అది నేను "జూ"నియర్ ఇంటర్ కాలేజీలో చేరబోతున్న రోజు.అంటార్టికా ఖండం నుంచి తీతువు పిట్ట నీకు మూడిందే అన్నట్టు భయంకరంగా సింగుతోంది. ఆటోవాడ్ని కాలేజీ ముందు ఆపమనగానే, వాడు సడెన్ బ్రేక్ సడెన్ గా వేసి, కాలేజి వంక అసహ్యంగా, నా వంక అత్యంత జాలిగా చూసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు.
ఫార్మాలిటీస్ అయ్యాక, మా ప్రిన్సిపాల్ నా చేతిలో ఒక పేపర్ పెట్టాడు. హాలిడేస్ లిస్టేమో అని ఆత్రంగా తెరిచిచూసాను. అది.. అది.. టైం టేబుల్. దాని సారాంశం నా భాషలో క్లుప్తంగా చెప్తా."పొద్దున్నే నాలుగింటికి లేచి ఓం రుబ్బుడాయ నమహా అనుకుంటూ రోలు చుట్టూ వందసార్లు తిరిగి, పుస్తకాలు ముందేసుకుని రుబ్బాలి. తర్వాత ఓం బాదుడాయ నమహా అనుకుంటూ రోకలి ముందు వెయ్యిసార్లు పొర్లాక క్లాసుకెళ్ళాలి. అక్కడ సారు సాంబారు, నల్లతారు కలిపితే సెలయేరు అవుతుందని బోధించినా నోర్మూసుకుని బాదించుకోవాలి. సాయత్రం మళ్ళీ ఓం రుబ్బుడాయ నమహా అని లక్షసార్లు అనుకుని సారు చెప్పినవి, చెప్పనవి, చెప్పబోయేవి, చెప్పలేనివి అన్నీ కలిపి అర్ధరాత్రి వరకు రుబ్బేయాలి.సరిగ్గా రుబ్బని మొండిపిల్లలకి క్రిమీభోజనం, కుంభీపాకం లాంటి లైటువెయిట్ శిక్షలు విధించబడతాయి".అది చూసి కళ్ళు తిరిగిపడిపోయాను.
కొన్ని యుగాల తర్వాత కళ్ళు తెరిచి "నేనెక్కడ వున్నాను. నాకేమయ్యింది" అన్నాను తెలుగు సినిమా హీరోయిన్లా.. "క్లాసురూములో వున్నావు. నువ్వు పడిపోయినా, ఈ సబ్ కాన్షస్ మైండ్ పాఠాలు వింటుందని ఇక్కడకి తీసుకొచ్చారు" అంది పక్కనమ్మాయి మెరుస్తున్న కళ్ళతో. ఇంతలో ఎవరివో ఆర్తనాదాలు వినిపించాయి. ఆ కేకలు..ఆ కేకలు ఇంతవరకు పాఠాలు విన్న నా సబ్ కాన్షస్ మైండ్వి. ..అలా మొదలయ్యాయి నా రుబ్బుడు కష్టాలు.
ఆ కష్టాలు భరించలేక క్లాసులొ నాకు తలనొప్పి వచ్చేసేది. స్టడీ అవర్స్లో చెవి నొప్పి, స్లిప్ టెస్టులొ నాకేమి రాకపోతే పంటి నొప్పి. అప్పుడప్పుడు వెరైటీ కోసం కాలినొప్పి, వేలినొప్పి, గోరునొప్పి, జడనొప్పి వగైరా వగైరా.... ఇలా నేను నొప్పులు, వాటి గొప్పలు, తప్పుగా వాడితే నెత్తికి కట్టే బొప్పులు అనే విషయం Ph.D చేసి ఝండు బాం, అమృతాంజనం వారు సంయుక్తంగా అందించే డాక్టరేట్ అందుకోబోయే సమయంలో నా కర్మకాలి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసాయి. మా ప్రిన్సిపాల్ సారు పిలిచారు. లొపలకెళ్ళగానే "ఏంటి తల్లీ.. ఇలా చేసావు. లెక్కల్లో 150 కి 160 (???) వస్తాయి అనుకుంటే 140 మాత్రమే తెచ్చుకున్నావు. ప్రాక్టీసు సరిగ్గా చెయ్యలేదా..? చెప్పు" అని కిచ్ కిచ్ వేసుకోని గరగరమనే గొంతుతో గద్దించాడు.
ఊరికే సర్దాకి చదవాలినిపించక చదవలేదని చెప్తే చీరేస్తాడని నా ఆత్మసీత హెచ్చరించింది. అందుకని ఎందుకొచ్చిన గొడవలే అని మౌనంగా వుంటే నా మౌనాన్ని అపార్ధం చేసుకుని "సర్లే తల్లీ. బాధపడకు. బెటర్మెంట్ కట్టేసేయ్. ఈ సారి మంచి మార్కులు తెచ్చుకో" అనగానే సముద్రాలు పొంగుతున్న ఫీలింగ్, భూకంపం వచ్చినంత షేకింగ్, హెడ్ బ్రేకింగ్. నేను పరీక్షలకి కష్టపడి చదివేదే ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలని. పాసయిపోయాక కూడా మళ్ళీ పరీక్ష ఎందుకు రాయాలి..? ఆ క్షణంలో నాకు అర్జెంటుగా ఆడ సన్యాసుల్లో కల్సిపోవాలి అన్నంత విరక్తి వచ్చింది.
