పనిదేవుడి అనుగ్రహం సంపాదించడం ఎలానో నేను మీకు చెప్తాను అనుకుంటున్నారా..? అబ్బబ్బే అదంత వీజీ అయితే నేను ఈ పోస్ట్ ఇంత భారమైన హృదయంతో(అంటే బోల్డంత బాధపడిపోతూ అన్న మాట) ఎందుకు రాస్తాను చెప్పండి?అస్సలు ఈ పని దేవుడు ఎవర్రా బాబు తల పట్టుకుంటున్నారా..?అయితే మీకు ముందు నా పని కష్టాల గురించి కుంచెం నాలెడ్జ్ ట్రాన్సఫర్ చెయ్యాలి.అస్సలు అన్ని కష్టాల్లోను పేద్ద పేద్ద భయంకరమైన,భీభత్సమైన, దారుణమైన కష్టాలు ఈ పని కష్టాలు. ఫ్రిజ్జులో పాలు పెట్టు బంగారం అంటుంది అమ్మ... బంగారం అనగానే ఉబ్బిపోయి ఆనందంగా, నేను పని చెయ్యగలను అని అమ్మ నమ్ముతోంది అని గర్వంగా పాలు ఫ్రిజ్జులో పెడ్తానా..? అదేంతో తెలీదు కాని తిరిగి చూసేసరికి సగం పాలు నేల మీద, మిగతావి ఫ్రిజ్జులోనూ (మొత్తానికి అన్నీ) ఒలిగిపోతాయి.అమ్మేమో బంగారం అన్న నోటితోనే ఒక్క పని సరిగ్గా చెయ్యవు కదా...? పనికి డబుల్ పని ..ఏం పిల్లో ఏంటో అని విసుగేసుకుంటుంది. నేనేమో ఫుల్ హర్ట్ అయిపోతాను....ఇందులో నా తప్పేమి వుంది చెప్పండి?
ఇంక వంట, అదేం వంటో ఏమో, ఒక్కో వేపుడుకి ఉల్లిపాయలు ముందు వెయ్యాలి, ఒక్కోదానికి తర్వాతా వెయ్యాలి, కాసేపు సింలో పెట్టాలి, కాసెపు హైలో పెట్టాలి..కొంతసేపు మూతపెట్టాలి, కొంతసేపు తీసెయ్యాలి... ఒక్కటీ పద్దతిగా వుండదు. అదే మాట అమ్మతోఅంటే "నీ బొంద, వాటికి పద్దతి లేకపోవడం కాదు" నీకు వంటంటే శ్రద్ద లేదు అంటుంది...
అందుకే ఒకసారి పౌరుషానికి పోయి శ్రద్దగా నేర్చుకోవాలని గాట్టిగా డిసైడ్ అయ్యి అమ్మా అమ్మా ఈ రోజు నేను కూర వండుతాను, వండుతాను అని బాగా పోరాడాను....పాపం అమ్మేమో పెద్దమనసుతో "పాపం పిచ్చి మాలోకం సర్దా పడిపోతుంది. మొన్న మాడ్చింది సరే, ఈ సారైనా బాగా వండకపోతుందా" అనే ఆశవహ ధృక్పధంతో (నిజానికి నా నస హింస భరించలేక) తన వంటింటి సామ్రాజ్యపు పగ్గాలు నా చేతికిచ్చింది..మొన్న మాడ్చాను కాదా ఈ సారి ఎలా అయినా మాడ్చకుండా వండాలనే పట్టుదలతో దాన్నే చూస్తూ, కలుపుతూ, కెలుకుతూ శ్రద్దగా వండి వార్చి టేబుల్ మీద సర్దాను.
