జీవితంలో ఎంత సాధించాలి? ఎన్ని సాధించాలి? ఏమి సాధించాలి? అసలు జీవితాన్ని సాధించాలా… లేక సాగించాలా, ఏదోలా లాగించేయ్యాలా ?
నాకైతే సమాధానం ఒక్కటే. సాధించాలి. గొప్పగా బతకాలి. అడుగు వేస్తే ఆకాశాన్నే అందుకోవాలి,గురి పెడితే ఏనుగు కుంభస్థలాన్నే తాకాలి. నరసింహ సినిమాలో పాట వుంటుందిగా . జీవితం అంటే పోరాటం, పోరాటంలో వుంది జయం అన్న టైపులో.
చిన్నప్పుడు ఈనాడు పేపర్లో "విజేతల కథలు" చదివేదాన్ని. Think Big లాంటి పుస్తకాలు చదివేదాన్ని. అప్పటినుంచి నా నమ్మకం ఒక్కటే, జీవితాన్ని గెలవాలి. ఏదోలా బతికెయ్యడం కాదు, గొప్పగా బతకాలి. ఏదోలా ఈదుకుంటూ వెళ్లిపోవడం కాదు,అలల్ని చీల్చుకుంటూ తీరాన్ని చేరాలి…
చిన్న ఆలోచనలు, చిన్న లక్ష్యాలు, చిన్న అడుగులు అంటే చిన్నతనంగా అనిపించేది. పెద్ద లక్ష్యాలు, పెద్ద విజయాలు, పెద్ద జీవితం…ఇదీ జీవితం, అదీ లెక్క.
ఉన్నదానితో కులాసాగా బతికేవాళ్లను చూస్తే, "వీళ్ల కలలకు రెక్కలు లేవా? లేక ఆకాశమే అవసరం లేదనుకుంటున్నారా?" అనిపించేది.
నా మనసంతా అసంతృప్తి, అలజడి. ఏదో లేదనే లోటు… ఇంకేదో కావాలనే తపన… సాయంత్రానికి అలసట, ఆయాసం.
ఆ అసంతృప్తి ప్రతిరోజూ నన్ను ప్రశ్నించేది…
"ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఎక్కడో ఉండాలి కదా! ఇంతే సాధించావా? ఇంకా ఎంతో సాధించాలి కదా! అప్పుడే అలసిపోయావా?"
నా ఆలోచనలు చాలు… నన్ను తినేయడానికి, నమిలేయడానికి, నలిపేయడానికి. నాకు వేరే శత్రువులు అవసరమే లేదు.
పోనీ ఈ విజయ భేరి , జైత్ర యాత్ర ఏదో ఒక్కవిషయంలో ఉంటే సరిపోదు . అన్నింట్లో , అంతటా విజయభేరి మోగాల్సిందే.
ఆఫీస్ లో పది మంది పది నిముషాల్లో చేసెయ్యాలి, ఇరవై నిముషాల్లో ఇరవై పుస్తకాలు చదివి వంటబట్టించేస్కోవాలి . ఇంట్లో వంద రకాల వంటలు వంద సెకనులో వండి పడెయ్యాలి. ఇల్లు అద్దంలా మెరిసి మెరిసిపోవాలి. యోగ , మెడిటేషన్ , జిమ్ , గిమ్ము, గమ్ము అన్నీ చేసి పడెయ్యాలి. మనిషి సంఘ జీవి కదా . కాబట్టి సోషల్ కమిట్మెంట్స్ అన్నీ కూడా చక్కబెట్టి చుట్టబెట్టయ్యాలి, ఇలా ఉంటుంది మన వరస . ఇన్ని పనులు, ఇన్ని పంచాయితులు పెట్టుకుంటే అలసిపోక అబ్రహం లింకన్ అవుతావా అని అడగొద్దు .
"ఇన్ని ఎలా సాధ్యమవుతాయి?" అని అడిగితే…"కుదరదు కాదు… కుదరాల్సిందే!" అంటాను.
