అవి నేను అమీర్ పేటలో హాస్టల్ వెతుక్కుంటున్న రోజులు. అక్కడ కనక మనగలిగితే ఆఫ్రికా అడవుల్లో, అఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల్లో సైతం ఆనందంగా బతికేయొచ్చని పుకారు.నేను బాగ ఆలోచించి, చించీ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు వుంటున్న హస్టల్ రూములో చేరిపోయాను.ఇక్కడ నా ప్లానింగ్ ఏంటంటే అక్కని పడేసామనుకోండి చెల్లి పడి వుంటుంది లేదా చెల్లిని లైనులో పెట్టేస్తే అక్క నోరుమూసుకుని వుంటుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటారే అలా అన్న మాట. అప్పటికీ మానవతా విలువులన్న పక్క రూమమ్మాయి మంజు నన్ను పరామర్శినించడానికి సారీ... పలకరించడానికి వచ్చి "మీ రూములో వుండే అక్కా, చెల్లి తెగ తేడా, నువ్వు వేగలేవు" అని హెచ్చరించింది కూడా. "ఇక్కడ.. ఇక్కడ.. సెవెన్ ఇయర్స్, సెవెన్ ఇయర్స్ హాస్టల్లో వున్నా, నేను తలుచుకుంటే వాళ్ళిద్దరిని ఈ హాస్టల్ చుట్టుపక్కలే లేకుండా చెయ్యగలను" అని కారు కూతలు కూసేసాను. కానీ నాకారోజు రాత్రే "ముందున్న గోతుల లోతు తెలీకుండా కోతలు కోయాకూడదు" అన్న విషయం బాగా అర్థం అయ్యింది.
ఆ అర్ధ రాత్రి నేను గాఢ నిద్రలో వున్నాను. సడెనుగా ఎవరిదో భయంకరమైన నవ్వు వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే అక్క రెండు చేతులు చాపి, వంగి హ్హ, హ్హ, హ్హ అంటూ షోలే సినిమాలో గబ్బర్ సింగులా నవ్వుతోంది. అది చూడగానే గుండె ఒక్కక్షణం ఆగిపోయింది. ఒళ్ళంతా చమటలు పట్టేసాయి. మంజు చెప్పినట్టు తేడా అంటే పిచ్చేమో. మమ్మీ... నాకు పిచ్చోళ్ళంటే చచ్చేంత భయం.ఇంక ఆ నవ్వు భరించలేక వాళ్ళ చెల్లిని లేపి "పాప నవ్వుతుంది" అని చెప్పాను. "ఓస్ అదా మా అక్క రాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది. పొద్దునే లేవలేదు. అందుకే రాత్రే యోగా చేసుకుని పడుకుంటుంది. ఇది నవ్వాసనం " అనేసి మళ్ళీ పడుకుంది. నా బొందాసనం...అయినా పొద్దున కుదరదని రాత్రే చేసి పడుకోవడానికి ఇదేమైనా ఇస్త్రీనా...? వంకాయ,టెంకాయ కలిపితే వచ్చే హైబ్రీడుకాయ మొహం అదీను.
*******
అలారం మోగింది.టైం ఆరు.ఈ సారి చెల్లి లేచింది.ఇంక మళ్ళీ నిద్ర పట్టక ఈ సైతాను మొకాలతో వేగడం బెటరా, లేక తిరుగుతున్న ఖేతాన్ ఫ్యానుకి ఉరేసుకుని చావడం బెటరా అని కళ్ళు తెరిచి దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అదే నేను చేసిన పే...ద్ద తప్పు.చెల్లి అల్మారాలోంచి ఓ భయంకరమైన వస్తువు తీసింది. అది కత్తో, గన్నో, వేటకొడవలో అయితే నేనసలు భయపడేదాన్ని కాదు.కానీ.. కానీ... అది ఒక వయొలిన్.
"విద్యా నీకు నిద్ర పట్టటం లేదు అనుకుంటా. వయొలిన్ క్లాసుకి వెళ్ళడానికి ఇంకో అరగంట టైం వుంది. ఈలోపు నేనో పాట వాయిస్తాను. అదేంటో నువ్వు చెప్పాలే" అంది గారాలు పోతూ.చీ ఎదవ జీవితం సునామీ, సైక్లోను కలిపొస్తే ఎలా వుంటుందో అంత కన్న భయంకరంగా తయారయ్యింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టల మాట దేవుడెరుగు, ఒక్క పిట్టకి రెండు దెబ్బల్లా అక్క, చెల్లి కలిపి నన్ను ఎడా,పెడా కుమ్మేస్తున్నారు అని తాళం తప్పకుండా నాలో నేను కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఈలోపు సంగీత పిపాసి గారు కచేరి మొదలెట్టేసారు.
