Wednesday, May 21, 2008

అపరిచితురాలు

నా మొదటి కంపనీలో మా బ్యాచ్ జాయిన్ అయ్యిన వెంటనే మాకేమీ రాదని అర్థం అయిపోయింది ఆ కంపనీవాళ్ళకి. మా బుర్ర బూజు దులిపి, కాస్త గ్రీజు రాసి వాటిని పనికొచ్చేలా చేసే బాధ్యతని లత అనే సూపర్ ట్రైనర్ చేతుల్లో పెట్టారు. మా లత ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు అరుస్తుందో, ఎప్పుడు ఏడిపిస్తుందో మా బుల్లి మెదళ్ళకి అంతు పట్టక ముద్దుగా అపరిచితురాలు అని పిలుచుకునే వాళ్ళం.మా లతకి రోజుకి నాలుగు సార్లు కోపం వచ్చేది. ఎందుకు వచ్చేది అంటే ఏం చెప్తాము. అదంతే. కొన్నిటికి కారణాలు వుండవు.కోపమొస్తే "మీకేమి రాధు. మీరెందుకు పనికి రారు" అంటూ ఆపకుండా చెవులు చిల్లులు పడేలా బండ బూతులు తిట్టేది.

ఒక రోజు పని లేని మంగలోడు పిల్లి తల గొరికినట్టు, క్లాసులో ఓ తలకి మాసినోడు "లత నువ్వింకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు..?" అని అడిగి తగలడ్డాడు. లత ఒక్కక్షణం ఆగి గట్టిగా ఊపిరి తీసుకుంది. అర్థమయిపోయింది మాకారోజు మూఢిందని. మా ప్రాణాలు తోడేసే ప్రోగ్రామేదో ప్లాన్ చేసిందని. టైం మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. కథ (రొద) మొదలుపెట్టింది.

నేను ఎల్.కె.జిలో జాయిన్ అయ్యాను అంటూ ఎత్తుకుంది.డిటైల్స్ మరీ అంత చిన్నప్పట్నుంచీ వద్దని మేము మొత్తుకుంటున్నా, ఆవిడ ఏబీసీడీలు దిద్దుకుంటూ పదో తరగతి పాసయ్యేసరికి 2:00 అయ్యింది. కథ కాలేజీ గేటు దగ్గరకి వచ్చేసింది.కాలేజీ అంటే ఇంక పెళ్ళి ఎందుకు చేసుకోలేదో చెప్తుంది అని నోరు తెరిచి, ఒళ్ళు మరిచి ఆత్రుతగా అందరం ఎదురు చూస్తున్నాము. కానీ మాకంత అదృష్టం ఎక్కడ ఏడిచింది.మా గుండెల్ని ముక్కలు చేస్తూ, అసలు పెళ్ళి ప్రసక్తే లేకుండా కాలేజీ కూడా అయిపోయింది. టైం 2:30. కడుపులో ఎలుకలు క్రికెట్ ఆడేసుకుంటున్నాయి. లతకి జాబ్ వచ్చింది. వాళ్ళ తమ్ముడికి పెళ్ళి అయ్యింది. కజిన్స్ కీ పెళ్ళి అయ్యింది. కథ అవ్వటం లేదు. అందరూ నీరసంతో చచ్చేలా వున్నారు. తమ్ముడికి పిల్లలు పుట్టారు. వాళ్ళ కజిన్స్కీ పిల్లలు పుట్టారు. మళ్ళీ జాబ్ మారింది. కడుపులో ఆకలి మంటలు. ఇంక తెగించి "ఆపేయ్ తల్లోయ్ నీకో దణ్ణం" అని చేతులెత్తి మొక్కేసాం. దాంతో మా మీద దయ తలిచి చిద్విలాసంగా నవ్వుతూ 4:00 కి ఆ చిదంబర రహస్యం చెప్పి మాకు ముక్తి కలిగించింది. "నా జీవితంలో ఇన్ని సంఘటనలు జరిగాయి. ఏ ఒక్క క్షణంలోనూ, సందర్భంలోనూ నాకు పెళ్ళి చేసుకోవాలి అనిపించలేదు. అందుకే చేసుకోలేదు.." అంది చాలా వీజీగా.

