Saturday, August 22, 2026

పుస్తకాల మాటున, జీవితపు చాటున

     నేను నా ఇంజనీరింగ్ కాలేజీ లో వున్నపుడు ఒక రిటైర్డ్ నేవీ ఆఫీసర్ వచ్చారు ,  ఆయన మా కాలేజీలోనే చదువుకున్నారట. అప్పుడు ఆయన చాల చెప్పారు ,  నాకు అన్నీ గుర్తు లేవు .  ఒక్కటి మాత్రం గుర్తు వుంది .  మీరు జీవితం లో సక్సెస్ అవ్వాలంటే ఈ అయిదు బుక్స్ చదవండి అని చెప్పారు . అందులో నాలుగు బుక్స్ మాత్రం నాకు గుర్తు వున్నాయి .  ఆయన చెప్పిన వెంటనే నేను కొనుక్కుని చదివాను.

     అందులో ఒక పుస్తకం, How to influence people and make friends. ఆ book  లో చెప్పినట్టు చేస్తే people నన్ను over friendly or fake అన్నట్టు  చూసేవారు. చాలా సంవత్సరాలు అర్ధం కాలేదు. ఎందుకు అలా అని , తర్వాత అర్ధం అయ్యింది. మనం ఏదో కాప్లిమెంట్స్ ఇస్తే, నవ్వుతూ మాట్లాడితే  జనాలు యాపీ అయిపోతారని బుక్కులో రాస్తే , వాళ్ళు యాపీ అయితే మనం యాపీ మనకి అంత కన్నా కావాల్సింది ఏముందిలే అని పొగుడుతూ, సరదాగా మాట్లాడుతూ ఉండేదాన్ని. కొంతమంది బానే ఉండేవారు. కొంతమంది మొహం తిప్పుకునే వారు, కొంత మంది ఏదో పనికిమాలిన దాన్ని చూసినట్టు చూసేవాళ్ళు . ఇదేంటబ్బా ఉప్మా  మురబ్బా అని తలకొట్టుకు చచ్చేదాన్ని.

  మనం వాళ్ళు యాపీ అవుతారు మనం అనుకున్నా, అవతలి వాళ్ళు కొంత మంది దీనికి ఎదో కావాలి మన నుండి అందుకే పొగిడేస్తోంది అనుకుంటారు. కొంత మంది మన పొగడ్తలకి వాళ్ళ ఇగో ఎలేవేట్ అయ్యి, బ్లోట్ అయ్యి  మనల్ని ఆక్ పాక్ కరివేపాకులా చూస్తారు.  

    అలా చాలా సార్లు తలబొప్పి కట్టి, మనసు నొప్పెట్టాక  అర్ధం అయిన జీవిత సత్యం ఏంటయ్యా అంటే,  ప్రపంచకం లో ప్రతిదీ మన వల్లే, మన బట్టే జరగదు.  మనం నీలం రంగు పూస్తే, అది నీలంగానే ఉండడానికి అది మనషులు ఏమీ తెల్ల కాగితాలు కాదు. వాళ్ళ జీవిత అనుభవాల్ని బట్టి ,  ఆలోచనల్ని బట్టి వాళ్ళకో రకం పర్సనాలిటీ ఉంటుంది. మన నీలం, అవతలి మనిషిని బట్టి ముదురు నీలం ,  లేత నీలం ,  లేదా సరికొత్త రంగుగా మారొచ్చు.

 

    ఆ బుక్కు రాసినాయన జీవితం లో అలా చేయడం వల్ల అలాంటి output వచ్చింది. మనకి అలానే జరగాలి అని రాసి లేదు. మారే కాలమాన  పరిస్థితుల్ని బట్టి, ప్రదేశాల్ని, మనుష్యుల్ని బట్టి ఇంకేదో జరుగుతుంది. మరి పుస్తకాలు చదివేది ఎందుకు అంటే ,  జస్ట్ నాన్ ఫిక్షన్ ని కూడా ఫిక్షన్ లా చదివాలి. అది ఒక రచయిత జీవిత అనుభవం, జీవితం పట్ల ఆ రచయిత కి వుండే నమ్మకాల సమూహం  దాన్ని ఎదో unievrsal truth లా తీసుకోకూడదు. కొంచెం లేటుగా అర్ధం అయ్యింది .  ఎం చేస్తాం ,  ఒక్కోసారి క్షవరం అయితే గానీ వివరం రాదు. జీవితం లాగిపెట్టి లెంపకాయ కొట్టకపోతే గానీ అర్ధం కాదు. 

Monday, July 13, 2026

సాధించాలా… లేక సాగించేయ్యాలా?

జీవితంలో ఎంత సాధించాలి? ఎన్ని సాధించాలి? ఏమి సాధించాలి? అసలు జీవితాన్ని సాధించాలా… లేక సాగించాలా, ఏదోలా లాగించేయ్యాలా ?

నాకైతే సమాధానం ఒక్కటే. సాధించాలి. గొప్పగా బతకాలి. అడుగు వేస్తే ఆకాశాన్నే అందుకోవాలి,గురి పెడితే ఏనుగు కుంభస్థలాన్నే తాకాలి. నరసింహ సినిమాలో పాట వుంటుందిగా .  జీవితం అంటే పోరాటం, పోరాటంలో వుంది జయం అన్న టైపులో.

చిన్నప్పుడు ఈనాడు పేపర్లో "విజేతల కథలు" చదివేదాన్ని. Think Big లాంటి పుస్తకాలు చదివేదాన్ని. అప్పటినుంచి నా నమ్మకం ఒక్కటే, జీవితాన్ని గెలవాలి. ఏదోలా బతికెయ్యడం కాదు, గొప్పగా బతకాలి. ఏదోలా ఈదుకుంటూ వెళ్లిపోవడం కాదు,అలల్ని చీల్చుకుంటూ తీరాన్ని చేరాలి…

చిన్న ఆలోచనలు, చిన్న లక్ష్యాలు, చిన్న అడుగులు అంటే చిన్నతనంగా అనిపించేది. పెద్ద లక్ష్యాలు, పెద్ద విజయాలు, పెద్ద జీవితం…ఇదీ జీవితం, అదీ లెక్క.

ఉన్నదానితో కులాసాగా బతికేవాళ్లను చూస్తే, "వీళ్ల కలలకు రెక్కలు లేవా? లేక ఆకాశమే అవసరం లేదనుకుంటున్నారా?" అనిపించేది.

నా మనసంతా అసంతృప్తి, అలజడి. ఏదో లేదనే లోటు… ఇంకేదో కావాలనే తపన… సాయంత్రానికి అలసట, ఆయాసం.

ఆ అసంతృప్తి ప్రతిరోజూ నన్ను ప్రశ్నించేది…

"ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఎక్కడో ఉండాలి కదా! ఇంతే సాధించావా? ఇంకా ఎంతో సాధించాలి కదా! అప్పుడే అలసిపోయావా?"

నా ఆలోచనలు చాలు… నన్ను తినేయడానికి, నమిలేయడానికి, నలిపేయడానికి. నాకు వేరే శత్రువులు అవసరమే లేదు.

పోనీ ఈ విజయ భేరి ,  జైత్ర యాత్ర ఏదో ఒక్కవిషయంలో ఉంటే సరిపోదు .  అన్నింట్లో ,  అంతటా విజయభేరి మోగాల్సిందే. 

ఆఫీస్ లో పది మంది పది నిముషాల్లో చేసెయ్యాలి,  ఇరవై నిముషాల్లో ఇరవై పుస్తకాలు చదివి వంటబట్టించేస్కోవాలి . ఇంట్లో వంద రకాల వంటలు వంద సెకనులో  వండి పడెయ్యాలి. ఇల్లు అద్దంలా మెరిసి మెరిసిపోవాలి. యోగ , మెడిటేషన్ ,  జిమ్ , గిమ్ము, గమ్ము  అన్నీ చేసి పడెయ్యాలి.   మనిషి సంఘ జీవి కదా .  కాబట్టి  సోషల్ కమిట్మెంట్స్ అన్నీ కూడా చక్కబెట్టి చుట్టబెట్టయ్యాలి,  ఇలా ఉంటుంది మన వరస .  ఇన్ని పనులు, ఇన్ని  పంచాయితులు పెట్టుకుంటే అలసిపోక అబ్రహం లింకన్ అవుతావా అని అడగొద్దు .  

"ఇన్ని ఎలా సాధ్యమవుతాయి?" అని అడిగితే…"కుదరదు కాదు… కుదరాల్సిందే!" అంటాను.

"ఒకటో రెండో ప్రాధాన్యతలు ఎంచుకో" అంటే ఎలా? నేను నేటి మహిళను కదా! అన్నిట్లో నేనే, అంతటా నేనే. లేదంటే నేనేదో వెనకబడిపోయాను అన్నమాట. 

మళ్ళీ చేసేదంతా పెర్ఫెక్టుగా ఫ్లాలెస్సుగా ఉండాలి ,  ఈ పెర్ఫెక్షనిజం అక్కయ్య గురించి ఇంకో రోజు మాట్లాడదాము.

అప్పుడు చదివాను, ఫోర్ బర్నర్స్ థియరీ. ఇది నాలాంటి తిక్క పుల్లమ్మల కోసం అన్నమాట. డేవిడ్ సెడరీస్ అనే గురువు గారు చెప్పింది ఏంటంటే జీవితం అనేది ఫోర్ బర్నర్స్ వున్న గ్యాస్ పొయ్యిలాంటిది.  ఒక బర్నర్ ఫ్రెండ్స్, ఒకటి వర్క్, ఒకటి ఫామిలీ ,  ఒకటి హెల్త్. ఒకటి అఖండ జ్వాలలా వెలిగిపోవాలి అంటే, మిగతా ఒకటి లేదా రెండు బర్నర్ల మంటను కొంచెం తగ్గించాల్సిందే అని.

 



ఉదాహరణకి మన ఎలాన్ మస్క్ అన్నయ్య వున్నాడు అనుకోండి, అస్సలు యాపారంలో అఖండంగా వెలిగిపోతున్నాడు. పాపం ఫ్యామిలీతో ,  పిల్లలతో కొంచెం గొడవలు మనోడికి. 

అప్పుడు అర్థమైంది…

సమస్య నేను ఎంచుకున్న శిఖరాల ఎత్తులో లేదు…ప్రతి శిఖరాన్ని ఒకేసారి అధిరోహించాలనే ఆరాటంలో ఉంది.భారం నా లక్ష్యాల్లో  లేదు…ప్రతి గమ్యాన్ని ఒకే ప్రయాణంలో చేరాలనే మొండి పట్టుదలలో ఉంది.

ఆలోచిస్తే అన్నీ కావాలి. వేటి టైం వాటికివ్వాలి, వేటి ప్రయారిటీ కావాలి .  అన్నీ కావాలి అనుకున్నపుడు కాసింత కూసింత చాలు అనుకోవాలి ,  అంతే గానీ అన్నీ కొండంత కావాలి అనుకోకూడదు. 

అలానే అసంతృప్తికి  సంతృప్తికి అతి సంతృప్తికి ఒక చిన్న లైన్ ఉంటుంది. వుంది చాల్లే అని చల్లబడిపోకూడదు, లేదు లేదు అని చతికిలపడకూడదు. ఒక్కో టైములో ఒక్కోదానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వేరే దాన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఒక్కోసారి వర్క్ ప్రయారిటీ అవుతుంది. అప్పుడే వేరే దగ్గర స్లో డౌన్ అవ్వాలి ,  ఇంకో సారి పిల్లలు ప్రయారిటీ అవుతారు ,  అప్పుడు వర్క్ స్లో డౌన్ అవ్వాలి. 

చిన్నప్పుడు "మానవ ప్రయత్నం మనం చేయాలి, ఫలితం ఏదైనా ఆనందంగా స్వీకరించాలి" అంటే, "ఇదేం మెట్ట వేదాంతం!" అనుకునేదాన్ని.

ఇప్పుడు అర్థమైంది…

అది మెట్ట వేదాంతం కాదు. జీవిత సారాంశం.

బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు, విజయాలు, గుర్తింపు, ఇవన్నీ జీవితం కోసం. జీవితం వీటి కోసం కాదు.

చివరికి గొప్ప జీవితం అంటే అన్నింటినీ గెలవడం కాదు.

ఏ సమయంలో ఏది ముఖ్యమో తెలుసుకుని, దానికి మనస్ఫూర్తిగా సమయం ఇవ్వడం… అదే నిజమైన విజయం.

జీవితాన్ని సాధించాలనే తపన ఉండాలి. కానీ ఆ తపనలో జీవితాన్నే కోల్పోకూడదు.

 

Saturday, July 4, 2026

Detour is the destination

చాలా రోజుల తర్వాత రాయాలి అనిపించింది. రాయాలా వద్దా అని కాసేపు నాతో నేనే వాదించుకున్నాను. రాస్తే ఏమొస్తుంది అనిపించింది. రాస్తే ఏం పోతుంది అనిపించింది. చివరికి, రాసి చూద్దాం అనిపించింది. అందుకే రాసేస్తున్నాను.

పాల సముద్రం చిలికితేనే కదా అమృతం. మనసులో జరిగే మథనానికి మాటల రూపం ఇస్తేనే కదా మనకు మనం కొంచెం అర్థమవుతాం.

చాలా కాలం నేను ఒక కన్ఫ్యూషన్‌లో ఉండేదాన్ని. ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ పూర్తిగా పోయిందా అంటే చెప్పలేను. ఏంటా కన్ఫ్యూషన్ అంటే నా ఆలోచనలు నన్ను సరైన దారిలో నడపలేవని, నేను ఆలోచించి తీసుకునే నిర్ణయాలు సరైనవి కావని, సరిగ్గా బతకడానికి ఒక బ్లూప్రింట్ ఎక్కడో ఎవరో రాసి పెట్టి ఉంటారని నమ్మేదాన్ని. అందుకే తెగ పుస్తకాలు చదివేదాన్ని.

Seven Habits of Highly Effective People, You Can Win, The Power of Now, Daring Greatly, The Four Agreements, Atomic Habits, Thinking, Fast and Slow, Meditations, Zen and the Art of Motorcycle Maintenance... ఇంకా ఎన్నో.

ఈ పుస్తకాలన్నింటినీ చదివి, వాటి సారాన్ని ఒంటబట్టించుకుంటే, చివరికి జీవితం అనే సమస్యకు ఒక ఐదు స్టెప్పుల సమాధానం దొరుకుతుందని అనుకునేదాన్ని. ఒక పది పాయింట్ల థియరీ తెలిసిపోతుందని నమ్మేదాన్ని. దాన్ని ఫాలో అయితే ఇక తప్పిపోనని అనుకునేదాన్ని.

కానీ కాలం మెల్లగా మరో విషయం నేర్పింది.

ఆ పుస్తకాలన్నీ ఆట ఎలా ఆడాలో చెబుతాయి. కానీ మనతో జీవితం ఆడే ఆట మాత్రం ప్రతిసారీ కొత్తది. అది ఇప్పటికే రాసేసిన కథ కాదు.  ముందే రాసిన రూల్‌బుక్ ఉండదు. కొన్ని general guidelines ఉంటాయి అంతే.

మన మైండ్‌లో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటి నుంచి డిటాచ్ అవ్వడమే జెన్ చెప్పే సిద్ధాంతం. అంటే మన మైండ్ చెప్పేది గుడ్డిగా నమ్మకూడదు; అలా అని పూర్తిగా కొట్టి పడేయకూడదు. వాటితో కూర్చోవాలి. వాటిని వినాలి. వాటిని గమనించాలి.

అదే sitting with discomfort.

ఆ discomfort ఎంత భయంకరంగా ఉంటుందంటే, మన నుంచి మనమే పారిపోవాలనిపిస్తుంది. మనకే మనం ఎస్కేప్ రూట్లు వెతుక్కుంటాం. ఫోన్‌లో, పనిలో, బిజీలో, ఇతరుల జీవితాల్లో, ఎక్కడో ఒకచోట దాక్కుని మనల్ని మనం తప్పించుకోవాలని ప్రయత్నిస్తాం.

ఎందుకంటే అన్ని యుద్ధాల్లో అతి పెద్ద యుద్ధం మనం మనతో చేసేదే.

కానీ ఇప్పుడు అనిపిస్తుంది, బహుశా అది యుద్ధం కాదు.

అది పరిచయం. మనతో మనకి జరిగే మొదటి నిజమైన పరిచయం. మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయాణం.

మనలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. ఎన్నో పొరలు ఉన్నాయి. కొన్ని మనకు తెలిసినవి. కొన్ని మనం దాచుకున్నవి. కొన్ని మనకే తెలియనివి.

ఆ లోతుల్లోకి దిగుతున్న కొద్దీ, మన నుంచి మనమే చేజారిపోతున్నామేమో అన్న భయం వస్తుంది. ప్రపంచానికి దూరమవుతున్నామేమో అనిపిస్తుంది.

ఆ భయాలను దాటి నిలబడగలిగితే, ఆ అసౌకర్యంతో కూర్చోగలిగితే, మనతో మనకి నిజమైన స్నేహం మొదలవుతుంది.

అన్ని స్నేహాల్లో అతి గొప్ప స్నేహం, మనతో మనం చేసే స్నేహం.

Befriending our thoughts.

మనకి మనం అర్థమవడం మొదలైన తర్వాత, ఆశ్చర్యంగా ప్రపంచం కూడా కొత్తగా కనిపించడం మొదలవుతుంది. మనుషులు మారరు. కానీ వాళ్లను చూసే మన చూపు మారుతుంది. వాళ్లను అర్థం చేసుకోవాలనే ఓపిక వస్తుంది. వాళ్లలోని భయాలు, సందేహాలు, పోరాటాలు కూడా మనవే అనిపిస్తాయి.

వాళ్ల కోపం వెనుక భయం కనిపిస్తుంది.

వాళ్ల మౌనం వెనుక బాధ కనిపిస్తుంది.

వాళ్ల గెలుపు వెనుక పోరాటం కనిపిస్తుంది.

కొంచెం కొంచెంగా, ప్రపంచంతో కూడా స్నేహం మొదలవుతుంది.

బహుశా ఈ ప్రయాణానికి గమ్యం అనేదే ఉండకపోవచ్చు. అందుకే ఎక్కడో మొదలుపెట్టి, ఎక్కడో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే, ప్రతి మలుపు, ప్రతి తప్పిదం, ప్రతి ఆలస్యం, ప్రతి దారి తప్పడమే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిందని అర్థమవుతుంది. ఈ ప్రయాణానికి fixed route ఉండదు. కొన్నిసార్లు దారి తప్పడమే అసలు దారి అవుతుంది.

Detour అనుకున్నదే destination అవుతుంది.

అంతే మరి

Detour is the destination.

Thursday, June 26, 2025

కలల వెంట వెళ్ళనా? వద్దా ? వెళ్లగలనా ? లేదా ?

 ఎప్పటికప్పుడు ఏదైనా కొత్త విషయం మిస్ అవుతుందేమోనన్న భయం నాకు ఉంటుంది. ఎక్కడో ఏదైనా interesting update వచ్చిందేమో, ఏదైనా useful learning దొరకుతుందేమో అన్న ఆలోచన బుర్రని తొలుస్తూనే ఉంటుంది. అందుకే మనసులో ఎప్పుడూ ఒక ఆందోళన – ఏదైనా కొత్తగా తెలుసుకోవాలి, వినాలి, చదవాలి అన్న తపన నన్ను తొక్కేస్తూ ఉంటుంది.

ఈ తపన వల్ల జరిగే మంచి ఏంటంటే – కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.
జరిగే నష్టం ఏంటంటే – ఆ information-seeking లో పడి, నా పర్పస్, నా goals, నా dreams ని కొంతవరకు పక్కన పెడుతున్నాను. ఎందుకంటే కొత్త information అలా వరదలా వస్తూనే ఉంటుంది ,  దానికి అంటూ లేదే . ఎంత నేర్చుకుంటే ఎం లాభం ?  ఆచరణ లేని విజ్ఞానం ఎంత ఉన్నా ప్రయోజనం లేదు, అది మనల్ని ముందుకు  నడిపించకపోతే.

తప్పనిసరిగా నేర్చుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్నది తెలుసుకోవాలి.
అవన్నీ మనల్ని inspire చెయ్యాలి – ముందుకి నడిపించాలి.  ఆ నేర్చుకోడంలోనే ఆగిపోకూడదు . 

