నాకు చిన్నప్పడో చిన్న కల వుండేది. నేను ఐయ్యేస్ అవ్వాలని. నా కారుని ఓ పది పదిహేను కార్లు పొలోమంటూ రయ్యి రయ్యిమని ఫాలో అయిపోవాలని. ఆ చిన్న కలని సాకరం చేసుకోవడానికి పెట్టుబడిగా రోజూ దిన పత్రిక పై నుంచి కింద దాకా కసి కసిగా చదివి చించి పారేసేదాన్ని.
చెరువులో పడి రెండు చేపలు గల్లంతు - అప్పటి నుంచి చెరువోఫోబియా
పిట్టగోడ కూలడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పది పిట్టలు - పిట్టగోడోఫోబియా
తాగి పెళ్ళాన్ని కొడుతున్న మొగుడు - మొగుడోఫోబియా
ఎస్కలేటర్‌లో పడి ఎలుకకి గాయాలు - "ఎస్కలేటరోఫోబియా"
ఇలాంటి వార్తలు చదివి చదివి బోలెడన్ని ఫోబియాలు వచ్చేసాయి. ఇంక చివరకి న్యూస్ పేపరోఫోబియా కూడా వచ్చేసింది. దాంతో దిన పత్రికలు చదవడం మానేసి, దిన ధారావాహికలు చూడటం మొదలు పెట్టాను. దెబ్బకి నా భయాలన్నీ పోయి జనాల్ని భయపెట్టడం వచ్చేసింది. కానీ కానీ.. నాకు తెలీకుండా ఒక్కటి మాత్రం నాలో కరిగిపోయి, కల్సిపోయి, నాలో భాగం అయిపోయింది. అదే అదే .. "ఎస్కలేటరోఫోబియా".
*****
ఆ రోజు మా సూపర్ ట్రైనర్ పుట్టిన రోజు. మాకు పండుగ రోజు. ఆ పర్వ దినాన ఐమేక్సులో సినిమా అన్నారు. రంగ్ దే బసంతి అని ఆశగా బయలుదేరిటే, మా మానసిక పరిస్థితిని బట్టి మా వయసుని అంచనా వేసి మరీ హనుమాన్, చిన్న పిల్లల ఏనిమేషన్ సినిమాకి టికెట్లు తీసారు. పోనిలే గుడ్డిలో మెల్ల, ట్రైనింగ్ కన్నా ఎదో ఒక సినిమా మిన్న అని నన్ను నేను ఓదార్చుకుంటూ లోపలకి అడుగుపేట్టానో లేదో ఒక భయంకరమైన కదులుతున్న యంత్రం కనిపించింది. నాలో నిద్దరోతున్న "ఎస్కలేటరోఫోబియా" లేచి బుసలు కొట్టింది. "నేను ఎక్కను ఎక్కలేను ఎక్కబోను" అని ఏడిచినంత పని చేసి నా కన్నీటి గాధని రీళ్ళుగా రీళ్ళుగా వెళ్ళబోసుకున్నాను. మా వాళ్ళంతా నా బరువైన ఫ్లాష్ బ్యాక్ విని, చున్నీలతో, జేబు రుమాళ్ళతో, అవి లేని వాళ్ళు టిష్యూ పేపర్లు కొనుక్కుని మరీ కార్చిన లీటర్ల లీటర్ల కన్నీరుని ఎండగట్టి, వాటితోనే బర్రు బర్రుమంటూ ముక్కు చీదుకున్నారు.
