Thursday, June 12, 2008

ఇంగ్లీషన్నయ్య -- సులక్షణక్కయ్య

నేను ఇంటర్ చదివేటప్పుడు నేను ఇంటరే చదవాల్సి వచ్చేది. కనీసం వేరే పేపర్ ముక్క కూడా చదివే టైం ఇవ్వకుండా మా తొక్కలో కాలేజీ వాళ్ళు మా చేత వీర రుబ్బుడు రుబ్బించేవాళ్ళు.అలాంటి కాలేజీలో ఎడారిలో ఎండమావిలా ఓ ఇంగ్లీష్ సార్. ఆయన ఇంగ్లీష్ కత్తి. మాట కత్తి. పాడే పాట కత్తి. వేసే బొమ్మ కత్తి. మనసు కత్తి.చూడ్డానికి మనిషి కత్తి. మొత్తానికి ఆయన కత్తో కత్తి. మా కాలేజీలో మొత్తం అమ్మాయిలంతా ఆయన అభిమాన సంఘానికి శాశ్వత సభ్యులం. ఒక రాఖీ పౌర్ణమి నాడు మా అభిమానాన్ని చాటుకోవడానికి కొట్టుకుంటూ, తోసుకుంటూ,పోటీ పడి రాఖీ కట్టేసాం. అలా ఇంగ్లీష్ సార్ కాస్త ఇంగ్లీషన్నయ్య అయిపోయారు. ఇంత మంది వీరాభిమానులున్న ఇంగ్లీషన్నయ్యకి ఓ శతృవు బయలుదేరింది. అదీ సులక్షణక్కయ్య రూపంలో.........

చిన్ని చిన్ని కళ్ళు, బూరె బుగ్గలు, ముద్దుగా బొద్దుగా వుండే సులక్షణక్కయ్య మా కాలేజీకి మెడికల్ ఎంట్రన్స్ కి లాంగ్ లాంగ్ లాంగ్ టెర్మ్ కోచింగుకని వచ్చింది. అంటే ఆల్రెడీ రెండు లాంగ్ టెర్ములు దొబ్బేసాయి. ఇది మూడోది. వచ్చిన రెండు రోజులకే మన అక్కయ్య విశ్వరూపం చూపించటం మొదలెట్టింది. మన అక్కయ్య మాటల పుట్ట, కబుర్ల తుట్ట, విషయాల తట్ట, విజ్ఞానపు బుట్ట ( చదువులో కాదు!). మా దిక్కుమాలిని హాస్టల్లో ఎంటెర్టైన్ మెంటే లేకుండా చదువులో మగ్గిపోయి, మసయిపోతున్న మా మొద్దు మొకాలకి ఈ సులక్షణక్కయ్య అడవిలో ఆదిత్య ఛానల్లా, ఎడారిలో ఎం టీవీలా కనిపించేసింది. నాసామి రంగా ఇంక చూసుకోండి, హాస్టలంతా సులక్షణక్కయ్య మాకు కావాలంటే మాకు కావాలి అని తెగ కొట్టుకు చచ్చిపోయేవాళ్ళం.

ఇలా కొంచెం చప్పగా, కొంచెం చేదుగా, కొంచెం తియ్యగా సాగిపోతున్న మా కాఫీ కప్పులాంటి జీవితాల్లో మా సులక్షణక్కయ్య వల్ల చిన్న తుఫాను రేగింది. స్టడీ అవర్స్ లో మా ఇంగ్లీషన్నయ్యని చూసి ప్యూనా అని అడిగింది. మాధవన్లా వుండే మా ఇంగ్లీషన్నయ్యని ప్యూనని అనేసరికి నా గుండె ముక్కలయిపోయింది. సులక్షణక్కయ్యకి ఇంగ్లీషన్నయ్య గుణ గణాలు, కళలు, కాంతులు, ఆమె భ్రాంతులు అన్ని అజెండాగా తీసుకుని అందరం కల్సి స్పెసల్ క్లాసు తీసుకుని బుర్ర రామ కీర్తన పాడించేసాము. అయినా మన అక్కయ్య అభిప్రాయంలో మార్పు రాలేదు. టేస్టు లేని వేస్టు ఫెలో అని వదిలేసాము.