రూముకెళ్ళి ఏం చెయ్యాలో తోచక దీనంగా కూర్చున్నా. శ్రావ్య వచ్చి " ఏంటి విద్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు" అని అడిగింది."ఏముంది శ్రావ్యా.. బెటెర్మెంట్ ఎలా ఎగ్గోట్టాలా అని" అన్నా మరింత దీనంగా మొహం పెట్టి."ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది. ఎప్పట్లానే మళ్ళీ మోకాలి నొప్పి అని చెప్పు" అంది నవ్వుతూ.ఆక్షణంలో దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తొందర్లోనే నేను సన్యాసుల్లో చేరబోతున్న విషయం గుర్తు వచ్చి శాంతం శాంతం అనుకుంటూ ఎలానో నిగ్రహించుకున్నా. "మళ్ళీ నొప్పంటే చెప్పు తీసి కొడతారే. మీరేదైనా మంచి కత్తిలాంటి జబ్బు పేరు పుణ్యం కట్టుకోండే" అని బతిమాలుకున్నా."ట్యూమరో, కాన్సరో అని చెప్పు. భయపడిపోయి ఇంటికి పంపేస్తారు" అంది నాకుమల్లే GKలో జీరో లెవెల్ కి కింద , CK(సినిమా నాలెడ్జ్)లో ఇనిఫినిటీ కి పైన వుండే రేణు."చీ నోర్ముయ్.. ట్యూమర్, కాన్సర్ అని మనం చెప్పకూడదు. డాక్టర్ చెప్పాలి.." అంది ఇంకో అమ్మాయి..ఆ లోపు Bi.P.C పిల్ల నిషా అవిడియా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది."అప్పుడెప్పుడో ఊపిరి ఆడట్లేదని మాధురి అంటే దానికి పదిరోజులు సెలెవిచ్చారు. నువ్వు ఊపిరి ఆడట్లేదని నటించు." అంది విజయగర్వంతో...
నిజం చెప్పొద్దూ.. నాకూ ఆ అవిడియా పిచ్చపిచ్చ్గగా నచ్చేసింది. నొప్పి నొప్పి అని చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. అసలే ఆలస్యం చిరంజీవి బాలకృష్ణ అని సెట్టింగ్స్, కాస్ట్యూంస్ అన్నీ చకా చకా సిధ్ధం చేసి రిహార్సల్స్ కూడా చేసేసాం. నటించడం కూడా సుళువు. గాలి కొంచెం గాట్టిగా.... గబా గబా.... పీల్చాలి అంతే. కానీ.. కానీ... ఊపిరి ఊరికే ఊసుపోక ఆందకుండా పోదని,దానికీ కొన్ని బలమైన కారణాలు వుంటాయన్న విషయం ఆ ఊపులో మ ఎవ్వరి ఊహకి అందలేదు. మనమొకటి తలిస్తే మాస్టార్లొకటి తలుస్తారని మా ఫిజిక్స్ సారు మా డ్రామా లొకేషన్ హాస్పిటల్ కి మార్చేసారు. లొకేషన్ ఏదైనా డెడికేషన్ తో చెయ్యగల సత్తా నాకున్నా బలంగా ఎత్తుగా ఎస్వీ రంగారెడ్డిలా వున్న డాక్టరుని చూస్తే కొంచెం దడ పుట్టింది.
ఆయన విషయం కనుక్కుని స్టెతస్కోపుతో నా గుండె ఇంకా కొట్టుకుంటుందని నిర్ధారించేసుకుని "పరీక్షలు ఏమైనా వున్నాయా" అని అడగ్గానే.. మేటర్ తెల్సిపోయిందేమొనని టెన్షన్ వచ్చేసి గబుక్కున స్టూల్ మీంచి జారిపడబోయాను. ఈలోగా మా ప్రిన్సిపాల్ చేతిలో ఏదో ఇంజెక్షన్ పట్టుకుని దిగాడు. "డాక్టరు గారు మా పిల్లకి ఊపిరాడటం లేదని డెరిబిలీన్ ఇంజెక్షన్ తెచ్చా. చేసేయండి." అంటుంటే ఆయన్ని ఎత్తి గిర గిరా తిప్పి అవతల పడేయాలన్నంత కోపం వచ్చింది. దిక్కుమాలిన కంగారు . అవతల డాక్టరు చూసున్నాడుగా. "ఏమీ అవసరం లేదు. పరీక్షల టెన్షన్ అంతే" అంటున్నా సరే ఆగకుండా "పర్లేదు చేసెయ్యండి. పడి వుంటుంది.అసలే వారంలో పరీక్షలు" ఆయన అంటుంటే నిషా వంక దీనంగా చూసా..అదేమో అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అన్నట్టు ఇంకా దీనంగా చూసింది.