వార్నీ సమరసింహా రెడ్డి, సింహాద్రి లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ వుంటుందని ఊహించుకున్నాను. ఒక్క డవిలాగుతో గాలి తీసేసింది.ఈ ముక్కేదొ ముందే చెప్తే నాలుగు అన్నం మెతుకులు తిని ఈ పాటికి సీట్లో పడి హాయిగా నిద్రోయేవాళ్ళం కదా..
దీనికి తోడు ఈ సోది భారతం విని ఒకడు మరీ కదిలిపోయి, కరిగిపోయి,రెచ్చిపోయి, లత నువ్వు నిజంగా త్యాగ మూర్తివి.నేను నీ జీవిత చరిత్ర రాసేద్దామని డిసైడ్ అయిపోయాను అన్నాడు. అంతే ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా మా క్లాస్ రూం మొత్తం షాకయ్యి, షేకయిపోయింది. ఈవిడ చిన్న చిన్న పిట్ట కథలు వినే మా మెదడులో రక్తం గడ్డ కట్టేస్తుంది.మొత్తం జీవిత చరిత్ర అంతా రాసి, జనాల మీదకి వదిలితే ఇంకేమన్నా వుందా....? జరిగే నరమేధాన్ని ఊహించడం నా తరం కాలేదు. ఏదో ఆవేశంలో నోరు జారాడని వాడి చేత బలవంతంగా రాయించుకుంటుందేమోన్న టెన్షన్ తో వాడి దగ్గరకి వెళ్ళి కొంపదీసి నిజంగానే రాస్తావా ఏంటి అని అడిగాను. వాడి నాలుకని అటూ ఇటూ ఆడించి లేదు ఉత్తుత్తినే, నాకింకా కొన్నాళ్ళు బతకాలని వుంది అన్నాడు. హమ్మయ్య బతికించాడు.వాడికా మాత్రం క్లారిటీ వుంది అది చాలు.

Wednesday, May 14, 2008

మనసున మనసై - III (కథ)

మూడేళ్ళు గడిచేసరికి రఘు ఖాతాలో రెండు సివిల్స్ దండయాత్రలు చేరాయి. మొదటిది ప్రిలింస్ లో తన్నితే, రెండోది మెయిన్స్ లో పల్టీ కొట్టింది. రెండు అపజయాలు, అనుభవాలుగా మారి మూడో సారి తప్పకుండా సాధించగలడన్న నమ్మకాన్ని కలిగించాయే తప్పితే నిరుత్సాహానికి గురి చెయ్యలేదు.చిన్నప్పుడు ఓ మాదిరిగా చదివే తన తోటి వాళ్ళంతా ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారు. వేరే దేశంలో వున్నారు.అంత సంపాదిస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారు అన్న ఊళ్ళో వాళ్ళ మాటలు కూడా అంత బాధపెట్టేవి కావు. కానీ ఆ మాటలు విన్నప్పడు తన తల్లితండ్రుల కళ్ళల్లో లీలగా కదలాడే నీలి నీడలు చూస్తుంటే, రఘుకి గుండెని ఎవరో రంపంతో కోస్తున్నట్టు అనిపించేది. అందరూ వెళ్ళే దారిని కాదని, తను కోరుకున్న దారిలో వెళ్ళడానికి కూడగట్టుకున్న ధైర్యం, పట్టుదల, శక్తి అంతా కరిగి నీరై తన చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపించేది. అలాంటి నిస్పృహలో, నిరుత్సాహంలో కీర్తి బాగా గుర్తుకి వచ్చేది. కీర్తి ఎంచుకున్న దారి వేరైనా, తనని అర్థం చేసుకోగలిగేదేమో అని రఘుకి బాగా అనిపించేది.

కానీ రఘు మనసులో ఎక్కడో చిన్న సందేహం."తన కోసం ఆశలు సౌధాలు దిగి, కలలు తీరాలని వదిలి వస్తుందా..? రేప్పొద్దున్న ఎన్ని ప్రయత్నాలు చేసినా, సివిల్స్ రాక మామూలు లెక్కల మాస్టారిగా వుండిపోతే, తన స్నేహితులతో పోల్చుకుని, తన అదృష్టాన్ని కొలుచుకోకుండా వుండగలదా ..? అలా జరిగితే కీర్తి కళ్ళల్లో విచారాన్ని, కాసుల వేటలో వెనకబడిపోయామన్న దిగులుని చూసి తను తట్టుకోగలదా..?". ఇలా సమాధానం లేని, రాని ఎన్నో ప్రశ్నలు, కీర్తి కూడా అందని ద్రాక్షే అనే భావాన్ని కలిగించాయి. దాంతో కీర్తి కథ తీరని కల అని తన మనసుకు సర్దిచెప్పుకోవడం మొదలుపెట్టాడు.