ఓ రోజు మేమంతా ఇంగ్లీష్ సారు ఇచ్చిన మెటీరియల్ కళ్ళు మూసుకుని బట్టీ కొడుతుంటే, సులక్షణక్కయ్య ఆ మెటీరియల్ లాక్కుని మెటికలు విరుస్తూ, చిటికెలు వేస్తూ, బరువు బరువు నిట్టూర్పులు విడుస్తూ చివరగా "ఇలా అయితే లాభం లేదమ్మాయిలు. మీరు ఇంగ్లీష్ పాసవ్వడం కష్టం" అని పెదవి విరిచేసింది.నా జీవితం మీద, పరీక్షల మీద నాకున్న సందేహాలు చాలవన్నట్టు ఈ మిటమిటల రాణి శాపనార్ధాలేంటో...?."ఈ మెటీరియల్ నిండా తప్పులే. మీ ఇంగ్లీష్ సారుకేమి రాదు" అంది.ఎంత మాట.... మా అందరికి గుండెల్లో నొప్పి, బాధ, వేదన. అటు రాఖీ కట్టిన బంధం, ఇటు సోది వినిపించే అనుబంధం. అటు చదువు చెప్పే గురువు. ఇటు మా అజ్ఞాన్ని పారద్రోలే కల్పతరువు. ఇద్దరూ మధ్య సయోధ్య కుదర్చలేక, కుదర్చకుండా వుండలేక మేమెంత నరకం అనుభవించామో మీకు తెలీదు, మీకెవ్వరికి తెలీదు....... వీలయినపుడల్లా మా ఇంగ్లీష్ సారుని దెప్పుతూనే వుంది. మమ్మల్ని వుందిగా సెప్టెంబర్ మార్చ్ పైన అంటూ భయపెడుతూనే వుంది.

ఈ గొడవలో పడి మేము క్రుంగి, క్రుశించి, నలిగి, నశించిపోతున్న సమయంలో సులక్షణక్కయ్య ఓ సవాల్ విసిరింది. మా ఇంగ్లీషన్నయ్య ఇచ్చిన మెటీరియల్లో తప్పుల్ని ఎర్ర ఇంకుతో మార్క్ చేసి,ఇది మీ అన్నయ్యకి చూపించి ఇవి తప్పులు కాదు అనమనండి చూద్దాం అంది.వెంటనే మేము బుర్ర బుద్ది లేకుండా చీమల దండులా పోలోమంటూ లెఫ్ట్ రైట్ అనుకుంటూ సారు దగ్గరకి వెళ్ళి ఆ పేపర్ చూపించాము. పేపర్, ఆ ఎర్ర గుర్తులు చూసి "ఏంటిది..?" అన్నారు అయోమయంగా. ఇవన్నీ తప్పులట సార్."ఎవరు చెప్పారు" అన్నారాయన సీరియస్గా. "సులక్షణక్కయ్య" అన్నాము అందరూ ఒకేసారి. "ఇంకేమంది..?" అని అడిగారు.

ఆయన అడిగిందే తడువుగా అస్సలు ఆలస్యం చేయకుండా మొత్తం కథంతా చెప్పేసి, మా గురు భక్తిని, సోదర ప్రేమని నిరూపించేసుకుని, చేతులు దులిపేసుకున్నాము. కానీ తర్వాత తెల్సింది మేమో పద్మ వ్యూహంలోకి ఎరక్క....పోయి ఇరుక్కు....పోయామని. ప్రిన్సిపాల్, సార్స్ అందరూ మమ్మల్ని తలా తోకా లేని బోలెడు చెత్త ప్రశ్నలు అడిగారు. మేము కొన్ని నిజాలు, అబద్దాలు కలిపి చెప్పి ఎలాగోలా ఆ ప్రశ్నల వర్షాన్ని కష్టపడి గట్టెక్కించేసాము. అలా విచారణ పూర్తి చేసి, మా వార్డెనక్కయ్య సాక్ష్యం ఆధారంగా సొల్లు కబుర్లు చెప్పి, చిన్న పిల్లల (అంటే మేమే..!) చిట్టి మనసుల్ని, చదువుల్ని చెడగొడుతుందనే అభియోగం మీద సులక్షణక్కయ్యని హాస్టల్ నుంచి గెంటేసారు. అలా మా లైటుని మేమే ఆర్పేసుకున్నాము.