"ఇదో ఇమేజనరీ భయ్యం, నిజ్జంగా ఎక్కావంటే నిజ్జంగా నీ భయ్యం పోతుంది." అని బలవంతంగా లాక్కుపోయి దాని ముందు నిలబెట్టారు.కళ్ళు మూసుకుని జై భజరంగ్ భళీ అనుకుంటూ వెళ్ళెళ్ళి ఎస్కలేటర్ రెండో మెట్టు ఎడ్జ్ మీద అతి సుకుమారంగా అడుగేసాను. ఎడ్జ్ మీద వెయ్యటం వల్ల బ్యాలన్స్ తప్పేసింది. న్యూటన్ మూడో సూత్రం ప్రకారం నేను చేసిన ఓవరేక్షనికి ఆ బండ ఎస్కలేటర్ ఒళ్ళు మండి నా మూతి పళ్ళు విరగొట్టడం ద్వారా రియాక్షన్ ఇచ్చుండాలి. కానీ వున్నాడుగా దేవుడు, సరిగ్గా నా ముందే బండ సుధీర్‌ని నిలబెట్టాడు. నేను పడిపోతుంటే నా చెయ్యి పట్టుకుని ఆపి, వాడి బలాన్నంతా ఎస్కలేటరుకి వ్యతిరేక దిశలో ప్రయోగించి మొత్తానికి గండం గట్టెకించాడు. అలా రియల్ టైము ఎస్కలేటర్ ఎక్కగానే,నిజ్జంగానే నాకదంటే ఇమేజనరీ భయం పోయి రియల్ భయం వచ్చేసింది.
*****
కొన్నాళ్ళకి ఎదో సరదాగా బెంగుళూర్ వెళితే, ఫోరం అనే ఘోరమైన షాపింగ్ మాలుకి తీసుకెళ్ళారు. అక్కడ ఆ సోది ఎస్కలేటర్ తప్పిటే మెట్లు ఎంత వెతికినా కనపడల్లే. మా హైదరాబాదోళ్ళే నయ్యం. నాలాంటి దద్దోజనం మొకాలు వుంటాయని ఊహించి, మెట్లు కూడా పెట్టి దొబ్బించుకుంటారు. "ఎస్కలేటర్ నేను ఎక్కనంటే ఎక్కను, ఇక్కడే బయట సెక్యూరిటీ గార్డుకి తోడుగా కూర్చుని, అవసరమైతే చెకింగులు గట్రా చేసి పెడతాను. మీరెళ్ళి షాపింగ్ చెయ్యండి" అని తెగేసి చెప్పాను. కానీ మా అన్నయ్య మాత్రం "ఆ గార్డుకి యూరో లాటరీ తగిలి, ఇంక ఈ ఉద్యోగం అవసరం లేదు అనుకున్నపుడు నీ సాయం తీసుకుంటాదులే.కానీ చూడు రెప్పొద్దున్న నిన్ను మీ ఆఫీసోళ్ళు వేరే దేశానికి పంపిస్తే, ఎయిర్ పోర్టులో నువ్విలాగే తింగరి వేషాలేస్తే, మీ కొలీగ్స్ నిన్ను కామెడీ చేసుకుంటారే, రా" అనగానే నా బంగారు భవిష్యత్తు గురించి అంత డీపుగా ఆలోచిస్తున్న వాడిని చూడగానే రక్త సంబంధం సినేమా గుర్తొచ్చింది. నీ కోసం నిప్పుల్లో దూకడానికైనా ఈ చెల్లెమ్మ సిద్దమన్నాయ్!ఇంక ఈ బోడి ఎస్కలేటర్ ఎంత అని మా వాడ్ని ఫాలో అయిపోయా.
తీరా లొపలికెళ్ళాక, సేం వణుకుడు."పర్లేదు, జాగ్రత్త. జాగ్రత్త, పర్లేదు" అంటూ మొదటి ఫ్లోర్ విజయవంతంగా దాటించేసాడు. దానికే నా గుండెకాయ నిముషానికి కొన్ని వేల లబ్బుడబ్బుల స్పీడుతో కొట్టేసుకుంటుంది. "ఇంక చాలు బాబు పద వెళ్దాము" అని బతిమాలాను.కానీ ఆక్కడ ఎక్కడానికి/ఎక్కకపోవడానికి చాయిస్ వుంటుంది. కానీ ఎక్కాక, దిగి తీరలిగా..అప్పుడు ఆ దిక్కుమాలిన యంత్రారాక్షసమే దిక్కుగా..! అందుకని నా చేత దిగడం కూడా ప్రాక్టీసు చెయ్యించాలని బలవంతంగా పైకెక్కే యంత్రంతో పై... దాకా తీసుకెళ్ళిపోయాడు. నాకేమో ఎక్కే ఎస్కలేటర్ కన్నా దిగే డెస్కలేటర్ ఇంకా అరివీర భయంకరంగా అనిపించేసి,నాకున్న ఒకే ఒక "రెండు జతల" కళ్ళూ సవ్య దిశలో(క్లాక్ వైసు) పది సార్లు, అపసవ్య దిశలో ఇరవై సార్లు చకా చకా గిరా గిరా తిరిగేసాయ్. ఆ తర్వాత కిందకి ఎలా వచ్చానో నాకస్సలు గుర్తు లేదు. పాపం నా పిచ్చి మెదడు భయంతో బిగుసుకుపోయి ఆ చారిత్రాత్మక ఘఠనల్ని రికార్డ్ చేసుకోవడం మర్చిపోయినట్టుంది. అలా ఫైరు డ్రిల్లులా ఎస్కలేటర్ డ్రిల్లు పూర్తయ్యేసరికి ఎస్కలేటర్ అంటే భయం పోలేదు సరి కదా భయం వల్ల వచ్చిన దడతో కూడిన అసహ్యమొచ్చేసింది.
