Wednesday, March 26, 2008
నింగి వంగి మరీ వెక్కిరించింది....
జాబిలమ్మ జాలిగా నవ్వింది.
పచ్చికేమో మొహం మీదే పక్కుమంది.
చల్లగాలి చిటపటలాడింది.
మబ్బులేమో మొహం ముడుచుకున్నాయి
నేలతల్లి మాత్రం అయ్యో నా బిడ్డ అంటూ బాధపడింది.
ఎందుకో తెలుసా...?
ఇంత అందమైన వేసవి రాత్రిని చూసి ఆస్వాదించే
ఓపిక లేదంటూ మొహం వేళ్ళాడేసుకుని, కాళ్ళీడ్చుకుంటూ
ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరిన నన్ను చూసి.......
Monday, March 24, 2008
గమ్యం - ఒక మంచి ప్రయాణం.
Friday, March 21, 2008
సన్యాసిరావు--సినిమా దర్శకుడు అయిపోవాలని వీడికో చిన్నకల
ఇంకో పక్క ఘాటునిజం చానల్ వాళ్ళు, జనాలు వారి చానల్లో ఏ ప్రోగ్రాము వస్తే,ఒళ్ళు తెలియకుండా మైమరిచిపోయి చూస్తారు, ఏ ప్రోగ్రాము వస్తే ఛీ, థూ అనుకుంటూ నిర్దాక్షణ్యంగా చానల్ మార్చేస్తారు అని ఓ భారీ సర్వే ఒకటి నిర్వహిస్తారు. ఫలితంగా చేతికొచ్చిన వెయ్యి పజీల రిపోర్టులో ఒక చిన్న పరిశీలన ఏంటంటే చుట్టూ సమాజంలొ జరిగే నేరాలని విపరీతమైన వివరంగా వివరించి, జనాల్ని అనవసరంగా భయపెట్టి, అతిగా అప్రమత్తం చేసే జనాలు మెచ్చే, ఖర్చు లేని కార్యక్రమం ఒకటి ప్రసారం చెయ్యట్లేదని గుర్తించి, ఇంతవరకు అలా చెయ్యందుకు ప్రగాడంగా విచారించి,కాసేపటకి తేరుకుని ఇక నుంచి తమ చానల్లో వేసెయ్యాలని గట్టిగా నిర్ణయించేసుకుంటారు.
చానల్ పెద్ద తలకాయ అయిడాల అన్నవరం(అ.అ) ఆ కార్యక్రమం డైరక్ట్ చేసే అమూల్యమైన అవకాశాన్ని సన్యాసి రావుకి(స.రా) ఇవ్వాలని పెద్ద మనసుతొ నిర్ణయించేసుకుని సన్యాసి రావుని పిలిపించి బాబూ సన్యాసి ఆ ప్రోగ్రాము నీ చేతుల్లో పెడుతున్నా, ఎలా తీస్తే జనాలు పడీ పడీ చూస్తారు అన్న విషయం మీద లొతుగా పరిశోధన చేసి రా, విజయోస్తు అని దీవించి పంపించేస్తాడు.