సులక్షణక్కయ్య నిష్క్రమణతో మా జీవితాల్లో చీకటి నిండింది. సోది కబుర్ల మీద బెంగతో దిగులు రేగింది. ఇలా నా బాధల్లో నేనుండగా ఓ రోజు ఫోన్ వచ్చింది.అది... అది.... సులక్షణ....... అక్కయ్య నుంచి. బోలెడంత ఆనదంతో నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే "మీ ఇంగ్లీషన్నయ్యకి నేనో క్షమాపణ లేఖ పంపాను. ఎవరూ లేనపుడు అందిందేమో అడుగు" అంది. "క్షమాపణ లేఖ..?ఎందుకక్కా..? లేని తప్పులు పట్టుకున్నా సారేమి అనుకోరు." అంటుంటే "నోరు ముయ్యి, చెప్పింది చెయ్యి" అని ఫోన్ పెట్టేసింది. నాకొళ్ళు మండింది.

కావాలనే సార్స్ అందరూ వున్నపుడే ఇంగీషన్నయ్యని అడిగాను "సార్ సులక్షణక్క మీకేదో క్షమాపణ లేఖ పంపిందట. మీకు అందిందో లేదో అడగమంది" అన్నాను మొహం వీలైనంత దీనంగా పెట్టి. ఒక్కసారిగా రూములో అందరూ నవ్వడం మొదలు పెట్టారు. సార్ మాత్రం కొంచెం ఏడుస్తూ, కొంచెం నవ్వుతూ, కొంచెం కోపంగా, కొంచెం కంగారుగా, కొంచెం వెర్రిగా అదో రకంగా ముఖం పెట్టారు. నాకేమి అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటే, మా ఫిజిక్స్ సారు "లేఖ కాదు, పుస్తకం అది. అందింది.దాన్ని అమ్మి బఠానీళ్ళు కొనుక్కున్నారని చెప్పు" అన్నారు. సరే అని అమాయకంగా తలకాయ ఊపి బయకొచ్చేసాక, ఆయన నవ్వుతూ అంటున్నారు "అంత పెద్ద ప్రేమలేఖ ఎన్ని రోజులు రాసిందో పాపం ఆ ఆమ్మాయి. ఎవరు పెట్టారో కానీ సులక్షణ అని, చాలా లక్షణమైన పేరు పెట్టారు" అని.

ప్రేమ లేఖా...! అమ్మనీ..... ఎంత కుట్ర. మనసులో ఇంత పెద్ద ప్లాను వేసి, స్కెచ్ గీసి, సారుని మా ముందు తిట్టి, రెచ్చగొట్టి మా అంతట మేమే రాయబారానికి వెళ్ళేలా చేసి, సారు దృష్టిలో ఈ రాణీ గారు పడేలా చేసుకుందన్న మాట. కొత్తగా ఫోన్ రాయబారాలు ఒకటి.మళ్ళీ క్షమాపణ లేఖంట.. చుంచు మొహంది ఎంత ఎదవల్ని చేసింది. తర్వాత తెల్సింది వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యిందని. అక్కకి ఓ అభాగ్యపు బావతో, అన్నయ్యకి వేరే అమాయకపు వదినతో. హమ్మయ్య నా కడుపు చల్లబడింది. గుడ్డిలో మెల్లలా, పొడుగు పొడుగు ప్రేమ లేఖలతో (పుస్తకాలతో) సారుని పడేసి, పెళ్ళి చేసేసుకుని మమ్మల్ని మరీ బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఎదవల్ని చేసెయ్యలేదు మా సులక్షణక్కయ్య కాదు... కాదు... సులక్షణవదిన.. ఛీ ఛీ ఏదో ఒకటిలే....

17 comments:

Srinivas said...

మన తెలుగు ఆడపడుచుల్లో హాస్యం ఇంకా ఇంకిపోలేదని నిరూపిస్తున్నారు. ఇలాగే నవ్వులు పూయిస్తూ ఉండండి.

Anonymous said...

Narration is very good. keep going.

krishna said...

excellent.keep it up.
made me take a trip back to memories .

Anonymous said...

Hehehehe....baga raseve... :)
idhi chadhuvuthunte pakka pakkana kurchuni kaburlu cheppu kovali anipisthundhi...

