Monday, June 24, 2013

ఒక అమ్మ, ఒక నాన, ఒక కూతురు. అంతే స్టోరీ - I

సరిగ్గా రెండేళ్ళ క్రితం అమ్మనే అయ్యానులే నీ రాకతో ఆహా ఓహో ఓహోహో అని పాడేసుకున్నాను.
అప్పుడు తెలీదు కదా, ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని.అయినా నా పిచ్చి కానీ,  నా రక్తం పంచుకుని పుట్టిన  పిల్ల కొంచెం  డిఫరెంట్గా (కొంచెమే సుమా!!)  అంటే నాలా కాక,  బుద్దిగా,  పొందికగా,  ఒద్దికగా వుంటుందా?

ఆమ్మా "దా" అంటుంది, వెంటనే ఉన్నపళాన పొయ్యి మీద పోపు, కంచంలో అన్నం, కంటి మీద నిద్ర అన్నీ వదిలేసి వెళ్ళాసిందే. వెళ్ళలేదనుకోండి, ఈ సారి ఇంగ్లీషులో అమ్మ "కం"  అంటుంది. అప్పటికీ కంచంలో  అన్నం మీదో,  టివీలో సిన్మా మీదో వ్యామోహం పడ్డామో అంతే బ్రహ్మాండం బద్దలవ్వడం అంటే ఏంటో చిన్న ట్రైలర్ రూపంలో చూపించబడుతుంది.  ఇంక చచ్చినట్టు బుద్ది తెచ్చుకుని, దాని వెనకాల తోకలా వెళ్తానా.  అమ్మ "కూర్చో" అంటుంది, కూర్చున్నానా? అమ్మ "లే" అంటుంది.  లేచానా, ఇంకో రెండు సెంటిమీటర్ల  దూరం  తీస్కెళ్ళి  మళ్ళీ "కూర్చో" అంటుంది.మళ్ళీ లే అంటుంది. మళ్ళీ ఇంకో అర సెంటి మీటరు. మళ్ళీ ఇంకో పావు సెంటిమీటరు.  ఇలా కూర్చోబెట్టి, నుంచోబెట్టి గుంజీలు  తియ్యించి మోకాళ్ళు అరిగిపోయి ఇంక విరిపోతాయి అనిపించే  స్టేజిలో నా మీద జాలేసి,. "అమ్మ ఎత్తండి" అంటుంది.  ఎత్తండి అంటే మాదేదో రాజవంశం అనుకునేరు. నా కూతురు  ఎత్తుకో  అనడానికి ఎత్తండి అంటుంది.

మొత్తానికి నేను వేరే ఆప్షన్ లేక, ఎత్తుకుంటాను. అమ్మా ఇంటి అంటుంది. ఇంటి అంటే ఇంట్లో ఏ ప్రదేశమైనా కావచు. హాల్, కిచెన్, బాల్కనీ, బెడ్రూం,యుటిలిటీ  రూం, బాత్ రూం ఏదన్నా..ఓక సుత్తి గెస్ చేసి ఏదో  ఒక చోటకి తీసుకెళ్ళాళి, మన టైం ఏజ్ యూజువల్ గా బాలేక, దాని మనసులో వున్న బొమ్మకి మేచ్ అవ్వలేదనుకోండి. అవ్వలేదనుకోండి ఏంటి అది మేచ్ అవ్వదు అంతే.  మళ్ళీ చెయ్యి చాపి ఏడుస్తూ "అదీ, ఇంటి" అంటుంది.

"అదేంటే, ఇల్లేంటే" అని లాజిక్స్ పీకడానికి ట్రై చేస్తే  వెంటనే జిమ్నాస్టిక్స్ షో ప్రారంభం అవుతుంది. ఆసక్తి వున్న వారు బేబీ సిట్టింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆ తర్వాతి పర్వసానాలకి నేను ఎంత మాత్రం బాధ్యురాల్ని కాదు. ఇంక విషయానికి వస్తే కొన్నాళ్ళు అవసరం అయితే తప్ప మనకో నోరు వుంది, నాలుక వుంది, నాలికకి పలు ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ భాషలు వచ్చు లాంటి సంగతులు మర్చిపోడం మంచిది.