ఈలోపు నాన్న వచ్చారు.నాన్నని సప్రైజ్ చేసెయ్యాలి అన్న అవిడియాతో (వండింది నేను అని తెలిస్తే ఆకల్లేదని పారిపోతారేమోనన్న అనుమానంతో) నేనే వండానని చెప్పకుండా ఏమి చెప్తారా అని అని ఆత్రంగా పక్క రూములో వెయిట్ చేస్తున్నాను. ఇంతలో నాన్నేమో "లక్ష్మీ కూర అమ్ములు చేసిందా" అనగానే నేను చేసానని నాన్నకెలా తెల్సింది, అంత బాగా చేసానా అని ఆశ్చర్యపోయి, అనందపడిపోయి, హార్ట్ అటాక్ తెచ్చేసుకునేలోపులోనే "ఈ రోజు... అస్సలు వుడకలేదు. అందుకే అలా అడిగాను" అని గాలి తీసేసారు.నేనేమో "అమ్మ వండినపుడు కూడా అప్పుడప్పుడు సరిగా వుడకదు కదా మరి నేనే చేసానని ఎలా అనేస్తున్నావు" అని యుద్ధానికి దిగాను..నాన్నేమో నవ్వుతూ "మీ అమ్మ వండితే ఎప్పుడైనా అక్కడక్కడా ఉడకదు... నువ్వు వండితే ఎప్పుడూ ఒక్క ముక్క కూడా ఉడకదు, లేకపోతే నల్లగా మాడిమసయిపోతుంది...అయినా నీకెందుకు తల్లీ ఈ పాట్లు" అనేసి వెళ్ళిపోయారు.. నాకైతే మాకెందుకమ్మా నీ వంటలు అన్నట్టు వినిపించింది.. ప్చ్..ఏం చేస్తాము... ?
అప్పుడెప్పుడో లండన్లో వున్న మా అన్నయ్య, నిమ్మకాయల పప్పు ఎలా చెయ్యాలో అమ్మని అడుగు అని మెయిల్ పెట్టాడు. "దున్నపోతు,తొక్కలో నిమ్మకాయల పప్పు ఎలా చెయ్యాలో నాకు తెలీదు అనుకుంటున్నాడా..?అమ్మని అడిగి అని చెప్పు అని నా మేధస్సుని అవమానిస్తాడా" అని కేజీలు కేజీల రోషం వచ్చేసింది. ఆ దిక్కుమాలిన రోషంతో "ఏముంది సింపులే పప్పు వుడకబెట్టుకో,రసం తీసి పక్కన వుంచుకో,పప్పు, రసం, ఉప్పు, పోపు కలిపి పొయ్యి మీద కాసేపు వేడిచేసేసుకో,అంతే ఘుమఘుమలాడే నిమ్మకాయ పప్పు రెడీ" అని మెడ నొప్పి పుట్టేలా బాగా తల పైకెత్తి సగర్వంగా మెయిల్ పెట్టాను.
వాడు వెంటనే ఫోన్ చేసి "పప్పు,నిమ్మకాయ రసం కలిపి వేడి చేస్తే చేదుగా అయ్యి తగలడిపోద్ది..నిద్రమొహం..." అని ఫోన్ చేసి మరీ పడీ పడీ నవ్వాడు... అంత తెల్సున్న పోటుగాడు నాకెందుకు మెయిల్ పెట్టాలొ, ఎందుకు అంతలా నవ్వి నా ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టాలో..?..అంతా ప్రతిపక్షాల కుట్ర. అందుకే అంటాను రోషం, పౌరుషంలాంటి బరువైన ఎమోషన్స్ మనకంతగా సూట్ అవ్వవని.
పోన్లే వంటలాంటి సంక్లిష్ట కార్యక్రమాలు మనకి అచ్చి రాలేదులే అని చిన్న చితకా పనుల మీద చెయ్యి వెయ్యాలని ఘాటుగా, గాఢంగా (ఈ విశేషణాలు తప్పయితే తిట్టకండి, బావున్నాయి కదా అని వాడేసాను) నిశ్చయించుకుని అమ్మ గుడికెళ్ళినపుడు ఓ రోజు ఇంట్లో వున్న కూరలన్నీ తరిగేసి ఫ్రిజ్జులో సర్దేసాను... అమ్మ ఇంట్లోకి రాగానే మంచినీళ్ళ కోసం ఫ్రిజ్జు తెరవగానే ఆశ్చర్యంతో, అనిర్వచనీయమైన అనుభూతితో అలా అవాక్కయిపోయి నిలబడిపోయింది... కాసేపటకి తేరుకుని అమ్మలూ ఫ్రిజ్జులొ ఏం పెట్టావే ఏదో చెడ్డ వాసన వస్తుంది అని అడిగింది...నాకు ఆవేశం పొంగుకొచ్చేసింది... మీరెప్పుడూ ఇంతే. నెనేం పని చేసినా మెచ్చుకోరు.. ప్రొత్సహించరు.. ఇలానే పేర్లు పెడ్తారు.." అని నిప్పులు కక్కేసాను (అంటే నిజంగా నిప్పులు కక్కలేదు, గాట్టిగా గట్టిగా అరిచేసానన్న మాట) అమ్మేమో "దయచేసి ముందు నువ్వేమి ఘనకార్యం చేసావో చెప్పవే... ఆనక నీకు కావల్సింత సేపు తీరిగ్గా మెచ్చుకుంటాను" అని బతిమాలింది.
