Thursday, August 7, 2008

నేనుగానీ..బొమ్మగానీ..గీసానంటే..!

బొమ్మలు గియ్యడానికి ఓ తెల్ల కాగితం, ఓ HP పెన్సిల్, నటరాజ్ రబ్బరు, అప్సరా మర వుంటే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా..? ఎంత అమాయకులండి మీరు.. అలా ఎలా అనేసుకుంటారు? వీటితోపాటూ సమాజం అందించే ప్రోత్సాహం, గుర్తింపు కూడా కావాలి...ఈ సమాజం వుందే, అది కొంచెం విచిత్రమన్న మాట.దానికి ఇష్టం లేకపోతే మనలో అడవి బాపిరాజు/రాణి, రవి వర్మ/వర్మిణి వున్నా సరే కావాలనే అన్యాయంగా గుర్తించదు... నా విషయంలో అదే... అదే.. జరిగింది.

నాకో జీవితాశయం వుండేది/వుంది/వుంటుంది. అదే జనాల దిమ్మ తిరిగి, కళ్ళు చెమ్మగిల్లి, సంతోషంతో సొమ్మసిల్లేలా చేసే ఒక్క బొమ్మైనా ఈ జన్మలో నేను గియ్యగలగాలి. . అలాని నేను ఊరికే కలలు కని ఊరుకునే అమ్మాయిని కాదు. నేను గీసిన కుక్క నక్కలా వున్నా, నక్క కుక్కలా వున్న సరే నా కలల్ని నిజం చేసుకోవాలనే గట్టి పట్టుదల వున్నదాన్ని. అందుకే ఎనిమిదో తరగతిలో వుండగానే (అబ్బో అంత తొందరగానా అనకండి. దిష్టి తగులుతుంది) నా మొదటి ప్రయత్నంగా రాత్రిపగలూ కష్టపడి కత్తిలాంటి ఓ బొమ్మ గీసాను. ఓ చిన్న పూరిల్లు, ఉదయిస్తున్న సూర్యుడు, రెండు కొబ్బరి చెట్లు, ఇంటి ముందు సన్నగా ప్రవహించే ఓ ఏరు..! ఓస్ ఇదా.. నేను ఒకటో తరగతిలో గీసాను అనకండి.నాలో వున్న కళాకారిణి హర్ట్ అవుతుంది. ఆ బొమ్మ చూడగానే మా అమ్మ పొంగిపొరలుతున్న పుత్రికోత్సాహాన్ని తనలో దాచుకోలేక పంచుకోవడానికి పక్కింటికెళ్ళింది.నాకు తెల్సు నన్నావిడ పొగడ్తలతో ముంచేస్తుందని... అలా అని ఆవిడ ముందు నుంచుంటే ఫ్రీగా పొగడలేదు కదా.. అందుకని గోడ పక్కన నుంచున్నాను...ఆవిడ ఆ బొమ్మని పరీక్షగా చూసి "బావుంది.. ఈ మర్రి చెట్లు బాగా గీసింది" మర్రి చెట్లా... అవెక్కడ వున్నాయి..? అయినా పొడుగ్గా, సన్నగా వుండే కొబ్బరి చెట్లెక్కడ..?పొట్టిగా, గుబురుగా వుండే మర్రి చెట్లెక్కడ..? మరీ విడ్డూరం కాకపోతే.. ఈ సమాజం అంతే.. ముఖ్యంగా మా డ్రాయింగ్ మేడం. ఆవిడకి బాగా బొమ్మలెయ్యడం వచ్చని, అందుకే పిలిచి ఉద్యోగం ఇచ్చారని బాగా గర్వం...

ఒకసారి నా సృజనాత్మకతకి బాగా పదును పెట్టి అరటి పండుని గీసుకెళ్ళి చూపించానా..? పదికి రెండేసింది..నేను ఊరుకుంటానేంటి..? ఏంటింత అన్యాయమని ప్రశ్నించాను.. "అది అరటిపండులా వుందా అసలు..? అక్కడక్కడ ఉబ్బిన సైకిల్ ట్యూబులా వుంది. అయినా అరటి పండు ఎక్కడైనా ఎర్ర రంగులో వుంటుందా..? మళ్ళీ ముచ్చికకి ఆకుపచ్చ రంగు..కింద బొడిపకి నీలం రంగు.. ఎన్ని రంగులుంటే అన్నీ పూసేస్తావా..?" అని అవమానించేసి నా క్రివేటివిటీని అర్ధం చేసుకోకుండా వ్యర్ధం చేసేసింది.