********

కీర్తికి ఒకప్పుడు రఘుతో భవిష్యత్తు అంటే కాలం కల్సి రాకపోతే లెక్కల మాస్టారుతో సాదా జీవితం అన్న దిగులు వుండేది. కనీ రఘుతో బంధంలోని అర్థం తెలిసాక,ఒకప్పుడు జీవిత పరమార్ధంగా అనిపించిన మంచి జీతం, పేరు, సుఖాలు, సౌకర్యాలు, స్నేహితుల ముందు పరువు అన్నీ వ్యర్ధంగా అనిపిస్తున్నాయి.రఘుతో జీవితం అంటే, కాలాలు కలిసొచ్చినా రాకున్నా కలకాలం కొంగొత్త మలుపుల, గెలుపుల దారులు తెరిచి కీర్తి తలపులకి పలికే ఆహ్వానంలా అనిపిస్తుంది.రఘు గురించి ఇలా మనసు చెప్పే తియ్యని ఊసుల, బాసల ఊగిసటలాటలో కీర్తికి రఘుని చూడాలన్న ఆరాటం, ఎప్పటికైనా చూస్తానన్న ఆశ, తనకి కాకుండా అయిపోతాడేమోనన్న దిగులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.రఘుకి కూడా కీర్తి తనతో జీవితాన్ని పంచుకుంటుందన్న ఆశ లేకపోయినా, ఇష్టం మాత్రం తగ్గలేదు.కీర్తిని చూడాలన్న తపన తరుముతూనే వుంది. తను వెళ్ళే ప్రతీ చోట కీర్తిని వెతుకుతూనే వుంది.


ఒక రోజు రఘు యధావిధిగా మది నిండా కీర్తి తలపుల బరువుని మోస్తూ వెళ్తుంటే దారిలో పుస్తకాల షాపు కనిపించింది.రఘు తన మనసుకి నచ్చిన పనిలో అలా మొండిగా, బండగా ముందుకెళ్ళడానికి స్పూర్తినిచ్చేవి పుస్తకాలే.మనసులో పేరుకున్న నిరుత్సాహాన్ని, దిగులుని బయటకి నెట్టి, కొత్త ఉత్సాహాన్ని నింపే పుస్తకాన్ని వెతుక్కోవడానికి లోపలకి వెళ్ళాడు.


అదే సమయంలో కీర్తి సంపాదించిన డబ్బుని కరిగించడానికి ఒంటరిగానే షాపింగుకని బయరుదేరింది. అలవాటు ప్రకారం రఘు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని వళ్ళంతా కళ్ళు చేసుకుని అడుగడుగునా అణువణువూ శోధించింది. అతను కనపించలేదు కానీ దారిలో ఒకచోట పుస్తకాల షాపు కనిపించింది. చదివే తీరిక, ఓపిక రెండూ లేవని తెల్సినా పుస్తకాలంటే వున్న ఇష్టం లోపలకి వెళ్ళేలా చేసింది.

"కలా నిజమా" అన్న టైటిల్ తో ఒక పుస్తకం కనపడగానే అదేంటో చూద్దమని, షెల్ఫ్ లో నుంచి ఆ పుస్తకాన్ని తియ్యబోయింది. అదే సమయంలో ఆ పుస్తకాన్ని ఇంకో చెయ్యి తాకింది. ఒక్కక్షణం తడబడి సారీ చెప్పడానికి తలెత్తి చూసింది.నిజంగానే కలా నిజమా అన్నట్టు, ఎదురుగా రఘు. ఇద్దరికి కళ్ళల్లో మాటల్లో చెప్పలేనంత ఆనందం, ఆశ్చర్యం.ఒకరి కళ్ళల్లోని మెరుపు, నవ్వులోని వెలుగు ఇంకొకరి ప్రశ్నలకి అడగకుండానే అందమైన సమాధానాల్ని చెప్పేసాయి. కలిసిన అభిప్రాయలు దగ్గర చేసాక, కలవని లక్ష్యాలు ఇద్దర్నీ దూరం చేసినా ఇంకా కల్సే వున్న ఆ మనసులకి, విధి అంత అందంగా కలిపిన తర్వాత కలకాలం కల్సి ఆనందంగా ఎలా వుండాలో బాగా తెల్సు.