అసలు నేనెందుకు ఈ ఊరు వచ్చాను, ఎలాంటి సినిమాలు తీద్దాము అనుకున్నను, చివరకి నా బ్రతుకు ఏంటి ఇలా తయారయ్యింది అని కాసేపు వేరు, వేరు ఏంగిల్స్ లో ముఖం పెట్టి మరీ భాదపడిన తర్వాత నిర్మాతల చుట్టూ తిరగడానికి బొలేడు బలం కావలని, అందుకు డబ్బులు కావాలని గుర్తొచ్చి అన్నవరం చెప్పిన పరిశోధన కార్యక్రమంలో భాగంగా వేరే చానల్స్ లో వచ్చే అన్ని క్రైం ప్రోగ్రాములు చూడ్డం మొదలుపెడతాడు. ప్రోగ్రాములు చూసి,వాటి తీవ్రతకి బాగా దడుచుకున్న సన్యాసి రావుకి మొదటిరోజే నూట ఇరవై డిగ్రీల చలి జ్వరం వచ్చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాన్ని నెత్తినేసి నడిపించే కన్నా, అమావాస్య రోజు,అర్థరాత్రి, శశ్మానంలో కాలక్షేపం చెయ్యడం నయం అనిపించినా మళ్ళీ నిర్మాతల చుట్టూ తిరగడానికి కావాల్సిన బలం గుర్తొచ్చి పరిశొధన లోతు పెంచి, తన బుర్రకెక్కినది అంతా ఏమిటి, ఎందుకు, ఎలా అంటూ డీటైల్డ్ రిపోర్టు ఒకటి రాసి, దాన్ని తీసుకుని పెద్ద తలకాయ దగ్గరకెళ్తాడు.
స.రా: సార్, ఈ కార్యక్రమం నిర్మించాడానికి నాకు కొన్ని వనరులు కావాలి. ముందుగా కల్పిత పాత్రల కోసం నటీనటులు.....
అ.అ: ఏంటి...? నటీ నటులా....? వెళ్ళవయ్యా వెళ్ళి, మహేషు బాబు , ఇలియానా డేట్లూ ఏమైనా దొరుకుతాయి ఏమో కనుక్కో. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు మా ప్రాణాలకి..? కల్పితపాత్రలకి ఎవరైతే ఏంటి..? ఏ దారి పోయే దానయ్యనో, ఊరక కూర్చుని వున్న బోడిలింగాన్నో తీసుకో
స.రా: సరేనండి, ఇంక స్క్రిప్టు రచయిత......
అ.అ: బాబు సన్నాసీ, సారీ సన్యాసి ఇది సినిమా కాదు. అంత భారీ బడ్జెట్టులు మన దగ్గర కుదరవు. మన క్రైం రిపోర్టర్లని అడుగు, చూసింది, చూడంది, వున్నవి, లేనివి అన్నీ కలిపి భయంకరమైన కథ, మాటలు అందించేస్తారు.
స.రా: సరే .ఇంక ప్రోగ్రాము వ్యాఖ్యాత.......
అ.అ: అది కూడా నేనే చెప్పలంటయ్యా....? మీ సినిమాల్లో వచ్చే రౌడీ మూకలో మంచి బొంగురు కంఠం వుండి, పిల్లల్ని ఎత్తుకుపోయేలా వుండే వాడు ఎవడైన వుంటే వాడిని సెట్ చేసేయ్.
స.రా: సరే .......ఇంక చివరగా ప్రోగ్రాము పేరు సార్. మన సమాజం తీరు తెన్నులు అని...
అ.అ: ఏంటీ...? సమాజం...... తీరూ........ తెన్నులా.....? ఇదేమైనా సాంఘిక శాస్త్రం పాఠం అనుకున్నావా..? పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకోవాలి.. ఉదాహరణకి నేరభేరి... ఆహా నేరం భేరి ఇదేదొ బావుంది. ఇదే వుంచేసేయ్.
స.రా: సరే సార్.
మొత్తానికి పెద్ద తలకాయ సౌజన్యంతో నేరభేరి కార్యకమాన్ని ఏదొ అలా ఈడ్చుకుంటూ ఓ మోస్తరు పేరు సంపాదించుకుంటాడు. కానీ ఒకటె బెంగ, క్రియేటివ్ డైరక్టరుతో సినిమా మొత్తం కాకుండా, ఒకటో, రెండో పాటలు తీయించినట్లుగా తన చేత కూడా హత్యలు, దొంగతనాలు మాత్రమే డైరెక్ట్ చేయిస్తారేమోనని.
