Wednesday, May 14, 2008

మనసున మనసై - III (కథ)

మూడేళ్ళు గడిచేసరికి రఘు ఖాతాలో రెండు సివిల్స్ దండయాత్రలు చేరాయి. మొదటిది ప్రిలింస్ లో తన్నితే, రెండోది మెయిన్స్ లో పల్టీ కొట్టింది. రెండు అపజయాలు, అనుభవాలుగా మారి మూడో సారి తప్పకుండా సాధించగలడన్న నమ్మకాన్ని కలిగించాయే తప్పితే నిరుత్సాహానికి గురి చెయ్యలేదు.చిన్నప్పుడు ఓ మాదిరిగా చదివే తన తోటి వాళ్ళంతా ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారు. వేరే దేశంలో వున్నారు.అంత సంపాదిస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారు అన్న ఊళ్ళో వాళ్ళ మాటలు కూడా అంత బాధపెట్టేవి కావు. కానీ ఆ మాటలు విన్నప్పడు తన తల్లితండ్రుల కళ్ళల్లో లీలగా కదలాడే నీలి నీడలు చూస్తుంటే, రఘుకి గుండెని ఎవరో రంపంతో కోస్తున్నట్టు అనిపించేది. అందరూ వెళ్ళే దారిని కాదని, తను కోరుకున్న దారిలో వెళ్ళడానికి కూడగట్టుకున్న ధైర్యం, పట్టుదల, శక్తి అంతా కరిగి నీరై తన చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపించేది. అలాంటి నిస్పృహలో, నిరుత్సాహంలో కీర్తి బాగా గుర్తుకి వచ్చేది. కీర్తి ఎంచుకున్న దారి వేరైనా, తనని అర్థం చేసుకోగలిగేదేమో అని రఘుకి బాగా అనిపించేది.

కానీ రఘు మనసులో ఎక్కడో చిన్న సందేహం."తన కోసం ఆశలు సౌధాలు దిగి, కలలు తీరాలని వదిలి వస్తుందా..? రేప్పొద్దున్న ఎన్ని ప్రయత్నాలు చేసినా, సివిల్స్ రాక మామూలు లెక్కల మాస్టారిగా వుండిపోతే, తన స్నేహితులతో పోల్చుకుని, తన అదృష్టాన్ని కొలుచుకోకుండా వుండగలదా ..? అలా జరిగితే కీర్తి కళ్ళల్లో విచారాన్ని, కాసుల వేటలో వెనకబడిపోయామన్న దిగులుని చూసి తను తట్టుకోగలదా..?". ఇలా సమాధానం లేని, రాని ఎన్నో ప్రశ్నలు, కీర్తి కూడా అందని ద్రాక్షే అనే భావాన్ని కలిగించాయి. దాంతో కీర్తి కథ తీరని కల అని తన మనసుకు సర్దిచెప్పుకోవడం మొదలుపెట్టాడు.

********

కీర్తికి ఒకప్పుడు రఘుతో భవిష్యత్తు అంటే కాలం కల్సి రాకపోతే లెక్కల మాస్టారుతో సాదా జీవితం అన్న దిగులు వుండేది. కనీ రఘుతో బంధంలోని అర్థం తెలిసాక,ఒకప్పుడు జీవిత పరమార్ధంగా అనిపించిన మంచి జీతం, పేరు, సుఖాలు, సౌకర్యాలు, స్నేహితుల ముందు పరువు అన్నీ వ్యర్ధంగా అనిపిస్తున్నాయి.రఘుతో జీవితం అంటే, కాలాలు కలిసొచ్చినా రాకున్నా కలకాలం కొంగొత్త మలుపుల, గెలుపుల దారులు తెరిచి కీర్తి తలపులకి పలికే ఆహ్వానంలా అనిపిస్తుంది.రఘు గురించి ఇలా మనసు చెప్పే తియ్యని ఊసుల, బాసల ఊగిసటలాటలో కీర్తికి రఘుని చూడాలన్న ఆరాటం, ఎప్పటికైనా చూస్తానన్న ఆశ, తనకి కాకుండా అయిపోతాడేమోనన్న దిగులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.రఘుకి కూడా కీర్తి తనతో జీవితాన్ని పంచుకుంటుందన్న ఆశ లేకపోయినా, ఇష్టం మాత్రం తగ్గలేదు.కీర్తిని చూడాలన్న తపన తరుముతూనే వుంది. తను వెళ్ళే ప్రతీ చోట కీర్తిని వెతుకుతూనే వుంది.


ఒక రోజు రఘు యధావిధిగా మది నిండా కీర్తి తలపుల బరువుని మోస్తూ వెళ్తుంటే దారిలో పుస్తకాల షాపు కనిపించింది.రఘు తన మనసుకి నచ్చిన పనిలో అలా మొండిగా, బండగా ముందుకెళ్ళడానికి స్పూర్తినిచ్చేవి పుస్తకాలే.మనసులో పేరుకున్న నిరుత్సాహాన్ని, దిగులుని బయటకి నెట్టి, కొత్త ఉత్సాహాన్ని నింపే పుస్తకాన్ని వెతుక్కోవడానికి లోపలకి వెళ్ళాడు.