********

మనసున మనసై - II (కథ)

ఆరు నెలలు గడిచేసరికి, ప్రతిఫలాలు ఆశించని పరిచయాల పరిమళాలు ఇద్దరి మనసులని అందంగా అల్లుకున్నాయి. ఇద్దరూ అభిప్రాయాలు పంచుకుని, అభిరుచులు తెల్సుకుని, ఒకరి మీద ఒకరికి అభిమానం ఒక బంధంగా మారబోయే సమయానికి,కీర్తికి అనుకోకుండా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ హైదరాబాదులో చేసే అవకాశం వచ్చింది.కంగారు కంగారుగా అంజలి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెప్పి,వాళ్ళూరు వెళ్ళి ఓ వారం అక్కడే వుండి, అట్నుంచి అటే భాగ్యనగరం బస్ ఎక్కేసింది. ఇంత హడావిడిలో రఘుకి చెప్పలేకపోయినందుకు కీర్తికి మనసు పీకుతూనే వుంది.

కీర్తికి హైదరాబాదు వచ్చాక కూడా జీవితంలో చాలా విలువైనది ఏదో కోల్పోయిన భావం వెంటాడుతూనే వుంది. రఘు ఎప్పుడూ తన పక్కనే వుంటే బావుంటుంది అని అనిపించింది.అలా అతనికై పడే ఆరాటం, పెంచుకున్న అనురాగం మనసుని మీటే ప్రతిసారీ, భవిష్యత్తు గురించి కోటి సందేహాలు చుట్టుముట్టేవి. "నలుగురూ నడిచే దారి నాకొద్దు అంటూ తనదైన బాటలో సాగే రఘుతో తను కలిసి నడవగలదా..? ఒకవేల రఘుకి సివిల్స్ రాకపొతే, అతను అన్నట్టుగానే లెక్కల మాస్టారిగా స్థిరపడిపోతే అప్పుడు పరిస్థితేంటి..? రేప్పొద్దున్న ఫ్రెండ్స్ అంతా గొప్ప గొప్ప పొజిషన్లో వుండి, బాగా సంపాదిస్తుంటే తను మాత్రం రఘుతో సాదా జీవితం, జీతంతో ఆనందంగా వుండగలదా..? దేనికీ అవును అనే సమాధానం ఖచ్చితంగా రాలేదు. దాంతో కీర్తి తన మనసుకి రఘు కథ కమ్మని జ్ఞాపకం అని నచ్చచెప్పటం మొదలుపెట్టింది. నెమ్మదిగా ప్రాజెక్ట్ గోలలో, జాబు వేటలో ఆ ఆలోచనలు మరుగునపడిపోయాయి.

కీర్తి ఆకస్మిక అదృశ్యం, రఘు గుండెల్లో ఆందోళనని,ఆవేదనని,ఆరాటాన్ని కలిపి రేపింది.ఎందుకు రావట్లేదో తెలీదు.ఏమి అయ్యిందో తెలీదు. కాసింత కంగారు, మరికొంత అసహనం. పోనీ ఎదురింటి వాళ్ళని డైరెక్టుగా అడుగుదామంటే, ఏమి అనుకుంటారో అని సందేహం. చివరకి ధైర్యం చేసి తను ట్యూషన్ చెప్పే అబ్బాయి చేత అంజలిని అడిగించాడు. అప్పుడు తెల్సింది కీర్తి ప్రాజెక్ట్ విషయం. చెప్పనందుకు మొదట కోపం వచ్చింది. మళ్ళీ తనకే అనిపించింది. కీర్తికి తను ఏమవుతాడని చెప్పాలి. ఒక పేరంటూ లేని పరిచయంలో అడిగే హక్కు తనకు లేదు. చెప్పాల్సిన బాధ్యత కీర్తికి అస్సలు లేదు అని గొప్పగా అనుకోడమైతే అనుకున్నాడు కానీ అదింకా భాధగా అనిపించింది.రోజూ నడిచే దారిలో, ఒక్కడే నడుస్తుంటే ప్రతి అడుగుకో జ్ఞాపకం పలకరిస్తూ కీర్తిని పదే పదే గుర్తు చేస్తుంటే భరించలేక వేరే దారిలో రావడం మొదలుపెట్టాడు.
*******
మూడేళ్ళు గడిచేసరికి కీర్తి చేతిలో మంచి ఉద్యోగం,కావాల్సినంత జీతం, కోరుకున్న జీవితం, దానితో పాటే అప్పుడప్పుడు గడిచిన అందమైన రోజుల్ని గుర్తు తెచ్చి, గుచ్చి గుచ్చ్చి వేధించి సాధించే ఒంటరితనం.స్నేహితులు అంతా పుట్టకొకరు, చెట్టుకొకరు అయిపోయారు. తనతో పని చేసే వాళ్ళంతా ఎవరికి యమునా తీరే అన్నట్టు వుంటారు.

