ట్రైన్ రాజమండ్రి వచ్చేసింది. గోదావరి గాలి మృదువుగా, చల్లగా తాకుతుంటే నా మనసుకి భలే హాయిగా అనిపించింది.ట్రైన్ దిగి అమ్మమ్మ ఊరు వెళ్ళడానికి ఎర్ర బస్ ఎక్కాము. హైదరాబాదులో దూరపు చుట్టంలా వున్న స్వేద బిందువులు నుదిటి పై చేరి పలకరింతలు మొదలెట్టాయి.
చుట్టాలొచ్చారు మర్యాద చెయ్యాలి అని కరెంటోడు టపీమని కరెంట్ తీసేసాడు.మాకు గాలి కావాలి దేవుడోయ్ అనుకుంటూ విసనకర్రలు తీసుకుని ఊపటం మొదలుపెట్టాము. ఇంక ఊపే ఒపిక లేదు అని ఏడుస్తుంటే, ఇప్పట్లో గాలే రాదన్న టీవీలో వచ్చే గాలి గన్నారావు గాలి తీసేస్తూ బోలెడంత గాలి వీచటం మొదలుపెట్టింది. అబ్బ ఎంత గాలో దాంతో నాకూ ఎగిరిపోవాలి అనిపించింది. గాలి మాత్రం ఏదో దుమ్ము,ధూళి, ఇలియానా, కరీనాలాంటి లైట్ వెయిట్ లేపమంటే లేపుతా కానీ నిన్ను లేపటం నా వల్ల కాదమ్మా అని చెప్పేసింది. సుత్తి గాలికి బొత్తిగా మొహమాటం లేదు.
నేను అలిగినానని నన్ను చల్లబర్చడానికి వర్షాన్ని పంపించింది. మండువాలో వర్షం, పెరట్లో వర్షం, వీధి అరుగుల మీద వర్షం. వెళ్ళి తడిసి ముద్ద అయిపోయాలి అనిపించింది. అలా వీధి అరుగు మీద అడుగుపెట్టానో లేదో జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు అని నన్ను ఆపేసారు. ఇంకేం చేస్తాం, కాళ్ళు, చేతులు తడుపుకుని సంతోషపడుతుంటే పడవలు వెయ్యాలన్న గ్రేట్ అవిడియా వచ్చింది. అప్పటికప్పుడు మరిచిపోయిన పడవల తయారీ విధానాన్ని మా పిన్ని కూతురి దగ్గర నేర్చేసుకుని వర్షం నీటిలో వేసేసాను. దొంగ పడవలు. వేసిన చోట నుంచి మిల్లీ మీటరు కూడా కదల్లేదు. టైటానిక్కే కాస్త నయం. కొంచెం దూరం అయినా వెళ్ళింది. మన పడవలు వేసిన చోటే మునిగిపోయాయి. తర్వాత అమ్మ చెప్పిద్ని కత్తి పడవలు వెయ్యవే కత్తిలా దూసుకెళ్తాయని. కానీ సోది వర్షం అప్పటికి ఆగిపోయింది. ఎంత కంగారో..!
ఇంక సరదాగా అందరం కల్సి నాలుగు గవ్వలాట గలగలలాడించాలని తీర్మానించేసాం. గవ్వలు నాలుగు, మన చెయ్యి పెద్దది. చెయ్యెందుకు పేర్చకుండా ఊరుకుంటుంది. ఎనిమిది పడాలంటే కొంచెం కష్టం కానీ నాలుగు అంటే మన చేతుల్లో పని. గవ్వల్ని అలా సుతారంగా చేతిలో కదిలిస్తూ, వాటి వంక చూస్తూ, చూడనట్టు నటిస్తూ, మన కావాల్సిన విధంగా అమరగానే, టక్కున నేల మీదకి వేసేయడమే. నేను అలా అలా మంచి మంచి (దొంగ) పందేలు వేస్తూ, మధ్యలో దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తూ విజయవంతంగా దూసుకువెళ్ళిపోతుంటే , మా కజిన్స్ ఇద్దరూ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు(ఇది కానీ చదివితే ఆ నిప్పులేవో నా మీద పోస్తారు) "విద్యక్కా నువ్వు బాగా మోసం చేస్తున్నావు" అని నా మీద లేని పోని అభాండాలేసేసి నా మీద అలిగి ఆడటం మానేసారు.