కనీసం ఒక గంట అదీ ఇదీ ఇంటి బైట అని సర్కస్ చేసిన తర్వాత తెలిసే  విషయం  ఏంటంటే  ఈ గొడవ మొదలెట్టిన గదిలోనే జస్ట్  రెండు అడుగుల దూరంలో వున్న విరిగిపోయిన చీపురు పుల్లో, చిరిగిపోయిన పేపర్ ముక్క కోసమో ఈ డ్రామా కార్యక్రమం మొదలయ్యింది అని అర్ధం అయ్యి ఆయాసం వచ్చి కాసేపటకి ఏడుపు వచ్చి, ఇంకాసేపటకి నవ్వు వచ్చి,  నా కూతురు తెగ ముద్దొచేస్తుంది. మరదే పిచ్చి తల్లి ప్రేమ..

ఒక్క మాట మాత్రం నిజం ఆ అమ్మ అన్న పిలుపు ఎంత తియ్యగా వుంటుందంటే ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.

సశేషం. ఇంకా వుంది.
ఇంకా ఇంకా వుంటూనే వుంటుంది.



12 comments:

శిశిర said...

ఎత్తండి అంటే మాదేదో రాజవంశం అనుకునేరు.
:)))

అమ్మ అన్న పిలుపు ఎంత తియ్యగా వుంటుందంటే ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.
వావ్..

వేణూశ్రీకాంత్ said...

హహహ వెల్కంబాక్ అండీ :)
బ్రహ్మండంగా ఉన్నాయి మీ యువరాణీ వారి కబుర్లు :))

సిరిసిరిమువ్వ said...

నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ మీ అమ్మాయి కబుర్లతో వచ్చారన్నమాట! Welcome..welcome.

మీరు చేసిన అల్లరిలో సగం అయినా చెయ్యకపోతే మీ అమ్మాయి ఎలా అవుతుంది.

Enjoy motherhood.

Kottapali said...

sweet :)

kiran said...

wow..nice...mudduga undi post mee ammayi lage :)

జయ said...

ఇంత తియ్యటి కబుర్లు ఇంకా ఇంకా ఉంటూనే ఉంటుంది ఏంటి...ఎప్పటికీ ఉంటూనే ఉండాలి.All the best to the happiest mother & daughter.

ranivani said...

చాలా బావుందమ్మా!అంత సర్కస్ చేస్తూ ,ఇంత మంచిటపా ఎంత బాగా రాసావమ్మా తరువాయి టపా కోసం ఎదురు చూస్తూ ఉంటాం

MURALI said...

చాన్నాళ్ళకి బ్లాగువనం చిగురుతొడిగింది :D

Niru said...

Welcome back....good one..

Unknown said...

Welcome back vidya garu. Post was sweet as always. :)

Srividya said...

@శిశిర : థాంక్సండీ
@వేణూశ్రీకాంత్ : :) :) . మా యువరాణీ ఎపుడూ బ్రహ్మండం అండి. నేను తట్టుకోలేక తలపట్టుకుంటాను.
@సిరిసిరిమువ్వ : థాంక్యూ. మీరు చెప్పే దాకా నేను రాసి నాలుగేళ్ళు అయ్యిందనే విషయమే గమనించలేదు నేను :)
Narayanaswamy S. : Thank you very much.
kiran: Thank you. :)

Srividya said...

@జయ: :) మా బుల్లి సిసింద్రీ గురించి ఎంత చెప్పినా తరిగేలా లేదులెండి.

@nagarani yerra: మీ అభిమానానికి చాలా థాంక్సండి.
@MURALI : సంసార బంధాల్లో పడ్డాక ఈ వసంతాలు, శిశిరాలు తప్పవు మరి :)

@Niru: ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు :). మొదట నా పోస్ట్ చాలా సేపటి వరకు కూడలిలో రాకపోఎసరకి అబ్సేంట్ స్టూడెంట్ అని తీసేసారేమో అనుకున్నను.

Pradeep Venkatesh : :) :) Thank you very much