"Knowing is not enough; we must apply." — Goethe

ఈ interviews, podcasts చూసినప్పుడల్లా ఇంకో  అనుమానం తలెత్తుతుంది –
అందరూ ఎంతో సాధించేస్తున్నారు. వాళ్ల జీతాలు, achievements, goals అన్నీ చూసినప్పుడు,  నాకు నేనే చాలా చిన్నగా అనిపిస్తాను . "ఇంత చిన్న అడుగులతోనే నేను పెద్ద లక్ష్యాల వరకు ఎలా చేరుతాను?" అనే నిరాశ  చుట్టేస్తోంది.

మళ్ళీ నాకే అనిపిస్తుంది , మన దారి, మన progress, మన rhythm – ఇవన్నీ మనవే కదా.
మనమే వాటిని తక్కువగా చూసుకుంటే, వాటిని మొగ్గలోనే తుంచేసిన వాళ్ళం అవుతాము కదా . 
వాళ్లూ ఒకప్పుడు చిన్నగానే  మొదలు పెట్టారు. ఎవ్వరూ లక్ష్యాన్ని ఒక్క అడుగుతో చేరలేరు .
చిన్న చిన్న వర్షపు చినుకులే చెరువుని నింపుతాయి.
చిన్న పనైనా consistency తో చేస్తూ పోతే, అది అర్ధవంతంగా మారి మన లక్ష్యానికి మనల్ని చేరువ చేస్తుంది . 

చిన్నదే అయినా – అది నాది.
ఆ దారి నన్ను నాకే దారి చూపిస్తోంది.

Friday, May 7, 2021

కరోనా కల్లోలం

 ఎటు చూసినా ఒక రకమైన భయం, నిరాశ, నిస్పృహలు. ఏ నిముషంలో ఎం జరుగుతుందో, ఏ క్షణాన ఎం వింటామో అన్న భయంతో వణికిపోతున్నాము. ఈ మాయదారి కరోనా మనిషిని పీల్చి పిప్పి చేస్తోంది. ఆశల్ని ఆవిరి చేస్తుంది. చాలా భయంకరమైన రోజులు ఇవి. ఎప్పుడు లేదింత నైరాశ్యం .  

దగ్గరగా చావు చూసినపుడు, ఒక్కసారి నిద్ర లేస్తాము. మనకూ అలా అవ్వచ్చనే ఊహ చాల భయానకంగా అనిపిస్తుంది.  ఇదే శస్మాన వైరాగ్యం. చాలా మంది పోతున్నప్పుడు మనమూ పోతామని లేదు. అందరూ బాగున్నపుడు మనం బాగుంటామని లేదు. ఈ విషయం కరోనా కల్లోలం తగ్గాక  కూడా గుర్తు పెట్టుకుందాము.  మరణం అనేది అందరికీ తప్పదు. ఎవ్వరం ఇక్కడే ఉండిపోము.  అందుకే మంచి చేద్దాము.  కుదిరితే సాయం చేద్దాము. లేని పోనీ కక్ష్యలు కార్పణ్యాలు వద్దు.  ఊరికే మాటలు అనొద్దు. ఆవేశకావేశాలు అస్సలొద్దు. మన జీవితంలో ప్రతిరోజూ దేవుడిచ్చిన గిఫ్ట్. కృతజ్ఞతలు చెప్పుకుందాము. ప్రతినిముషం అర్ధవంతంగా గడుపుదాము. మన వాళ్లందరికీ అందమైన జ్ఞాపకాలు మిగిలుద్దాము. మన పిల్లలకి మంచి విలువలు ఇద్దాము. 

Thursday, May 6, 2021

ఏమి అయిపోయాను ఇన్నాళ్లు?

 ఏమి అయిపోయాను ఇన్నాళ్లు? వున్నాను నా అంతర్ముఖంలో దాక్కున్నాను.  ఏదో అంతర్మథనంలో మునిగి తేలాను.  పారిపోయానా నేను? కాదు నన్ను నేను వెతుక్కుంటున్నాను. ఒక నిముషం దొరుకుతాను. మరు నిముషం అందకుండా జారిపోతాను. నాకు నేనే అర్ధం కాను. నాలోనే వంద పార్శ్వాలు. నాలోనే వేల గొంతులు. 

నన్ను నేను చేరేందుకు నాలో నేను నాతో  నేను ప్రయాణం చేస్తున్నాను. ప్రయాణం పూర్తవ్వలేదు కానీ గమ్యం కోసం ఆరాటం లేదు. నాతో నాకు పోరాటం లేదు. నా మీద నాకు నిర్లిప్తత లేదు. నా మీద నాకు అపనమ్మకం లేదు. నేనంటే నాకు అసహనం లేదు.  ఇప్పుడిప్పుడే నాతో నాకు స్నేహం చిగుర్లు వేస్తోంది.  నేను నాకు పరిచయం అవుతున్నాను. నేను నాకు అర్ధం అవుతున్నాము. వేరెవరూ తమ ప్రతిబింబాలన్నీ అద్దంలో చూపించి నమ్మేసేదాన్ని. ఇప్పుడు నేను నాకు తెల్సు. నేను ఏది కాదో కూడా తెల్సు.  నావి ప్రతిబింబాలకి దూరంగా, నాతో నేను దగ్గరగా. ఇదేనేమో సంతోషం అంటే. 

నాతో నాకు స్నేహం.

నేనే నాకు మోదం .

నాలో నాకు హర్షం .


 

Saturday, April 25, 2020

సమయం

మనసు మాటుల్లో దాగున్న ఊసులకి ఊపిరి పోసే సమయం వచ్చింది. 
గుండె లోతుల్లో గుట్టుగా దాగున్న గేయాలకి బాణీ కట్టే సమయంవచ్చింది.
 హృదయం అంచుల్లో ఊగిసలాడుతూన్న ఊహలన్నిటికీ ఉప్పెనలా ఎగిసిపడే సమయం వచ్చింది. 
కనురెప్పల్లో దాగున్న కలలన్నీ వేకువని చూసే సమయం వచ్చింది. 
మది సొదల్లో కథలల్లె అల్లరికి రెక్కలు వచ్చి ఎగిరే సమయం వచ్చింది. 
సమయం మర్చిపోయి నదిలా పరుగులెత్తి, అలలా ఎగిసి పడి, ఆకాశం అందుకునే సమయం వచ్చింది. 

Monday, June 16, 2014

ప్రయాణం

నేస్తం
ఎంత పరిగెత్తావు నేస్తం?
గమ్యం వెంట ఎంత వేగంగా , ఆత్రంగా పరిగెత్తావు నేస్తం?
అలసిపోయి  పరుగు  ఆపి అవలోకిన్చుకుంటే,
మనసు పొరల్లో ఆనందపు నీడల్లో  సేద  తీరదామంటే ,
అదేంటో  చిన్ననాటి చిలిపి అల్లర్లు పలకరిస్తున్నాయి.
గోదారి గాలి, కీచులాటలు,తెలుగు పద్యాలు,దూరదర్శన్ సినిమా , ఈనాడు ఆదివారం అనుబంధం మెదులుతున్నాయి.
మరి మిగిలిన కాలమంతా ఎక్కడ జారిపోయిందో?
విజయాల వేటలో మజిలీలు దాటి చాలా దూరం వచ్చాక తెలుస్తుంది, అసలీ గమ్యమో ఎండమావని చిన్ని చిన్ని మజిలీలే నిజమైన సంతోషాలని.

Friday, July 5, 2013

ఒక అమ్మ, ఒక నాన, ఒక కూతురు. అంతే స్టోరీ- II

 మా బుజ్జిదాని చిన్నప్పుడు,  నాకు నచ్చిన రెండు డ్రెసెస్ ఇచ్చి ఆ రెంటిలో దానికి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోమనే దాన్ని.అది ఒకటి బుద్దిగా పట్టుకునేది. సో చాయిస్ నాది, డెసిషన్ నా కూతురిది. వాట్  ఎ కాంబినేషన్ అని మురిసి  ముక్కలు అయిపోయేదాన్ని.అప్పటికీ మా అమ్మ అంటూనే వుండేది, ఇప్పటి నుండీ ఎందుకే దానికీ సెలెక్షన్స్ అని. వింటే బాగుపడి  సుఖపడిపోమూ !!


గొంగళి పురుగు సీతాకోకచిలుక అయినట్టు, వీక్లీ సీరియల్స్ డైలీ సీరియల్స్ గా రూపాంతరం చెందినట్టు నా కూతురు ఇండివిడ్యువాలిటీ పెరిగి పెద్దది అయ్యి నాకు పెద్ద బరువు అయ్యి కూర్చుంది ఇప్పుడు. మా బుల్లి రాకాసి నిద్ర లేచేవరకు ,  సూర్యుడు బాబాయి మా కిటికీ దగ్గరే తచ్చాడుతూ తొంగిచూస్తూ వుంటాదు. మా బుజ్జిది లేచింది అంటే చాలు, దాని అరుపులకి మరియు నా ఆర్త నాదాలకి భయపడి పక్కింటి విండోలోకి షిఫ్ట్ అయిపోతాడు . వెరీ స్మార్ట్ సూర్యుడు .

పొద్దున లేవగానే మొదలెడుతుంది పేంట్ బాలేదు, వేరే పేంట్ అని.  సరేలే "పళ్ళది ఏముంది.. ఎపుడన్నా తోముకోవచ్చు. చంటిది సరదా పడుతుంది " అని ఆ కలర్ గౌను , ఈ కలర్ పేంట్ అంటూ మన అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేస్తే తర్వాత తల రుద్దుకోడానికి మనకి నెత్తి  మీద జుట్టు వుండదు. కప్ బోర్డ్ ఓపెన్ చెయ్యడం వరకే నా పని, ఆ తర్వాత నేను నిమిత్తమాత్రురాలిని.   ఇక ఆ తర్వాత ఏం  జరుగుతుంది అనేది పూర్తిగా  మన గ్రహస్థితులు, జాతక చక్రం, రాశి ఫలాలు , న్యూమరాలజీ , రంగు రాళ్ళ ప్రభావం తదితర  అంశాల మీద ఆధార పడి వుంటుంది .

పోనీ ఏదో ఒక డ్రెస్సుతో అడ్జస్ట్ అవుతుందా అంటే లేదు. పేంట్ పాదాల్ని ఆల్మోస్ట్ కవర్ చేసేయాలి . ఏం చెప్తాము, పదహారు యూరోల అచ్చమైన తెలుగు బాలిక మరి.!! కొలతలో ఒక మిల్లిమీటరు తేడా వచ్చినా మేము యూజ్ చెయ్యము అంతే.కేప్రీస్, షార్ట్స్ వేస్తే పాదాల వరకు లాక్కుని లాక్కుని చింపి ముక్కలు చేస్తే, ఆ ముక్కలు నా వంటిల్లు శుభ్రత - పరిశుభ్రత కార్యక్రమంలో పాలు పంచుకుని వాటి జన్మని సార్ధకం చేసుకుంటున్నాయి .  పొద్దున్న లేవడంతో మొదలెట్టి, రాత్రి పడుకునే వరకూ వేరే డ్రెస్ , ఇంకో గౌను అంటూ పాటల్లో వీరోయిను బట్టలు మార్చినట్టు బట్టలు మారుస్తూనే వుంటుంది. ఈవిడగారు వాడిన బట్టలు వుతికీ వుతికీ, మావి ఉతుక్కునే టైమ్, ఓపికా రెండో లేక నేను, వాళ్ళ నాన్న మురికి బట్టలేసుకుని ఏబ్రాసోళ్ళలా తిరుగుతున్నాము.

పోనీ ఇంట్లో వున్నపుడు ఈ వీరంగం అంటే ఏదో గుట్టుగా మూల కూర్చుని ఓ గంట బాధపడి, ముక్కు చీదుకుని , గ్రీన్ టీ  తాగి, ఈ టీవీలో చంద్రముఖి సీరియల్ చూసి మళ్ళీ రీచార్జ్ అయిపోతాను.   ఈ మధ్య ఈవిడ క్రివేటివిటీ ఎల్లలు దాటి నా ప్రశాన్తతకి చిల్లులు పెడుతున్ది.సేంపిల్ కి మొన్న పింక్ కలర్ పేంట్ , ఆరంజ్ కలర్ షర్ట్ , బ్రౌన్ కలర్ జెర్కిన్, యెల్లో కలర్ స్కార్ఫ్ , బ్లూ కలర్ సాక్స్ , గ్రీన్ కలర్ షూస్ వేసుకుంటాను అంటుంది . అటు సూర్యుడు ఇటు తిరిగినా , మోహన్ బాబు మహేష్ బాబు అయినా, నాకు పద్మశ్రీ అవార్డ్ ఇచ్చినా , పొరపాటున కూడా ప్యాంటు, షర్టు, స్కర్ట్, మిగిలిన సరంజామా ఒక దానితో మేచ్  అవ్వవు. అన్నిటి కన్నా అన్యాయమైన విషయం, షూస్ కుడిది  ఒక కలర్ , ఎడమది  ఒక  కలర్ వేసుకుంటాను అంటుంది.

అప్పలమ్మకి అమ్మమ్మలా అన్ని రంగుల బట్టలు వేసుకుని  వెళ్తే "పక్కింట్లో టర్కీ వాళ్ళు, కిందింట్లో ఐర్లాండ్ వాళ్ళు, ఎదురింట్లో డచ్  వాళ్ళు ందరూ పిల్లని ఎలా రెడీ చేసిందో అని బుగ్గలు నొక్కుకుని మరీ నన్ను ఆడిపోసుకోరూ !!!" ఇలాంటి ఘనకార్యాలు చేసి, మళ్ళీ ఆ క్రెడిట్ నా ఖాతాలో వేసి అన్ని ఖండాల వారి ముంది నా ఇమేజిని ఖండ ఖండాలుగా డేమేజి చెయ్యమంటే ముందు వుంటుంది నా కూతురు .

 మా బుల్లి రాణీని రెడీ చేసే టైములో పది మంది హీరోయిన్ల కి మేకప్ వేసెయ్యొచ్చు  దానితో  "ఇది బాలేదమ్మా , అలా వేసుకోకూడదు " అని చర్చించీ చర్చించీ, విఫలం చెందీ చెందీ, జీవితం మీద విరక్తి చెందీ  చెందీ , బుజ్జమ్మ వాళ్ళ నాన్నని "ప్రాణ నాధా రక్షించండి కాపాడండి పాహిమాం పాహిమాం మీరే దిక్కు"అని  వేడుకుంటాను . వెంటనే ఆయన "ఏమో బాబు ఆ రంగులు, మేచింగ్స్ గట్రా నాకు తెలీవబ్బా" అనేసి పారిపోతారు . ఇక్కడ మేమేదో ఇంటర్నేషనల్ ఫాషన్ షోకి వెళ్తున్నాము మరి. అయినా అనకూడదు కానీ ఆ సుమతీ శతకం రాసిన  బద్దెన గారు " తప్పించు తిరుగు వాడు ధన్యుడు సుమతీ " అని కాదు " తప్పించు తిరుగు వాడు మగడు పడతీ " అని  రాయాల్సింది.

పోనీ నైట్ డ్రెస్ అయినా ఏదో ఒకటి వేసుకుంటుందిలే వదిలేస్తే అది తీసుకొచ్చి ఐరన్ చెయ్యు అంటుంది . నేను చెయ్యను పో అంటే "ఐరన్ చెయ్యూ" అంటూ సాగదీసి దబాయించి మరీ వాళ్ళ నాన్న చేత  చేయించుకుంటుంది . రాకుమారుడు ఏమన్నా కలలోకి వస్తాడేమో మరి ???

అదేమి విచిత్రమో పిల్ల ఇంత  ఆగం చేసినా  "నా కూతురు ప్రత్యేకం. తనదంటూ ఒక లోకం . తన సాటి ఇంకెవరు రాలేరండీ" అని పాడుకోవాలి అనిపిస్తుంది ఏవిటో!!!

సశేషం. ఇంకా వుంది.
ఇంకా ఇంకా వుంటూనే వుంటుంది.
 

Monday, June 24, 2013

ఒక అమ్మ, ఒక నాన, ఒక కూతురు. అంతే స్టోరీ - I

సరిగ్గా రెండేళ్ళ క్రితం అమ్మనే అయ్యానులే నీ రాకతో ఆహా ఓహో ఓహోహో అని పాడేసుకున్నాను.
అప్పుడు తెలీదు కదా, ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని.అయినా నా పిచ్చి కానీ,  నా రక్తం పంచుకుని పుట్టిన  పిల్ల కొంచెం  డిఫరెంట్గా (కొంచెమే సుమా!!)  అంటే నాలా కాక,  బుద్దిగా,  పొందికగా,  ఒద్దికగా వుంటుందా?

ఆమ్మా "దా" అంటుంది, వెంటనే ఉన్నపళాన పొయ్యి మీద పోపు, కంచంలో అన్నం, కంటి మీద నిద్ర అన్నీ వదిలేసి వెళ్ళాసిందే. వెళ్ళలేదనుకోండి, ఈ సారి ఇంగ్లీషులో అమ్మ "కం"  అంటుంది. అప్పటికీ కంచంలో  అన్నం మీదో,  టివీలో సిన్మా మీదో వ్యామోహం పడ్డామో అంతే బ్రహ్మాండం బద్దలవ్వడం అంటే ఏంటో చిన్న ట్రైలర్ రూపంలో చూపించబడుతుంది.  ఇంక చచ్చినట్టు బుద్ది తెచ్చుకుని, దాని వెనకాల తోకలా వెళ్తానా.  అమ్మ "కూర్చో" అంటుంది, కూర్చున్నానా? అమ్మ "లే" అంటుంది.  లేచానా, ఇంకో రెండు సెంటిమీటర్ల  దూరం  తీస్కెళ్ళి  మళ్ళీ "కూర్చో" అంటుంది.మళ్ళీ లే అంటుంది. మళ్ళీ ఇంకో అర సెంటి మీటరు. మళ్ళీ ఇంకో పావు సెంటిమీటరు.  ఇలా కూర్చోబెట్టి, నుంచోబెట్టి గుంజీలు  తియ్యించి మోకాళ్ళు అరిగిపోయి ఇంక విరిపోతాయి అనిపించే  స్టేజిలో నా మీద జాలేసి,. "అమ్మ ఎత్తండి" అంటుంది.  ఎత్తండి అంటే మాదేదో రాజవంశం అనుకునేరు. నా కూతురు  ఎత్తుకో  అనడానికి ఎత్తండి అంటుంది.

మొత్తానికి నేను వేరే ఆప్షన్ లేక, ఎత్తుకుంటాను. అమ్మా ఇంటి అంటుంది. ఇంటి అంటే ఇంట్లో ఏ ప్రదేశమైనా కావచు. హాల్, కిచెన్, బాల్కనీ, బెడ్రూం,యుటిలిటీ  రూం, బాత్ రూం ఏదన్నా..ఓక సుత్తి గెస్ చేసి ఏదో  ఒక చోటకి తీసుకెళ్ళాళి, మన టైం ఏజ్ యూజువల్ గా బాలేక, దాని మనసులో వున్న బొమ్మకి మేచ్ అవ్వలేదనుకోండి. అవ్వలేదనుకోండి ఏంటి అది మేచ్ అవ్వదు అంతే.  మళ్ళీ చెయ్యి చాపి ఏడుస్తూ "అదీ, ఇంటి" అంటుంది.

"అదేంటే, ఇల్లేంటే" అని లాజిక్స్ పీకడానికి ట్రై చేస్తే  వెంటనే జిమ్నాస్టిక్స్ షో ప్రారంభం అవుతుంది. ఆసక్తి వున్న వారు బేబీ సిట్టింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆ తర్వాతి పర్వసానాలకి నేను ఎంత మాత్రం బాధ్యురాల్ని కాదు. ఇంక విషయానికి వస్తే కొన్నాళ్ళు అవసరం అయితే తప్ప మనకో నోరు వుంది, నాలుక వుంది, నాలికకి పలు ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ భాషలు వచ్చు లాంటి సంగతులు మర్చిపోడం మంచిది.

కనీసం ఒక గంట అదీ ఇదీ ఇంటి బైట అని సర్కస్ చేసిన తర్వాత తెలిసే  విషయం  ఏంటంటే  ఈ గొడవ మొదలెట్టిన గదిలోనే జస్ట్  రెండు అడుగుల దూరంలో వున్న విరిగిపోయిన చీపురు పుల్లో, చిరిగిపోయిన పేపర్ ముక్క కోసమో ఈ డ్రామా కార్యక్రమం మొదలయ్యింది అని అర్ధం అయ్యి ఆయాసం వచ్చి కాసేపటకి ఏడుపు వచ్చి, ఇంకాసేపటకి నవ్వు వచ్చి,  నా కూతురు తెగ ముద్దొచేస్తుంది. మరదే పిచ్చి తల్లి ప్రేమ..