*****
నా "ఎస్కలేటరోఫోబియా" చిదంబర రహస్యాన్ని నాలో దాచుకుని గుట్టుగా బతుకుతుంటే ఊరి నుంచి మా సైన్యం దిగింది. సరే కదా అని అందరం సర్దాగా అమీర్ పేట వెళ్ళాము. అక్కడ మా మంద మొత్తం బిగ్ బాజార్లో దూరిపోబోతుంటే, వాళ్ళని ఆపి "మీకు తెలుసా...అక్కడ లోపల... ఎస్కలేటర్ వుంటుంది" అన్నా అదేదో లోపల పులి వుందన్నట్టు. "ఓస్ అంతేనా..!విజయవాడ రైల్వే స్టేషనులో అమ్మమ్మ కూడా ఎక్కింది తెల్సా. నీకు భయమా విద్యక్కా..?" అని అడిగింది మా పిన్నికూతురు. దానికి మేటర్ మొత్తం అర్థం అయిపోయింది. మన పరువు మొత్తం గంగలో కల్సిపోయింది. అయినా "అమ్మమ్మ..ప్చ్..! ఆఖరికి అమ్మమ్మ కూడా ఎక్కేసి నాకు అన్యాయం చేసేసాక ఈ పరువు గంగలో కలిస్తే ఏంటి, దొంగలెత్తికెళ్తే ఏంటి...? విద్యా ఈ జగమంతా మిధ్య.." అని నా బుజ్జి మనసు తెగ కుమిలిపోయింది.గుండెల్లో ఒకలాంటి ఆక్రోశం మొదలై, ఆవేశం వచ్చేసింది.మా వాళ్ళు ఎవ్వరూ పక్కన లేకుండా మొదటిసారి ఎస్కలేటర్ మీద అడుగేసాను. అలా ఎస్కలేటరోఫోబియా పోయి, ఎస్కలేటరోమేనియా వచ్చేవరకు ఆపకుండా మళ్ళీ మళ్ళీ ఎక్కడం, దిగడం ఇదే పని. అలా మా అమ్మమ్మ దెబ్బకి నా "ఎస్కలేటరోఫోబియా" ఎగిరి...చంచల్ గూడా పక్కనున్న ఎస్కల్ గూడాకి పారిపోయింది.
*****
ఇప్పుడు ఎస్కలేటర్ చూసి పారిపోయేంత విపరీతమైన భయం లేదు కానీ దాన్ని చూడగానే ఒక్క క్షణం కాళ్ళు చిన్నగా వణుకుతాయి. ఇంకో విషయం "ఎస్కలేటర్", ఈ ఆంగ్ల పదానికి మంచి తెలుగు పదం చెప్పి పుణ్యం కట్టుకోండి.ఎంత కొట్టుకున్నా నా మట్టిబుర్రకి తట్టట్లేదు.
24 comments:
ఎస్కలేటర్‌కి తెలుగు పదం కావాలా....?
"ఎగుడు దిగుడు పాకుడు యంత్రం" అనేసుకోండి ఓ పనైపోతుంది.‘
ఎస్కల్ గూడ’ హైదరాబాద్‌లో ఉందా!!! చాలా మంచి డిస్కవరీ.