ఇలా బెంగ పెట్టుకుని చిక్కిపోతుండగా, ఓ బడా నిర్మాత ఫోను చేసి, నాన్న సన్యాసీ నీకో ఫుల్ లెంగ్త్ సినిమా తీసే అవకాసం ఇద్దాము అనుకుంటున్నా అనగానే, మన సన్నీ ఆనందంతో కరెంట్ షాకు కొట్టిన కాకిలా చలనరహితం అయిపోతే, నిర్మాతే మళ్ళీ సినిమా పేరు వంద హత్యలు. సినిమ ప్రారంభం నుంచీ. ముగింపు వరకూ వరసగా హత్యలు జరుగుతూనే వుంటాయి. నీకు నేరభేరితో మంచి అనుభవం వచ్చిందిగా. కాబట్టి నువ్వైతే వంద హత్యలూ విభిన్నంగా, ఉత్కంఠభరితంగా చూపిస్తావని నిన్ను తీసుకోవాలని అనుకుంటున్నా అని అనగానే,సన్యాసేమో కానీ నాకు మణిరత్నంలా మంచి సినిమాలు తియ్యాలని...... అని నసుగుతుంటే నిర్మాతకి బోలెడంత కోపం వచ్చెసింది.మణిరత్నంలా తియ్యడానికి మణిరత్నం వున్నాడయ్యా.. మళ్ళీ నువ్వెందుకు...? ఈ సినిమా హిట్ చెయ్యి చాలు, తర్వాత నీ జాతకమే మారిపోద్ది. ఒక్క పోటు చాలు, చావాలని వుంది, దొంగ, దొంగ నడుమ హంతకుడు, చంపుకుందం రా, ఇలాంటి మంచి మంచి చాన్సులనీ నీకే ఇప్పిస్తాను. సరేనా..?రేపు విలేఖరుల సమావేశం వుంది వచ్చేయ్ అని ఫోను పెట్టేస్తాడు. కానీ విలేఖరుల సమావేశంలో అంత అద్భుతమైన అవకాశం పొందిన సన్యాసి రావు మాత్రం తన స్పందన తెలియచెయ్యటానికి విచ్చేయలేదు. అంతకు ముందు రోజే జీవితం మీద బా...గా.. విరక్తి చెంది, సన్యాసంలో కల్సిపోయి హిమాలయాల్లో తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు.
Saturday, March 15, 2008
మిస్టర్ మేధావి - నిజంగా మేధావేనా....!
ఇంక సుత్తి లేకుండా, సూటిగా( ఇది స్ప్రైట్ ఏడ్ కాప్షన్ నాకు తెగ నచ్చేసింది) ఈ సినిమా గురించి చెప్పాలంటే, చూయింగ్ గమ్ అరగంట నమిలితే బానే ఉంటుంది నోటికి. దాన్నే గంటన్నర నమిలితే పరిస్థితేంటి....? నోరంతా పాడవుతుంది......... ఈ సినిమా కూడా అంతే, తీసుకున్న సబ్జెక్ట్ మంచిది. సాగదీయకుండా మంచి నవల్‌గానో రాస్తేనో ( రాస్తే ఈ కాలంలో ఎవరు చదువుతారు అని నన్ను అడగొద్దు), గంటన్నర నిడివి సినిమాగానో తీస్తే చాలా బావుండేది.కానీ దాన్ని రెండున్నర గంటల సినిమాగా సాగదీసెసరికి, కథలోని ఫీల్ పోయింది .కొంచెం బోర్ కొట్టింది.
ఇంక కథ విషయంలో కి వస్తే, మన హీరో రాజా గారు అనాథ.తాను బ్రతకటానికి వేరే వాళ్ళ బలహీనతల మీద
ఆడుకుని అదే మేధావితనం అనుకుంటాడు. ఆ భ్రమ నుంచి ఎలా బయట పడ్డాడు, మానవ సంబంధాల గొప్పతనం ఎలా తీసుకున్నాడు అన్నదే కథ. రొటీన్ గా లవ్ ట్రాక్ కూడా ఉంది. రాజా కన్నింగ్ ఏక్షన్ చాలా బాగా చేశాడు.