ఈలోపు నర్స్ లైటేసింది. అవసరమైనపుడు అసలు పని చెయ్యని నా బుర్ర ఆ క్షణం అడక్కుండానే పని చేసి ఒక తొక్కలో థియరీని కనిపెట్టి చచ్చింది.. "ఆరివున్న బల్బ్ స్విచ్ నొక్కితే వెలిగింది. అదే వెలుగుతున్న బల్బ్ స్విచ్ నొక్కితే ...... ఆరిపోతుంది. అలానే ఊపిరి లక్షణంగా ఆడుతున్న నాకు ఆ ఇంజెక్షన్ ఇస్తే నా ఊపిరి... ఆగిపోతుందా" అంత వెధవ లాజిక్ వర్క్అవుట్ చేసిన నా బుర్ర మీద నాకే వెర్రి కోపమొచ్చింది. పోనీలే నా బుర్రని డైవర్ట్ చేద్దామని గోడల వంక, వాటి సున్నాల వంక చూడ్డం మొదలెట్టా. మరేమో గోడ మీద దండేసి వున్నడాక్టర్ గారి నాన్నారి ఫొటో ప్లేసులో నా మొకం కనిపించింది. నాకంత ఊహాశక్తి ఇచ్చిన దేవుడి మీద ఇంకా కోపం వచ్చింది.
ఈలోపు "మేస్టారు. మీరు కంగారుపడకండి. మై హూ నా" అని డాక్టరంకుల్ అంటుంటే ఆయన కృతజ్ఞత వరద నీరులా పొంగి పొర్లింది. "చూడమ్మా పరీక్షలు రిక్షాల్లాంటివి. మనం రిక్షాలాగేటోళ్ళమన్న మాట. అసలు రిక్షావోళ్ళు మన రిక్షా బక్కోడు ఎక్కుతాడా,బండోడు ఎక్కుతాడా, మనం తొక్కగలామా లేదా ఇలాంటి బెంగలు అసలు పెట్టుకోరు. అలాగే మనం కూడా మనం చదివెలగబెట్టిన ఒకే ఒక చాప్టర్లో నుంచి ప్రశ్నలు వస్తాయా, రావా మనం పాసవుతామా లేదాలాంటి వెర్రి సందేహాలు పెట్టుకోకూడదు. అర్ధమయ్యిందా... కాసేపు బయటికెళ్ళికూర్చో " అన్నారాయన. నాకు చిరాకేసింది. పాసయిపోయిన పరీక్ష గురించి నేనెందుకు బెంగ పెట్టుకుంటాను. కాసేపటికి మా ప్రిన్సిపాల్ బయటకి వచ్చాడు.డాక్టరంకుల్ ఏం చెప్పాడో కానీ "సర్లే తల్లీ.. ఈ పరీక్షలు గురించి పూర్తిగా మర్చిపో.. టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు" అంటుంటే నాకు డెబ్యూట్ సినిమాకే "నటీముత్యం" బిరుదు ఇచ్చినంత సంబరం వేసింది.
మొత్తానికి అలా పరీక్షల లంపటం అంత కష్టపడి వదిలించుకుని ఆటోలొ కూలబడి ఓ రెండుగంటల హైడ్రామా తర్వతా ప్రశాంతంగా, స్వేచ్చగా గాలి పీల్చుకున్నాను. అదొట్టి అనుమానపు గాలేమో, వెంటనే నాకో పిచ్చి డౌట్ వచ్చింది. "నిషా.. నాది ఏక్షన్ అని సారుకి అనుమానం వచ్చిందంటావా.." అని అడిగాను కుతూహలంగ...."నీ మొహం. ..నువ్వలా జీవించేస్తూ అరకొరగా ఊపిరి పీల్చడం వల్ల నిజంగా ఊపిరాడటంలేదేమో అని.. నాకేభయం వేసింది" అంది కోపంగా.
సరిగ్గా అప్పుడే ఆటో ఆగింది. ఆటోవాడు వెనక్కి తిరిగాడు. వాడు.. వాడు మొదటి రోజు కాలేజీలో డ్రాప్ చేసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయినోడు. "చెల్లెమ్మా. ఈ డొక్కు కాలేజీలో చదివి ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటున్నాను. నిన్ను చూస్తే గర్వంగా వుందమ్మా. ఆ ఆ రుబ్బుడు భూతం ప్రిన్సిపాల్ .......ని నమ్మించగలిగావంటే నీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. నీ రాక సీరియళ్ళకి స్వర్ణ యుగం, సువర్ణ యోగం తెస్తాయమ్మా..." అంటూ ఆటొ అన్నయ్య ఊగిపోతుంటే ఆ షాకుకి నాకు నిజంగానే ఊపిరాడటం మానేసింది.