ఇలా కాదని మా అమ్మ ఒక ఉచిత సలహా ఇచ్చింది. ఎనిమిది గవ్వలాట ఆడదాము. ఎనిమిది పేర్చాలంటే విద్యక్కకి ఎలానూ చెయ్యి సరిపోదు అంది. సరే అని మొదలుపెట్టాము. నిజంగానే పేర్చడం పరమ కష్టంగా వుంది. ఎనిమిది ట్రై చేస్తే, ఏడు, ఆరు ట్రై చేస్తే అయిదు పడుతుంది ఘోరంగా. పోనీ ఆరు పడుతుందని ఏడు పేరిస్తే ఏడే పడుతుంది చెత్తగా.దానికి తోడు ఆకలిగా వున్న పులుల్లా ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకోడం ఒకటి. అనకూడదు కానీ మాలో ఒక మంచి ఫ్యాక్షనిష్టు దాగున్నాడు. మా పగలు, ప్రతీకారాలతో ఆట ఎంతకీ తెమలకపోయేసరికి మా అమ్మకి చిరాకేసి ఒక శాంతి ఒప్పందం చేసి పారేసింది. ఇంక చంపుకోవడాలు లేవని. అప్పుడు చూడాలి మా మొహాలు. ఫ్యాక్షనిష్టు చేతిలో కత్తులు, బాంబులు లాగేసుకుంటే ఎలా అవుతుందో అలా అయిపోయాయి. అలా మా ఆటని లేడీ విలన్ లేని డైలీ సీరియల్లా నీరసంగా ముగించేసాము. ఫలితాలు అడగొద్దు. ఎందుకంటే నేను పెద్ద మనసుతో పేర్చకుండా (పేర్చలేక) ఓడిపోయి వాళ్ళని గెలిపించాను అని గొప్పలు చెప్పుకోవడం నాకస్సలు ఇష్టం వుండదు.
గవ్వల గలగలలు అయ్యాయి.తర్వాత కేరం బోర్డ్ మీద పడ్డాము. మన ప్రతిభ ఎవ్వరూ గుర్తించటం లేదు కానీ లేకపోటే ఈ ఆటలో మనకి తోపుడు విభాగం కింద అర్జున అవార్డ్ ఇవ్వచ్చు. హోల్, కాయిన్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వున్నా ఆ రెండిటినీ ఒక చోటకి చేర్చే(తోసే) సమర్ధత నాకు (నా చేతికి) వుంది. నా ఇష్టారాజ్యంగా తోసేస్తుంటే మా మావయ్య కూతురికి మండిపోయి (కడుపు మంట!) వదినా ఎందుకంత కష్టపడిపోతావు, కాయిన్ని చేత్తో తీసి హోల్లో వేసెయ్ అంది. వీళ్ళు మరీను. మరీ అంత దారుణంగా నేనేలా.... ఆడ...గలను అసలు.నాకసలే మొహమాటం ఎక్కువ.
ఈలోపల మా అన్నయ్య బ్లఫ్ ఆడదాము రండి అన్నాడు. "పేకాటా శివా శివా, మన ఇంటా వంటా వుందా" అని చెంపలేసుకున్నాను. ఇంతలో పక్క నుంచి మా పిన్ని "జీవించింది చాల్లేవే, తాతయ్య బయటకి వెళ్ళారు" అంది. అంతే అందరం పేకముక్కలేసుకుని గుండ్రటి బల్ల సమావేశానికి సిద్దం అయిపోయాము. ఒక ముక్క వేసి వేరే ముక్క వేసామని అబద్దం చెప్పి, అందరిని అదే నిజమని నమ్మించి ముంచేయాలి. కానీ ఇక్కడా నాకు అన్యాయం జరిగింది.అందరూ కల్సి నాకు న్యాయంగా దక్కవల్సిన గుర్తింపు దక్కనివ్వలేదు. నేను ఎంతో ఆటబద్దంగా ఆడి గెలుస్తున్నా, "నువ్వే ఆటలోనైనా బాగా కిరికిరిలు చెయ్యగలవు. అందుకే ఈ అటలో నువ్వు గెలిచినా లెక్కలోకి రాదు" అని నన్ను... నన్ను... ఆటలో అరటిపండులా తీసిపారేసారు. ఇంత కన్నా పెద్ద ఘోరం నేనెక్కడా చూళ్ళేదమ్మా. అయినా వీళ్ళకి బొత్తిగా స్పోర్టివ్ స్పిరిట్ లేదు బాబు.అందుకే అన్నారు న్యాయంగా ఆడే రోజులు అస్సలు కాదని........ కలికాలం.
11 comments:
"అన్నీ చెప్పినట్టుందీ, ఏమీ చెప్పనట్టుంది. దీని మతలబేమిటబ్బా?" అని బుర్ర బద్దలు కొట్టుకోలేదుగానీ,మీ గాలి దుమ్మూధూళితో పాటూ ఇలియానానీ,కరీనానూ ఎత్తుకు పోతుంటే పట్టుకున్నా,పట్టి ఆట్టేపెట్టా.ఎవరికైనా కావాలంటే ఇచ్చేద్దాం.
పడవలూ,కత్తిపడవలూ చెయ్యడం నేనూ మర్చిపోయా!
ఇక గవ్వలాట,పేకాట (శివ శివా)మా పల్లెకెళ్ళి ఆడటానికి మనసైంది. కానీ భోపాల్ నుండీ వెళ్ళాలంటే బోలెడు ఖర్చు,రెజర్వేషనూ దొరకదే!!!
hi vidya garu,
thanks 4 ur encouragement.
nenu ee madhye anni blogs chustunnanu.
ivvatito meedi kooda chadivesanu.
donga padavalu,millimetre kooda kadalledu....baundi.