ఇంక ఈ సినిమాలో నీతి(తెలుగు ప్రేక్షకులకి నచ్చాలంటే, అస్సలు నీతి అనే పదం కూడా సినిమాలో ఉండకూడదని దర్శకుడు నీలకంఠ కి ఎవరైనా చెప్పారో లేదో) ఏంటంటే కలసి పని చేస్తే కలదు సుఖం, కలిసి వచ్చును అదృష్టం అని
ఒకరి ఎదుగుదలకి ఇంకొకరు తోడ్పడాలి. అంతే కానీ పీతల్లా ఒకళ్ళని, ఒకళ్ళు కిందకి లాగేసుకోకూడదు.మనసనేది ఈర్ష, అసూయ, ద్వేషాలు లేకుండా అద్దంలా ఉండాలి అని. చూసి వదిలేయకుండా ఆచరిస్తే బానే ఉంటుంది (ఆచరించాలి కదా..!).
కమర్షియల్ ఫార్ములా ఫైట్లు, మాస్ పాటలు లేకపోయినా, బోర్ కొట్టించే సీన్లని ఓపిగ్గా చూసేసి, సినిమాలో ఉన్న మంచిని ఫీలయ్యి, ఆస్వాదించే విశాల హృదయం ఉన్న తెలుగు ప్రేక్షకుడు/ ప్రేక్షకురాలు మీరు ఐతే ఈ సినిమా తప్పకుండా చూడవచ్చు
P.S: నేను ఇందాక ఆకుపకోడీలు టాపిక్ తెచ్చానుగా. మీకు ఎవ్వరికైనా తినాలానిపించి, అవి ఎలా చెయ్యాలో తెలియకపోతే నాకో కామెంట్ ముక్క( ఉత్తరం ముక్కలా) రాసీపడేయండి. మా అమ్మ సహాయ సహకారాలతో ఆకుపకొడీలు-తయారీ విధానం అని ఇంకో పోస్ట్ రాసేస్తాను.
Thursday, March 13, 2008
హమ్మయ్య.... వెయ్యి మైలు రాయిని దాటాను.
నా బ్లాగు మొత్తానికి 1000 హిట్ల గణాంకాన్ని దాటింది. అందులో ఇరవై శాతం హిట్లు నావే అయ్యీ ఉండొచ్చు. అధి వేరే విషయం. వెయ్యికే, లక్ష వచ్చినంత సంబరమా అనకన్డి.. సంబర పడకుండా ఎలా,ఒక అంకె సంఖ్య(0) నుంచి మూడు అంకెల సంఖ్యని(1000) చేరె ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగిపొలేదు మరి. బుర్ర నిండా విశేషాలు ఉన్నప్పుడు చేతిలో సమయం ఉండదు. సమయం ఉన్నప్పుడు, బుర్రన్తా ఖాళీగా ఉంటుంది. ఒక వేళ సమయం ఉంది,ఏదో గొప్ప ఆలోచన వచ్చిందని మొదలుపెడ్తాను, మొత్తం రాసేసరికి ఇంత చెత్తగా రాసింది నేనేనా, అని అనిపించేస్తూ ఉంటుంది. పోనీ ఆలోచన బానే ఉన్నా, నా అర, కొరా ఇంగ్లీషుతో కప్పడిపోయిన మంచి, మంచి తెలుగు పదాలని తవ్వడానికి కాస్త కస్టపడాల్సి వస్తుంది. (వేరే వాళ్ళ బ్లాగుల్లో మంచి మంచి తెలుగు పదాల్ని చూసి నాకు బోలెడంత ఈర్ష వచ్చేస్తుంది ఈ మధ్య). పోనీ అంతా రాశాము అనుకుంటే దానికో శీర్షిక పెట్టడానికి చుక్కలు కనపడ్తాయి. ఈ ప్రహసనం మొత్తం పూర్తి చేసి, పోస్ట్ చేశాక మళ్లీ చదువుతున్నారో లేదో అని కంగారు. ఇలా చెప్పాలంటే బొలెడు. కానీ ఎన్ని కబుర్లుచెప్పినా ఇష్టమైంది ఎప్పుడు కష్టమే కాదు అనుకోండీ.