ఒక్క మాట మాత్రం నిజం ఆ అమ్మ అన్న పిలుపు ఎంత తియ్యగా వుంటుందంటే ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.

సశేషం. ఇంకా వుంది.
ఇంకా ఇంకా వుంటూనే వుంటుంది.



Wednesday, August 19, 2009

క క క కళ్ళజోడు.....

కొన్ని బంధాలు దృఢమైనవి. ఎంత దృఢమైనవంటే ఎలా చెప్తాను? భూకంపాన్ని రిక్టరు స్కేలుతో కొలిచినట్టు బంధాల దృఢత్వాన్ని అంత వీజీగా కొలవలేము. అవి అంటుకుంటె వదల్నై తుమ్మజిగురులా, బంకమన్నులా మనల్ని అలా అంటిపెట్టుకుంటాయంతే. అలాంటి ఒక విభిన్న, వినూత్న, విలక్షణ, వైవిధ్యమిన బంధాన్ని మీకీరోజు పరిచయం చెయ్యబోతున్నా. ఆ బంధమే నాదీ, నా కళ్ళజోడుదీ. నాకు నా చిన్నప్పుడు కళ్ళజోడంటే విపరీతమైన ఆరధనా భావం వుండేది.కళ్ళ జోడంటే ఎందుకంత ఆరాధనా భావమంటే

1) సినిమాల్లో లాయర్లు, మేస్టార్లు, డాక్టర్లు కళ్ళజోడు పెట్టుకునేవారు
2) మాయదారి మల్లిగాడికి, సోగ్గాడికి, దసరాబుళ్ళోడికి కళ్ళజోడు వుండేది కాదు.
3) ఎక్కువ మాట్లాడకుండా, వాళ్ళావిడ అరుస్తున్న పట్టించుకోకుండా, ఎప్పుడూ పేపర్ చదువుకుంటూ(చదువుతున్నట్టు నటిస్తూ!) అపర మేధావిలా కనిపించే పక్కింటి తాతగారికి పేద్ద, పేద్ద, బండ, బండ కళ్ళద్దాలు వుండేవి
4) అశోకుడు చెట్లు నాటించాడు, వాటి మొక్కలకి ఎంటీ రామారావు నీళ్ళు పోయించాడని చరిత్రని, రాజాకీయాలని కలిపి ఖూని చేసేస్తూ మా బుర్రలని గరిటెతో తినేసే మా సోషల్ మేస్తార్కి కళ్ళజోడు వుండేది కాదు
5) కష్టపడి నాలుగు రాసాను కదా..! కళ్ళజోడు మీద నాకున్న ఆరధనా భావాన్ని ఒప్పేసుకోవచ్చు కదా..!

పై కారణాల వల్ల కళ్ళద్దాలు మేధావితనానికి ప్రతీక, పదునైన మెదడుకి వుండాల్సిన అర్హత,చురకైన బుర్రకి ఆభరణంలాంటి వెర్రి వెర్రి నమ్మకాలతో నా తలకాయ్ నిండి పుండయిపోయింది. అలా కొన్నేళ్ళపాటు మూగగ కళ్ళద్దాలాని ఆరాధించగా, ఆరాధించగా దేవుడు నా ఆరాధనని మెచ్చి, నా మేధావితనం నచ్చి ఒక కళ్ళజోడుని ప్రసాదించాడు. ప్రసాదించడం అంటే డైరెక్టుగా కాదన్న మాట దేవుడు కదా! అందుకని నాకు బాగా తలనొప్పి రప్పించి, ఒక కళ్ళడాక్టరు దగ్గరకి పంపించి, ఆయన ద్వరా నాకు కళ్ళజోడు, నా ద్వారా ఆయనకో వంద ఫీజు, కళ్ళజోడు షాపులో కమీషన్(ఆయన కూడా బ్రతకాలిగా) ఇప్పించాడన్న మాట. అదన్న మాట సంగతి.

అప్పటిదాకా నేను మేధావిని అని గుండెల్లో గుట్టుగా వున్న ఫీలింగ్ కాస్తా కళ్ళలోంచి తన్నుకొచ్చి, కళ్ళజోడులోంచి దూసుకొచ్చేస్తుంటే అప్పుడు చూడాలి నాసామి రంగా,దానికి తోడు మా హాస్టల్లో అమ్మయిలంతా కళ్ళుజోడు పెట్టుకున్న నన్ను చూసి, తెల్సా అచ్చు ప్రొఫెసర్లా వున్నావు. భలే వున్నవు తెల్సా అంటుంటే నేనేమో ఉబ్బితబ్బిబ్బయి,ఉక్కిరిబిక్కిర ఉప్మా అయిపోయేదాన్ని.అప్పట్నుంచి ఎంత మాడెస్ట్ గా వుందామన్నా ఉత్తి మేధావి నుంచి అపర మేధావిగా ఎదిగిపోయిన ఫీలింగ్.

కొన్ని భయంకరమైన నిజాలు ఎందుకో మన ముందుకు వెంటనే రావు.కొన్నేళ్ళు మనని శునకానందంలో ముంచీతేల్చీ మళ్ళీ ముంచీ విపరీతంగా ఆనందించి అప్పుడు బయటికొస్తాయి.మెట్ట వేదాంతం ఆపి,విషయంలోకి రావచ్చు కదా అనుకుంటున్నారా? వచ్చేస్తున్నా.వచ్చేస్తున్నా. ఓరోజు పాస్ పోర్ట్ అప్లయి చెయ్యడానికిఆఫీసుకి వెళ్ళాను. నేను అక్కడ క్లెర్క్ కోసం చిరాగ్గా వెయిట్ చేస్తుంటే నా కోసం ఒక భయంకరమైన నిజం తీరిగ్గా వెయిట్ చేస్తుందని నాకసలు తెలీదు. క్లెర్క్ రాగనే వాడి చేతిలో అప్లికేషన్ ఫార్మ్ పెట్టను, వాడు అప్లికేషన్లో వున్న నా ఫొటో తీక్షణంగా చూస్తుంటే, పోనిలే ఆ ఫోటో కళ్ళజోడులొంచి దూసుకొచ్చే మేధావితనాన్ని తట్టుకోవాలంటే ఆ మాత్రం తీక్షణత అవసరంలే సరిపెట్టేసుకున్నాను. కాసేపు ఫోటో చూసాక, సరేమ్మా మీ అమ్మగారి పాస్పోర్ట్ రెడీ అవ్వడానికి ఇంకో నెల పడుతుంది అనేసాడు. అంతే కరెంట్ షాకు కొట్టిన కాకిలా కొంచెం సేపు గిలగిలా కొట్టుకుని, మౌనంగా రోదించి "సార్. అది మా అమ్మ కాదు. నేనే సారు" అని మాత్రం అనగలిగాను. ఆయనేమో బోలెడంత ఆస్చర్యపడిపోతూ నా వంక, ఫొటొ వంకా మార్చి మార్చి చూసి "తల్లీ నీకు కళ్ళజోడుందా, వుంటె అదొకసారి పెట్టుకోమ్మా" అన్నడు. నేను భయభయంగా తెసి, మొహమాటంగా పెట్టుకున్నానో లేదో వెంటనే "నీదే నీదే ఈ ఫొటొ, ఇంకా మీ అమ్మగారు అనుకున్నాను నీదేమ్మా" అంటూ ఏదో గ్రహంతర వాసుల ఉనికి తనొక్కడే కనిపెట్టేసినట్టు తెగసంబర పడిపోయాడు సోదిమొహంగాడు.

అక్కడ నుండి బయటకి రాగానే నేను మొదట చేసిన పని పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ నా ఇంటర్ రూమ్మేట్ కావ్యకి ఫోన్ చెయ్యడం."ఒసేయ్ కావ్యా నేను మీకేం అన్యాయం చేసానే?నెను కళ్ళజోడు పెట్టుకుంటే ఆంటీలా వుంటానన్న విషయం సూటిగా చెప్పకుండా, దానికి పౌడరు రాసి,మేకపు చేసి ప్రొఫెసర్ వున్నానని చెప్పి నన్ను మోసం చేస్తారా..?" అని ఉరుమే ఉలిక్కిపడెంత గట్టిగా గర్జించాను.(కొంచెం ఎక్కువయ్యింది కదా..!)

"అది కాదే నువ్వు మనం ఇంటెర్లో వున్నపుడు ఒక కథ రాసావు గుర్తుందా?" అంది కొంచెం సందేహిస్తున్నట్టు గా.నేను ఇంటెర్లో ఇంటెర్ పుస్తకాలే చదవాల్సి వచ్చేది.దాంతో బాగా బోరు కొట్టి నేనే కథలు రాసుకుని చదువుకునేదాన్ని.పాపం మా వాళ్ళకి కూడా ఫ్రతిఫలేక్ష లేకుండా నా కథలన్నీ ఫ్రీగా చదివి వినిపించేదాన్ని.ఆ రోజులు గుర్తొచ్చి తెగ సంతోషంతో గుండె బూరెలా ఉబ్బిపోయి "ఒక కథేమిటి నీ బొంద.బొలెడు కథలు రాసేదాన్ని" కొంచెం గర్వంగా అన్నను."అవునే చాలా........ కథలు.ఒక కథలో హీరో వుంటాదు.హీరోయిను వుంటుంది.వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు.విడిపోతారు.మళ్ళీ కల్సిపోతారు.కథ మొత్తం అలా విడిపోతూ కలుస్తూ వుంటారే. చివరాఖరికి అయినా కలుస్తారో లేదో గుర్తు లేదే.. ఆ కథ చదివి మీ హీరో,హీరోయినుకి కలవడం విడిపోవడం తప్పితే వేరే ఉద్యోగం సద్యోగం లేదా అని అడిగితే మీకు కధారాధన రాదు, కళాపోషణలేదు అంటూ గంట సేపు తిట్టి, అలిగి నాలుగు రోజులు కాలేజీకెళ్ళడం మానేసావు చూడు.అపుడే అందరూ కల్సి తీర్మానించేసుకున్నమే. నీకు జన్మలో నిజంగా నిజాన్ని నిజంలా మాత్రం చెప్పకూడదని." అంది.

అది విని నాకు చాలా చిరాకేసింది.అది నా కళ్ళజోడుని,నా కథల్ని,నాలో కళకారిణిని కలిపి అవమానించింది.అప్పుడే నేనో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాను.కథలు రాయడం మానేయాలని అనుకున్నానేమొనని హమ్మయ్య నుకుంటున్నరా?అబ్బా ఆశ దోస అప్పడం వడ,అది కానే కాదు,ఎలాగైనా నా కళ్ళజోడుని వదిలించుకోవాలని.

అలా వదిలించుకునే క్రమంలో కాలగర్భంలో కొన్నేళ్ళు కల్సిపోయాయి.నన్ను మాత్రం నా కళ్ళజోడు వదల్లేదు.దాన్ని మందం మాత్రం బాగా పెరిగింది. ఒక రోజు చల్లని మీటింగ్ రూములో ఓ పిల్ల మేనెజర్ ఏమి చెప్పి నాకన్నీ తెల్సు అని వీళ్ళని ఒప్పించాలా అని దీర్ఘాచనలో వున్నాడు. నేనేమో సిన్సియర్గా ఒళ్ళు మరిచి, కళ్ళు తెరిచి నిద్రపోవడం ఎలా అని ప్రాక్టిస్ చేస్తున్నను.అలా మా టీం మొత్తం ఎవరి సీక్రెట్ అగెండాతో వాళ్ళు కుస్తీపడుతున్న ఆ క్షణాన నాకొక భయంకరమైన సత్యం తెల్సింది. ఆ రూములో ఇరవై మందిలో పదిహేను మంది కళ్ళద్దలు లేకుండా వళ్ళా సొంతకళ్ళతో కళకళ్ళాడిపోతున్నారు.ఇంకాపుకోలేక నా పక్కనున్న వాడినికుతూహలంగా అడిగాను "నీకెందుకు కళ్ళజోడు రాలెదని" అని. వాడేమో జాలిగా, కోపంగా, దీనంగా, చిరాగ్గా, విసుగ్గా, అసహ్యంగా, నిరాశగా, నీర్సంగా కాసేపు చూసి (నాకు తెల్సీ మేనేజర్కి ఫ్రస్టేషన్ వెళ్ళగక్కడం అన్న విషయంమీద లోతుగా పరిశోధన చేసుకుంటున్నట్టు వున్నాడు) "నేను లెన్స్ పెట్టుకున్నా" అని చెప్పేసి శూన్యంలో తల తిప్పేసి మళ్ళీ ప్రాక్టీసు మొదలెట్టేసుకున్నడు.

ఆ దెబ్బకి ఒక కాంతి పుంజం, ఒక వెలుగు రేఖ నా కళ్ళజోడుని చేదించి నా కళ్ళని తాకగానే, నా మనసు కొన్ని వందల వంకర్లు కొన్ని వేల టింకర్లు పోయి కటకాల(లెన్స్)మీదకి మళ్ళిపోయింది.వెంటనే పతియే ప్రత్యక్ష దైవం అని చిన్నప్పుడెప్పుడో విన్న డవిలాగు గుర్తొచ్చి "ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటండీ" అని మా ఆయన్ని అడిగాను.మా ఆయనేమో "నీ ఇష్టం రా.నీకెలా చేయాలనిపిస్తే అలా చెయ్యు" అనేసారు సింపుల్గా.

అసలు "లెన్సా,ఏమొద్దు"అని చెప్తే "ఆయ్ నేను అంత ముచ్చటపడి అడిగితే వద్దు అంటారా?ఏంటంత పురుషాహంకారం,మగ దురహంకారం, ఉల్లిపాయ కారం,సూదిలో దారం అంటూ ఆవేశంతో ఊగిపోతూ మా ఆయన్ని సాధించడానికైనా ఆ పని చేసేదాన్ని.పొనీ అలా కాకుండా "కొనుక్కోరా.ఈ కళ్ళజోడులో అమ్మాయివి కాస్తా ఆంటీలా కనపడుతున్నావు.నీకు లెన్స్ బావుంటాయి.బాగా సూట్ అవుతాయి" అని నన్నో అరగంట పొగిడినా మురిసిపోయి,ఆనందంలో తడిసి ముద్దయిపోయి ఆ ఉత్సాహంలో అనుకున్నది కాస్తా చేసేదాన్ని.కానీ ఈయనగారేమో పెద్ద స్వేచ్చావాది.ప్రతీదానికీ నీ ఇష్టం నీ ఇష్టం అంటే నాకేమో మండిపోయి,అసలు నాకేది ఇష్టమో తెలీక కంఫ్యూజ్ అయిపోయి అస్సలు మీ గురించి మీరు ఏమనుకుంటారు,అస్సలు అభిరుచులు పంచుకోరా,అభిప్రాయలు ఇచ్చిపుచ్చుకోరా అంటూ ఉత్తి పుణ్యానే గొడవ పెట్టేసుకుంటాను.పాపం ఈయనకేమో తనేమంత ఘోరమైన నేరం చేసారొ అర్ధం కాక కాసేపు జుట్టు పీక్కుని "ఈ ఆడాళ్ళున్నారే!! అస్సలు అర్ధం కారు" అని తను కూడా బాగా కంఫ్యూజ్ అయిపోతారు.ఇంక ఇలా కాదని కిం కర్తవ్యం? అని బాగా ఆలోచించగా చించగా పెద్దల మాట చద్దన్నం మూట అని అర్ధరాత్రి రెండింటికి గుర్తొచ్చి మా అన్నయ్యకి మిసెడ్ కాల్ ఇవ్వగా పాపం ఏం కొంప మునిగిండొ అని వాడు మళ్ళీ ఫోను చేసాడు.

"అన్నయ్యా...................................."

"ఎంటే"

"ఎలా వున్నవురా..?"

"బానే వున్నానే..!నువ్వెలా వున్నావు?"

"ఏదో అలా.. బరువైనా కళ్ళజోడుతో భారంగా బతుకు ఈడుస్తున్నాను."

"ఏంటె బానే వున్నావా..? అయినా ఇంత అర్ధరాత్రి ఆ వాగుడేంటే..?"

"ఏంటన్నయ్య..! నా నయనాల గోడు నీకు వాగుడులా వుందా..?"

"నీ బొంద. ఏమి ఆలొచించకుండా బుద్దిగా పడుకో"

"నా ఆలొచనలన్నీ నా లోచనాల చుట్టూ తిరుగుతుంటే నిద్రెలా వస్తుందన్నయ్యా?"

"ఇంకాపు, నీకేమి కావాలో చెప్పి తగలడు. లేదంటే గుండెపోటొచ్చేట్టుంది నాకు"

"నా కళ్ళకి కళ్ళజోడు నచ్చట్లేదు. లెన్స్ కావలని అవి నన్ను పదే పడే రెక్వెస్ట్ చేస్తున్నయి. నేను నీకు గౌరవం ఇచ్చి నిన్ను అడుగుతున్నా.
బాగా అలోచించి లెన్స్ కొనుక్కో చెల్లీ సలహా ఇవ్వాలరా నువ్వు......"

"ఇంత మాత్రానికి నన్ను అడగడం దేనికే. సర్లే బాగా అలోచించి రేపు చెప్తాలే..." అన్నాడు.

"హన్నా!! ఏంటిరా రేపు చెప్పేది... నేను అల్రెడీ డిసైడ్ అయిపోయా..? రేపటినుండి కళ్ళజోడు పోయి కటకాలొచ్చె డాం డాం డాం. బై" అని డింగుమని ఫోన్ పెట్టేసా...

ఆ వీకెండ్ షాపింగ్ చేసేసి, ఆదివారం తెల్లారుఝామునే అయిదింటికే లేచి, గంటలు గంటలు కుస్తీ పడి నా కళ్ళని పీకి పాకం పెట్టేసి మొత్తానికి కొత్త లెన్స్ ఫిక్స్ చేసిపారేసా. ఎప్పుడూ పొరపాటున కూడా ఆదివారం పూట పది లోపు నిద్ర లేవని మా ఆయన్ని బాది బాది బలవంతంగా నిద్ర లేపేసి మరీ "ఎలా వున్నాను, దయచేసి ఈ విషయంలో అయినా మీ అభిప్రాయం చెప్పండి, నీ ఇష్టం అన్నరంటే మీ మర్యాద దక్కదు "అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. "ఎలా వుండడం ఏంటే.. ఎప్పటిలానే వున్నావు. అసలు ఏం డిఫరెన్స్ లేదు, సేం జిడ్డు మొకం" అన్నారు.. నాకేమో ఘోర అవమానంగా అనిపించేసి ఏడుపు మొకం పెట్టేసి "స్పెక్ట్స్ తీసేసాను, లెన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్పండి" అని కొంచెం రిక్వెస్టింగ్ మోడ్ లో అడిగాను.మా హీరో గారేమో తీరిగ్గా "ఓహ్ అవునా.." అని ఓ గంట సేపు కళ్ళు నులుముకుని, ఆవలించి, చిటికెలు వేసి, మెటికలు విరిచి, ఆ తర్వతా రెండంటే రెండు నిముషాలు నా కళ్ళల్లోకి చూసి ఓ పేరు తిరగని హిందీ సినిమా పేరు సినిమా చెప్పి,అందులో హీరోయిన్లా వున్నావన్నారు. అసలా మాటలకి ఉబ్బిపోయేదాన్నే, ఇంతలో నా కళ్లజోడు కథ గుర్తొచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా "నేను అస్సలు ఏమీ అనుకోను. నిజం చెప్పరా ప్లీజ్" అని అడిగాను కొంచెం గారంగా."నువ్విలా మొహమాటపెట్టేస్తే ఈలా చెప్పు. నిజం చెప్పలంటే ఆ సినిమాలో హీరోయినే లేదసలు. అందులో ఓ గున్నేనుగు వుంటుంది. ఈ రోజు నీ కళ్ళు అచ్చు దాని కళ్ళలానే వున్నాయి . అది కూడా నీలానే కళ్ళు తెగ చికిలిస్తూ వుంటుంది సినిమా మొత్తం" అని సెలివిచ్చారు...

అసలా ఆ క్షణంలో ఆయన్ని ఒంగోబెట్టి మరీ వీపు మీద దబీ దబీమని కొట్టాలి అనిపించింది. కానీ పతియే పత్యక్ష దైవంగా భావించే పతివ్రతలు అలా చెయ్యకూడదని గుర్తొచ్చి డ్రాప్ అయిపోయాను.....హ్మ్మ్...ప్చ్..అయ్యో పాపం..అలా నా కటకాలు అటకెక్కాయి. నా కళ్ళద్దాలు మళ్ళీ నా నెత్తికెక్కాయి.