బ్రహ్మాండంగా రాశారు. ఇలియానా, కరీనా దుమ్మూ ధూళి, పోలిక బాగుంది.
మీ ఆటలో నేనూ కూర్చుని ఆడినట్టుగా వుంది.కానీ నిజంగా ఆడినట్టు కాదుకదా.ఇప్పుడు నాతో ఈ ఆటలు ఎవరు ఆడతారు?అన్నీ రీలులా కళ్ళముందు తిరిగుతున్నాయి.మీకు అస్సలు హృదయం లేదు.ఇలాంటివి గుర్తుచేసి చిన్నపిల్లని ఏడిపిస్తారా?దుర్మార్గురాలా :)[ఇలా అనేసానని బాధపడకండి.ఆతలో పక్కవాళ్ళని ఇలాగే తిట్టుకునేవాళ్ళం.]
Naku aa aatalu anni aadalani vundhe...and ma patha illu gurthu vasthundhi...manduva illu..vaana paper padavalu... :( emi chestham...
avunu ee post kudali lo kanapadaledhu ente..naku..??
బావుంది!
చాలా బాగారాశారు.
భలే గుర్తు చేసారండీ.. మా చిన్నప్పుడు మా తాతయ్యగారి ఇంటికి వెళ్ళినప్పుడు (వూలపల్లి అని గొల్లల మామిడాడ పక్కన) అక్కడ నేల మీద ఫ్లోరింగ్ చేసినప్పుడు అచ్చు పోసిన ఎనిమిది గడుల (మొత్తం అరవై నాలుగు అన్నమాట.. మీరు ఆడినట్టిదే!) పందిరి మీద గవ్వలాట ఆడుతుందేవాళ్ళం. మీ లాగే మాకు కూడా ఒక పెద్దక్క వుంది - శేషక్క అని. పెద్ద చేతితో అలవోకగా దచ్చి (ఎనిమిది గవ్వలు పైకి చూస్తూ పడితే - అని గుర్తు), బార (ఎనిమిది గవ్వలూ తిరగబడి (మొహం తలగడ లో దాచుకుని పడుకున్నట్టు బోర్లా పడితే)) లు వేసేస్తూ వుండేది. ఎప్పుడైనా ఓడిపోతున్న వాళ్ళది ఒకటే ఆర్గ్యుమెంటు కదా!.. "అక్కడి పెద్ద చెయ్యి - మేమేమో రెండు చేతులూ కలిపినా వెయ్యలేకపోతున్నాము" అని గోల పెట్టె వాళ్ళము. అసలు సంగతీ ఏమిటంటే, మరి అక్క అక్కడే వుండి, వారానికి ఒక సారి ఆ ఊరి పిల్లలతో ఆడేస్తూ, పిచ్చ form లో వుండేది.
మేము ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని గవ్వలు తెచ్చుకున్నాము. ఒక సారి ఆడేము కూడా - అట్ట పెట్టె మీద స్కెచ్ పెన్ తో గడులు గీసి!. చంపుకోడాలు చావడాలు ఎక్కువ అయి, ఒక ఐదారు గంటలు పట్టింది ఫలితం తేలడానికి. మళ్ళీ చంపుడు పందాలు, కొసరు పందాలు అవీ కూడా వుంటాయి కదా!!. మళ్ళీ ఎప్పుడో ఆడాలి. మంచి ఆట గుర్తు చేసారు. ఈ మధ్య పేకాటలు, pictionary లు ఎక్కువ అయి మన అసలు సిసలు ఫాక్షన్ ఆట మరిచిపోతున్నాం :).
మంచి కల్పనా చాతుర్యం
బొల్లోజు బాబా
@Kathi Mahesh Kumar:పట్టుకున్నారు సరే, ఎవరైనా అడిగితే నిజంగానే ఇస్తారా..?
@meenakshi.a, siva, indianminerva, ahmad ali baba,ఫణి ప్రదీప్: చాలా చాలా థాంక్స్.......
@రాధిక:ఎవరు ఆడతారేంటి, మేమంతా వున్నము కదా.. ఆన్ లైన్ వెర్షన్ కనిపెట్టి ఆడేసుకుందాము, లేకపోతే నిజంగా దుర్మార్గురాలిని .
@రామ:మీ శేషక్కలానే మా అమ్మది కూడా ఫుల్ ఫార్మ్. పందేలు వెయ్యడం మొదలు పెట్టిందటే మనం ఓ కునుకు తియ్యచ్చు...! వీళ్ళతో చాలా కష్టం బాబు.
శ్రీవిద్య గారు చాలా బాగ వ్రాస్తున్నారండి. మీ బ్లాగ్ bookmark చేసేసి పని మధ్యలో రిలాక్స్ అవడానికి మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నా.
Post a Comment