ఈ ప్రయాణంలో నాన్ను చాలా మంది ప్రోత్సహించారు. మొదటగా కూడలికి నా కృతజ్ఞతలు. కూడలే లేకపోతే ఈ శ్రీవిద్య రాసింది,అంత మంది ఎలా చదువుతారు చెప్పండి.నా బ్లాగు చదివిన వారికి, వ్యాఖ్యలు రాసి,వారి అభిప్రాయాలు తెలిపిన వారికి అందరికి ధన్యవాధాలు.ఇక్కడ కొత్త, పాత బ్లాగరు అన్న భేధం లేధు. అందరినీ ఆదరిస్తారు. మళ్ళీ పది వేలయ్యాక ఇలానే సంబర పడుతూ ఇంకో పోస్టు రాస్తాను. చూడాలి ఎన్నాళ్లు పడుతోందో.
Tuesday, March 11, 2008
మన హాకీ-మన జనం
ఇంకా సమాజం కోసం తెగ పాటు పడిపోయే, ఒక ఇంగ్లీష్ టీవీ చానల్ వాళ్ళయితే మీ అభిప్రాయాలు మయ ఫోన్ ద్వారా అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నెత్తినేసేసుకున్నారు. ఇంక ఆ కార్యక్రమం వివరాల్ళోకికి వెళ్ళిపోతే, కొన్ని అమూల్యమైన అభిప్రాయాలు అభిప్రాయాలు నా చెవిన పడ్డాయి.
ఒకటో కాలర్: నేనైతే కోచ్, ఆటగాళ్ళ వైఫల్యం అనుకుంటున్న అని అన్నాడు (నాకో డౌట్. అతనెప్పుడైనా హాకీ మ్యాచ్ చూసాడా? వళ్ళెవరి పేర్లైనా తెలుసా అని)
రెండో కాలర్: పాపం ఈవిడ ఎవరో కొంచెం పద్దతి కలావిడలా అనిపించింది. మీరు జాతికే సిగ్గు చేటు అని ప్రసారం చెయ్యడం పట్ల నాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఆటన్టె గెలుస్తాం, ఓడతాం. అన్దులో సిగ్గుపడ్దానికి ఏముంది అంది. టీవీ వాళ్ళు క్రీడా స్పూర్తితో తమ తప్పు సరిచేసుకుంటారేమో అనుకొన్నా.కానీ ఎప్పటిలానే వారి విలువల విషయంలో నా అంచనాలను తారు మారు చేస్తూ, మన ఏంకర్ గారు ఎన్దుకనకూడదు. హాకీ మన జాతీయ క్రీడా(ఇప్పటకి గుర్తు వచ్చిందేమో) అందులో దారుణంగా ఓడిపోవడం సిగ్గు చేటే మరి అని సమర్దించేసుకున్నాడు.
మూడో కాలర్: ఈ కాలంలో హాకీ అంటే ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదు. కాలంతో పాటే మనమూ మారాలి. హాకీని జాతీయ క్రీడగా తీసేసి, క్రికెట్ పెట్టండి అని ఓ సలహా పారేసాడు.(వార్నీ..... ఇలాంటి జనాలు కూడా ఉంటారా...? రేపెప్పుడైన ఆదరణ లేకపోతే మన పేర్లు, ఊరి పేర్లు, అలవాట్లు అన్ని మార్చేసుకోవాలేమో. ప్చ్.. కలికాలం).