కుయ్.. ఇంకో కుయ్.....
కుయ్యో... ఇంకో కుయ్యో.
నేనో పిచ్చి శ్రోతని దొరికేసరకి, ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ రెచ్చిపోయి ...రెండో కుయ్యో లెంగ్త్,స్ట్రెంగ్త్,వేవ్ లెంగ్త్ అన్నీ పెంచేసింది. అది కాస్త కీచుమంటూ కీచుమంటూ వచ్చేసరకి నా పీచు జుత్తు భయపడి లేచి నుంచుంది. "కుయ్యో.. కుయ్యో.. కుయ్.. కుయ్.. కూ... కో......" ఇలా చెల్లి గారు జీవితం మీద రోత పుట్టేలా మోత మోగించేస్తుంటే, అక్కగారు కదలకుండా, మెదలకుండా పడుకున్నారు. పాపం పిచ్చి తల్లికి మళ్ళీ మళ్ళీ ఈ చెల్లి లొల్లి విని చెవులు చిల్లులు పడి, మెదడు మొద్దుబారిపోయినట్టుంది. ఆ క్షణంలో చెల్లెమ్మ వయొలిన్ వైలెన్స్ కన్నా అక్కయ్య గబ్బరు సింగే నవ్వే కాస్త వినసొంపుగా వుందనిపించింది.
ఇంకో పక్క చెల్లి ఆపకుండా తీగల్ని లాగి లాగి సాగదీసి లేని రాగాలు పుట్టించేస్తోంది.కొన్ని వేల ఏళ్ళ తర్వాత ఆ వయొలిన్ వాయింపుడు ఆపి"ఇప్పుడు చెప్పుకో చూద్దం" అంది. కుయ్యోలని నా జీవిత కాలంలో విన్న ఏదో ట్యూనులోకి ఇరికించేద్దామని ఎంత జుట్టు పీక్కున్నా కుదిరి చావదే...!అమ్మో ఈ వయొలిన్ వైడూర్యం, సంగీత వజ్రం ఏదో కొత్త(చెత్త) ట్యూన్ కనిపెట్టేసినట్టు వుంది. "నీకు తెలీట్లేదా...? ఇది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్" అంది. వామ్మో.. వాయ్యో.. ఇది అదా.. అదే ఇదని ఏమాత్రం అనుమానం రాకుండా ఎంత అద్బుతంగా ఖూనీ చేసింది. తగలెట్టడంలో కూడా ఎంత పర్ఫెక్షనో...! "నేను బాగా వాయించలేదు కదా..! నువ్వు గుర్తు పట్టలేదు" అని దీనంగా మొహం పెట్టి అడిగేసరికి నా వెధవ గుండెకాయ కరిగిపోయింది. కళాకారుల్ని నిరుత్సాహపరచకూడదనే పెద్దమనుసుతో "చీ అలా కాదు, నేను తెలుగు మీడియం. అందుకే నాకు ఇంగ్లీష్ రైంస్ అస్సలు తెలీవు" అన్నాను. "అయ్యో పాపం" అంది. కోతి మొకం,పీత కళ్ళేసుకుని వెధవ జాలొకటి మళ్ళీ.
"సరేలే నీ కోసం మంచి తెలుగు పాట బాగా నేర్చుకుని పది రోజులకి వినిపిస్తానే..అప్పుడు కరెక్ట్ గా చెప్పాలమ్మా..! " అంది.వెంటనే మంజు దగ్గరకి వెళ్ళి వలా వలా ఏడిస్తే "చా ఊరుకో. కష్టాలు మనుషులకి కాపోతే మానులకి వస్తాయా..! అయినా నా మాట విని వేరే హాస్టల్ కి వెళ్ళిపో" అని సలహా ఇచ్చింది. ఇంక హాస్టల్లో వుండే దమ్ము లేక, రూం వేటలో పడ్డా. అయినా నా పిచ్చి కానీ, హైదరాబాదులో అద్దెకి ఇళ్ళు, ఆడపిల్లలకి మొగుళ్ళు అంత వీజీగా దొరికేస్తారేంటి? రోజులు గబా, గబా గడిచిపోతున్నాయి. మా వాళ్ళందరికీ ఫోను చేసి మాట్లాడాను. అప్పులన్నీ తీర్చేసాను.నాకెవరైనా ఇవ్వాల్సివుంటే, ఇలాంటి దశలో తుచ్చమైన డబ్బు మీద మమకారం ఎందుకని ఆ బాకీలన్నీ మాఫీ చేసేసాను.బాకీలు మాఫీ చేసిన పుణ్యఫలమో,పూర్వజన్మ సుకృతమో,దేవుడి దయో కానీ చెల్లి భీకరమైన ప్రాక్టీసుకి తట్టుకోలేక వయోలిన్ తీగ తెగింది (ఎవరో తెంపేసారు!).చెల్లెమ్మ మారణాయుధం దెబ్బకి చిరుగులు పడ్డ నా జీవితం మళ్ళీ కొత్త చిగురులు వేసింది.