సంబరంగా మొహం పెట్టి "కూరలన్నీ తరిగి ఫ్రిజ్జులో పెట్టేసాను." అని చెప్పాను.అమ్మేమో "అమ్మో అమ్మో ఎంత పని చేసావే" అన్నట్టు సూర్యకాంతం చూపు చూసి గబా గబా ఫ్రిజ్జు మొత్తం అంతా వెతగ్గా, ఓ కవరు కనిపించింది..ఆ కవరు కనిపించగానే అమ్మ కనుబొమ్మలు ముడిపడ్డయి (అంటే సీరియస్ అయ్యింది అని అర్ధం) . ఆ కవరులో ఏముందా అనేగా మీరిప్పుడు కుతూహలపడిపోతున్నారు. ఆ టైములో నేనూ అలానే కుతూహలపడ్డాను.. అమ్మ మాత్రం బాగా కోప్పడింది. ఎందుకంటే ఆ కవర్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తరిగిపెట్టాను.... వాటి వాసనతో ఫ్రిజ్జంతా వెలగబెట్టానన్న మాట. అదీ సంగతి... ఇంక మొదలు "పనంటే ఎంత జాగ్రత్తగా చెయ్యాలి, ఎన్ని ముందు వెనకలు అలోచించాలి, ఎలా ధ్యాస మొత్తం పని మీదే పెట్టాలి" అనే అజెండాతో గట్టిగా ప్రైవేటు చెప్పేసింది...!! ఇలా ప్రైవెట్లు చెప్పేటపుడు ఏదోలే చెప్తుంది అని అటూ ఇటూ దిక్కులు చూసామా..? అయిపోయాము అన్నమాటే..వింటున్నాము అన్నా వినిపించుకోదు... ఈ అమ్మలతో ఇదే కష్టం. చిన్నప్పటి నుండి పిల్లల్ని పెంచేసి బాడీలాంగ్వేజ్ బట్టీ కొట్టేసి మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేస్తారు.
అవన్నమాట నా సేంపిల్ పని కష్టాలు. అయినా నా పని కష్టాల గురించి చెప్పుకుంటె పోతే ఇలా ఒకటా రెండా.. నేను సిన్సియర్గా చేద్దామనే అనుకుంటాను...ఇల్లు తుడిస్తే చీపురు అరిగిపోయి, విరిగిపోయినంత పని అవుతుంది.దుమ్ము మాత్రం ఎక్కడది అక్కడే వుండిపోతుంది. అట్లు వేస్తే పెనం మీద నుండి ఊడి రావు, వచ్చినా కనీసం పది పదిహేను ముక్కలు అవుతాయి...గిన్నెలు సర్దితే వీలైతే నాలుగు సొట్టలు, కుదిరితే ఎనిమిది చిల్లులు. రూము సవరిస్తే ఒకటో రెండు వస్తువులు (అంతే అంతకన్నా ఎక్కువ కాదు) పగులుతాయి. ఈ కష్టాలన్నీ నాకు పని దేవుడి అనుగ్రహం లేకపోవడం వల్లే నన్ను చుట్టుముట్టేస్తున్నాయి...పనిదేవుడ్ని ప్రసన్నం చేసుకోడానికి ఏమైనా రంగురాళ్ళు, జాతిరాళ్ళులాంటివి దొరుకుతాయేమో చూడాలి. మీకేమైనా తెల్సిన మార్గాలుంటే నాక్కుంచెం చెప్పండే..!లేదంటే మీరు కూడా మా అమ్మలాగ పనంటే శ్రద్దగా, ఓపికగా, నిదానంగా, వందనంగా చెయ్యాలని ప్రైవేటు చెప్పేస్తారా..?