అలా ఒంటరితం వేధించినపుడు,ఎడారిలో బ్రతుకున్నట్టు అనిపించినపుడు , తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని, అభద్రతా భావాల్ని తన కోణంలోంచి చూడగలిగే మనిషి, తన నిశ్శబ్దాన్ని, మూర్ఖత్వాన్ని, పిరికితనాన్ని అర్థం చేసుకునే మనసు కావాలని కీర్తికి బాగా అనిపించేది. బ్రతుకులో కష్టం,మనసులో వెలితి నిజమైన స్నేహాల విలువ తెలిసేలా చేస్తాయేమో.అందుకే అలా అనిపించినప్పుడల్లా ఎంతో కాలంగా పరిచయమైన స్నేహితులు, పక్కనే వున్న కొలీగ్స్ అందర్నీ దాటి చిత్రంగా కీర్తి ఆలోచన మళ్ళీ మళ్ళీ రఘు దగ్గరకే వెళ్ళి ఆగేది.

పదే పదే రఘు దగ్గరకే వెళ్ళి ఆగిన ఆ ఆలోచన, మొదట చిన్న అభిలాషై, నెమ్మదిగా ఆశగా మారి, క్రమంగా విడదీయలేనంత గాఢంగా మనసంతా అల్లుకుని, కీర్తి శ్వాసలో భాగం అయిపోయింది.రఘుతో జీవితం పంచుకుంటే, అరువు తెచ్చుకున్న ఆశలు, కలలు కరిగిపోయి, కీర్తి కీర్తిలానే వుండగలుగుతుందన్న భావం, దూరం అయిన మూడేళ్ళ తర్వాత కీర్తిని రఘుకి బాగా దగ్గర చెసింది.కానీ కీర్తికి ఒకటే సందేహం. "రఘు కూడా తన గురించి ఇలానే ఆలోచిస్తున్నాడా..? లేక నా ఆలోచనలకి, ఆశయాలకి కీర్తి సరిపడదు అనుకుని పూర్తిగా మర్చిపోయాడా..?".
*******

మనసున మనసై - I (కథ)

ఇది నా మొదటి కథ. మొదటి అడుగులో పొరపాట్లు, తడబాట్లు సహజం. వాటిని సరిచేసుకోవడానికి మీ అందరి అభిప్రాయాలు, సలహాలు, విమర్శలు అందిస్తారని ఆశిస్తూ...

#######


చల్లగాలి, అందమైన ఆకాశం, ఎక్కడ నుంచో వస్తున్న మల్లెపూల సుగంధం అన్నీ కలగలిపిన అందమైన వేసవి సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ, నెమ్మదిగా నడుస్తుంది కీర్తి. రోడ్డుకి అవతల పక్కన కీర్తికి సమాంతరంగా ఒకబ్బాయి నడుస్తున్నాడు. ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. ముందు ఈ అబ్బాయిలంతా ఇంతే, ఒంటరిగా వున్న అమ్మాయిని అల్లరి పెట్టాలి అనిపిస్తుంది అని అనుకోగానే బోలెడంత కోపం వచ్చేసింది. మొహం చాలా చిరాగ్గా పెట్టి, నిప్పులు కక్కే చూపులతో ఆ అబ్బాయిని కాల్చేసేలా చూసింది. అయినా ఆ అబ్బాయి అదేమీ పట్టనట్టు అలానే వస్తున్నాడు. చూపుల చురకలు పనిచెయ్యకపోయేసరికి విపరీతమైన భయం వేసింది. దాంతో వడిగా వడిగా నడవటం మొదలుపెట్టింది.అవతలి మనిషి అడుగుల వేగం పెరగలేదు. వెనక్కి తిరిగి చూసింది.నడుస్తూ నిద్రపోతున్నాడో, నిద్రలో నడుస్తున్నాడో అతనికే తెలియనంత పరధ్యానంగా నడుస్తూ, ఆ అబ్బాయి లోకంలో అతను వున్నాడు.