30 comments:
LOL
GREAT PIECE.
chaalaa baavundi.inkaa tach lO vunnaaraa?
పాపం మీ కష్టాలు పగవాడికి కూడా వద్దు అనిపించినా నవ్వుకోకుండా మాత్రం వుండలేకపోయానండి.
అదరహో! ఒక్కసారి నా ఇమాజినేషన్లో మీ హిడింబిల సీన్ వేసుకుని మరీ నవ్వుకున్నా...
chaalaa baavundi
బాబోయ్! మా హాస్టల్ రోజులు గుర్తొచ్చాయి. అసలు మంచి కంపెనీ లేకపోతె హాస్టల్ అంత నరకం ఇంకోటి లేదు. బోల్డన్ని కష్టాలు పడ్డాను - అసలు వీళ్ళు చదువుకుని, నాగరికత తెలిసిన వాళ్ళేనా అన్నంత చెత్తగా ప్రవర్త్రిసారు కొందరు అమ్మాయిలు. చూడటానికి ఎంత సౌమ్యంగా.. అందంగా ఉన్నా.. ప్రవర్తన మాత్రం భయంకరం అండ్ విచిత్రం !! బాగా రాసారు. వోయిలిన్ తీగ తెగినందుకు కంగ్రాట్స్.
హహహ... భలే అనుభవాలు.
కోతిమొగానికి పీతకళ్ళు!
నాకో జబ్బుంది. చాలా సార్లు ఏదన్న చదవినా విన్నా దాని తాలూకు దృశ్యం ఒకటి కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది. పై మాటలు తెప్పించిన దృశ్యానికి నవ్వలేక చచ్చా. శ్రీవిద్యా .. మీ పదబంధాలు, ప్రయోగాలు అమోఘం!!
కొనసాగించండి
సునామీ, సైక్లోను కలిపొస్తే - ఎలా ఉంటుందో అర్ధం అయ్యింది.
ముందున్న గోతుల లోతు తెలీకుండా కోతలు కోయాకూడదు" -- ఓ గొప్ప నీతి వాఖ్యం.
వంకాయ,టెంకాయ కలిపితే వచ్చే హైబ్రీడుకాయ మొహం -- కొత్తపాళి గారన్నట్లు ఊహించుకొంటే నవ్వొస్తుంది.
ఒక్క పిట్టకి రెండు దెబ్బల్లా - ఈ ప్రయోగమేదో ఇదెదో బాగుందే
(ఎవరో తెంపేసారు!). : ఒ హెన్రీ ట్విష్టు.
వెరసి చాలా బాగుంది మీ పోష్టు.
బొల్లోజు బాబా
LOL
:)
ఈ టపాలో ప్రాసలు చాలా బాగా వచ్చాయి. మచ్చుకు:
1.ఈ సైతాను మొకాలతో వేగడం బెటరా, లేక తిరుగుతున్న ఖేతాను ఫ్యానుకి ఉరేసుకుని చావడం బెటరా ...
2. పాపం పిచ్చి తల్లికి మళ్ళీ మళ్ళీ ఈ చెల్లి లొల్లి విని చెవులు చిల్లులు పడి ...
చదవటానికి బాగున్నాయి. ఇలాంటివే మరికొన్ని చూశాక నాకొక సందేహం వచ్చింది. అదే శబ్దం పదేపదే వినబడేలా వాక్యనిర్మాణం చేసే ప్రక్రియకు అలంకారశాస్త్రంలో ఏదైనా పేరుపెట్టే వుంటారేమో! లేక వ్యావహారిక భాషను అలంకారశాస్త్రం పట్టించుకోదా!?
రానారె .. రకరకాల అనుప్రాసలున్నాయి. ఛేకానుప్రాస, లాటానుప్రాస, యమకము, మొ.. ఇవి శబ్దాలంకారాల్లోకి వస్తాయి. అలంకార శాస్త్రమంటే మరేం ళేదు, పదిమంది కవులూ రచయితలూ ఉపయోగించగా ఇదేదో బావుందే అని దానికో పేరు పడేసి ఒక సూత్రం తయారు చేశారు. వ్యాకరణమూ ఇట్లా పుట్టిందే.
మీరు మామూలు అమ్మాయి కాదు :-) నిజం చెప్పండి మీరు ముళ్లపూడి మనవరాలు కాదూ?
hahaha....bale rasevee...
navva leka chachhannu.. :D
amazing word play.. that is. Fantastic writing..
Keep going gal.
