మా బుజ్జిదాని చిన్నప్పుడు, నాకు నచ్చిన రెండు డ్రెసెస్ ఇచ్చి ఆ రెంటిలో దానికి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోమనే దాన్ని.అది ఒకటి బుద్దిగా పట్టుకునేది. సో చాయిస్ నాది, డెసిషన్ నా కూతురిది. వాట్ ఎ కాంబినేషన్ అని మురిసి ముక్కలు అయిపోయేదాన్ని.అప్పటికీ మా అమ్మ అంటూనే వుండేది, ఇప్పటి నుండీ ఎందుకే దానికీ సెలెక్షన్స్ అని. వింటే బాగుపడి సుఖపడిపోమూ !!
గొంగళి పురుగు సీతాకోకచిలుక అయినట్టు, వీక్లీ సీరియల్స్ డైలీ సీరియల్స్
గా రూపాంతరం చెందినట్టు నా కూతురు ఇండివిడ్యువాలిటీ పెరిగి పెద్దది అయ్యి
నాకు పెద్ద బరువు అయ్యి కూర్చుంది ఇప్పుడు. మా బుల్లి రాకాసి నిద్ర లేచేవరకు , సూర్యుడు బాబాయి మా కిటికీ దగ్గరే
తచ్చాడుతూ తొంగిచూస్తూ వుంటాదు. మా బుజ్జిది లేచింది అంటే చాలు, దాని
అరుపులకి మరియు నా ఆర్త నాదాలకి భయపడి పక్కింటి విండోలోకి షిఫ్ట్
అయిపోతాడు . వెరీ స్మార్ట్ సూర్యుడు .
పొద్దున లేవగానే మొదలెడుతుంది పేంట్ బాలేదు, వేరే పేంట్ అని.
సరేలే "పళ్ళది ఏముంది.. ఎపుడన్నా తోముకోవచ్చు. చంటిది సరదా పడుతుంది "
అని ఆ కలర్ గౌను , ఈ కలర్ పేంట్ అంటూ మన అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం
చేస్తే తర్వాత తల రుద్దుకోడానికి మనకి నెత్తి మీద జుట్టు వుండదు. కప్ బోర్డ్ ఓపెన్ చెయ్యడం వరకే నా పని, ఆ తర్వాత నేను నిమిత్తమాత్రురాలిని. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది పూర్తిగా మన గ్రహస్థితులు, జాతక చక్రం, రాశి ఫలాలు , న్యూమరాలజీ , రంగు రాళ్ళ ప్రభావం తదితర అంశాల మీద ఆధార పడి వుంటుంది .
పోనీ ఏదో ఒక డ్రెస్సుతో అడ్జస్ట్ అవుతుందా అంటే లేదు. పేంట్ పాదాల్ని
ఆల్మోస్ట్ కవర్ చేసేయాలి . ఏం చెప్తాము, పదహారు యూరోల అచ్చమైన తెలుగు బాలిక
మరి.!! కొలతలో ఒక మిల్లిమీటరు తేడా వచ్చినా మేము యూజ్ చెయ్యము అంతే.కేప్రీస్, షార్ట్స్ వేస్తే పాదాల వరకు లాక్కుని లాక్కుని
చింపి ముక్కలు చేస్తే, ఆ ముక్కలు నా వంటిల్లు శుభ్రత - పరిశుభ్రత
కార్యక్రమంలో పాలు పంచుకుని వాటి జన్మని సార్ధకం చేసుకుంటున్నాయి .
పొద్దున్న లేవడంతో మొదలెట్టి, రాత్రి పడుకునే వరకూ వేరే డ్రెస్ , ఇంకో
గౌను అంటూ పాటల్లో వీరోయిను బట్టలు మార్చినట్టు బట్టలు మారుస్తూనే
వుంటుంది. ఈవిడగారు వాడిన బట్టలు వుతికీ వుతికీ, మావి ఉతుక్కునే టైమ్, ఓపికా
రెండో లేక నేను, వాళ్ళ నాన్న మురికి బట్టలేసుకుని ఏబ్రాసోళ్ళలా
తిరుగుతున్నాము.