ఇకపోతే ముగ్గులు.. ఎవరు చెప్పారసలు..ముగ్గంటే నాలుగు వైపులా ఒకేలా వుండాలని.. చుక్కలు సమాన దూరంలో వుండాలని.. పోత పోస్తే సన్నగా, నాజూగ్గా వుండాలని..ముగ్గుకి కూడా ఇన్ని రూల్సా..? నా ముగ్గు అయితే వెరైటీగా రెండు పక్కలా రెండు రకాలుగా, మూడో పక్క వేరే విధంగా, నాలుగో పక్క ఇంకో విధంగా చాలా బావుండేది. పోత కూడా ఒకచోట సన్నగా, ఒకచోట లావుగా చాలా డిఫరెంటుగా వుండేది. అయినా ఏ పనైనా కొత్తగా చేస్తే ఈ సుత్తి జనాలకి నచ్చుతుందేంటి..? మా అమ్మయితే మరీను "ముగ్గు కింద బై "శ్రీవిద్య" రాసుకోవే. లేకపోతే నేను పెట్టానేమో అనుకుంటున్నారు" అనేది. అర్ధం చేసుకోరూ......

అలా అలా సమాజం దృష్టిలో నేనో మంచి చిత్రకారిణిగా గుర్తింపబడాలని గట్టి పోరాటం చేస్తుండగా పదోతరగతి పరీక్షలు వచ్చేసాయి. మా జీవశాస్త్రం మేడం పిలిచి "శ్రీవిద్యా.. నీ మీద మన స్కూలు మొత్తం చాలా ఆశలు పెట్టుకున్నాము. పరీక్షల్లో మేటర్ మొత్తం బ్రహ్మాండంగా రాస్తావు.. బొమ్మలు మాత్రం మరీ ఎవరూ గుర్తుపట్టకుండా వేస్తావేంటసలు..? ఈ విషయం మీద కొంచెం శ్రద్ద పెట్టు తల్లీ.." అంది. ఆ క్షణంలో నా గుండె ఎన్ని ముక్కలు, చెక్కలు అయ్యిందో నేనే లెక్కపెట్టలేకపోయాను.ఆ రోజు అర్ధరాత్రి రెండుగంటల ఇరవై రెండు నిముషాల రెండు సెకన్లకి నా టాలెంటుని గుర్తించని సమాజం అంటే పిచ్చ కోపమొచ్చింది.ఇంక జీవితంలో బొమ్మలెయ్యకూడదని ఒక సంచలనాత్మకైన నిర్ణయం తీసుకున్నాను. అలా ప్రపంచం మొత్తం గాఢనిద్రలో వుండగా తనకి తెలీకుండానే ఓ గొప్ప చిత్రకారిణిని కోల్పోయింది.

ఇక పరీక్షల్లో ఎలా..? అందుకే "బాగు చెయ్యి-బాగుపడు" అనే సూత్రాన్ని ఫాలో అయిపోయా.. పరీక్షల్లో నా పక్కబ్బాయి అంత బాగా చదవడు. బొమ్మలు కూడా నా అంత స్టైలుగా, డిఫరెంటుగా గియ్యడం రాదు. ఏదో వున్నదున్నట్టు గీసేస్తాడు అంతే.. వాడి దగ్గరకి వెళ్ళి "ఒరేయ్ బాబు.. నీకు మొత్తం అన్ని సబ్జెక్ట్లు బిట్లతో సహా చూపిస్తాను. స్కూల్ ఫస్టు నా బదులు నీకొచ్చేసినా అస్సలేమనుకోను. నాకు మాత్రం నువ్వేసే బొమ్మలు చూపించి గట్టెకించు తండ్రీ" అని ఓ ఒప్పందాన్ని పకడ్బందీగా కుదుర్చుకున్నాను.