"ఒకటో రెండో ప్రాధాన్యతలు ఎంచుకో" అంటే ఎలా? నేను నేటి మహిళను కదా! అన్నిట్లో నేనే, అంతటా నేనే. లేదంటే నేనేదో వెనకబడిపోయాను అన్నమాట.
మళ్ళీ చేసేదంతా పెర్ఫెక్టుగా ఫ్లాలెస్సుగా ఉండాలి , ఈ పెర్ఫెక్షనిజం అక్కయ్య గురించి ఇంకో రోజు మాట్లాడదాము.
అప్పుడు చదివాను, ఫోర్ బర్నర్స్ థియరీ. ఇది నాలాంటి తిక్క పుల్లమ్మల కోసం అన్నమాట. డేవిడ్ సెడరీస్ అనే గురువు గారు చెప్పింది ఏంటంటే జీవితం అనేది ఫోర్ బర్నర్స్ వున్న గ్యాస్ పొయ్యిలాంటిది. ఒక బర్నర్ ఫ్రెండ్స్, ఒకటి వర్క్, ఒకటి ఫామిలీ , ఒకటి హెల్త్. ఒకటి అఖండ జ్వాలలా వెలిగిపోవాలి అంటే, మిగతా ఒకటి లేదా రెండు బర్నర్ల మంటను కొంచెం తగ్గించాల్సిందే అని.
ఉదాహరణకి మన ఎలాన్ మస్క్ అన్నయ్య వున్నాడు అనుకోండి, అస్సలు యాపారంలో అఖండంగా వెలిగిపోతున్నాడు. పాపం ఫ్యామిలీతో , పిల్లలతో కొంచెం గొడవలు మనోడికి.
అప్పుడు అర్థమైంది…
సమస్య నేను ఎంచుకున్న శిఖరాల ఎత్తులో లేదు…ప్రతి శిఖరాన్ని ఒకేసారి అధిరోహించాలనే ఆరాటంలో ఉంది.భారం నా లక్ష్యాల్లో లేదు…ప్రతి గమ్యాన్ని ఒకే ప్రయాణంలో చేరాలనే మొండి పట్టుదలలో ఉంది.
ఆలోచిస్తే అన్నీ కావాలి. వేటి టైం వాటికివ్వాలి, వేటి ప్రయారిటీ కావాలి . అన్నీ కావాలి అనుకున్నపుడు కాసింత కూసింత చాలు అనుకోవాలి , అంతే గానీ అన్నీ కొండంత కావాలి అనుకోకూడదు.
అలానే అసంతృప్తికి సంతృప్తికి అతి సంతృప్తికి ఒక చిన్న లైన్ ఉంటుంది. వుంది చాల్లే అని చల్లబడిపోకూడదు, లేదు లేదు అని చతికిలపడకూడదు. ఒక్కో టైములో ఒక్కోదానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వేరే దాన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఒక్కోసారి వర్క్ ప్రయారిటీ అవుతుంది. అప్పుడే వేరే దగ్గర స్లో డౌన్ అవ్వాలి , ఇంకో సారి పిల్లలు ప్రయారిటీ అవుతారు , అప్పుడు వర్క్ స్లో డౌన్ అవ్వాలి.
చిన్నప్పుడు "మానవ ప్రయత్నం మనం చేయాలి, ఫలితం ఏదైనా ఆనందంగా స్వీకరించాలి" అంటే, "ఇదేం మెట్ట వేదాంతం!" అనుకునేదాన్ని.
ఇప్పుడు అర్థమైంది…
అది మెట్ట వేదాంతం కాదు. జీవిత సారాంశం.
బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు, విజయాలు, గుర్తింపు, ఇవన్నీ జీవితం కోసం. జీవితం వీటి కోసం కాదు.
చివరికి గొప్ప జీవితం అంటే అన్నింటినీ గెలవడం కాదు.
ఏ సమయంలో ఏది ముఖ్యమో తెలుసుకుని, దానికి మనస్ఫూర్తిగా సమయం ఇవ్వడం… అదే నిజమైన విజయం.
జీవితాన్ని సాధించాలనే తపన ఉండాలి. కానీ ఆ తపనలో జీవితాన్నే కోల్పోకూడదు.

No comments:
Post a Comment