Purnima said...

chaalaa baagundi mee saaru-akkala romance. nijam gaa jarigindoo, meeru oohinchukuni raasaro kaani.. nenu maatram bhale enjoy chesaa!!

Looking forward for more such posts!!

Srividya said...

లేదండి. నిజంగానే జరిగింది. ఇంకా నాకనిపిస్తుంది ముందే సార్ కి ప్రపోజ్ చేసిందేమో అందుకే పంపించేసారేమో అని.అప్పట్లో నమ్మక ద్రోహమని తిట్టుకున్నాము కానీ ఇప్పుడనిపిస్తుంది తన అల్లిన కథల వెనక ఎంత ఆరాటం దాగుందో అని.ఎక్కడో చదివా ప్రేమలోను, యుద్ధంలోనూ వున్నవారికి తప్పొప్పుల ప్రసక్తి వుండదట.

ramya said...

excellent!
మీర్రాసిన స్టైల్ సూపరోసూపర్:)

karthik said...

really great post. super narration. read a good comic post after a long time. keep going!!

నిషిగంధ said...

స్టార్టింగ్ లైనే అదుర్స్!! ఇక ప్రతి పంక్తిలోనూ హాస్యం విరక్కాసిందంటే నమ్మండి! :))

Kathi Mahesh Kumar said...

హమ్మో...మీరూ భలే కామెడీ అండీ!

కొత్త పాళీ said...

Very well done!
Opening line - fantastic.
మాటల పుట్ట, కబుర్ల తుట్ట, విషయాల తట్ట, విజ్ఞానపు బుట్ట - అడవిలో ఆదిత్య ఛానల్లా, ఎడారిలో ఎం టీవీలా - మిటమిటల రాణి ..
ముళ్ళపూడికీ, శ్రీరమణకీ ఒక వారసురాలు తయారవుతోందిక్కడ.

Bolloju Baba said...

లెటుగా వచ్చనేమో, అన్నీ అందరూ చెప్పేసారనిపిస్తుంది.ంచదువుతున్నప్పుడు ఏ ప్రయోగాలవద్ద మెదడు ఫ్లో ఆగిందో, దాదాపు అవే ప్రయోగాలలను కొత్తపాళీగారు ఉటంకించేసారు.
వెరీ నైస్ పోష్ట్
బొల్లోజు బాబా

Srividya said...

@srinivas : చాలా థాంక్స్.హాస్యం అందరిలో ఇంకా వుందండి. కానీ దాన్ని పంచుకుని, నవ్వుకునే టైమే లేదు మనకి.
@vikatakavi: థాంక్సండి.

@కృష్ణుడు: చాలా థాంక్స్.నాక్కూడా ఈ పోస్ట్ రాసిన తర్వాత రోజు మొత్తం నా ఇంటర్ రోజులు గుర్తు వస్తూనే వున్నాయి :)

@harika: కబుర్లేగా.. చెప్పుకుందాము. అయినా నీకెక్కడ ఖాళీ చెప్పు..?..

Srividya said...

@ramya: చాలా థాంక్స్.

@karthik: థాంక్స్.మీకు నవ్వించగలిగినందుకు చాలా హ్యాపీ.

@నిషిగంధ : థాంక్సండి.నవ్వులు పూయించాలనే ఈ తాపత్రయం అంతా..

@Kathi Mahesh Kumar: హమ్మో మీరు పండించినన్ని రసాలు పండించలేనండి..

@కొత్త పాళీ :థాంక్సండి. చాలా పెద్ద పొగడ్త. మీరు అన్నందుకైనా హాస్యాన్ని అపహాస్యం కాకుండా మరింత జాగ్రత్తగా రాయాలి నేను.

@bolloju ahmad ali baba :థాంక్సండి. నా ప్రయోగాలు వికటించకుండా వినోదాన్ని పంచాయంటే నాకూ సంతోషమే.

Anonymous said...

సూపరుగా రాసారు. టైటిల్ దగ్గరనుంచి చివరి వాక్యం దాకా చాలా బాగా నవ్వులు పూయించింది.

Anonymous said...

Good dispatch and this fill someone in on helped me alot in my college assignement. Thank you seeking your information.

flourishboy said...

Katha raayadam chaala baagundhi..
Story eh bagaledhu.
Ante ippudu 2020 kaabatti ila anipisthundhemo.
Miru raasindhi 2008 lo kadha.
A kaalam lo highlight emo