వాడు అప్పుడప్పుడు "నాకు మెడ నొప్పెడుతుంది. చాల్లే" అన్నా సరే తెలుగు నుంచి లెక్కల వరకూ అన్నీ జాగ్రత్తగా కాపీ కొట్టించాను. ఎదురుచూసినరోజు రానే వచ్చింది. అది నేను కాపీ కొట్టాల్సిన రోజు. చేతులు వణుకుతుంటే పేపర్ నెమ్మదిగా వెనక్కి తిప్పాను.. తీరా చూస్తే "ఉమ్మెత్త ఆకు నిర్మాణం గీసి భాగాలు గుర్తించుము" అని వుంది. అది చూడగానే నా మెదడులొ లైటు వెలిగింది. ఆ వెలుగులో ఉమ్మెత్తా ఆకు, గుర్తించాల్సిన భాగాలు మిలా మిలా మెరిసిపోతూ కనిపించేసాయి. అది చూసి అప్పటిదాకా నాలో అలిగి నిద్దరోతున్న చిత్రకారిణి నిద్రలేచింది. "వీజీ బొమ్మే కదా..నేను గీస్తా, గీస్తా" అని సరదాపడింది."సరే" అన్నా.. అయినా నా పిచ్చిగానీ నాలా మోడర్న్ ఆర్ట్ చేతిలో వున్నవాళ్ళకి మామూలుగా గియ్యడం ఎలా వస్తుంది.. ఎంత కష్టపడ్డా నా బుర్రలొ వెలుగుతున్న ఉమ్మెత్తకి, నా పేపర్ కనపడుతున్న ఉమ్మెత్తకి పోలికే కనపడలేదు. మెదడులో టింగుటింగుమంటూ మెరుస్తున్న అయిదు భాగాలు ఎక్కడ గుర్తించాలో అర్ధం కాక జుట్టు పీక్కుంటూ పక్కకి తిరిగాను. నా పక్కబ్బాయి నీ ఋణం తీర్చుకోనీ.. నా పేపర్లో కాపీ కొట్టు అన్నట్టు దీనంగా మొహం పెట్టి పేపర్ నా వైపు తిప్పి వుంచాడు. మరీ కళ్ళతో అంతలా బతిమాలేస్తుంటే కాదనలేకపోయా.. సరే అని చూసి గీసేసా..

పదో తరగతి రిజల్ట్స్ వచ్చాయి..నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. అది కాదు నా బాధ.. నా పేపర్లో చూసి కాపీ కొట్టినోడికి సెకండ్ క్లాసు వచ్చింది. అదీ ఫస్ట్ క్లాస్ ఒక్క మార్కులో పోయింది.వాడు నా దగ్గరికి వచ్చి "థాంక్స్. ఈసారి పరీక్ష పోతుందనుకున్నాను. నీ వల్ల 359 మార్కులు వచ్చాయి. అసలు NS కూడా చూపిస్తే తప్పకుండా 360 దాటేవి. నీకేమో ఆ బొమ్మ గీసి చెరపడంతోనే సరిపోయింది. అయినా నీకు బొమ్మలు గియ్యడం రాదని తెలీదా..? తెల్సీ అలా చేస్తావా..?" అనేసి వెళ్ళిపోయాడు. చీ ఎదవ జీవితం.. అయినా నాకు తెల్సు నాలో వున్న అపరిమితమైన టాలెంటుని, అర్ధం కాకుండా అద్భుతంగా గీసే మోడర్న్ ఆర్టుని ఈ పిచ్చి సమాజం ఎప్పటికీ గుర్తించలేదు. అందుకే ఎప్పటికైనా నేనూ ఈటీవీ సుమన్ లా ఒక టీవీ పెడతా.. నా బొమ్మలకి నేనే గుర్తింపు తెచ్చుకు తీరతా........!

38 comments:

Purnima said...

oka chitrakarini ni memantaa kolpOyinaa, oka blogger maatram maa mundu undadam maa adrushtam gaa bhaavistunnamu!! :-))) ninnu vadulukomule!!

You Rock!! Please keep writing!!

Kathi Mahesh Kumar said...

మొత్తానికి మీరూ చిత్రకారిణే అన్నమాట....బాగుంది. మాయకపు ఆలోచనల హాస్యం చాలా బాగుంది.

ప్రపుల్ల చంద్ర said...

చాలా బాగా వ్రాశారు !!! మీ ఛానల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము.

వేణూశ్రీకాంత్ said...