Purnima
శ్రీవిద్యా,
చించేశారు! కానీ ఈ అక్కా చెల్లెళ్ల లాంటి కారెక్టర్లు జీవితంలో అప్పుడప్పుడూ తగిలితేనే తర్వాత ఇలా హాయిగా నవ్వుకోడానికి(అఫ్ కోర్స్, నవ్వు మాకొస్తోందంకోండి) సరుకు ఉంటుంది. కదా!
నాకు మీ మీదే అనుమానం! మీరె తీగ తెంపారేమో!!! పోనీలెండి.. తీగ తెగింది..మీరు బతికారు కదా! చాలా సంతోషం. పదప్రయొగం బాగుంది.
10/10
10/10
చాలా బాగుంది. ఆ హింస భరించలేక మీరె తీగ తెంపెరు కదా?
Vidya ardaratri 3 gantalappududa aapukoleka chadiva. inka navvapadaniki enta time padutundo. Reaaly awesome.
http://muralidharnamala.wordpress.com/
HI Vidya,
I hav fwded ur posts as mail in Virtusa. They responded superbly. I think now you can start a fan's association or EYE,Blood bank.
http://muralidharnamala.wordpress.com/
@ కృష్ణుడు : చాలా థాంక్స్
@trk: థాంక్స్.టచ్లో వుండటమా... అమ్మో నాకంత ధైర్యం లేదు.
@వేణూ శ్రీకాంత్: హాస్టల్లో కూడా అందరూ నన్ను చూడగానే నవ్వేవారు. ఎందుకని అడిగితే వయొలిన్ గుర్తు వస్తుంది అనేవారు.
@కత్తి మహేష్ కుమార్ : చాలా థాంక్స్.
@sujata:అవునండి ఫ్రెండ్స్ వుంటే భలే వుంటుంది హాస్టల్ లైఫ్. ఎవరూ లేకపోతే భరించలేని నరకం.
@Shankar Reddy : నెనర్లు.
@ప్రవీణ్ గార్లపాటి: మీకలా అనిపించిందా..!
@Narsingrao : నెనర్లు.
@కొత్త పాళీ : నెనర్లు.కోతిమొగానికి పీతకళ్ళు! ప్రాస బావుందని రాసేసాను. కానీ మీరు చెప్పాక చెల్లిని అలా మళ్ళీ మళ్ళీ ఊహించుకుని రోజంతా నవ్వుకుంటూనే వున్నాను.
@రానారె : నెనర్లు. ఏదో పదో క్లాసులో చదివిన వ్యాకరణమే. అలంకార శాస్త్రం గురించి అంత కన్నా తెలీదండి. అయినా మీ సందేహానికి గురువు గారు కొత్త పాళీ గారు సమాధానం చెప్పేసారు.
@bolloju ahmad ali baba: నెనర్లు. ఈ అక్కలకి ఇంకో చెల్లి వుంది. ఆమె కూడా చేరితే సునామీ, సైక్లోను, భూకంపం కలిసొస్తే ఎలా వుంటుందో అలా వుంటుందేమో..
@srinivas: లేదండి నిజంగా మామూలు అమ్మాయినే...!
@Purnima: థాంక్సండి. వాళ్ళ లీలా విలాసాల గురించి వివరిస్తుంటే మాటలు అలా వచ్చేసాయి.
@Harika:అలా నవ్వుతూనే వుండు.
@చైతన్య : ఈ ప్రశ్న ఎవరూ అడగలేదాంటా అనుకున్నా..! తెంపాలనే వుండేది. కానీ శ్రమ పడకుండా గట్టెక్కేసాను.
@సుజాత : నిజమేనండి. అప్పుడు ఎందుకు ఆ రూములో పడ్డానా అని ఏడ్చాను కానీ.. దాని పరమార్ధం ఇప్పుడు అర్ధం అవుతుంది.
@oremuna : నెనర్లు.
@chandu: మీరూ అదే ప్రశ్న అడిగారూ..నిజంగా నేను కాదండి.
@murali: థాంక్స్. మూడింటికి మీరు కూడా నవ్వాసనంలాంటిది వేసారన్న మాట.
నన్నేమన్నా చంపేద్దామని ప్లేన్ చేసి రాసారా ఈ టపా?నవ్వి నవ్వి కడుపు నొప్పొచ్చేస్తుంది.నాకు కక్ష వున్నోళ్ళందరికీ పంపేసా ఈ లింక్.వాళ్ళకీ కడుపునొప్పిరావాలని.
super :)
hahaha...navvu agaledu...thanks.
Excellent blog. Bu jokes on Sangeetham are very large in number. chaalaa cinemaallo choosaam. But the word play is worth mentioning.
చాలా బాగుంది.
nice story....
Post a Comment