పోనీ ఇంట్లో వున్నపుడు ఈ వీరంగం అంటే ఏదో గుట్టుగా మూల
కూర్చుని ఓ గంట బాధపడి, ముక్కు చీదుకుని , గ్రీన్ టీ తాగి, ఈ టీవీలో
చంద్రముఖి సీరియల్ చూసి మళ్ళీ రీచార్జ్ అయిపోతాను. ఈ మధ్య ఈవిడ క్రివేటివిటీ ఎల్లలు దాటి నా ప్రశాన్తతకి చిల్లులు పెడుతున్ది.సేంపిల్ కి మొన్న పింక్ కలర్ పేంట్ , ఆరంజ్ కలర్ షర్ట్ , బ్రౌన్ కలర్
జెర్కిన్, యెల్లో కలర్ స్కార్ఫ్ , బ్లూ కలర్ సాక్స్ , గ్రీన్ కలర్ షూస్
వేసుకుంటాను అంటుంది . అటు సూర్యుడు ఇటు తిరిగినా , మోహన్ బాబు మహేష్ బాబు
అయినా, నాకు పద్మశ్రీ అవార్డ్ ఇచ్చినా , పొరపాటున కూడా ప్యాంటు, షర్టు,
స్కర్ట్, మిగిలిన సరంజామా ఒక దానితో మేచ్ అవ్వవు. అన్నిటి కన్నా అన్యాయమైన
విషయం, షూస్ కుడిది ఒక కలర్ , ఎడమది ఒక కలర్ వేసుకుంటాను అంటుంది.
అప్పలమ్మకి అమ్మమ్మలా అన్ని రంగుల బట్టలు వేసుకుని వెళ్తే "పక్కింట్లో టర్కీ వాళ్ళు, కిందింట్లో ఐర్లాండ్ వాళ్ళు, ఎదురింట్లో డచ్
వాళ్ళు ందరూ పిల్లని ఎలా రెడీ చేసిందో అని బుగ్గలు నొక్కుకుని మరీ నన్ను
ఆడిపోసుకోరూ !!!" ఇలాంటి ఘనకార్యాలు చేసి, మళ్ళీ ఆ క్రెడిట్ నా ఖాతాలో వేసి
అన్ని ఖండాల వారి ముంది నా ఇమేజిని ఖండ ఖండాలుగా డేమేజి చెయ్యమంటే ముందు వుంటుంది నా కూతురు .
మా బుల్లి రాణీని రెడీ చేసే టైములో పది మంది హీరోయిన్ల కి
మేకప్ వేసెయ్యొచ్చు దానితో "ఇది బాలేదమ్మా , అలా వేసుకోకూడదు " అని
చర్చించీ చర్చించీ, విఫలం చెందీ చెందీ, జీవితం మీద విరక్తి చెందీ చెందీ , బుజ్జమ్మ వాళ్ళ నాన్నని "ప్రాణ నాధా రక్షించండి కాపాడండి పాహిమాం పాహిమాం మీరే దిక్కు"అని వేడుకుంటాను . వెంటనే ఆయన "ఏమో బాబు ఆ
రంగులు, మేచింగ్స్ గట్రా నాకు తెలీవబ్బా" అనేసి పారిపోతారు . ఇక్కడ మేమేదో
ఇంటర్నేషనల్ ఫాషన్ షోకి వెళ్తున్నాము మరి. అయినా అనకూడదు కానీ ఆ సుమతీ
శతకం రాసిన బద్దెన గారు " తప్పించు తిరుగు వాడు ధన్యుడు సుమతీ " అని కాదు " తప్పించు తిరుగు వాడు మగడు పడతీ " అని రాయాల్సింది.
పోనీ నైట్ డ్రెస్ అయినా ఏదో ఒకటి వేసుకుంటుందిలే వదిలేస్తే అది
తీసుకొచ్చి ఐరన్ చెయ్యు అంటుంది . నేను చెయ్యను పో అంటే "ఐరన్ చెయ్యూ" అంటూ సాగదీసి దబాయించి మరీ వాళ్ళ నాన్న చేత చేయించుకుంటుంది . రాకుమారుడు ఏమన్నా కలలోకి
వస్తాడేమో మరి ???
అదేమి విచిత్రమో పిల్ల ఇంత ఆగం చేసినా "నా కూతురు ప్రత్యేకం. తనదంటూ ఒక
లోకం . తన సాటి ఇంకెవరు రాలేరండీ" అని పాడుకోవాలి అనిపిస్తుంది ఏవిటో!!!
సశేషం. ఇంకా వుంది.
ఇంకా ఇంకా వుంటూనే వుంటుంది.