హ!! ఏం చేస్తాం శ్రీవిద్యా, మీలా మోడర్న్ ఆర్ట్ ని ఎడం చేత్తో గీసే పడేసే వాళ్ళని ఈ సమాజం అస్సలు గుర్తించట్లా.. వెంటనే ఆ చానల్ పనేదో మొదలు పెట్టాల్సిందే ఇక... :-)
As always బాగా నవ్వించారు :-)

చైతన్య.ఎస్ said...

నిజమే ఈ సమాజం మీ టేలెంట్ ని గుర్తించ లేదు. నాలో నటుడు కూడా మీ లోని చిత్రకారిణి లా అలా అలా మరుగున పడిపొయాడు. మీరు టి.వి పెట్టాక నా లోని నటుడికి ఒకే ఒక అవకాశం ఇవ్వండి.. ప్లీజ్. మనం మనలోని కళా తృష్ణ, సమాజం మీద కసిని రెంటినీ ఒకేసారి తీర్చేసుకుందాం.

మీనాక్షి said...

అయ్యో చేం స్టోరి అన్నమాట..మనిద్దరిది.
ఈ సమాజం ఇంతే విద్య గారు..టాలెంట్ ఉన్నవాళ్ళని అస్సలు పట్టించుకోదు.
ఏం చేస్తాం.అంతా వాళ్ళ ఖర్మ...
....................
ఇంత మంచి పోస్ట్ రాసాక ఇలా అనకుండా
ఉండలేను గా.
విద్యా అమ్మాజి కి జై,జై,జై

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

చాలా బాగా నవ్వించారు..

నేను ఒక సీరియల్ తీద్దామని అనుకుంటూన్నాను. మీ చానల్ లో ఒక చాన్స్ ఇవ్వండి. మీ చానల్, నా సీరియల్ ద్వారా సమాజం మీద ప్రతీకారం తీర్చుకుందాం.
:)

Uday said...

good one..

కల said...

టీవీ ఛానెల్ పెట్టాల్సిందేనంటారా?
పెడితే పెట్టారు కాని, మీ ప్రోగ్రాం వచ్చే టైం చెప్పండి. మా అక్కవాళ్ళ అబ్బాయి బువ్వ అస్సలు తినట్లేదంట. ఏం చేసినా, ఏం చూపించినా, ఎలా బెదిరించినా అస్సలు భయపడటం లేదంట. హ్హా హ్హా.. ఏదో జోకాను.
బాగా రాసారు.

MURALI said...

కళకి కుక్క,నక్క,కొబ్బరి చెట్టు,మఱ్ఱి చెట్టు అనే భేదం లేదని లోకానికి చాటాలన్న మీ ఆశయాన్ని చిన్న తనంలోనే తుంచేసారన్నమాట. పాడు లోకం వాళ్ళు చెయ్యరు. చేసినవారిని హర్షించరు. ఏ మాటకి ఆమాటే చెప్పుకోవాలి. మనం కూడా మంచి ఆర్టిస్ట్ లెండి. లోకం మనలోని ప్రతిభని గుర్తించటం లేదని చాయా చిత్రాలు అంటే (మనుషుల నీడల్ని పోలిన బొమ్మలు) గీయటం మొదలు పెట్టా. ఇవైతే కళ్ళు,ముక్కు ఇలా ఏవీ చూపించాల్సిన అవసరం లేదు. ఎడాపెడా రంగు పులిమెయ్యటమే. ఇందులో ఇంకో సౌలభ్యం ఉంది. ఒక బొమ్మ వెయ్యాలని మొదలు పెట్టిన తరువాత అది రావటంలేదనే అనుమానం కలిగితే వెంటనే డాం..! అంటూ ప్లేటు తిప్పెయ్యొచ్చు.అది మరో బొమ్మయిపోతుంది.
మీ బ్లాగువనంలో నవ్వుల పువ్వులు ఇలా పూస్తూ ఉండాలి అని కోరుకుంటూ.

ప్రతాప్ said...

నేను గీసాను, లోకం ఏడ్చింది.
నేను వదిలేసాను, లోకం నవ్వింది.
నాకింకా లోకంతో పనిఉంది.
I do care...........

నిషిగంధ said...

:)))) సూపర్..

"అది అరటిపండులా వుందా అసలు..? అక్కడక్కడ ఉబ్బిన సైకిల్ ట్యూబులా వుంది."

అప్పట్లోనే think outside the box సూత్రాన్ని పాటించేసారన్నమాట! :-)

Anonymous said...