వెంటనే కీర్తికి తన అనవసరమైన కంగారుకి నవ్వు, ఆ అబ్బాయంటే కాసింత జాలి, ఎందుకలా వున్నాడో అన్న కుతూహలం ఒకేసారి కలిగాయి.కీర్తి గురించి క్లుప్తంగా చెప్పాలంటే,హాస్టల్లో వుంటూ ఇంజినీరింగ్ ఆఖరి సవత్సరం చదువుతుంది.గోపాలరావుగారి అమ్మాయి అంజలికి స్కూలు తెరిచేనాటికి పాఠాలు బెంగ, తనకి కాలేజీ తెరిచేసరికి ఫీజులు బెంగ లేకుండా వుండేందుకు కీర్తి అంజలికి ట్యూషన్ చెప్పడానికి తన వేసవి శెలవలకి సెలువిచ్చేసి,హాస్టల్లోనే వుండిపోయింది. గోపాలరావుగారి ఇంటి లోపలకెళ్ళి, గేటు మూస్తున్నప్పుడు కీర్తి చూపులు మళ్ళీ తను వచ్చిన దారిని పరికించాయి. సరిగ్గా అదే సమయానికి ఆ అబ్బాయి ఎదురింటి గేటు తీసి లోపలికి వెళ్తున్నాడు. ఇతనేంటి, ఇప్పుడేంటి, ఇక్కడేంటి,అస్సలు సంగతేంటిలాంటి ప్రస్నలతో, కూతహలం ఇంకాస్త బలపడే క్షణంలో ముక్కొ మొహం తెలియనని వాడి కోసం ఇంత ఆలోచన అవసరమా అని అనిపించింది. దాంతో ఆ అలోచనలని గుమ్మం దగ్గరే వదిలిపెట్టేసి ఇంట్లోకి అడుగుపెట్టింది.


మర్నాడు మళ్ళీ అదే సమయానికి కీర్తి అదే దారిలో అంజలి వాళ్ళింటికి వెళ్తుంటే,ఆమె వెనకాలే ఆ అబ్బాయి. అప్పటి నుంచి ప్రతి రోజు ఒకరు ముందు, ఒకరు వెనక, లేకపోతే దారికి ఆ పక్క ఒకరు, ఈ పక్క ఒకరు.వెళ్ళే సమయం, వెళ్తున్న దారులు, వెళ్ళాల్సిన చోటు ఒకటే అవ్వడంతో, రోజూ మాటలు లేని మౌనంలో కలసి నడవడం ఇద్దరికి అలవాటు అయిపోయింది.


********

ఒక నెల రోజులకి,ఆ అబ్బాయి ఇద్దరి మధ్య వున్న మొహమాటం గోడల్ని దాటి, కీర్తిని చూసి చిన్నగా నవ్వాడు.నెల రోజుల ముఖ పరిచయం కీర్తికి అతనంటే కాస్త మంచి అభిప్రాయమే కలిగించటంతో, అతని నవ్వుల పలకరింపుకి ప్రతిగా తన చిరునవ్వుని సమాధానంగా పంపించింది. వెంటనే "హాయండీ, నా పేరు రఘు. మీ ఎదురింట్లో వుండే పిల్లలకి ట్యూషన్ చెప్తాను" అన్నాడు నవ్వుతూ. "అయ్యో అది మా ఇల్లు కాదండి. నేనూ వాళ్ళ అమ్మాయికి ట్యూషన్ చెప్తాను" అంది తెగ కంగారు పడిపోతూ. ఆ మాట వినగానే అతని ముఖంలోని నవ్వుల విస్తీర్ణం ఇంకాస్త పెరిగింది. "ఐతే ఒకే గూటి పక్షులం అన్న మాట. నేను ఎమ్మెస్సీ మాథ్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా" అన్నాడు.


"ఎమ్మెస్సీ మాథ్స్ ..!" అంది కాసింత ఆశ్చర్యం, మరికొంత నిరుత్సాహం కలగలిపిన కంఠంతో. కీర్తి కంఠంలో పలికిన నిరుత్సాహనికి అర్థం ఆమెకే అర్థం కాలేదు. రఘు మాత్రం ఇలాంటి ప్రశ్నలు, ప్రతిస్పందనలు తనకి కొత్తేమీ కాదన్నట్టు చిన్నగా నవ్వి చెప్పాడు "నాకు లెక్కలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం." "ఓహో. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?" ఈ విషయం తనకి అనవసరమేమో అనిపించినా అడిగింది.