సశేషం...
ఇదో అంతులేని కథ(వ్యధ)

Monday, June 22, 2009

బొమ్మని చూస్తే .......

దీనికి ఆ బొమ్మలుంటే చాలు, తిండి, నిద్ర ఏమక్కర్లేదు అని ముద్దుగా విసుక్కునే అమ్మ.. ఏమ్మా మీ బొమ్మల పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావా అని నవ్వుతూ అడిగే నాన్న... మీ అమ్మాయిని మా మనవడి కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేస్తావా అని వేళాకోళం ఆడుతూ ఏడిపించే ఎదురింటి తాతయ్య... అసలు నాకు ఊహ తెల్సిన దగ్గర్నుంచీ నా ప్రియనేస్తాలు నా బుజ్జి బొమ్మలే.. నేను స్కూలుకెళ్ళాలంటే వాటిని వదిలి వెళ్ళాలని బెంగ.. స్కూల్ నుంచి రాగానే వాటి ముందు వాలిపోయేదాన్ని.దాన్నే మిస్ అవ్వడం అంటారని నాకప్పడు తెలీనే తెలీదు.

ఆ బొమ్మల్ని నాన్న తాటాకులతో చేసేవారు.కొబ్బరాకులతో కూడా చెయ్యొచ్చు. కానీ వారానికే ఎండిపోయి అదోలా అయిపోయేవి. అందుకే తాటాకు బొమ్మలకే నా ఓటు. తాటాకులేమో ఓ పట్టాన దొరికేవి కావు. వున్న బొమ్మలు ఎన్నున్నా మనకి సరిపొయేవి కావు. అమ్మా, నాన్నా, ఇద్దరు బుడ్డి బుడ్డి పిల్లలు, మళ్ళీ బుడ్డోళ్ళు ఆడుకోవడానికి ఫ్రెండ్స్, తాతయ్య, అమ్మమ్మ, మావయ్యలు, పిన్నులు మరి ఇంత పెద్ద ఫేమిలీ అంటే మాటలా..దానికి తోడు వాటికేమయినా జబ్బు చేసినా(వాటితో 24*7 ఆడ్డం వల్ల శిధిలావస్థకి వచ్చేయడమన్న మాట),ఇంకా వాటికి ఏమన్నా ఏక్సిడెంట్స్ గట్రా (అంటే పక్కింటి సుధ తనకి లేవనే ఉడుకుమోత్తనంతో వాటిని చించేయ్యడం, ఎదురింటి శ్రీలక్ష్మి నా మీద కోపంతో వాటిని దొబ్బేయడం, కుదరకపొతే కాలి కింద వేసి తొక్కేయ్యడం లాంటివి) జరిగినా మళ్ళీ కొత్త బొమ్మలు రావల్సిందే.. అందుకే తాటాకుల కోసం నాన్న బుర్ర తెగ తినేసేదాన్ని. నా గోల భరించలేక నాన్నయితే పెద్ద తాటాకు కొమ్మ తెచ్చి దొడ్లో పడేసేవారు.. అయినా మనకి కరువేననుకోండి. అది వేరే విషయం.

నాకు అమ్మ చక్కగా మంచి గౌన్లు వేసి, జడేసి పూలు పెట్టి, రంగుల రంగుల పూసల దండలు, గాజులు వేసి భలే రెడీ చేసేది. మరి నేను అలానే నా బొమ్మల్ని రెడీ చెయ్యాలి కద...అందుకని చీరలు, నగలు అంటూ ఒకటే హడావిడి. ఊ అంటే, ఆ అంటే బొమ్మలకి కొత్త బట్టలు అంటావు అని అమ్మ కోప్పడేది. మరి ప్రతీ ఆదివారం బొమ్మల పెళ్ళి. పెళ్ళంటే ఫేమిలీ ఫేమిలీ మొత్తానికి కొత్త బట్టలు కావాలి కదా. ఈ
పెద్దోళ్ళున్నారే.. అర్ధం చేసుకోనే చేసుకోరు. దానికోసమని వారం మొత్తం టైలరింగ్ షాప్ చుట్టూ ప్రదక్షిణలు. మా అన్నయ్యేమో అమ్మా ఇది చిరాగ్గా ఎప్పుడూ చూసినా అక్కడే వుంటుందే అని తొక్కలో చాడీలు.అయినా మనం తగ్గుతాము ఎంటి..? పై పెచ్చు అమ్మా నెను అడిగితే టైలరబ్బాయు నాకివ్వటం లేదే, నువ్వొచ్చి రికమండ్ చెయ్యవే అని రివర్సులొ అమ్మ బుర్ర తినేసేదాన్ని.ఏ మాటకి ఆ మాట ప్పుకోవాలి.అమ్మని
బలవంతంగా తోడు తీసుకెళ్తే మంచి మంచివి (పట్టువి,జిగేల్ జిగేల్ అని మెరిసేవి) ఇచ్చేవాడు.

ఇంక నగలు.వాటి తయారీకి మన హస్తకళా ప్రావీణ్యం తెగ చూపించేసేవాళ్ళం. పక్కింటి ఆంటీ పాపం చిప్స్ కుడుతుంటే ఆ ఆంటీ పక్కన కూర్చుని సోది కబుర్లు చెప్తూ ఓ నాలుగు, పది, ఇరవై చిప్స్ గుమ్మం ముందున్న డోర్ మ్యాట్ కిందకి తోసేసి ఆ తర్వత తీరిగ్గా పేద్ద దండ (కాసుల పేర) గుచ్చి బొమ్మలకి వేసేదాన్ని. అయ్యో అది దొంగతనం కదా అనకండి. అప్పట్లో నా బొమ్మ తల్లి హృదయం దాన్ని నా బొమ్మలకి కాలవల్సినవి సమకూర్చుకోడం, సేకరించుకోడం అనేసుకునేది అన్న మాట. అదన్న మాట సంగతి. పిన్ని దగ్గర తీసుకుని గుచ్చిన మిలమిలా మెరిసే నీలం పూసల గొలుసు, ఎర్ర పూసల వడ్డాణం, రెండంటే రెండు గోల్డు పూసల మంగల సూత్రం... ఇంకా పచ్చ పూసల దండ అవన్నీ ఎంత ముద్దుగా వుండేవో!!! కాకి పిల్ల కాకికి ముద్దు అనకండి. నా బొమ్మ తల్లి హృదయం తల్లడిల్లిపోద్ది.

చెప్పడం మర్చిపోయాను. నా పెళ్ళికూతురు బొమ్మకి జడ కుడా వుండేది.నకప్పట్లో పెద్ద పెద్ద బారు జడలు వుండేవి. ఊడిపోయిన నా జుట్టుని దాచి ఆ జుట్టుతో దానికి అమ్మ జడేసింది. దాన్ని అందంగా అల్లి చివర్ని సన్నని రిబ్బన్ ముక్క కట్టేది. దానికి కూడా నాతొ పాటు రోజూ జడేయాల్సిందే. పాపం అమ్మ, నీకూ నీ బొమ్మలకి సేవలు చెయ్యలేకపోతున్ననే తల్లీ అంటూ నవ్వుతూ కోప్పడేది.పెరట్లో మొల్ల, మల్లె,
కనకంబరాలు, విష్ణు వర్ధనాలు, మందారం రేకలు ఏదో ఒకటి తెచ్చి మా హీరోయిన్ కి సింగారించేదాన్ని.

నా బొమ్మలు కింద పడుకుంటున్నాయి, వాటికి నొప్పెడుతుంది. వాటికి పరుపు కొంటావా, లేక నన్ను కింద పడుకోమంటావా అని తిక్క పేచీ పెడితే నా పోరు పడలేక,అమ్మ ఇంట్లో వున్న పాత బట్టలన్నీ పోగేసి వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి జాగ్రత్తగా బొంత కుడుతుంటే ఏదో అద్భుతం చూస్తున్న అనుభూతి, ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం. ఒకసారయితే మా చిన్నక్క నా బొమ్మలకని బుల్లి బుల్లి గౌన్లు, చిట్టి చిట్టి చొక్కాలు కుట్టి తీసుకొచ్చింది.గాల్లో తేలినట్టుందే,గుండె పేలినట్టుందే అన్నంత సంబరం. ఆ రోజు మొత్తం నా కళ్ళల్లో ఆనందం కన్నీరై ప్రవహించేసింది.వాటినే ఆనందభాష్పాలు అంటారని ఆ తర్వాత తెలుగు సినిమాలు చూసి తెల్సుకున్నానులెండి.

అలా వాటితో ఆడీ ఆడి, రాజ్య ప్రజల కోరిక మేరకు ఏడో తరగతి చదివి లోకాన్ని ఉద్దరించాలన్న వారి విన్నపంతో నా నేస్తాల్ని మా ఇంట్లోంచి పంపించేసి నా మనసులో చోటుతో సరిపెట్టుకోమనాల్సి వచ్చింది.I miss those days so much.I miss my tiny n beautiful family members so much. ఆ చిన్ని చిన్ని సంతోషాలు, చిట్టి చిట్టి బంధాలు మళ్ళీ రమ్మన్నా రావేమో!!!

Wednesday, March 25, 2009

పనిదేవుడి అనుగ్రహం సంపాదించడం ఎలా..?

పనిదేవుడి అనుగ్రహం సంపాదించడం ఎలానో నేను మీకు చెప్తాను అనుకుంటున్నారా..? అబ్బబ్బే అదంత వీజీ అయితే నేను ఈ పోస్ట్ ఇంత భారమైన హృదయంతో(అంటే బోల్డంత బాధపడిపోతూ అన్న మాట) ఎందుకు రాస్తాను చెప్పండి?అస్సలు ఈ పని దేవుడు ఎవర్రా బాబు తల పట్టుకుంటున్నారా..?అయితే మీకు ముందు నా పని కష్టాల గురించి కుంచెం నాలెడ్జ్ ట్రాన్సఫర్ చెయ్యాలి.అస్సలు అన్ని కష్టాల్లోను పేద్ద పేద్ద భయంకరమైన,భీభత్సమైన, దారుణమైన కష్టాలు ఈ పని కష్టాలు. ఫ్రిజ్జులో పాలు పెట్టు బంగారం అంటుంది అమ్మ... బంగారం అనగానే ఉబ్బిపోయి ఆనందంగా, నేను పని చెయ్యగలను అని అమ్మ నమ్ముతోంది అని గర్వంగా పాలు ఫ్రిజ్జులో పెడ్తానా..? అదేంతో తెలీదు కాని తిరిగి చూసేసరికి సగం పాలు నేల మీద, మిగతావి ఫ్రిజ్జులోనూ (మొత్తానికి అన్నీ) ఒలిగిపోతాయి.అమ్మేమో బంగారం అన్న నోటితోనే ఒక్క పని సరిగ్గా చెయ్యవు కదా...? పనికి డబుల్ పని ..ఏం పిల్లో ఏంటో అని విసుగేసుకుంటుంది. నేనేమో ఫుల్ హర్ట్ అయిపోతాను....ఇందులో నా తప్పేమి వుంది చెప్పండి?

ఇంక వంట, అదేం వంటో ఏమో, ఒక్కో వేపుడుకి ఉల్లిపాయలు ముందు వెయ్యాలి, ఒక్కోదానికి తర్వాతా వెయ్యాలి, కాసేపు సింలో పెట్టాలి, కాసెపు హైలో పెట్టాలి..కొంతసేపు మూతపెట్టాలి, కొంతసేపు తీసెయ్యాలి... ఒక్కటీ పద్దతిగా వుండదు. అదే మాట అమ్మతోఅంటే "నీ బొంద, వాటికి పద్దతి లేకపోవడం కాదు" నీకు వంటంటే శ్రద్ద లేదు అంటుంది...

అందుకే ఒకసారి పౌరుషానికి పోయి శ్రద్దగా నేర్చుకోవాలని గాట్టిగా డిసైడ్ అయ్యి అమ్మా అమ్మా ఈ రోజు నేను కూర వండుతాను, వండుతాను అని బాగా పోరాడాను....పాపం అమ్మేమో పెద్దమనసుతో "పాపం పిచ్చి మాలోకం సర్దా పడిపోతుంది. మొన్న మాడ్చింది సరే, ఈ సారైనా బాగా వండకపోతుందా" అనే ఆశవహ ధృక్పధంతో (నిజానికి నా నస హింస భరించలేక) తన వంటింటి సామ్రాజ్యపు పగ్గాలు నా చేతికిచ్చింది..మొన్న మాడ్చాను కాదా ఈ సారి ఎలా అయినా మాడ్చకుండా వండాలనే పట్టుదలతో దాన్నే చూస్తూ, కలుపుతూ, కెలుకుతూ శ్రద్దగా వండి వార్చి టేబుల్ మీద సర్దాను.

ఈలోపు నాన్న వచ్చారు.నాన్నని సప్రైజ్ చేసెయ్యాలి అన్న అవిడియాతో (వండింది నేను అని తెలిస్తే ఆకల్లేదని పారిపోతారేమోనన్న అనుమానంతో) నేనే వండానని చెప్పకుండా ఏమి చెప్తారా అని అని ఆత్రంగా పక్క రూములో వెయిట్ చేస్తున్నాను. ఇంతలో నాన్నేమో "లక్ష్మీ కూర అమ్ములు చేసిందా" అనగానే నేను చేసానని నాన్నకెలా తెల్సింది, అంత బాగా చేసానా అని ఆశ్చర్యపోయి, అనందపడిపోయి, హార్ట్ అటాక్ తెచ్చేసుకునేలోపులోనే "ఈ రోజు... అస్సలు వుడకలేదు. అందుకే అలా అడిగాను" అని గాలి తీసేసారు.నేనేమో "అమ్మ వండినపుడు కూడా అప్పుడప్పుడు సరిగా వుడకదు కదా మరి నేనే చేసానని ఎలా అనేస్తున్నావు" అని యుద్ధానికి దిగాను..నాన్నేమో నవ్వుతూ "మీ అమ్మ వండితే ఎప్పుడైనా అక్కడక్కడా ఉడకదు... నువ్వు వండితే ఎప్పుడూ ఒక్క ముక్క కూడా ఉడకదు, లేకపోతే నల్లగా మాడిమసయిపోతుంది...అయినా నీకెందుకు తల్లీ ఈ పాట్లు" అనేసి వెళ్ళిపోయారు.. నాకైతే మాకెందుకమ్మా నీ వంటలు అన్నట్టు వినిపించింది.. ప్చ్..ఏం చేస్తాము... ?

అప్పుడెప్పుడో లండన్లో వున్న మా అన్నయ్య, నిమ్మకాయల పప్పు ఎలా చెయ్యాలో అమ్మని అడుగు అని మెయిల్ పెట్టాడు. "దున్నపోతు,తొక్కలో నిమ్మకాయల పప్పు ఎలా చెయ్యాలో నాకు తెలీదు అనుకుంటున్నాడా..?అమ్మని అడిగి అని చెప్పు అని నా మేధస్సుని అవమానిస్తాడా" అని కేజీలు కేజీల రోషం వచ్చేసింది. ఆ దిక్కుమాలిన రోషంతో "ఏముంది సింపులే పప్పు వుడకబెట్టుకో,రసం తీసి పక్కన వుంచుకో,పప్పు, రసం, ఉప్పు, పోపు కలిపి పొయ్యి మీద కాసేపు వేడిచేసేసుకో,అంతే ఘుమఘుమలాడే నిమ్మకాయ పప్పు రెడీ" అని మెడ నొప్పి పుట్టేలా బాగా తల పైకెత్తి సగర్వంగా మెయిల్ పెట్టాను.

వాడు వెంటనే ఫోన్ చేసి "పప్పు,నిమ్మకాయ రసం కలిపి వేడి చేస్తే చేదుగా అయ్యి తగలడిపోద్ది..నిద్రమొహం..." అని ఫోన్ చేసి మరీ పడీ పడీ నవ్వాడు... అంత తెల్సున్న పోటుగాడు నాకెందుకు మెయిల్ పెట్టాలొ, ఎందుకు అంతలా నవ్వి నా ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టాలో..?..అంతా ప్రతిపక్షాల కుట్ర. అందుకే అంటాను రోషం, పౌరుషంలాంటి బరువైన ఎమోషన్స్ మనకంతగా సూట్ అవ్వవని.

పోన్లే వంటలాంటి సంక్లిష్ట కార్యక్రమాలు మనకి అచ్చి రాలేదులే అని చిన్న చితకా పనుల మీద చెయ్యి వెయ్యాలని ఘాటుగా, గాఢంగా (ఈ విశేషణాలు తప్పయితే తిట్టకండి, బావున్నాయి కదా అని వాడేసాను) నిశ్చయించుకుని అమ్మ గుడికెళ్ళినపుడు ఓ రోజు ఇంట్లో వున్న కూరలన్నీ తరిగేసి ఫ్రిజ్జులో సర్దేసాను... అమ్మ ఇంట్లోకి రాగానే మంచినీళ్ళ కోసం ఫ్రిజ్జు తెరవగానే ఆశ్చర్యంతో, అనిర్వచనీయమైన అనుభూతితో అలా అవాక్కయిపోయి నిలబడిపోయింది... కాసేపటకి తేరుకుని అమ్మలూ ఫ్రిజ్జులొ ఏం పెట్టావే ఏదో చెడ్డ వాసన వస్తుంది అని అడిగింది...నాకు ఆవేశం పొంగుకొచ్చేసింది... మీరెప్పుడూ ఇంతే. నెనేం పని చేసినా మెచ్చుకోరు.. ప్రొత్సహించరు.. ఇలానే పేర్లు పెడ్తారు.." అని నిప్పులు కక్కేసాను (అంటే నిజంగా నిప్పులు కక్కలేదు, గాట్టిగా గట్టిగా అరిచేసానన్న మాట) అమ్మేమో "దయచేసి ముందు నువ్వేమి ఘనకార్యం చేసావో చెప్పవే... ఆనక నీకు కావల్సింత సేపు తీరిగ్గా మెచ్చుకుంటాను" అని బతిమాలింది.

సంబరంగా మొహం పెట్టి "కూరలన్నీ తరిగి ఫ్రిజ్జులో పెట్టేసాను." అని చెప్పాను.అమ్మేమో "అమ్మో అమ్మో ఎంత పని చేసావే" అన్నట్టు సూర్యకాంతం చూపు చూసి గబా గబా ఫ్రిజ్జు మొత్తం అంతా వెతగ్గా, ఓ కవరు కనిపించింది..ఆ కవరు కనిపించగానే అమ్మ కనుబొమ్మలు ముడిపడ్డయి (అంటే సీరియస్ అయ్యింది అని అర్ధం) . ఆ కవరులో ఏముందా అనేగా మీరిప్పుడు కుతూహలపడిపోతున్నారు. ఆ టైములో నేనూ అలానే కుతూహలపడ్డాను.. అమ్మ మాత్రం బాగా కోప్పడింది. ఎందుకంటే ఆ కవర్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తరిగిపెట్టాను.... వాటి వాసనతో ఫ్రిజ్జంతా వెలగబెట్టానన్న మాట. అదీ సంగతి... ఇంక మొదలు "పనంటే ఎంత జాగ్రత్తగా చెయ్యాలి, ఎన్ని ముందు వెనకలు అలోచించాలి, ఎలా ధ్యాస మొత్తం పని మీదే పెట్టాలి" అనే అజెండాతో గట్టిగా ప్రైవేటు చెప్పేసింది...!! ఇలా ప్రైవెట్లు చెప్పేటపుడు ఏదోలే చెప్తుంది అని అటూ ఇటూ దిక్కులు చూసామా..? అయిపోయాము అన్నమాటే..వింటున్నాము అన్నా వినిపించుకోదు... ఈ అమ్మలతో ఇదే కష్టం. చిన్నప్పటి నుండి పిల్లల్ని పెంచేసి బాడీలాంగ్వేజ్ బట్టీ కొట్టేసి మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేస్తారు.