నేను త్వరలో తీయబోయే కార్టూన్‌ సీరియల్ లో పాత్ర, కార్టూన్‌ రచన కూడా మీరే చెయ్యాలి. రెండు పాత్రలేం సరిపోతాయి గానీ ఇంకోటి కూడా ఇస్తా. అదే నిర్మాత పాత్ర. నేను ఒక్కటంటే ఒక్కటి తీసుకుంటా అదే డిరెట్రు పాత్ర. తొందరగా ఇల్లో, గొలుసో, ఉంగరమో అమ్మేసి డబ్బులు రడీ చేసుకొండి. కుంచె నిదానంగా కొనుక్కోవచ్చు.

సినిమా పేరు: కుంచె లో మనసు (ట్యాగ్ లైన్‌: కదిలించే కళాకారిణి ఆవేశ ఆక్రంద ఆవేదన)

-- విహారి

Jagadeesh Reddy said...

మీరు కూడా ఎమ్మెఫ్ హుస్సేన్ అంత గొప్ప చిత్రకారిణి అయిపోవాలని, ఎవరికి అర్దం కానంత 'అందం'గా పెయింటింగ్ వెయ్యాలని కోరుకుంటున్నాను. మీరు పెట్టే టీ.వీ. చానల్‌ని టీ.వీ. ఎటుతిప్పి చూసినా పర్వాలేదు కదా. అంటే తల్లక్రిందులుగా చూసినా, మామూలుగా చూసినా ఒకేలా ఉంటుందనుకొంటున్నాను. ఎనీవే, బెస్టాఫ్‌లక్.

Kranthi M said...

అప్పుడెప్పుడో మీనాక్షి గారు నేను చిత్రకారిణే అన్నారు.ఇప్పుడు మీరు.అ౦ద౦గా రాసే మీర౦తా వాటికి వెళ్ళిపోతే ఇక్కడ నవ్వే మేమున్నా నవ్వి౦చే వాళ్ళు౦డరు.
సరే వెళ్ళారులే పోటీ ఉ౦డదు అనుకున్నామీరు టి.వి పెట్టీ దా౦ట్లో ఒకళ్ళు హీరోగా,ఇ౦కొకళ్ళు డైరెట్రు అయిపోతే ఇ౦త మ౦ది కలిసి ద౦డెత్తితే మేమేమవ్వాలి అసలే ఉన్న టి.వి లే సగ౦ చ౦పేస్తున్నాయి.మీకు కూడా ఎ౦దుకు మా మీద కక్ష(Just joke సీరియస్ అవ్వక౦డి ఎదో చిన్నపిల్లోడిని).
ప్లీజ్.. ప్లీజ్ మీర౦తా బ్లాగులే రాసుకో౦డే ఎ౦చక్కా.ఏదో ఈ నానిగాడి రిక్వెస్టు ఈ ఒక్కసారికి మన్ని౦చొచ్చు కదా.మన్నిస్తారని ఆశిస్తూ...

Unknown said...

మీరు నా బొమ్మోసారి గీయరూ ?
మా మేనల్లుడు అసలు నా మాట వినట్లేదు బూచి ఉందంటే...

krishna rao jallipalli said...

పనిలో పని.. నెలకో సినిమా కూడా తియ్యండి.

cbrao said...

నాకు సుమన్ బొమ్మలు నచ్చుతాయి. సుమన్ కాక ఏ డుంబూనొ లేక ఆలీ నో చిత్రకారుడిగా రాస్తే, చివరలో ఇంకా పేలుండేది.

సుజ్జి said...

sri vidhya garu... tappa adurus... navvi, navvi, kadupu noppi vachindi. mottaniki mana lanti talented fellows ni ee prapancham gurthinchadulendi...

any ways, great reading...keep it up.

Sujata M said...

ha ha excellent

ramya said...

మోడర్న్‌ ఆర్ట్:)
బొమ్మ లో ఎవ్వరికి కావల్సింది వాళ్ళు చూసుకుంటారు గీసిన దానికి పేరు పెట్టకుండా వదిలేయండి ఈ సారి:)

Kamaraju Kusumanchi said...

సూపర్ పోస్ట్!

Anonymous said...

