొదలెట్టాము.ఈలోపు మా SM ఒక పేద్ద బండరాయిని తీసాడు. హ్హా.. హ్హా..హెహ్హే... నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందం కారుని ఎవ్వరూ ఎత్తుకెళ్ళకుండా ఇంజన్ని రాయితో కొట్టడం గుర్తొచ్చింది. కానీ ఎప్పట్లానే మా అంచనాలని తల్లక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకుని సూటిగా మా వైపుకి వస్తున్నాడాయన. పగలకి ప్రతీకరాలకి సమయమా ఇదీ.నేను చెప్పిన పని చెయ్యను, సాకులు చెప్పి పని ఎగ్గొడ్తాను, పని చేస్తున్నట్టు ఏక్ట్ చేస్తాను. చేసిన కూసింత పని కూడా సవ్యంగా చెయ్యను. అంతమాత్రానికే బండరాయితో బుర్ర పగులగొట్టేస్తారా..? మాళ్ళీ నా అంచనాలని తలక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకెళ్ళి వెనక టైరుకి అడ్డంగా పెట్టారు,నాన్న గారి చిట్టికొండని ఎవ్వరూ గుద్దేయకుండా.. నాకు మల్లే తెలివితేటలు ఎక్కువ ఆయనక్కూడా..

అక్కర్లేనపుడు బస్సులు, ఆటోలు బొయ్యి బొయ్యిమంటూ హారన్ మోగించుకుంటూ రయ్యిరయ్యిమని తెగ తిరగేస్తాయి. ఆ రోజు మాత్రం రోడ్డు మీద మేము ముగ్గురం, చుట్టూ చెట్లు,గుట్టలు తప్పితే వేరే ఒక్క పిట్ట కూడా లేదు.ఈ లోపు ఏ దేవదూతలో పంపినట్టు భాషాలో రజినీలా, ఆటో డ్రైవర్లో నాగార్జునలా, హీరోలకే హీరోలా ఒక ఆటోవాడు వచ్చాడు. బంజారాహిల్స్ వస్తావా అని అడిగాము. మమ్మల్ని చూసాడు అసహనంగా. ఆగి వున్న కారుని చూసాడు ఆరాగా. మా మెళ్ళో వేళ్ళాడుతున్న ఐడెంటిటీ బిళ్ళలని చూసాడు ఆశ్చర్యంగా...వెంటనే ఏదో అర్ధమైనవాడిలా తల ఊపుతూ వంద అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ.. రెండు సందులకి వందేమిటి నాయనా అన్నాము. అంత దగ్గరయితే నడిచివెళ్ళండి అన్నాడు మీళ్ళో బిళ్ళలని తీక్షణంగా చూస్తూ..ఛీ ఛీ ఈ మెళ్ళో బిళ్ళల బదులు పాములేసుకుని తిరగడం నయం . చేసేదేమీ లేక నీవే మాకు దిక్కిప్పుడు అని గాట్టిగా మొక్కి, ఆటోలో కూలబడి అయ్యవారికి వంద దక్షిణగా సమర్పించుకున్నాము. అయినా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే ప్రతీవాడికీ లోకువే..పది రూపాయల సరుక్కి వంద లాగుతారు.మనలో మన మాట ఆఫీసు బయట ఆ బిళ్ళేసుకుని ఫొజులు ఇవ్వమాకండే.పర్సు ఖాళీ అయిపోతుంది జాగ్రత్త.

అలా పడుతూ లేస్తూ కాళ్ళీడ్చుకుంటూ నీరసంగా రెస్టారెంటుకెళ్ళేసరికి మా ముందెళ్ళిన పదిమంది మస్తుగా కుమ్మేసి,ఆవలించుకుంటూ, ఈగలు తోలుకుంటూ సొల్లు కొట్టుకుంటూ మాకోసం ఎదురు చూస్తున్నారు (??). ఎంత రెండు గంటలు లేట్ అయితే మాత్రం మాకోసం ఆగకుండా తినేస్తారా..? నా హృదయం తీవ్రంగా గాయపడింది. ఆ తిక్కలో కసి కసిగా అక్కడున్నవన్నీ ఊడ్చి తినేద్దామని ఆవేశంగా ప్లేట్ తీసుకుని ఫీల్డులోకి దూకాను.తీరా చూస్తే ఏమున్నాయి అక్కడ, నా తలకాయ్.టమాటా తొక్కులు, దోసకాయ ముక్కలు, క్యాబేజీ తొక్కలు, నిమ్మకాయ చెక్కలు. ఇవ్వన్నీ రైతుబాజార్లో సరసమైన ధరలకి దొరుకుతాయిగా.. ఇంకోపక్క క్యాలీ ఫ్లవర్ పుల్సు, కుక్కగొడుగుల పులావు, చల్లారిపోయిన చపాతీలు. ఏం తినాలో తెలియక, అస్సలు తినే ధైర్యం లేక, అలా అని తినకుండా వుండలేక నోర్మూసుకుని పెరుగన్నం పెట్టుకొచ్చాను.బిల్లులో నా వాటా గుర్తు తెచ్చుకుంటూ, గుడ్లనీరు కక్కుతూ,వెక్కుతూ పెరుగన్నం బలవంతంగా కుక్కుకుంటుంటే అర్ధమయ్యింది నాకు. జూనియర్లుగా వున్నపుడు ర్యాగింగ్ చేసారని ఏడ్చి, సీనియర్లయ్యాక వాళ్ళే మళ్ళీ ర్యాగింగ్ ఎందుకు చేస్తారో....!హ్హి హ్హీ.. రాబోయే కొత్తవాళ్ళు పార్టీ ఇవ్వడానికి నా స్వహస్తాలతో మాంచి మూహుర్తం పెట్టడం నా భవిష్య దర్శినిలో దివ్యంగా, మనోహరంగా కనిపిస్తుంది మరి.