"ఏముంది సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. నా సర్వశక్తులు ఉపయోగించి, చేయగలిగినన్ని దండయాత్రలు చేస్తాను. జయించానా సరే సరి. లేదా లెక్కల మాస్టారిని అవుతాను" అన్నాడు చాలా ఈజీగా. తనని తాను తెల్సుకుని,లోకంతో సంఘర్షణ పడకుండా, తన జీవిత గమ్యం, గమనం నిర్దేశించుకుని, ఆ దిశగా ప్రయాణించేవాళ్ళంటే కీర్తికి చాలా గౌరవం. అదే సమయంలో, తన మనసులోని వెలితిని వెలికి తీస్తారని కాసింత భయం.

"మరి మీ సంగెతేంటి..?" అని రఘు అడగ్గానే అర క్షణం కూడా ఆలోచించకుండా " ఏముంది. ఇంజినీరింగ్ అయిపోగానే,ఏదో ఐ.టి కంపనీలో ఉద్యోగం తెచ్చుకుని హాయిగా సెటిల్ అయిపోవడమే" అని మనసులో వున్నది మాటల్లోకి మార్చేసింది. ఆ మాట వినగానే నడుస్తున్న వాడల్లా ఆగి, ఓ చిన్న నిట్టూర్పు విడిచి "మిమ్మల్ని చూస్తే అందరిలా కాకుండా, కొంచెం భిన్నంగా ఆలోచిస్తారేమో అనిపించింది.కానీ మీరు కూడా అందరిలానే ఆలోచిస్తున్నారు. మీరు చదివే ఇంజనీరింగ్ మిమ్మల్ని ఇలా మార్చేస్తుందా..?" అన్నాడు.


ఆ మాటలు కీర్తి ఇగోని తాకాయి. తన గురించి ఏం తెల్సని అందరి కన్నా భిన్నం అని అనేసుకుంటాడు. ఇప్పుడు తన మాటల్లో ఏమి లేదని, అందరిలాంటిదే అని మొహం మీదే అనేస్తాడు అని కోపంతో ఉడికిపోతూ "ఎవ్వరి కలలు, ఆశలు వాళ్ళకుంటాయి. ఇన్నాళ్ళు కష్టపడ్డ వాళ్ళు, మంచి ఉద్యోగం తెచ్చుకుని సుఖపడాలి అనుకోవడంలో తప్పేంటి..? అయినా అందని ద్రాక్ష పుల్లన" అంది. "ఏమో కావచ్చు." అన్నాడు పరమ కూల్ గా. అలా అనడం కీర్తిని ఇంకా బాధపెట్టింది. వాదించడమో, తిరిగి తనని ఇంకో మాట అనడమో చేస్తే బావుణ్ణు అనిపించింది. ఆ రోజు అలా ఓ చిన్న భేధాభిప్రాయంతో ముగిసింది.


మరసటి రోజు పలకరింపుగా నవ్వాడు. ఏమీ జరగనట్టే వున్నాడు. కీర్తి కూడా నవ్వి, తనే మాటలు కలిపింది. ముందటి రోజు వాడి చర్చని దృష్టిలో పెట్టుకుని ఇద్దరూ సొంత విషయాల జోలికి పోలేదు. మామూలు విషయాలే మాట్లాడుకున్నారు. కొందరి పరిచయంలో మనకి మనమే కొత్తగా పరిచయం అవుతాము.రోజులు గడిచేకొద్దీ,రఘు విషయంలో కీర్తికి అలానే అనిపించింది. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు దగ్గరిగా వుండటంతో బోలెడన్ని విషయాలు దొరికేవి మాట్లాడుకోవడానికి. కొన్ని విషయాలు వివరించేది, కొన్ని వాదించేది, కొన్ని సార్లు అరిచి తనే కరెక్ట్ అని ఒప్పుకోవాలని గొడవ చేసేది. అప్పటివరకు తనలో అన్ని ఆలోచనలు, అభిప్రాయాలు, అంత ఆవేశం, ఆరాటం దాగి వున్నాయని కీర్తికే తెలియదు.

********