బాగా రాసావె..... :)

Anonymous said...

sri vidya garu, mee manana meeru thega raasesthunnaru kaani ilanti rathalani ban cheyyali. Monna oka roju office lo, naa blog lonchi paradyanam ga mee blog loki jump ayyanu theera choosthe okate giliginthalu mee blog antha daanitho office lo padi padi navvanu anthalo maa team lo oka aganthakudu choodane choosadu daanitho andaru nannu choosi jaali padipoyaaru inka nenu software industry ki paniki ranani...naa expiry date ee roju tho ayipoyindi anukunnaru...so mee blog ni block cheyyalani nenu akila paksham advaryam lo bandh ki pilupunisthunna.....

Anonymous said...

మీరు గీసిన + గీయబొతున్న బొమ్మలన్నీ అబ్బో ...అదుర్స్. దయ చేసి సొంత ఛానల్ మాత్రం పెట్టకండి. పుణ్యం ఉంటుంది. మన సర్వ కళా కోవిదుడు విశ్రాంతి తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ ఈ టివి చూస్తున్నాను. :)
మీ చిత్ర కళా విశేషాలు బాగున్నాయి

రాధిక said...

ఇదిగో అమ్మాయ్....నీకిదే చివరి వార్నింగ్
నవ్వించేసి నవ్వించేసి చంపేద్దామనుకుంటున్నావా?ఇంకోసారి ఇలాంటి రాతలు రాస్తే నేనొప్పుకోను.

Anonymous said...

ha ha baavuMdi Sri vidya gaaru

మాలతి said...

:). అవునండీ అప్సరా మర అంటే పెన్సిలు చెక్కుకునేదేనా. అమెరికాకి వచ్చి పెన్సిలు షార్పెనరు అనడం నేర్చుకున్నతరవాత, మనం తెలుగులో ఏం అనుకునేవాళ్లమో మర్చిపోయేను, ఖర్మ
మాలతి

Bolloju Baba said...

good comedy
bollojubaba

భరత్ said...

శ్రీవిద్య గారు,
చాలా చక్కగా వివరించారు, బ్లాగ్ చదవడం వల్ల ఆనందానికి లోనయ్యాను. బాగుంది

Anonymous said...

Bagundammaa vidya nee kallaluuu nee kaburluuuu ..okkamaata lo cheppali ante.....iragadeesesaavu anukooo....aa bommala geeyatam emo kani ekkada taggakundaaa ila raasi padeyyiii ETV Suman em karam Zee TV Ektha kapoor ayipothav.....

Cheppatam marichanu sumeee nee raathalu emo kani aa raathalaku pettina talakattu (ade headline) adirindi pho....naaku tega nachesindi.......

swamy said...

NENU KUDA ARTS GEESI GEESI . TEACHER TRAINING KUDA CHESI, AAKHARIKI FILM WRITER AYYAANU..BUT MEE ARTICLE CHADIVE TIME LEKA COMMENTS CHADIVI COMMENTS CHESTHUNNAA..BYE

krishna rao jallipalli said...

fruit?? అంటే?? మీ అసలు పేరు ఏమిటి?? ఎ ఎ సినిమాలకి రచించారు?? రచించు తున్నారు?? తెలుసు కోవాలని కుతూహలంగా ఉంది.

COMMENTS CHADIVI COMMENTS CHESTHUNNAA.. GOOD IDEA.

Gulti said...

హ..హా హ హా....బాగుందండి.....ఏదొ ఉబుసుపోక తెలుగు బ్లాగుల మీద పడ్డాను.....మిగతా పొస్టుల మీద పడతానిప్పుడు......

మెహెర్ said...
This comment has been removed by the author.
mesnehitudu said...

నవ్వు నాలుగు విధాల చేటు…
ఈ బ్లాగు ను ఆపేస్తే అది అందరికి తీరని లోటు..

విద్య నువ్వు నవ్వు...
ఈ బ్లాగు ద్వారా నీ నవ్వలను మాకివ్వు..
నవ్వు ఉన్నంత కాలం గుర్తంటావు మాకు నువ్వు.


సతీష్, విజయవాడ.

..nagarjuna.. said...

excellent post.... :) x :)

Advaitha Aanandam said...

అండీ.... ఇలా నవ్వించటం భావ్యమా....
ఇక్కడ ఉద్యోగాలు ఊడిపోగలవు.....
అలా పిచ్చెక్కినట్టు నవ్వుతుంటే పక్క క్యూబు వాడు ఇటు వచ్చి మరీ చూసి వెళ్తున్నాడు....


Hats Off.....