మంచి నవ్వుల టపాకాయ ఈ టపా.
నిజమే దాన్ని చుస్తే నాకు కుడా భయం మొదట్లో. కానీ ఉద్యాననగరి కి వచ్చాక ఆ భయం కాస్త పోయింది లెండి. చాలా బాగుంది మీ "ఎస్కలేటరోఫోబియా".
10/10
baagunDi ... :-)
hi vidya gaaru.....
chaala baundi mee post.
naaku kuuda ee bhayam undandi...
bhayam ante maamulu bhayam kaadu...chaaala...daanni chustene kaallu,chetulu vanukutaayi...
+1
మొహమంతా కందేలా నవ్వుకున్నా..
అమ్మాయ్.. నేను ఇంకా నీ టపా చదవలేదు. కాని "నాలా ఎందరో" అన్నట్టు గా.. నీ టైటిల్ ఉంది కనుక రాస్తున్న..
ఎక్కవలసి వచ్చిన ప్రతీ సారీ.. దాన్ని ఒక గంట పరీక్షగా చూసినా.. వేసే అడుగు ఏప్పుడూ తప్పే!! కచ్చితం గా వెనక్కి వాలిపొతా... పడతే ఒకటే గొడవ. అదే ఆ టైములో ఏ మహేశ్ బాబో వచ్చి చెయ్యి పట్టుకుంటే మరీ కష్టం కదా.. ఏకం గా చార్మినార్ ఎక్కిశ్తాడు. అంత ఎత్తు అంటే గుండె ఆగిపోదూ. ;-(
మల్లా వచ్చి చదువుతా..
ఈ ఫోబియా కనీసం మొదటి రోజుల్లో లేని వాళ్ళెవరూ ఉండర్లే విద్యా! నా భయం కాస్తా అట్లాంటా ఎయిర్ పోర్టులో దాదాపు 100 మెట్లతో 65 డిగ్రీల కోణంలో ఉండే ఎస్కలేటరు ఎక్కాక దెబ్బకి పోయింది. ఇహ ఫోరం లో అయితే ఒక్కసారి వెళ్ళామంటే, తిరిగి బయటికి వచ్చేసరికే ఈ ఫోబియా పోతుంది. అన్ని సార్లు ఎక్కి దిగాలి కదా మరి! బాగుంది టపా!
సెబాసు.
హ హ విద్య గారు టపా అదిరందండీ...మొదటి సారి ఎక్కే ప్రతి వాళ్ళకీ ఈ భయం ఉంటుంది. భయం పోయి అలవాటు అయ్యే వరకూ తిరిగేసి మంచి పని చేసారు. మీరు అట్లాంటా విమానాశ్రయం లో ఎస్కలేటర్ ఎక్కి తీరాల్సిందే... It's so steep and such a scary giant.
అదిరిపోయే టపా...
మీ ఫోబియా మాకు నవ్వులు పంచింది మరి :-)
Kummesavu... :)
ఇక్కడ నాదొక చిన్న అనుభవం,ఆ మధ్య మా బబ్లూగా్డిని తీసుకుని(మార్గదర్శిలో చేరక పోయినా)బిగ్ బజార్ కు వెళ్ళాం.అప్పుడు వాడు యల్.కే.జీ.ఇప్పుడు దాని తర్వాత కిలో యూ.ఖె.జీ అనుకొండి,ఎస్కలేటర్ ఎక్కీదిగే వాడి ఉత్సాహం తట్టుకోలెక,ఎన్ని సార్లెక్కామో,అక్కడి సూపర్వైజర్ మాకు మర్యాదగా మెట్లు చూయించాడు.
కామెడీ టపాల యాగం మొదలు పెట్టారా మీరు?
నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేక పోవటం ఒక రోగం అని హాస్యబ్రహ్మ చెప్పారు.
కొంత మంది రోగులకి మీ యోగం తో భోగం కలిగిస్తున్నారు.
ఇప్పుడున్న జీవితం లో అనుక్షణం ఎదో ఒత్తిడి. కామెడీ అందరికి తప్పకుండా కావాల్సిన టానిక్.