అవన్నమాట నా సేంపిల్ పని కష్టాలు. అయినా నా పని కష్టాల గురించి చెప్పుకుంటె పోతే ఇలా ఒకటా రెండా.. నేను సిన్సియర్గా చేద్దామనే అనుకుంటాను...ఇల్లు తుడిస్తే చీపురు అరిగిపోయి, విరిగిపోయినంత పని అవుతుంది.దుమ్ము మాత్రం ఎక్కడది అక్కడే వుండిపోతుంది. అట్లు వేస్తే పెనం మీద నుండి ఊడి రావు, వచ్చినా కనీసం పది పదిహేను ముక్కలు అవుతాయి...గిన్నెలు సర్దితే వీలైతే నాలుగు సొట్టలు, కుదిరితే ఎనిమిది చిల్లులు. రూము సవరిస్తే ఒకటో రెండు వస్తువులు (అంతే అంతకన్నా ఎక్కువ కాదు) పగులుతాయి. ఈ కష్టాలన్నీ నాకు పని దేవుడి అనుగ్రహం లేకపోవడం వల్లే నన్ను చుట్టుముట్టేస్తున్నాయి...పనిదేవుడ్ని ప్రసన్నం చేసుకోడానికి ఏమైనా రంగురాళ్ళు, జాతిరాళ్ళులాంటివి దొరుకుతాయేమో చూడాలి. మీకేమైనా తెల్సిన మార్గాలుంటే నాక్కుంచెం చెప్పండే..!లేదంటే మీరు కూడా మా అమ్మలాగ పనంటే శ్రద్దగా, ఓపికగా, నిదానంగా, వందనంగా చెయ్యాలని ప్రైవేటు చెప్పేస్తారా..?

Monday, September 1, 2008

ఓం రుబ్బుడాయ నమహా --- ఓం బాదుడాయ నమహా

అది నేను "జూ"నియర్ ఇంటర్ కాలేజీలో చేరబోతున్న రోజు.అంటార్టికా ఖండం నుంచి తీతువు పిట్ట నీకు మూడిందే అన్నట్టు భయంకరంగా సింగుతోంది. ఆటోవాడ్ని కాలేజీ ముందు ఆపమనగానే, వాడు సడెన్ బ్రేక్ సడెన్ గా వేసి, కాలేజి వంక అసహ్యంగా, నా వంక అత్యంత జాలిగా చూసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు.

ఫార్మాలిటీస్ అయ్యాక, మా ప్రిన్సిపాల్ నా చేతిలో ఒక పేపర్ పెట్టాడు. హాలిడేస్ లిస్టేమో అని ఆత్రంగా తెరిచిచూసాను. అది.. అది.. టైం టేబుల్. దాని సారాంశం నా భాషలో క్లుప్తంగా చెప్తా."పొద్దున్నే నాలుగింటికి లేచి ఓం రుబ్బుడాయ నమహా అనుకుంటూ రోలు చుట్టూ వందసార్లు తిరిగి, పుస్తకాలు ముందేసుకుని రుబ్బాలి. తర్వాత ఓం బాదుడాయ నమహా అనుకుంటూ రోకలి ముందు వెయ్యిసార్లు పొర్లాక క్లాసుకెళ్ళాలి. అక్కడ సారు సాంబారు, నల్లతారు కలిపితే సెలయేరు అవుతుందని బోధించినా నోర్మూసుకుని బాదించుకోవాలి. సాయత్రం మళ్ళీ ఓం రుబ్బుడాయ నమహా అని లక్షసార్లు అనుకుని సారు చెప్పినవి, చెప్పనవి, చెప్పబోయేవి, చెప్పలేనివి అన్నీ కలిపి అర్ధరాత్రి వరకు రుబ్బేయాలి.సరిగ్గా రుబ్బని మొండిపిల్లలకి క్రిమీభోజనం, కుంభీపాకం లాంటి లైటువెయిట్ శిక్షలు విధించబడతాయి".అది చూసి కళ్ళు తిరిగిపడిపోయాను.

కొన్ని యుగాల తర్వాత కళ్ళు తెరిచి "నేనెక్కడ వున్నాను. నాకేమయ్యింది" అన్నాను తెలుగు సినిమా హీరోయిన్లా.. "క్లాసురూములో వున్నావు. నువ్వు పడిపోయినా, ఈ సబ్ కాన్షస్ మైండ్ పాఠాలు వింటుందని ఇక్కడకి తీసుకొచ్చారు" అంది పక్కనమ్మాయి మెరుస్తున్న కళ్ళతో. ఇంతలో ఎవరివో ఆర్తనాదాలు వినిపించాయి. ఆ కేకలు..ఆ కేకలు ఇంతవరకు పాఠాలు విన్న నా సబ్ కాన్షస్ మైండ్వి. ..అలా మొదలయ్యాయి నా రుబ్బుడు కష్టాలు.

ఆ కష్టాలు భరించలేక క్లాసులొ నాకు తలనొప్పి వచ్చేసేది. స్టడీ అవర్స్లో చెవి నొప్పి, స్లిప్ టెస్టులొ నాకేమి రాకపోతే పంటి నొప్పి. అప్పుడప్పుడు వెరైటీ కోసం కాలినొప్పి, వేలినొప్పి, గోరునొప్పి, జడనొప్పి వగైరా వగైరా.... ఇలా నేను నొప్పులు, వాటి గొప్పలు, తప్పుగా వాడితే నెత్తికి కట్టే బొప్పులు అనే విషయం Ph.D చేసి ఝండు బాం, అమృతాంజనం వారు సంయుక్తంగా అందించే డాక్టరేట్ అందుకోబోయే సమయంలో నా కర్మకాలి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసాయి. మా ప్రిన్సిపాల్ సారు పిలిచారు. లొపలకెళ్ళగానే "ఏంటి తల్లీ.. ఇలా చేసావు. లెక్కల్లో 150 కి 160 (???) వస్తాయి అనుకుంటే 140 మాత్రమే తెచ్చుకున్నావు. ప్రాక్టీసు సరిగ్గా చెయ్యలేదా..? చెప్పు" అని కిచ్ కిచ్ వేసుకోని గరగరమనే గొంతుతో గద్దించాడు.

ఊరికే సర్దాకి చదవాలినిపించక చదవలేదని చెప్తే చీరేస్తాడని నా ఆత్మసీత హెచ్చరించింది. అందుకని ఎందుకొచ్చిన గొడవలే అని మౌనంగా వుంటే నా మౌనాన్ని అపార్ధం చేసుకుని "సర్లే తల్లీ. బాధపడకు. బెటర్మెంట్ కట్టేసేయ్. ఈ సారి మంచి మార్కులు తెచ్చుకో" అనగానే సముద్రాలు పొంగుతున్న ఫీలింగ్, భూకంపం వచ్చినంత షేకింగ్, హెడ్ బ్రేకింగ్. నేను పరీక్షలకి కష్టపడి చదివేదే ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలని. పాసయిపోయాక కూడా మళ్ళీ పరీక్ష ఎందుకు రాయాలి..? ఆ క్షణంలో నాకు అర్జెంటుగా ఆడ సన్యాసుల్లో కల్సిపోవాలి అన్నంత విరక్తి వచ్చింది.

రూముకెళ్ళి ఏం చెయ్యాలో తోచక దీనంగా కూర్చున్నా. శ్రావ్య వచ్చి " ఏంటి విద్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు" అని అడిగింది."ఏముంది శ్రావ్యా.. బెటెర్మెంట్ ఎలా ఎగ్గోట్టాలా అని" అన్నా మరింత దీనంగా మొహం పెట్టి."ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది. ఎప్పట్లానే మళ్ళీ మోకాలి నొప్పి అని చెప్పు" అంది నవ్వుతూ.ఆక్షణంలో దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తొందర్లోనే నేను సన్యాసుల్లో చేరబోతున్న విషయం గుర్తు వచ్చి శాంతం శాంతం అనుకుంటూ ఎలానో నిగ్రహించుకున్నా. "మళ్ళీ నొప్పంటే చెప్పు తీసి కొడతారే. మీరేదైనా మంచి కత్తిలాంటి జబ్బు పేరు పుణ్యం కట్టుకోండే" అని బతిమాలుకున్నా."ట్యూమరో, కాన్సరో అని చెప్పు. భయపడిపోయి ఇంటికి పంపేస్తారు" అంది నాకుమల్లే GKలో జీరో లెవెల్ కి కింద , CK(సినిమా నాలెడ్జ్)లో ఇనిఫినిటీ కి పైన వుండే రేణు."చీ నోర్ముయ్.. ట్యూమర్, కాన్సర్ అని మనం చెప్పకూడదు. డాక్టర్ చెప్పాలి.." అంది ఇంకో అమ్మాయి..ఆ లోపు Bi.P.C పిల్ల నిషా అవిడియా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది."అప్పుడెప్పుడో ఊపిరి ఆడట్లేదని మాధురి అంటే దానికి పదిరోజులు సెలెవిచ్చారు. నువ్వు ఊపిరి ఆడట్లేదని నటించు." అంది విజయగర్వంతో...

నిజం చెప్పొద్దూ.. నాకూ ఆ అవిడియా పిచ్చపిచ్చ్గగా నచ్చేసింది. నొప్పి నొప్పి అని చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. అసలే ఆలస్యం చిరంజీవి బాలకృష్ణ అని సెట్టింగ్స్, కాస్ట్యూంస్ అన్నీ చకా చకా సిధ్ధం చేసి రిహార్సల్స్ కూడా చేసేసాం. నటించడం కూడా సుళువు. గాలి కొంచెం గాట్టిగా.... గబా గబా.... పీల్చాలి అంతే. కానీ.. కానీ... ఊపిరి ఊరికే ఊసుపోక ఆందకుండా పోదని,దానికీ కొన్ని బలమైన కారణాలు వుంటాయన్న విషయం ఆ ఊపులో మ ఎవ్వరి ఊహకి అందలేదు. మనమొకటి తలిస్తే మాస్టార్లొకటి తలుస్తారని మా ఫిజిక్స్ సారు మా డ్రామా లొకేషన్ హాస్పిటల్ కి మార్చేసారు. లొకేషన్ ఏదైనా డెడికేషన్ తో చెయ్యగల సత్తా నాకున్నా బలంగా ఎత్తుగా ఎస్వీ రంగారెడ్డిలా వున్న డాక్టరుని చూస్తే కొంచెం దడ పుట్టింది.

ఆయన విషయం కనుక్కుని స్టెతస్కోపుతో నా గుండె ఇంకా కొట్టుకుంటుందని నిర్ధారించేసుకుని "పరీక్షలు ఏమైనా వున్నాయా" అని అడగ్గానే.. మేటర్ తెల్సిపోయిందేమొనని టెన్షన్ వచ్చేసి గబుక్కున స్టూల్ మీంచి జారిపడబోయాను. ఈలోగా మా ప్రిన్సిపాల్ చేతిలో ఏదో ఇంజెక్షన్ పట్టుకుని దిగాడు. "డాక్టరు గారు మా పిల్లకి ఊపిరాడటం లేదని డెరిబిలీన్ ఇంజెక్షన్ తెచ్చా. చేసేయండి." అంటుంటే ఆయన్ని ఎత్తి గిర గిరా తిప్పి అవతల పడేయాలన్నంత కోపం వచ్చింది. దిక్కుమాలిన కంగారు . అవతల డాక్టరు చూసున్నాడుగా. "ఏమీ అవసరం లేదు. పరీక్షల టెన్షన్ అంతే" అంటున్నా సరే ఆగకుండా "పర్లేదు చేసెయ్యండి. పడి వుంటుంది.అసలే వారంలో పరీక్షలు" ఆయన అంటుంటే నిషా వంక దీనంగా చూసా..అదేమో అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అన్నట్టు ఇంకా దీనంగా చూసింది.

ఈలోపు నర్స్ లైటేసింది. అవసరమైనపుడు అసలు పని చెయ్యని నా బుర్ర ఆ క్షణం అడక్కుండానే పని చేసి ఒక తొక్కలో థియరీని కనిపెట్టి చచ్చింది.. "ఆరివున్న బల్బ్ స్విచ్ నొక్కితే వెలిగింది. అదే వెలుగుతున్న బల్బ్ స్విచ్ నొక్కితే ...... ఆరిపోతుంది. అలానే ఊపిరి లక్షణంగా ఆడుతున్న నాకు ఆ ఇంజెక్షన్ ఇస్తే నా ఊపిరి... ఆగిపోతుందా" అంత వెధవ లాజిక్ వర్క్అవుట్ చేసిన నా బుర్ర మీద నాకే వెర్రి కోపమొచ్చింది. పోనీలే నా బుర్రని డైవర్ట్ చేద్దామని గోడల వంక, వాటి సున్నాల వంక చూడ్డం మొదలెట్టా. మరేమో గోడ మీద దండేసి వున్నడాక్టర్ గారి నాన్నారి ఫొటో ప్లేసులో నా మొకం కనిపించింది. నాకంత ఊహాశక్తి ఇచ్చిన దేవుడి మీద ఇంకా కోపం వచ్చింది.

ఈలోపు "మేస్టారు. మీరు కంగారుపడకండి. మై హూ నా" అని డాక్టరంకుల్ అంటుంటే ఆయన కృతజ్ఞత వరద నీరులా పొంగి పొర్లింది. "చూడమ్మా పరీక్షలు రిక్షాల్లాంటివి. మనం రిక్షాలాగేటోళ్ళమన్న మాట. అసలు రిక్షావోళ్ళు మన రిక్షా బక్కోడు ఎక్కుతాడా,బండోడు ఎక్కుతాడా, మనం తొక్కగలామా లేదా ఇలాంటి బెంగలు అసలు పెట్టుకోరు. అలాగే మనం కూడా మనం చదివెలగబెట్టిన ఒకే ఒక చాప్టర్లో నుంచి ప్రశ్నలు వస్తాయా, రావా మనం పాసవుతామా లేదాలాంటి వెర్రి సందేహాలు పెట్టుకోకూడదు. అర్ధమయ్యిందా... కాసేపు బయటికెళ్ళికూర్చో " అన్నారాయన. నాకు చిరాకేసింది. పాసయిపోయిన పరీక్ష గురించి నేనెందుకు బెంగ పెట్టుకుంటాను. కాసేపటికి మా ప్రిన్సిపాల్ బయటకి వచ్చాడు.డాక్టరంకుల్ ఏం చెప్పాడో కానీ "సర్లే తల్లీ.. ఈ పరీక్షలు గురించి పూర్తిగా మర్చిపో.. టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు" అంటుంటే నాకు డెబ్యూట్ సినిమాకే "నటీముత్యం" బిరుదు ఇచ్చినంత సంబరం వేసింది.

మొత్తానికి అలా పరీక్షల లంపటం అంత కష్టపడి వదిలించుకుని ఆటోలొ కూలబడి ఓ రెండుగంటల హైడ్రామా తర్వతా ప్రశాంతంగా, స్వేచ్చగా గాలి పీల్చుకున్నాను. అదొట్టి అనుమానపు గాలేమో, వెంటనే నాకో పిచ్చి డౌట్ వచ్చింది. "నిషా.. నాది ఏక్షన్ అని సారుకి అనుమానం వచ్చిందంటావా.." అని అడిగాను కుతూహలంగ...."నీ మొహం. ..నువ్వలా జీవించేస్తూ అరకొరగా ఊపిరి పీల్చడం వల్ల నిజంగా ఊపిరాడటంలేదేమో అని.. నాకేభయం వేసింది" అంది కోపంగా.

సరిగ్గా అప్పుడే ఆటో ఆగింది. ఆటోవాడు వెనక్కి తిరిగాడు. వాడు.. వాడు మొదటి రోజు కాలేజీలో డ్రాప్ చేసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయినోడు. "చెల్లెమ్మా. ఈ డొక్కు కాలేజీలో చదివి ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటున్నాను. నిన్ను చూస్తే గర్వంగా వుందమ్మా. ఆ ఆ రుబ్బుడు భూతం ప్రిన్సిపాల్ .......ని నమ్మించగలిగావంటే నీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. నీ రాక సీరియళ్ళకి స్వర్ణ యుగం, సువర్ణ యోగం తెస్తాయమ్మా..." అంటూ ఆటొ అన్నయ్య ఊగిపోతుంటే ఆ షాకుకి నాకు నిజంగానే ఊపిరాడటం మానేసింది.

Thursday, August 7, 2008

నేనుగానీ..బొమ్మగానీ..గీసానంటే..!

బొమ్మలు గియ్యడానికి ఓ తెల్ల కాగితం, ఓ HP పెన్సిల్, నటరాజ్ రబ్బరు, అప్సరా మర వుంటే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా..? ఎంత అమాయకులండి మీరు.. అలా ఎలా అనేసుకుంటారు? వీటితోపాటూ సమాజం అందించే ప్రోత్సాహం, గుర్తింపు కూడా కావాలి...ఈ సమాజం వుందే, అది కొంచెం విచిత్రమన్న మాట.దానికి ఇష్టం లేకపోతే మనలో అడవి బాపిరాజు/రాణి, రవి వర్మ/వర్మిణి వున్నా సరే కావాలనే అన్యాయంగా గుర్తించదు... నా విషయంలో అదే... అదే.. జరిగింది.

నాకో జీవితాశయం వుండేది/వుంది/వుంటుంది. అదే జనాల దిమ్మ తిరిగి, కళ్ళు చెమ్మగిల్లి, సంతోషంతో సొమ్మసిల్లేలా చేసే ఒక్క బొమ్మైనా ఈ జన్మలో నేను గియ్యగలగాలి. . అలాని నేను ఊరికే కలలు కని ఊరుకునే అమ్మాయిని కాదు. నేను గీసిన కుక్క నక్కలా వున్నా, నక్క కుక్కలా వున్న సరే నా కలల్ని నిజం చేసుకోవాలనే గట్టి పట్టుదల వున్నదాన్ని. అందుకే ఎనిమిదో తరగతిలో వుండగానే (అబ్బో అంత తొందరగానా అనకండి. దిష్టి తగులుతుంది) నా మొదటి ప్రయత్నంగా రాత్రిపగలూ కష్టపడి కత్తిలాంటి ఓ బొమ్మ గీసాను. ఓ చిన్న పూరిల్లు, ఉదయిస్తున్న సూర్యుడు, రెండు కొబ్బరి చెట్లు, ఇంటి ముందు సన్నగా ప్రవహించే ఓ ఏరు..! ఓస్ ఇదా.. నేను ఒకటో తరగతిలో గీసాను అనకండి.నాలో వున్న కళాకారిణి హర్ట్ అవుతుంది. ఆ బొమ్మ చూడగానే మా అమ్మ పొంగిపొరలుతున్న పుత్రికోత్సాహాన్ని తనలో దాచుకోలేక పంచుకోవడానికి పక్కింటికెళ్ళింది.నాకు తెల్సు నన్నావిడ పొగడ్తలతో ముంచేస్తుందని... అలా అని ఆవిడ ముందు నుంచుంటే ఫ్రీగా పొగడలేదు కదా.. అందుకని గోడ పక్కన నుంచున్నాను...ఆవిడ ఆ బొమ్మని పరీక్షగా చూసి "బావుంది.. ఈ మర్రి చెట్లు బాగా గీసింది" మర్రి చెట్లా... అవెక్కడ వున్నాయి..? అయినా పొడుగ్గా, సన్నగా వుండే కొబ్బరి చెట్లెక్కడ..?పొట్టిగా, గుబురుగా వుండే మర్రి చెట్లెక్కడ..? మరీ విడ్డూరం కాకపోతే.. ఈ సమాజం అంతే.. ముఖ్యంగా మా డ్రాయింగ్ మేడం. ఆవిడకి బాగా బొమ్మలెయ్యడం వచ్చని, అందుకే పిలిచి ఉద్యోగం ఇచ్చారని బాగా గర్వం...

ఒకసారి నా సృజనాత్మకతకి బాగా పదును పెట్టి అరటి పండుని గీసుకెళ్ళి చూపించానా..? పదికి రెండేసింది..నేను ఊరుకుంటానేంటి..? ఏంటింత అన్యాయమని ప్రశ్నించాను.. "అది అరటిపండులా వుందా అసలు..? అక్కడక్కడ ఉబ్బిన సైకిల్ ట్యూబులా వుంది. అయినా అరటి పండు ఎక్కడైనా ఎర్ర రంగులో వుంటుందా..? మళ్ళీ ముచ్చికకి ఆకుపచ్చ రంగు..కింద బొడిపకి నీలం రంగు.. ఎన్ని రంగులుంటే అన్నీ పూసేస్తావా..?" అని అవమానించేసి నా క్రివేటివిటీని అర్ధం చేసుకోకుండా వ్యర్ధం చేసేసింది.