నాలుగో కాలర్: ఇది మొత్తం హాకీ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. ఇందుకు నేను చాలా సిగ్గుపడుతున్నానని తెగ భాదపడిపోయాడు. (వీడెవడికో రాజకీయ నాయకుడి లక్షణాలు బాగా ఉన్నాయి)
ఐదో కాలర్: ఈయన మాటలు నాకు బాగా నచ్చాయి. మన దేశములో క్రికెట్ తప్ప వేరే ఆటకి ప్రోత్సాహమే ఉండదు.ఆసియా కప్ గెలిచి వస్తే పట్టించుకున్న నాధుడే లేదు. పరమ చెత్తగా క్రికెట్ ఆడే ఆటగాడు కోటీశ్వరుడు ఐతే,అద్బుటంగా హాకీ ఆడే బీదవాడు అయి ఉంటాడు. ఇకెన్కడి నుంచి వస్తుంది మోటీవేషన్. క్రికెట్ ఆతగాళ్ళు ఐదు నక్షత్రాల హోటెల్లో బస చేసి, ప్రధానితో ముచ్చట్లాడుతుంటే, హాకీ ఆతగాళ్ళు ఒక చిన్న హోటేల్లో,రెండు రోజులు ప్రధానిని కలవటం కోసం వేచివున్నారు అని మా బాగా వివరించి చెప్పారు.
ఆరో కాలర్: చక్ దే ఇండియా షారూక్ ఖాన్ తప్పు ఇదంతా అని ఓ చెత్త జోక్ వేసాడు.( రామయణమ్లో పిడకల వేటలా ఈ జోక్ వెయ్యడం అవసరమా..? ప్రజాస్వామ్యం)
ఏడవ కాలర్: ఈవిడెవరో అందరి కన్నా భిన్నంగా మాట్లాడాలని తాపత్రయ పడింది. అంతా క్రికెట్ని మధ్యలో నింధిస్తున్నారు. హాకీ సమాఖ్య కూడా బీసీసీఐ వాళ్ళలా ఆటగళ్ళని ప్రోత్సహించాలి, ప్రతిభని వెతికి పట్టుకోవాలి. అన్ని చోట్ల హాకీ ఆడ్డానికి సదుపాయాలు పెంచాలి అని ముగించింది (పాపం మన ఏంకర్ ఏడ్వలేక నవ్వుతూ, ఇవ్వన్నీ చెయ్యడానికి డబ్బులేకే కదా ఈ తిప్పలన్నీ అని అన్నాడు) అదీ అసలు సంగతి.
మన భారత జాతి క్రికెట్ తప్ప వేరే ఆట చూడదు. ఆటకి ఆదరణ లేకపోతే ఎవ్వరూ స్పాన్సర్ చెయ్యరు. కావున డబ్బులు ఉండవు.ఐనా ఆటగాళ్ళు దేశం కోసం కష్టపడి ఆడెయ్యాలి. ఒకవేళ కష్టపడి గెలిస్తే మన పట్టించుకోం. ప్రభత్వం రూపాయి విదల్చదు (జాతీయ క్రీడా ఐనా సరే) ఓడిపోతే మాత్రం జాతి మొత్తం భాదపడిపోతాం. అందర్నీ దుమ్మెత్తిపోసేస్తాం. జాతీయ క్రీడ కదా..... హాకీ క్రీడా వ్యవస్తలో తేడాలు, లూకలుకలు ఉంది ఉండచ్చు. కానీ ఈ రేన్జులో దుమ్మెత్తిపోసే అర్హత మన భారత జాతికి ఉందా అని నా అనుమానం.
ఇదంతా చూసిన తల్లితండ్రులు తమ పిల్లల్ని ఆడితే క్రికెట్ ఆడు లేదన్టే బుద్ధిగా బట్టీ కొట్టి, ఇంజినీరింగ్ చదివి, సాఫ్త్వేర్ ఇంజినీర్ అవ్వు అని హింసించినా ఆశ్చర్యపోనక్కర్లేదు