కామెడీ దాత సుఖీభవ.
చాలా బాగా రాసారు. ఎస్కలేటర్‌ను తెలుగులో కదిలే-మెట్లు, తిరిగే-మెట్లు అనుకోవచ్చు. మొట్ట మొదటిసారి సింగపూర్ రైల్వే స్టేషన్లో ఓ నాలుగయిదు నిమిషాల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రెండు మెట్ల మధ్య కాలు పెట్టి మరీ ఎక్కాను :) నా ధైర్య సాహసాలకు అదొక పరిక్ష.
పది రోజుల తరువాత బ్లాగుల మీద కూచుంటే భలే కామెడీ. ఎస్కలేటర్‌ని తెలుగులో ఏమంటారబ్బా............? ఎవరినైనా అడుగదాం. చెప్పిన వారికి ఆంటీ/అంకుల్ బిరుదిద్దాం. నేను చెప్పినా కూడా! చాలా బాగుంది మీ బ్లాగు. మొత్తానికీ సుఖాంతం చేశారు.
విజయవాడ లో ఎస్కలేటర్ కనబడితే చాలు, నేనూ మా మునీ తెగ ఆడుకుంటాం. దాని మీద అలా పోతుంటే ... ఆ హాయి వేరు. అట్లాంటా ఎస్కలేటర్ గురించి విన్నాం. మా వాడు మొన్న మార్చిలో ఆడుకుని వచ్చాడు. మరి నేనూ ఓ చూపు చూడాలి. అంతదాకా విజయవాడే గతి.
ఎస్కలేటర్‌ని తెలుగులో ఊర్ధ్వ గామిని (పైకి వెళ్ళేది), అధో గామిని (కిందకి వచ్చేది) అన వచ్చు. లేక పోతే, ఊర్ధ్వ చారిణి, అధో చారిణి అన వచ్చు. ఊర్ధ్వ గమన యంత్రం, అధో గమన యంత్రం. ఏది బాగుంటుందో బ్లాగు రాసినందుకు మీరే సెలెక్ట్ చేయండి.
"చెరువులో పడి రెండు చేపలు గల్లంతు - అప్పటి నుంచి చెరువోఫోబియా
పిట్టగోడ కూలడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పది పిట్టలు - పిట్టగోడోఫోబియా
తాగి పెళ్ళాన్ని కొడుతున్న మొగుడు - మొగుడోఫోబియా" SUPER.
hi srividya.
it's really good.
ఇలాంటివే నా అనుభవాలు కూడాను.
ప్రాక్టీస్ కోసం బిగ్ బజార్ లో చానాళ్లు ఉత్తుత్తినె కొన్నాళ్లు తిరిగాను కూడా.
బొల్లోజు బాబా
ఇంత చిన్న విషయాన్ని ఇంత funnyగా వ్రాయటం మీకొక్కరికే సాధ్యమేమో! BTW మీ బ్లాగులో టపాలు చాలా బాగున్నాయండి.
escalator ని తెలుగులో "మెట్లబండి" అంటే ఎలా వుంటుందంటారూ?
అస్సలు అదరగొట్టేసారు.నవ్వి0చి చ0పేద్దామనుకు0టున్నారా ఏమిటి?మీకో విషయ0 తెలుసా ..వీళ్ళ0దరూ భయపెడుతున్న అట్లా0టా ఎస్కలేటరే నేను ఎక్కిన మొదటి ఎస్కలేటర్[ఇ0చుమి0చు] .మా ఊరును0డి డైరెక్టుగా వెళ్ళి విమాన0లో పడ్డాను.తరువాత అట్లా0టాలో.మరి నాపరిస్థితి చూసుకో0డి.ఇప్పుడు కూడా ఎస్కలేటర్ అ0టే భయమే.మా అబ్బాయి దాన్ని చూసాడ0టే 100 ఎక్కి ది0పిస్తాడు మరి.
mee migatha posts lage chala bavundandi... Escalator ki telugu word dorakkapodame manchidilendi.. ledante maku ardham kavadaniki enni rojulu pattedoo.. :)
vidyua ..nice post. chala bagundi..chala navvukunnanu..thanks
gud1
Post a Comment