ఇకపోతే ముగ్గులు.. ఎవరు చెప్పారసలు..ముగ్గంటే నాలుగు వైపులా ఒకేలా వుండాలని.. చుక్కలు సమాన దూరంలో వుండాలని.. పోత పోస్తే సన్నగా, నాజూగ్గా వుండాలని..ముగ్గుకి కూడా ఇన్ని రూల్సా..? నా ముగ్గు అయితే వెరైటీగా రెండు పక్కలా రెండు రకాలుగా, మూడో పక్క వేరే విధంగా, నాలుగో పక్క ఇంకో విధంగా చాలా బావుండేది. పోత కూడా ఒకచోట సన్నగా, ఒకచోట లావుగా చాలా డిఫరెంటుగా వుండేది. అయినా ఏ పనైనా కొత్తగా చేస్తే ఈ సుత్తి జనాలకి నచ్చుతుందేంటి..? మా అమ్మయితే మరీను "ముగ్గు కింద బై "శ్రీవిద్య" రాసుకోవే. లేకపోతే నేను పెట్టానేమో అనుకుంటున్నారు" అనేది. అర్ధం చేసుకోరూ......

అలా అలా సమాజం దృష్టిలో నేనో మంచి చిత్రకారిణిగా గుర్తింపబడాలని గట్టి పోరాటం చేస్తుండగా పదోతరగతి పరీక్షలు వచ్చేసాయి. మా జీవశాస్త్రం మేడం పిలిచి "శ్రీవిద్యా.. నీ మీద మన స్కూలు మొత్తం చాలా ఆశలు పెట్టుకున్నాము. పరీక్షల్లో మేటర్ మొత్తం బ్రహ్మాండంగా రాస్తావు.. బొమ్మలు మాత్రం మరీ ఎవరూ గుర్తుపట్టకుండా వేస్తావేంటసలు..? ఈ విషయం మీద కొంచెం శ్రద్ద పెట్టు తల్లీ.." అంది. ఆ క్షణంలో నా గుండె ఎన్ని ముక్కలు, చెక్కలు అయ్యిందో నేనే లెక్కపెట్టలేకపోయాను.ఆ రోజు అర్ధరాత్రి రెండుగంటల ఇరవై రెండు నిముషాల రెండు సెకన్లకి నా టాలెంటుని గుర్తించని సమాజం అంటే పిచ్చ కోపమొచ్చింది.ఇంక జీవితంలో బొమ్మలెయ్యకూడదని ఒక సంచలనాత్మకైన నిర్ణయం తీసుకున్నాను. అలా ప్రపంచం మొత్తం గాఢనిద్రలో వుండగా తనకి తెలీకుండానే ఓ గొప్ప చిత్రకారిణిని కోల్పోయింది.

ఇక పరీక్షల్లో ఎలా..? అందుకే "బాగు చెయ్యి-బాగుపడు" అనే సూత్రాన్ని ఫాలో అయిపోయా.. పరీక్షల్లో నా పక్కబ్బాయి అంత బాగా చదవడు. బొమ్మలు కూడా నా అంత స్టైలుగా, డిఫరెంటుగా గియ్యడం రాదు. ఏదో వున్నదున్నట్టు గీసేస్తాడు అంతే.. వాడి దగ్గరకి వెళ్ళి "ఒరేయ్ బాబు.. నీకు మొత్తం అన్ని సబ్జెక్ట్లు బిట్లతో సహా చూపిస్తాను. స్కూల్ ఫస్టు నా బదులు నీకొచ్చేసినా అస్సలేమనుకోను. నాకు మాత్రం నువ్వేసే బొమ్మలు చూపించి గట్టెకించు తండ్రీ" అని ఓ ఒప్పందాన్ని పకడ్బందీగా కుదుర్చుకున్నాను.

వాడు అప్పుడప్పుడు "నాకు మెడ నొప్పెడుతుంది. చాల్లే" అన్నా సరే తెలుగు నుంచి లెక్కల వరకూ అన్నీ జాగ్రత్తగా కాపీ కొట్టించాను. ఎదురుచూసినరోజు రానే వచ్చింది. అది నేను కాపీ కొట్టాల్సిన రోజు. చేతులు వణుకుతుంటే పేపర్ నెమ్మదిగా వెనక్కి తిప్పాను.. తీరా చూస్తే "ఉమ్మెత్త ఆకు నిర్మాణం గీసి భాగాలు గుర్తించుము" అని వుంది. అది చూడగానే నా మెదడులొ లైటు వెలిగింది. ఆ వెలుగులో ఉమ్మెత్తా ఆకు, గుర్తించాల్సిన భాగాలు మిలా మిలా మెరిసిపోతూ కనిపించేసాయి. అది చూసి అప్పటిదాకా నాలో అలిగి నిద్దరోతున్న చిత్రకారిణి నిద్రలేచింది. "వీజీ బొమ్మే కదా..నేను గీస్తా, గీస్తా" అని సరదాపడింది."సరే" అన్నా.. అయినా నా పిచ్చిగానీ నాలా మోడర్న్ ఆర్ట్ చేతిలో వున్నవాళ్ళకి మామూలుగా గియ్యడం ఎలా వస్తుంది.. ఎంత కష్టపడ్డా నా బుర్రలొ వెలుగుతున్న ఉమ్మెత్తకి, నా పేపర్ కనపడుతున్న ఉమ్మెత్తకి పోలికే కనపడలేదు. మెదడులో టింగుటింగుమంటూ మెరుస్తున్న అయిదు భాగాలు ఎక్కడ గుర్తించాలో అర్ధం కాక జుట్టు పీక్కుంటూ పక్కకి తిరిగాను. నా పక్కబ్బాయి నీ ఋణం తీర్చుకోనీ.. నా పేపర్లో కాపీ కొట్టు అన్నట్టు దీనంగా మొహం పెట్టి పేపర్ నా వైపు తిప్పి వుంచాడు. మరీ కళ్ళతో అంతలా బతిమాలేస్తుంటే కాదనలేకపోయా.. సరే అని చూసి గీసేసా..

పదో తరగతి రిజల్ట్స్ వచ్చాయి..నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. అది కాదు నా బాధ.. నా పేపర్లో చూసి కాపీ కొట్టినోడికి సెకండ్ క్లాసు వచ్చింది. అదీ ఫస్ట్ క్లాస్ ఒక్క మార్కులో పోయింది.వాడు నా దగ్గరికి వచ్చి "థాంక్స్. ఈసారి పరీక్ష పోతుందనుకున్నాను. నీ వల్ల 359 మార్కులు వచ్చాయి. అసలు NS కూడా చూపిస్తే తప్పకుండా 360 దాటేవి. నీకేమో ఆ బొమ్మ గీసి చెరపడంతోనే సరిపోయింది. అయినా నీకు బొమ్మలు గియ్యడం రాదని తెలీదా..? తెల్సీ అలా చేస్తావా..?" అనేసి వెళ్ళిపోయాడు. చీ ఎదవ జీవితం.. అయినా నాకు తెల్సు నాలో వున్న అపరిమితమైన టాలెంటుని, అర్ధం కాకుండా అద్భుతంగా గీసే మోడర్న్ ఆర్టుని ఈ పిచ్చి సమాజం ఎప్పటికీ గుర్తించలేదు. అందుకే ఎప్పటికైనా నేనూ ఈటీవీ సుమన్ లా ఒక టీవీ పెడతా.. నా బొమ్మలకి నేనే గుర్తింపు తెచ్చుకు తీరతా........!

Thursday, July 31, 2008

నేను స్కూలుకెందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే........!

చదువు వచ్చి మన మీద పడినా మనం వెళ్ళి చదువు మీద పడినా మనకే నష్టం.
చదువు రాకపోవటం ఒక యోగం
చదువుకోనక్కర్లేకపోవటం ఒక భోగం
చదువుకోవాల్సిరావడం ఒక త్యాగం
*************************************************
చిన్నప్పుడు ఇలా పైత్యం కలిపిన కపిత్వాన్ని చెప్పేంత తెలుగు రాదాయే... అందుకే బడి అన్న మాట వినగానేకాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ, కింద పడి దొర్లేస్తూ చదువు మీద నా నిరసనని తీవ్రంగా తెలిపేదాన్ని. అయినా సరే ఏ మాత్రం జాలి లేకుండా మా నాన్న ఎత్తి ఏట్లో పడేసినట్టు ఎత్తుకుని మరీ బళ్ళో పడేసేవారు.అదీ కాకుండా, మా అన్నయ్యకి ఎప్పుడూ వంద జ్వరం వుండేది. అందుకే ఎవరైనా మీ అన్నయ్య స్కూలుకెందుకు వెళ్ళట్లేదని అడిగితే "మరేమో మా అన్నయ్యకి జ్వరం ఇంచక్కా" అని చెప్పేదాన్ని. మా అమ్మేమో "చీ తప్పు ఇంచక్కా అనకూడదు. మా అన్నయ్యకి జ్వరం పాపం అని చెప్పాలి" అని కోప్పడేది.

అప్పటికీ తెలివిగా పొద్దున్న లేవగానే "అమ్మోయ్.. అమ్మోయ్..! నాకు జ్వరం వచ్చేసింది. నేను స్కూలుకెళ్ళను" అనేదాన్ని. వెంటనే నాన్న వచ్చి "బాబోయ్.. బాబోయ్ జ్వరమా అమ్మలు" అని ధర్మామీటరు తీసుకొచ్చేసేవాళ్ళు. ఆ దొంగ ధర్మామీటర్ ఎప్పుడూ అన్నయ్య పార్టీనే..వాడికి పాపం (ఇంచక్కా) 100 జ్వరం చూపించేది. నాకు మాత్రం అస్సలు జ్వరమే లేదని చూపించేదాన్ని. జ్వరం వుందని చూపించవా.. చూపించవా అని బతిమాలినా సరే చూపించేది కాదు. అందుకే దాని మీద బోలెడు కోపం వచ్చేసి డామ్మని కింద పడేసాను. అప్పుడు నాన్న "అల్లరిపిల్లకానా..! నీకు గారం ఎక్కువయిపోయింది. అసలు చెప్పిన మాట వినట్లేదు. పద స్కూలుకి" అని కళ్ళెర్రచేసి నన్ను భయపెట్టేసారు.

ఇంక అప్పట్నుంచి పోనిలే అని వాళ్ళ కోసం స్కూలుకెళ్ళేదాన్ని. అప్పుడు కూడా నా అభిప్రాయాలకి విలువిచ్చేవాళ్ళు కారు. "స్కూలుకెళ్ళడానికి నాకు బలం కావాలి. గిన్నెలో వున్నదంతా నా ప్లేట్లో పెట్టేయ్. మొత్తం నేనే తింటాను" అని గాట్టిగా ఏడ్చినా సరే అమ్మేమో "నువ్వు తినవు. ఏడ్వవు. అంతా ఎంగిలి చేసి అక్కడ పెడతావు." అని కొంచెమే పెట్టేది.
స్కూలుకెళ్ళాక బోలెడు సమస్యలు, ఆకలేస్తే బొటనవేలు నోట్లో వేసి చీక్కూడదు. నిద్రొస్తే బరా బరా బుర్ర గోక్కోకూడదు. ఇంకా తిక్క లేస్తే పక్కన కూర్చున్న పిల్లని గట్టిగా గిల్లకూడదు. నెమ్మదిగా కూడా గిల్లకూడదు అనుకోండి. పలకం, బలపం అరిగిపోయి, చేతులు నొప్పెట్టేవరకూ అక్షరాలు దిద్దుతూనే వుండాలి.ఒకసారి అలానే ఏదో దిద్దుతున్నాను. ఈలోపు మేస్టారు బయటకి వెళ్ళారు. ఎందుకో నా పక్కన పిల్ల నన్ను గిల్లుతుందేమోనని అనుమానంగా అనిపించింది. అందుకే ముందుజాగ్రత్తగా నేనే గట్టిగా గిల్లేసాను. అదేమో మేస్టారు చూసేసారు.

"ఓయ్ అమ్మాయి పలక తీసుకుని ఇటు రా.." అని పిలిచారు. వెళ్ళాక, పలక తీసుకుని దాని మీద అక్షరాలన్నీ చెరిపేసి " నేను దిద్దించిన అక్షరాలు ఇప్పుడు చూడకుండా రాయి" అన్నారు. నాకేమైనా భయమా..! గబా గబా రాసేసి ఆయనకి చూపించాను. "ఏంటివి" అని అదిగారు. ""అ ఆ"లు అని చెప్పాను ధైర్యంగా. "అక్షరాలు రాయమంటే పిచ్చి గీతలు గీస్తావా..? మొద్దు పిల్ల. చెయ్యి పెట్టు" అన్నారు. చెయ్యి పట్టాక స్కేలిచ్చుకుని టపీ టపీమని రెండు కొట్టారు. దాంతో మేస్టారి మీద కోపం వచ్చి ఆ రోజంతా ఏడుస్తూనే వున్నా..అమ్మకి చెప్తే అయ్యోపాపం అనకపోగా "నువ్వు బాగా చదువుకోవాలి అని కొట్టారు." అంది.నన్ను మొద్దు పిల్ల అన్నారన్నా పట్టించుకోలేదు. వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదని ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను.చించగా చించగా బంగారంలాంటి అవిడియా బుర్రలోకి వెలిగేసింది......

మర్నాడు అమ్మ చూడకుండా నా పుస్తకాల సంచీలో కొన్ని బొమ్మలేసుకుని బుద్దిగా స్కూలుకి బయదేరేసాను. మా ఇంటి సందు దాటి, కొంచెం దూరం నడవగానే సుధ పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చింది. వాళ్ళింట్లోకి వెళ్ళాను. సుధ పిన్నితో "పిన్నీ నాకు బోల్డు జ్వరం. అమ్మ మీ ఇంటికెళ్ళి గిరీషుతో(వాళ్ళ రెండేళ్ళ బాబు) ఆడుకొమ్మంది" అని చెప్పాను. ఇంచక్కా నా బొమ్మలతో,ఆ బాబుతో ఆడుకుని నా తెలివితేటలకి మురిసిపోతూ, ఎగురుకుంటూ ఆనందంగా స్కూలు వదిలే టైముకి ఇంటికొచ్చేసాను. ఆ ప్లానేదో భలే వుందనిపించేసి,రోజూ వెళ్ళిపోతే పిన్నికి అనుమానం వస్తుందన్న భయం కూడా లేకుండా, రెచ్చిపోయి రెండో రోజు కూడా వెళ్ళిపోయాను.కానీ ఆ రోజే నా జీవితం ఒక దారుణమైన మలుపు తిరగబోతుందని నాకు తెలీదు..తెలిస్తే వెళ్ళేదాన్ని కాదేమో..! ఇంటికెళ్ళేసరికి అమ్మ గుమ్మం దగ్గరే నుంచుంది.

ఎత్తుకుని డైరెక్టుగా చీకటి గదిలోకి తీసుకెళ్ళింది. నాకు విషయం అర్ధమయ్యేలోపే "అబద్దాలు ఆడతావా..? అబద్దాలు ఆడి స్కూల్ మానేస్తావా..? అని చేతుల మీద, కాళ్ళ మీద, వీపు మీద ఒకటే బాదుడు. అసలే నాకు తెల్సీ మా అమ్మ కొట్టడం మొదటిసారి, దెబ్బలు తప్పించుకోవడంలో పెద్దగా అనుభవం లేదు. అందునా చీకటి గది. నెక్స్ట్ దెబ్బ ఎక్కడ పడుతుందో ఊహించి చేతులు అడ్డు పెట్టుకుంటూ, మెలికలు తిరిగిపోతూ,గాట్టిగా ఏడుస్తూ కాసేపు డిస్కో డాన్సే డిస్కో డాన్స్. కాసేపటకి నీరసం వచ్చి డాన్స్ ఆపేసి, ఏడుపు మానేసి, తప్పు ఒప్పేసుకుని "ఇంకెప్పుడూ స్కూల్ మానను. అబాద్దాలు ఆడను. ఇంక కొట్టద్దమ్మా..!" అని బతిమాలటంతో బతికిపోయాను.

అలా నా మాస్టర్ ప్లానులోని ఒక బుల్లి ఫ్లా వల్ల,సుధ పిన్ని నాకు చేసిన అన్యాయం వల్ల, స్కూలో జైలులా, చదువో కష్టాల చెరువులా ఎంత అనిపించినా మా అమ్మ వీర ఉతుకుడుని దృష్టిలో వుంచుకుని అప్పట్నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్దిగా స్కూలుకెళ్ళాల్సి వచ్చింది పాపం నేను......

Saturday, July 12, 2008

రాజులనాటి కారులో జోరుగా హుషారుగా....!

మా టీములో "మా ఇంటికొస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేం పెడతారు" టైపులో ఓ సోది సాంప్రదాయం వుంది. కొత్తవాళ్ళంతా పాతవాళ్ళతో కల్సిపోవాలంటే పార్టీ ఇచ్చి తీరాలట. పార్టీ ఇచ్చి మరీ కొత్త పోగొట్టేసుకుని పాతబడిపోయి పని మొత్తం నెత్తిన రుద్దించుకోవడానికి నేనేమైనా చిన్నదాన్నా..? చితకదాన్నా..? కాదు కదా... అయినా సరే ఏమాత్రం భయ్యం,బత్తి లేకుండా వాళ్ళంతట వాళ్ళే అలుసు, బచ్చలి పులుసు తీసేసుకుని పార్టీకి మాంచి(?) ముహూర్తం పెట్టేసారు.
***
డబ్బులు, మబ్బులు, సబ్బులు ఎక్కువ కాలం వుండవు.అలాంటి అశాశ్వతమైన వాటి కోసం అనవసర హైరానా పడితే మాత్రం లేనిపోని జబ్బులు వస్తాయి.జరగాల్సింది జరగక మానదు.వదలాల్సింది వదల..కా.. మానదు. అందుకే వదిలించుకోవడాన్ని, విదిలించుకోవడాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించగలగాలి. అదే జీవిత పరమార్ధం.ఇదే ఈ విద్యా అమ్మాజీ ఉపదేశం. సందేశం. ఆదేశం. పాటించండి. సంతోషంగా జీవించండి.
***
అసలే నా సబ్బుల ఫిలాసఫీకి నేనే ఏకైక ఫాలోయర్నాయే..అందుకే బుద్దిగా బిల్లు విషయం మర్చిపోయి,పార్టీ పేరుతో పని ఎగ్గొట్టి షికారుకెళ్ళడం,రెస్టారెంటులో పీకల దాకా మెక్కడం, తిని తిరిగి అలిసిపోయి ఆఫీసుకొచ్చి సీట్లో అడ్డంగా పడి నిద్దరోవడం. ఇలా మంచి మంచి ఊహల గుంపుని ఆస్వాదిస్తున్నాను.వాటిని చెదరగెడుతూ మా టీం లీడ్ వచ్చాడు."శ్రీవిద్యా, మన టీములో ముగ్గురికి కార్లున్నాయి. మేము పదిమందిమి రెండు కార్లలో ఇరుక్కుని,సర్దుకుని,కష్టపడి రెస్టారెంటుకి వచ్చేస్తాము. నువ్వు, చందూ(ఇంకో అమ్మాయి) మాత్రం విశాలంగా, ఫ్రీగా ఇంకో కారులో రండే." అనగానే ఆ మాకోసం వాళ్ళు చేస్తున్న "త్యాగానికి" మా మనసు కరిగి నీరై వరదగా మారి మా ఆఫీసుని ముంచేయ్యబోతుంటే "సీనియర్ మేనేజర్ మీటింగు నుంచి బైటకి రాగానే, ఆయనతో కల్సి వచ్చేయండే.. ఇంచక్కా(!)" అని బాంబు పేల్చాడు. ఆ ఇమానమంత ఇశాలమైన కారు "SM"దా..? ఆయనతో రావాలా..? అంతే దెబ్బకి కరిగిన మనసు గబ గబా భయంతో బిగుసుకుపోయింది.ఇశాలం ట్రాపులో అంత దారుణంగా ఇరుక్కుపోయాక ఏం చేస్తాం..? ఆయన కోసం మా ఎదురుచూపులు ఫలించి, ఆయన లోపల చర్చలు ముగించేసరికి , ఓ గంట మా కళ్ళ ముందే కర్పూరంలా కరిగిపోయింది.ఈ పెద్దతలకాయలు వున్నాయే, వాటికి మాలాంటి బుడ్డి తలకాయల మనసు ఎప్పటికీ అర్ధం కాదు. ఎంత సేపు పని.. పని.. పని...హు..

కారు దగ్గరికెళ్ళగానే, మా టీం మొత్తం కల్సికట్టుగా మా కోసం త్యాగం చేసేసిన ఆ అద్భుతమైన కళాఖండాన్ని చూడగానే కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు అర్జెంటుగా టపా టపా రాలిపోయాయి.ఆ కారు బంగారు, మా మేనేజరు గారి నాన్నగారిదట. మారుతీ కంపనీ వారి మొదటి మోడలట. ఏది పట్టుకుంటే, ఏది ఊడిపోతుందో అని భయంభయంగా డోరు తీసి చా..లా.. జాగ్రత్తగా లోపల కూర్చున్నాను. అవసాన దశలో వున్న సీట్లు, కారు పార్టులు, నట్లు, బోల్టులు అన్నిటినీ తనివితీరా మళ్ళీ మళ్ళీ చూసాను.రేప్పొద్దున్న దీన్ని ఏ లండన్ మ్యూజియంలోనో పెట్టేసారనుకోండి.అప్పుడు చూడ్డానికి మన ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అందుకే ఇప్పుడే ఫ్రీగా చూసేసాను. ఎన్ని తెలివి తేటలో కదా..! దిష్టి కొట్టకండే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కారు హుషారుగా వెళ్తుంది.కానీ.. కానీ.. ఆరిపోయే దీపానికే వెలుగెందుకు ఎక్కువ..? తుఫాను ముందు ఎందుకంత ప్రశాంతత..? డబ్..డబా..డబా..డబ్.. కచా.. ఇచా.. లబా.. టకాల్..డిమేల్..డబా.డబా.....ఎందుకంత డబడబలాడించుకుంటూ బండిని నడుపుతావని పక్కనున్న స్కూటరోడుని చిరాగ్గా చూసాను.ఆ సంగీతం మీ పుష్పక విమానం నిర్వాకమే తల్లీ అని నా వంక ఇంకా... బోల్డంత చిరాగ్గా చూసాడు.

ఇంక నాన్న గారి బుజ్జిముండ డబడబలు భరించలేక ఒక పక్క కారుని ఆపి, ఏదో ఒకటి చేద్దామని చూసి ఇంకేమీ చెయ్యలేక ఆటో కోసం ఎదురు చూపులు మొదలెట్టాము.ఈలోపు మా SM ఒక పేద్ద బండరాయిని తీసాడు. హ్హా.. హ్హా..హెహ్హే... నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందం కారుని ఎవ్వరూ ఎత్తుకెళ్ళకుండా ఇంజన్ని రాయితో కొట్టడం గుర్తొచ్చింది. కానీ ఎప్పట్లానే మా అంచనాలని తల్లక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకుని సూటిగా మా వైపుకి వస్తున్నాడాయన. పగలకి ప్రతీకరాలకి సమయమా ఇదీ.నేను చెప్పిన పని చెయ్యను, సాకులు చెప్పి పని ఎగ్గొడ్తాను, పని చేస్తున్నట్టు ఏక్ట్ చేస్తాను. చేసిన కూసింత పని కూడా సవ్యంగా చెయ్యను. అంతమాత్రానికే బండరాయితో బుర్ర పగులగొట్టేస్తారా..? మాళ్ళీ నా అంచనాలని తలక్రిందులు చేస్తూ ఆ రాయి తీసుకెళ్ళి వెనక టైరుకి అడ్డంగా పెట్టారు,నాన్న గారి చిట్టికొండని ఎవ్వరూ గుద్దేయకుండా.. నాకు మల్లే తెలివితేటలు ఎక్కువ ఆయనక్కూడా..

అక్కర్లేనపుడు బస్సులు, ఆటోలు బొయ్యి బొయ్యిమంటూ హారన్ మోగించుకుంటూ రయ్యిరయ్యిమని తెగ తిరగేస్తాయి. ఆ రోజు మాత్రం రోడ్డు మీద మేము ముగ్గురం, చుట్టూ చెట్లు,గుట్టలు తప్పితే వేరే ఒక్క పిట్ట కూడా లేదు.ఈ లోపు ఏ దేవదూతలో పంపినట్టు భాషాలో రజినీలా, ఆటో డ్రైవర్లో నాగార్జునలా, హీరోలకే హీరోలా ఒక ఆటోవాడు వచ్చాడు. బంజారాహిల్స్ వస్తావా అని అడిగాము. మమ్మల్ని చూసాడు అసహనంగా. ఆగి వున్న కారుని చూసాడు ఆరాగా. మా మెళ్ళో వేళ్ళాడుతున్న ఐడెంటిటీ బిళ్ళలని చూసాడు ఆశ్చర్యంగా...వెంటనే ఏదో అర్ధమైనవాడిలా తల ఊపుతూ వంద అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ.. రెండు సందులకి వందేమిటి నాయనా అన్నాము. అంత దగ్గరయితే నడిచివెళ్ళండి అన్నాడు మీళ్ళో బిళ్ళలని తీక్షణంగా చూస్తూ..ఛీ ఛీ ఈ మెళ్ళో బిళ్ళల బదులు పాములేసుకుని తిరగడం నయం . చేసేదేమీ లేక నీవే మాకు దిక్కిప్పుడు అని గాట్టిగా మొక్కి, ఆటోలో కూలబడి అయ్యవారికి వంద దక్షిణగా సమర్పించుకున్నాము. అయినా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే ప్రతీవాడికీ లోకువే..పది రూపాయల సరుక్కి వంద లాగుతారు.మనలో మన మాట ఆఫీసు బయట ఆ బిళ్ళేసుకుని ఫొజులు ఇవ్వమాకండే.పర్సు ఖాళీ అయిపోతుంది జాగ్రత్త.

అలా పడుతూ లేస్తూ కాళ్ళీడ్చుకుంటూ నీరసంగా రెస్టారెంటుకెళ్ళేసరికి మా ముందెళ్ళిన పదిమంది మస్తుగా కుమ్మేసి,ఆవలించుకుంటూ, ఈగలు తోలుకుంటూ సొల్లు కొట్టుకుంటూ మాకోసం ఎదురు చూస్తున్నారు (??). ఎంత రెండు గంటలు లేట్ అయితే మాత్రం మాకోసం ఆగకుండా తినేస్తారా..? నా హృదయం తీవ్రంగా గాయపడింది. ఆ తిక్కలో కసి కసిగా అక్కడున్నవన్నీ ఊడ్చి తినేద్దామని ఆవేశంగా ప్లేట్ తీసుకుని ఫీల్డులోకి దూకాను.తీరా చూస్తే ఏమున్నాయి అక్కడ, నా తలకాయ్.టమాటా తొక్కులు, దోసకాయ ముక్కలు, క్యాబేజీ తొక్కలు, నిమ్మకాయ చెక్కలు. ఇవ్వన్నీ రైతుబాజార్లో సరసమైన ధరలకి దొరుకుతాయిగా.. ఇంకోపక్క క్యాలీ ఫ్లవర్ పుల్సు, కుక్కగొడుగుల పులావు, చల్లారిపోయిన చపాతీలు. ఏం తినాలో తెలియక, అస్సలు తినే ధైర్యం లేక, అలా అని తినకుండా వుండలేక నోర్మూసుకుని పెరుగన్నం పెట్టుకొచ్చాను.బిల్లులో నా వాటా గుర్తు తెచ్చుకుంటూ, గుడ్లనీరు కక్కుతూ,వెక్కుతూ పెరుగన్నం బలవంతంగా కుక్కుకుంటుంటే అర్ధమయ్యింది నాకు. జూనియర్లుగా వున్నపుడు ర్యాగింగ్ చేసారని ఏడ్చి, సీనియర్లయ్యాక వాళ్ళే మళ్ళీ ర్యాగింగ్ ఎందుకు చేస్తారో....!హ్హి హ్హీ.. రాబోయే కొత్తవాళ్ళు పార్టీ ఇవ్వడానికి నా స్వహస్తాలతో మాంచి మూహుర్తం పెట్టడం నా భవిష్య దర్శినిలో దివ్యంగా, మనోహరంగా కనిపిస్తుంది మరి.

Monday, June 30, 2008

ఎస్కలేటరోఫోబియా...

నాకు చిన్నప్పడో చిన్న కల వుండేది. నేను ఐయ్యేస్ అవ్వాలని. నా కారుని ఓ పది పదిహేను కార్లు పొలోమంటూ రయ్యి రయ్యిమని ఫాలో అయిపోవాలని. ఆ చిన్న కలని సాకరం చేసుకోవడానికి పెట్టుబడిగా రోజూ దిన పత్రిక పై నుంచి కింద దాకా కసి కసిగా చదివి చించి పారేసేదాన్ని.

చెరువులో పడి రెండు చేపలు గల్లంతు - అప్పటి నుంచి చెరువోఫోబియా
పిట్టగోడ కూలడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పది పిట్టలు - పిట్టగోడోఫోబియా
తాగి పెళ్ళాన్ని కొడుతున్న మొగుడు - మొగుడోఫోబియా
ఎస్కలేటర్లో పడి ఎలుకకి గాయాలు - "ఎస్కలేటరోఫోబియా"

ఇలాంటి వార్తలు చదివి చదివి బోలెడన్ని ఫోబియాలు వచ్చేసాయి. ఇంక చివరకి న్యూస్ పేపరోఫోబియా కూడా వచ్చేసింది. దాంతో దిన పత్రికలు చదవడం మానేసి, దిన ధారావాహికలు చూడటం మొదలు పెట్టాను. దెబ్బకి నా భయాలన్నీ పోయి జనాల్ని భయపెట్టడం వచ్చేసింది. కానీ కానీ.. నాకు తెలీకుండా ఒక్కటి మాత్రం నాలో కరిగిపోయి, కల్సిపోయి, నాలో భాగం అయిపోయింది. అదే అదే .. "ఎస్కలేటరోఫోబియా".
*****
ఆ రోజు మా సూపర్ ట్రైనర్ పుట్టిన రోజు. మాకు పండుగ రోజు. ఆ పర్వ దినాన ఐమేక్సులో సినిమా అన్నారు. రంగ్ దే బసంతి అని ఆశగా బయలుదేరిటే, మా మానసిక పరిస్థితిని బట్టి మా వయసుని అంచనా వేసి మరీ హనుమాన్, చిన్న పిల్లల ఏనిమేషన్ సినిమాకి టికెట్లు తీసారు. పోనిలే గుడ్డిలో మెల్ల, ట్రైనింగ్ కన్నా ఎదో ఒక సినిమా మిన్న అని నన్ను నేను ఓదార్చుకుంటూ లోపలకి అడుగుపేట్టానో లేదో ఒక భయంకరమైన కదులుతున్న యంత్రం కనిపించింది. నాలో నిద్దరోతున్న "ఎస్కలేటరోఫోబియా" లేచి బుసలు కొట్టింది. "నేను ఎక్కను ఎక్కలేను ఎక్కబోను" అని ఏడిచినంత పని చేసి నా కన్నీటి గాధని రీళ్ళుగా రీళ్ళుగా వెళ్ళబోసుకున్నాను. మా వాళ్ళంతా నా బరువైన ఫ్లాష్ బ్యాక్ విని, చున్నీలతో, జేబు రుమాళ్ళతో, అవి లేని వాళ్ళు టిష్యూ పేపర్లు కొనుక్కుని మరీ కార్చిన లీటర్ల లీటర్ల కన్నీరుని ఎండగట్టి, వాటితోనే బర్రు బర్రుమంటూ ముక్కు చీదుకున్నారు.

"ఇదో ఇమేజనరీ భయ్యం, నిజ్జంగా ఎక్కావంటే నిజ్జంగా నీ భయ్యం పోతుంది." అని బలవంతంగా లాక్కుపోయి దాని ముందు నిలబెట్టారు.కళ్ళు మూసుకుని జై భజరంగ్ భళీ అనుకుంటూ వెళ్ళెళ్ళి ఎస్కలేటర్ రెండో మెట్టు ఎడ్జ్ మీద అతి సుకుమారంగా అడుగేసాను. ఎడ్జ్ మీద వెయ్యటం వల్ల బ్యాలన్స్ తప్పేసింది. న్యూటన్ మూడో సూత్రం ప్రకారం నేను చేసిన ఓవరేక్షనికి ఆ బండ ఎస్కలేటర్ ఒళ్ళు మండి నా మూతి పళ్ళు విరగొట్టడం ద్వారా రియాక్షన్ ఇచ్చుండాలి. కానీ వున్నాడుగా దేవుడు, సరిగ్గా నా ముందే బండ సుధీర్ని నిలబెట్టాడు. నేను పడిపోతుంటే నా చెయ్యి పట్టుకుని ఆపి, వాడి బలాన్నంతా ఎస్కలేటరుకి వ్యతిరేక దిశలో ప్రయోగించి మొత్తానికి గండం గట్టెకించాడు. అలా రియల్ టైము ఎస్కలేటర్ ఎక్కగానే,నిజ్జంగానే నాకదంటే ఇమేజనరీ భయం పోయి రియల్ భయం వచ్చేసింది.
*****
కొన్నాళ్ళకి ఎదో సరదాగా బెంగుళూర్ వెళితే, ఫోరం అనే ఘోరమైన షాపింగ్ మాలుకి తీసుకెళ్ళారు. అక్కడ ఆ సోది ఎస్కలేటర్ తప్పిటే మెట్లు ఎంత వెతికినా కనపడల్లే. మా హైదరాబాదోళ్ళే నయ్యం. నాలాంటి దద్దోజనం మొకాలు వుంటాయని ఊహించి, మెట్లు కూడా పెట్టి దొబ్బించుకుంటారు. "ఎస్కలేటర్ నేను ఎక్కనంటే ఎక్కను, ఇక్కడే బయట సెక్యూరిటీ గార్డుకి తోడుగా కూర్చుని, అవసరమైతే చెకింగులు గట్రా చేసి పెడతాను. మీరెళ్ళి షాపింగ్ చెయ్యండి" అని తెగేసి చెప్పాను. కానీ మా అన్నయ్య మాత్రం "ఆ గార్డుకి యూరో లాటరీ తగిలి, ఇంక ఈ ఉద్యోగం అవసరం లేదు అనుకున్నపుడు నీ సాయం తీసుకుంటాదులే.కానీ చూడు రెప్పొద్దున్న నిన్ను మీ ఆఫీసోళ్ళు వేరే దేశానికి పంపిస్తే, ఎయిర్ పోర్టులో నువ్విలాగే తింగరి వేషాలేస్తే, మీ కొలీగ్స్ నిన్ను కామెడీ చేసుకుంటారే, రా" అనగానే నా బంగారు భవిష్యత్తు గురించి అంత డీపుగా ఆలోచిస్తున్న వాడిని చూడగానే రక్త సంబంధం సినేమా గుర్తొచ్చింది. నీ కోసం నిప్పుల్లో దూకడానికైనా ఈ చెల్లెమ్మ సిద్దమన్నాయ్!ఇంక ఈ బోడి ఎస్కలేటర్ ఎంత అని మా వాడ్ని ఫాలో అయిపోయా.

తీరా లొపలికెళ్ళాక, సేం వణుకుడు."పర్లేదు, జాగ్రత్త. జాగ్రత్త, పర్లేదు" అంటూ మొదటి ఫ్లోర్ విజయవంతంగా దాటించేసాడు. దానికే నా గుండెకాయ నిముషానికి కొన్ని వేల లబ్బుడబ్బుల స్పీడుతో కొట్టేసుకుంటుంది. "ఇంక చాలు బాబు పద వెళ్దాము" అని బతిమాలాను.కానీ ఆక్కడ ఎక్కడానికి/ఎక్కకపోవడానికి చాయిస్ వుంటుంది. కానీ ఎక్కాక, దిగి తీరలిగా..అప్పుడు ఆ దిక్కుమాలిన యంత్రారాక్షసమే దిక్కుగా..! అందుకని నా చేత దిగడం కూడా ప్రాక్టీసు చెయ్యించాలని బలవంతంగా పైకెక్కే యంత్రంతో పై... దాకా తీసుకెళ్ళిపోయాడు. నాకేమో ఎక్కే ఎస్కలేటర్ కన్నా దిగే డెస్కలేటర్ ఇంకా అరివీర భయంకరంగా అనిపించేసి,నాకున్న ఒకే ఒక "రెండు జతల" కళ్ళూ సవ్య దిశలో(క్లాక్ వైసు) పది సార్లు, అపసవ్య దిశలో ఇరవై సార్లు చకా చకా గిరా గిరా తిరిగేసాయ్. ఆ తర్వాత కిందకి ఎలా వచ్చానో నాకస్సలు గుర్తు లేదు. పాపం నా పిచ్చి మెదడు భయంతో బిగుసుకుపోయి ఆ చారిత్రాత్మక ఘఠనల్ని రికార్డ్ చేసుకోవడం మర్చిపోయినట్టుంది. అలా ఫైరు డ్రిల్లులా ఎస్కలేటర్ డ్రిల్లు పూర్తయ్యేసరికి ఎస్కలేటర్ అంటే భయం పోలేదు సరి కదా భయం వల్ల వచ్చిన దడతో కూడిన అసహ్యమొచ్చేసింది.
*****
నా "ఎస్కలేటరోఫోబియా" చిదంబర రహస్యాన్ని నాలో దాచుకుని గుట్టుగా బతుకుతుంటే ఊరి నుంచి మా సైన్యం దిగింది. సరే కదా అని అందరం సర్దాగా అమీర్ పేట వెళ్ళాము. అక్కడ మా మంద మొత్తం బిగ్ బాజార్లో దూరిపోబోతుంటే, వాళ్ళని ఆపి "మీకు తెలుసా...అక్కడ లోపల... ఎస్కలేటర్ వుంటుంది" అన్నా అదేదో లోపల పులి వుందన్నట్టు. "ఓస్ అంతేనా..!విజయవాడ రైల్వే స్టేషనులో అమ్మమ్మ కూడా ఎక్కింది తెల్సా. నీకు భయమా విద్యక్కా..?" అని అడిగింది మా పిన్నికూతురు. దానికి మేటర్ మొత్తం అర్థం అయిపోయింది. మన పరువు మొత్తం గంగలో కల్సిపోయింది. అయినా "అమ్మమ్మ..ప్చ్..! ఆఖరికి అమ్మమ్మ కూడా ఎక్కేసి నాకు అన్యాయం చేసేసాక ఈ పరువు గంగలో కలిస్తే ఏంటి, దొంగలెత్తికెళ్తే ఏంటి...? విద్యా ఈ జగమంతా మిధ్య.." అని నా బుజ్జి మనసు తెగ కుమిలిపోయింది.గుండెల్లో ఒకలాంటి ఆక్రోశం మొదలై, ఆవేశం వచ్చేసింది.మా వాళ్ళు ఎవ్వరూ పక్కన లేకుండా మొదటిసారి ఎస్కలేటర్ మీద అడుగేసాను. అలా ఎస్కలేటరోఫోబియా పోయి, ఎస్కలేటరోమేనియా వచ్చేవరకు ఆపకుండా మళ్ళీ మళ్ళీ ఎక్కడం, దిగడం ఇదే పని. అలా మా అమ్మమ్మ దెబ్బకి నా "ఎస్కలేటరోఫోబియా" ఎగిరి...చంచల్ గూడా పక్కనున్న ఎస్కల్ గూడాకి పారిపోయింది.
*****
ఇప్పుడు ఎస్కలేటర్ చూసి పారిపోయేంత విపరీతమైన భయం లేదు కానీ దాన్ని చూడగానే ఒక్క క్షణం కాళ్ళు చిన్నగా వణుకుతాయి. ఇంకో విషయం "ఎస్కలేటర్", ఈ ఆంగ్ల పదానికి మంచి తెలుగు పదం చెప్పి పుణ్యం కట్టుకోండి.ఎంత కొట్టుకున్నా నా మట్టిబుర్రకి తట్టట్లేదు.

Tuesday, June 17, 2008

హిడింబి హిడింబి నడుమ నేను

అవి నేను అమీర్ పేటలో హాస్టల్ వెతుక్కుంటున్న రోజులు. అక్కడ కనక మనగలిగితే ఆఫ్రికా అడవుల్లో, అఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల్లో సైతం ఆనందంగా బతికేయొచ్చని పుకారు.నేను బాగ ఆలోచించి, చించీ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు వుంటున్న హస్టల్ రూములో చేరిపోయాను.ఇక్కడ నా ప్లానింగ్ ఏంటంటే అక్కని పడేసామనుకోండి చెల్లి పడి వుంటుంది లేదా చెల్లిని లైనులో పెట్టేస్తే అక్క నోరుమూసుకుని వుంటుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటారే అలా అన్న మాట. అప్పటికీ మానవతా విలువులన్న పక్క రూమమ్మాయి మంజు నన్ను పరామర్శినించడానికి సారీ... పలకరించడానికి వచ్చి "మీ రూములో వుండే అక్కా, చెల్లి తెగ తేడా, నువ్వు వేగలేవు" అని హెచ్చరించింది కూడా. "ఇక్కడ.. ఇక్కడ.. సెవెన్ ఇయర్స్, సెవెన్ ఇయర్స్ హాస్టల్లో వున్నా, నేను తలుచుకుంటే వాళ్ళిద్దరిని ఈ హాస్టల్ చుట్టుపక్కలే లేకుండా చెయ్యగలను" అని కారు కూతలు కూసేసాను. కానీ నాకారోజు రాత్రే "ముందున్న గోతుల లోతు తెలీకుండా కోతలు కోయాకూడదు" అన్న విషయం బాగా అర్థం అయ్యింది.

ఆ అర్ధ రాత్రి నేను గాఢ నిద్రలో వున్నాను. సడెనుగా ఎవరిదో భయంకరమైన నవ్వు వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే అక్క రెండు చేతులు చాపి, వంగి హ్హ, హ్హ, హ్హ అంటూ షోలే సినిమాలో గబ్బర్ సింగులా నవ్వుతోంది. అది చూడగానే గుండె ఒక్కక్షణం ఆగిపోయింది. ఒళ్ళంతా చమటలు పట్టేసాయి. మంజు చెప్పినట్టు తేడా అంటే పిచ్చేమో. మమ్మీ... నాకు పిచ్చోళ్ళంటే చచ్చేంత భయం.ఇంక ఆ నవ్వు భరించలేక వాళ్ళ చెల్లిని లేపి "పాప నవ్వుతుంది" అని చెప్పాను. "ఓస్ అదా మా అక్క రాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది. పొద్దునే లేవలేదు. అందుకే రాత్రే యోగా చేసుకుని పడుకుంటుంది. ఇది నవ్వాసనం " అనేసి మళ్ళీ పడుకుంది. నా బొందాసనం...అయినా పొద్దున కుదరదని రాత్రే చేసి పడుకోవడానికి ఇదేమైనా ఇస్త్రీనా...? వంకాయ,టెంకాయ కలిపితే వచ్చే హైబ్రీడుకాయ మొహం అదీను.
*******
అలారం మోగింది.టైం ఆరు.ఈ సారి చెల్లి లేచింది.ఇంక మళ్ళీ నిద్ర పట్టక ఈ సైతాను మొకాలతో వేగడం బెటరా, లేక తిరుగుతున్న ఖేతాన్ ఫ్యానుకి ఉరేసుకుని చావడం బెటరా అని కళ్ళు తెరిచి దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అదే నేను చేసిన పే...ద్ద తప్పు.చెల్లి అల్మారాలోంచి ఓ భయంకరమైన వస్తువు తీసింది. అది కత్తో, గన్నో, వేటకొడవలో అయితే నేనసలు భయపడేదాన్ని కాదు.కానీ.. కానీ... అది ఒక వయొలిన్.

"విద్యా నీకు నిద్ర పట్టటం లేదు అనుకుంటా. వయొలిన్ క్లాసుకి వెళ్ళడానికి ఇంకో అరగంట టైం వుంది. ఈలోపు నేనో పాట వాయిస్తాను. అదేంటో నువ్వు చెప్పాలే" అంది గారాలు పోతూ.చీ ఎదవ జీవితం సునామీ, సైక్లోను కలిపొస్తే ఎలా వుంటుందో అంత కన్న భయంకరంగా తయారయ్యింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టల మాట దేవుడెరుగు, ఒక్క పిట్టకి రెండు దెబ్బల్లా అక్క, చెల్లి కలిపి నన్ను ఎడా,పెడా కుమ్మేస్తున్నారు అని తాళం తప్పకుండా నాలో నేను కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఈలోపు సంగీత పిపాసి గారు కచేరి మొదలెట్టేసారు.

కుయ్.. ఇంకో కుయ్.....
కుయ్యో... ఇంకో కుయ్యో.

నేనో పిచ్చి శ్రోతని దొరికేసరకి, ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ రెచ్చిపోయి ...రెండో కుయ్యో లెంగ్త్,స్ట్రెంగ్త్,వేవ్ లెంగ్త్ అన్నీ పెంచేసింది. అది కాస్త కీచుమంటూ కీచుమంటూ వచ్చేసరకి నా పీచు జుత్తు భయపడి లేచి నుంచుంది. "కుయ్యో.. కుయ్యో.. కుయ్.. కుయ్.. కూ... కో......" ఇలా చెల్లి గారు జీవితం మీద రోత పుట్టేలా మోత మోగించేస్తుంటే, అక్కగారు కదలకుండా, మెదలకుండా పడుకున్నారు. పాపం పిచ్చి తల్లికి మళ్ళీ మళ్ళీ ఈ చెల్లి లొల్లి విని చెవులు చిల్లులు పడి, మెదడు మొద్దుబారిపోయినట్టుంది. ఆ క్షణంలో చెల్లెమ్మ వయొలిన్ వైలెన్స్ కన్నా అక్కయ్య గబ్బరు సింగే నవ్వే కాస్త వినసొంపుగా వుందనిపించింది.

ఇంకో పక్క చెల్లి ఆపకుండా తీగల్ని లాగి లాగి సాగదీసి లేని రాగాలు పుట్టించేస్తోంది.కొన్ని వేల ఏళ్ళ తర్వాత ఆ వయొలిన్ వాయింపుడు ఆపి"ఇప్పుడు చెప్పుకో చూద్దం" అంది. కుయ్యోలని నా జీవిత కాలంలో విన్న ఏదో ట్యూనులోకి ఇరికించేద్దామని ఎంత జుట్టు పీక్కున్నా కుదిరి చావదే...!అమ్మో ఈ వయొలిన్ వైడూర్యం, సంగీత వజ్రం ఏదో కొత్త(చెత్త) ట్యూన్ కనిపెట్టేసినట్టు వుంది. "నీకు తెలీట్లేదా...? ఇది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్" అంది. వామ్మో.. వాయ్యో.. ఇది అదా.. అదే ఇదని ఏమాత్రం అనుమానం రాకుండా ఎంత అద్బుతంగా ఖూనీ చేసింది. తగలెట్టడంలో కూడా ఎంత పర్ఫెక్షనో...! "నేను బాగా వాయించలేదు కదా..! నువ్వు గుర్తు పట్టలేదు" అని దీనంగా మొహం పెట్టి అడిగేసరికి నా వెధవ గుండెకాయ కరిగిపోయింది. కళాకారుల్ని నిరుత్సాహపరచకూడదనే పెద్దమనుసుతో "చీ అలా కాదు, నేను తెలుగు మీడియం. అందుకే నాకు ఇంగ్లీష్ రైంస్ అస్సలు తెలీవు" అన్నాను. "అయ్యో పాపం" అంది. కోతి మొకం,పీత కళ్ళేసుకుని వెధవ జాలొకటి మళ్ళీ.

"సరేలే నీ కోసం మంచి తెలుగు పాట బాగా నేర్చుకుని పది రోజులకి వినిపిస్తానే..అప్పుడు కరెక్ట్ గా చెప్పాలమ్మా..! " అంది.వెంటనే మంజు దగ్గరకి వెళ్ళి వలా వలా ఏడిస్తే "చా ఊరుకో. కష్టాలు మనుషులకి కాపోతే మానులకి వస్తాయా..! అయినా నా మాట విని వేరే హాస్టల్ కి వెళ్ళిపో" అని సలహా ఇచ్చింది. ఇంక హాస్టల్లో వుండే దమ్ము లేక, రూం వేటలో పడ్డా. అయినా నా పిచ్చి కానీ, హైదరాబాదులో అద్దెకి ఇళ్ళు, ఆడపిల్లలకి మొగుళ్ళు అంత వీజీగా దొరికేస్తారేంటి? రోజులు గబా, గబా గడిచిపోతున్నాయి. మా వాళ్ళందరికీ ఫోను చేసి మాట్లాడాను. అప్పులన్నీ తీర్చేసాను.నాకెవరైనా ఇవ్వాల్సివుంటే, ఇలాంటి దశలో తుచ్చమైన డబ్బు మీద మమకారం ఎందుకని ఆ బాకీలన్నీ మాఫీ చేసేసాను.బాకీలు మాఫీ చేసిన పుణ్యఫలమో,పూర్వజన్మ సుకృతమో,దేవుడి దయో కానీ చెల్లి భీకరమైన ప్రాక్టీసుకి తట్టుకోలేక వయోలిన్ తీగ తెగింది (ఎవరో తెంపేసారు!).చెల్లెమ్మ మారణాయుధం దెబ్బకి చిరుగులు పడ్డ నా జీవితం మళ్ళీ కొత్త చిగురులు వేసింది.

Thursday, June 12, 2008

ఇంగ్లీషన్నయ్య -- సులక్షణక్కయ్య

నేను ఇంటర్ చదివేటప్పుడు నేను ఇంటరే చదవాల్సి వచ్చేది. కనీసం వేరే పేపర్ ముక్క కూడా చదివే టైం ఇవ్వకుండా మా తొక్కలో కాలేజీ వాళ్ళు మా చేత వీర రుబ్బుడు రుబ్బించేవాళ్ళు.అలాంటి కాలేజీలో ఎడారిలో ఎండమావిలా ఓ ఇంగ్లీష్ సార్. ఆయన ఇంగ్లీష్ కత్తి. మాట కత్తి. పాడే పాట కత్తి. వేసే బొమ్మ కత్తి. మనసు కత్తి.చూడ్డానికి మనిషి కత్తి. మొత్తానికి ఆయన కత్తో కత్తి. మా కాలేజీలో మొత్తం అమ్మాయిలంతా ఆయన అభిమాన సంఘానికి శాశ్వత సభ్యులం. ఒక రాఖీ పౌర్ణమి నాడు మా అభిమానాన్ని చాటుకోవడానికి కొట్టుకుంటూ, తోసుకుంటూ,పోటీ పడి రాఖీ కట్టేసాం. అలా ఇంగ్లీష్ సార్ కాస్త ఇంగ్లీషన్నయ్య అయిపోయారు. ఇంత మంది వీరాభిమానులున్న ఇంగ్లీషన్నయ్యకి ఓ శతృవు బయలుదేరింది. అదీ సులక్షణక్కయ్య రూపంలో.........

చిన్ని చిన్ని కళ్ళు, బూరె బుగ్గలు, ముద్దుగా బొద్దుగా వుండే సులక్షణక్కయ్య మా కాలేజీకి మెడికల్ ఎంట్రన్స్ కి లాంగ్ లాంగ్ లాంగ్ టెర్మ్ కోచింగుకని వచ్చింది. అంటే ఆల్రెడీ రెండు లాంగ్ టెర్ములు దొబ్బేసాయి. ఇది మూడోది. వచ్చిన రెండు రోజులకే మన అక్కయ్య విశ్వరూపం చూపించటం మొదలెట్టింది. మన అక్కయ్య మాటల పుట్ట, కబుర్ల తుట్ట, విషయాల తట్ట, విజ్ఞానపు బుట్ట ( చదువులో కాదు!). మా దిక్కుమాలిని హాస్టల్లో ఎంటెర్టైన్ మెంటే లేకుండా చదువులో మగ్గిపోయి, మసయిపోతున్న మా మొద్దు మొకాలకి ఈ సులక్షణక్కయ్య అడవిలో ఆదిత్య ఛానల్లా, ఎడారిలో ఎం టీవీలా కనిపించేసింది. నాసామి రంగా ఇంక చూసుకోండి, హాస్టలంతా సులక్షణక్కయ్య మాకు కావాలంటే మాకు కావాలి అని తెగ కొట్టుకు చచ్చిపోయేవాళ్ళం.

ఇలా కొంచెం చప్పగా, కొంచెం చేదుగా, కొంచెం తియ్యగా సాగిపోతున్న మా కాఫీ కప్పులాంటి జీవితాల్లో మా సులక్షణక్కయ్య వల్ల చిన్న తుఫాను రేగింది. స్టడీ అవర్స్ లో మా ఇంగ్లీషన్నయ్యని చూసి ప్యూనా అని అడిగింది. మాధవన్లా వుండే మా ఇంగ్లీషన్నయ్యని ప్యూనని అనేసరికి నా గుండె ముక్కలయిపోయింది. సులక్షణక్కయ్యకి ఇంగ్లీషన్నయ్య గుణ గణాలు, కళలు, కాంతులు, ఆమె భ్రాంతులు అన్ని అజెండాగా తీసుకుని అందరం కల్సి స్పెసల్ క్లాసు తీసుకుని బుర్ర రామ కీర్తన పాడించేసాము. అయినా మన అక్కయ్య అభిప్రాయంలో మార్పు రాలేదు. టేస్టు లేని వేస్టు ఫెలో అని వదిలేసాము.

ఓ రోజు మేమంతా ఇంగ్లీష్ సారు ఇచ్చిన మెటీరియల్ కళ్ళు మూసుకుని బట్టీ కొడుతుంటే, సులక్షణక్కయ్య ఆ మెటీరియల్ లాక్కుని మెటికలు విరుస్తూ, చిటికెలు వేస్తూ, బరువు బరువు నిట్టూర్పులు విడుస్తూ చివరగా "ఇలా అయితే లాభం లేదమ్మాయిలు. మీరు ఇంగ్లీష్ పాసవ్వడం కష్టం" అని పెదవి విరిచేసింది.నా జీవితం మీద, పరీక్షల మీద నాకున్న సందేహాలు చాలవన్నట్టు ఈ మిటమిటల రాణి శాపనార్ధాలేంటో...?."ఈ మెటీరియల్ నిండా తప్పులే. మీ ఇంగ్లీష్ సారుకేమి రాదు" అంది.ఎంత మాట.... మా అందరికి గుండెల్లో నొప్పి, బాధ, వేదన. అటు రాఖీ కట్టిన బంధం, ఇటు సోది వినిపించే అనుబంధం. అటు చదువు చెప్పే గురువు. ఇటు మా అజ్ఞాన్ని పారద్రోలే కల్పతరువు. ఇద్దరూ మధ్య సయోధ్య కుదర్చలేక, కుదర్చకుండా వుండలేక మేమెంత నరకం అనుభవించామో మీకు తెలీదు, మీకెవ్వరికి తెలీదు....... వీలయినపుడల్లా మా ఇంగ్లీష్ సారుని దెప్పుతూనే వుంది. మమ్మల్ని వుందిగా సెప్టెంబర్ మార్చ్ పైన అంటూ భయపెడుతూనే వుంది.

ఈ గొడవలో పడి మేము క్రుంగి, క్రుశించి, నలిగి, నశించిపోతున్న సమయంలో సులక్షణక్కయ్య ఓ సవాల్ విసిరింది. మా ఇంగ్లీషన్నయ్య ఇచ్చిన మెటీరియల్లో తప్పుల్ని ఎర్ర ఇంకుతో మార్క్ చేసి,ఇది మీ అన్నయ్యకి చూపించి ఇవి తప్పులు కాదు అనమనండి చూద్దాం అంది.వెంటనే మేము బుర్ర బుద్ది లేకుండా చీమల దండులా పోలోమంటూ లెఫ్ట్ రైట్ అనుకుంటూ సారు దగ్గరకి వెళ్ళి ఆ పేపర్ చూపించాము. పేపర్, ఆ ఎర్ర గుర్తులు చూసి "ఏంటిది..?" అన్నారు అయోమయంగా. ఇవన్నీ తప్పులట సార్."ఎవరు చెప్పారు" అన్నారాయన సీరియస్గా. "సులక్షణక్కయ్య" అన్నాము అందరూ ఒకేసారి. "ఇంకేమంది..?" అని అడిగారు.

ఆయన అడిగిందే తడువుగా అస్సలు ఆలస్యం చేయకుండా మొత్తం కథంతా చెప్పేసి, మా గురు భక్తిని, సోదర ప్రేమని నిరూపించేసుకుని, చేతులు దులిపేసుకున్నాము. కానీ తర్వాత తెల్సింది మేమో పద్మ వ్యూహంలోకి ఎరక్క....పోయి ఇరుక్కు....పోయామని. ప్రిన్సిపాల్, సార్స్ అందరూ మమ్మల్ని తలా తోకా లేని బోలెడు చెత్త ప్రశ్నలు అడిగారు. మేము కొన్ని నిజాలు, అబద్దాలు కలిపి చెప్పి ఎలాగోలా ఆ ప్రశ్నల వర్షాన్ని కష్టపడి గట్టెక్కించేసాము. అలా విచారణ పూర్తి చేసి, మా వార్డెనక్కయ్య సాక్ష్యం ఆధారంగా సొల్లు కబుర్లు చెప్పి, చిన్న పిల్లల (అంటే మేమే..!) చిట్టి మనసుల్ని, చదువుల్ని చెడగొడుతుందనే అభియోగం మీద సులక్షణక్కయ్యని హాస్టల్ నుంచి గెంటేసారు. అలా మా లైటుని మేమే ఆర్పేసుకున్నాము.

సులక్షణక్కయ్య నిష్క్రమణతో మా జీవితాల్లో చీకటి నిండింది. సోది కబుర్ల మీద బెంగతో దిగులు రేగింది. ఇలా నా బాధల్లో నేనుండగా ఓ రోజు ఫోన్ వచ్చింది.అది... అది.... సులక్షణ....... అక్కయ్య నుంచి. బోలెడంత ఆనదంతో నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే "మీ ఇంగ్లీషన్నయ్యకి నేనో క్షమాపణ లేఖ పంపాను. ఎవరూ లేనపుడు అందిందేమో అడుగు" అంది. "క్షమాపణ లేఖ..?ఎందుకక్కా..? లేని తప్పులు పట్టుకున్నా సారేమి అనుకోరు." అంటుంటే "నోరు ముయ్యి, చెప్పింది చెయ్యి" అని ఫోన్ పెట్టేసింది. నాకొళ్ళు మండింది.

కావాలనే సార్స్ అందరూ వున్నపుడే ఇంగీషన్నయ్యని అడిగాను "సార్ సులక్షణక్క మీకేదో క్షమాపణ లేఖ పంపిందట. మీకు అందిందో లేదో అడగమంది" అన్నాను మొహం వీలైనంత దీనంగా పెట్టి. ఒక్కసారిగా రూములో అందరూ నవ్వడం మొదలు పెట్టారు. సార్ మాత్రం కొంచెం ఏడుస్తూ, కొంచెం నవ్వుతూ, కొంచెం కోపంగా, కొంచెం కంగారుగా, కొంచెం వెర్రిగా అదో రకంగా ముఖం పెట్టారు. నాకేమి అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటే, మా ఫిజిక్స్ సారు "లేఖ కాదు, పుస్తకం అది. అందింది.దాన్ని అమ్మి బఠానీళ్ళు కొనుక్కున్నారని చెప్పు" అన్నారు. సరే అని అమాయకంగా తలకాయ ఊపి బయకొచ్చేసాక, ఆయన నవ్వుతూ అంటున్నారు "అంత పెద్ద ప్రేమలేఖ ఎన్ని రోజులు రాసిందో పాపం ఆ ఆమ్మాయి. ఎవరు పెట్టారో కానీ సులక్షణ అని, చాలా లక్షణమైన పేరు పెట్టారు" అని.

ప్రేమ లేఖా...! అమ్మనీ..... ఎంత కుట్ర. మనసులో ఇంత పెద్ద ప్లాను వేసి, స్కెచ్ గీసి, సారుని మా ముందు తిట్టి, రెచ్చగొట్టి మా అంతట మేమే రాయబారానికి వెళ్ళేలా చేసి, సారు దృష్టిలో ఈ రాణీ గారు పడేలా చేసుకుందన్న మాట. కొత్తగా ఫోన్ రాయబారాలు ఒకటి.మళ్ళీ క్షమాపణ లేఖంట.. చుంచు మొహంది ఎంత ఎదవల్ని చేసింది. తర్వాత తెల్సింది వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యిందని. అక్కకి ఓ అభాగ్యపు బావతో, అన్నయ్యకి వేరే అమాయకపు వదినతో. హమ్మయ్య నా కడుపు చల్లబడింది. గుడ్డిలో మెల్లలా, పొడుగు పొడుగు ప్రేమ లేఖలతో (పుస్తకాలతో) సారుని పడేసి, పెళ్ళి చేసేసుకుని మమ్మల్ని మరీ బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఎదవల్ని చేసెయ్యలేదు మా సులక్షణక్కయ్య కాదు... కాదు... సులక్షణవదిన.. ఛీ ఛీ ఏదో ఒకటిలే....