అదే సమయంలో కీర్తి సంపాదించిన డబ్బుని కరిగించడానికి ఒంటరిగానే షాపింగుకని బయరుదేరింది. అలవాటు ప్రకారం రఘు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని వళ్ళంతా కళ్ళు చేసుకుని అడుగడుగునా అణువణువూ శోధించింది. అతను కనపించలేదు కానీ దారిలో ఒకచోట పుస్తకాల షాపు కనిపించింది. చదివే తీరిక, ఓపిక రెండూ లేవని తెల్సినా పుస్తకాలంటే వున్న ఇష్టం లోపలకి వెళ్ళేలా చేసింది.

"కలా నిజమా" అన్న టైటిల్ తో ఒక పుస్తకం కనపడగానే అదేంటో చూద్దమని, షెల్ఫ్ లో నుంచి ఆ పుస్తకాన్ని తియ్యబోయింది. అదే సమయంలో ఆ పుస్తకాన్ని ఇంకో చెయ్యి తాకింది. ఒక్కక్షణం తడబడి సారీ చెప్పడానికి తలెత్తి చూసింది.నిజంగానే కలా నిజమా అన్నట్టు, ఎదురుగా రఘు. ఇద్దరికి కళ్ళల్లో మాటల్లో చెప్పలేనంత ఆనందం, ఆశ్చర్యం.ఒకరి కళ్ళల్లోని మెరుపు, నవ్వులోని వెలుగు ఇంకొకరి ప్రశ్నలకి అడగకుండానే అందమైన సమాధానాల్ని చెప్పేసాయి. కలిసిన అభిప్రాయలు దగ్గర చేసాక, కలవని లక్ష్యాలు ఇద్దర్నీ దూరం చేసినా ఇంకా కల్సే వున్న ఆ మనసులకి, విధి అంత అందంగా కలిపిన తర్వాత కలకాలం కల్సి ఆనందంగా ఎలా వుండాలో బాగా తెల్సు.

********

14 comments:

katuri said...

chala bagundi . .. mi view , naration , quotes chala bagunnai .......

Sujata M said...

Sri Vidya garu..

mee modati kadha.. chala bagundi. different gaa undi. veelliddari manasullo doubts.. bagunnayi. good job.

Anonymous said...

inko kadha kuda pettave....

Anonymous said...

శ్రీవిద్య గారు, మీ కధ చాలా బాగుంది. కధలో, అమ్మాయి రఘుని చూడగానే అపార్ధం చేసుకోవడం తర్వాత నిజం తెలుసుకోవడం ... చాలా సహజంగా ...బాగుంది. ఇద్దరి భావాలు, అనుమానాలు బాగున్నాయి.

Srividya said...

@katuri
@sujata
@balu
చాలా చాలా థాంక్స్. నేను కథలు రాసే సాహసం చెయ్యచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చారు.
@harika
పెడతాను. నా కథలు బ్లాగు ఫార్మేట్ కి సరిపడవేమో అన్న చిన్న అనుమానం వచ్చి ఆగాను.

Anonymous said...

శ్రీవిద్య గారు చాలా బాగా రాశారండి. మొదటి కథే ఇంత బాగా రాశారంటే.. గుడ్ జాబ్ :)

uma said...

కధ బాగుంది....కానీ ఇద్దరూ ఒక చోట కలవటం తెలుగు సినిమాలో లా వుంది. ఎందుకంటే ఇద్దరు వేరే వూర్లలో వుంటూ ఒక బుక్ షాప్ లో ఎలా కలిసారో చెప్పటం మిస్ అయ్యారు.

Srividya said...

@srilu
చాలా థాంక్స్.
@uma
నాకు కూడా ఈ కథలో నచ్చనిది ముగింపే. నిజ జీవితంలో మనకి చాలా వాటి(స్కూలు,కాలేజీ రోజులు,చిన్ననాటి స్నేహితులు) విలువ దూరమయ్యాకే తెలుస్తుంది. మళ్ళీ అవి మనకి దొరికే అవకాశం తక్కువ. ఇది కథ కాబట్టి కలపాలని అలా కలిపాను అంతే

Anonymous said...

srividya garu,chaala baga rasarau..idi mee real story la anipistundi.

Purnima said...

జల్సా సినిమా చూశావా నువ్వు?? అందులో ఒక డైలాగు ఉంటుంది.. హీరోయిన్ అక్క చెప్తుంటుంది హీరోయిన్ కి..

"అతడు పార్క్ లాంటి వాడు.. ఒక రెండు రోజుల్లో మొహం మొత్తేస్తాడు. అదే సంజయ్ (హీరో) అయితే అడవి లాంటి వాడు.. రోజుకో కొత్త అనుభవం.. ఏం జరుగుతుందో తెలియదు." అని ఏదో చెప్తుంది.

వినగానే నాకు భలే నచ్చేసింది. కానీ ఆలోచిస్తే.. అందులో లోతు తెలిసింది. పార్క్ మనుష్యుల్లో ఒకటిగా ఉంటుంది. అడవి ఊరికి దూరంగా ఉంటుంది. పార్క్ బోరు కొట్టచ్చు.. అడవి మాత్రం భయపెడుతుంది. వెన్నెల రాత్రి కూడా దడ వచ్చేలా ఉంటుంది. అడవితోనే జీవితం అనుకుంటే... ఇష్టం ఒకటే సరిపోదు, ధైర్యం, సాహసం, ఓపిక, ఎదురించి నిలడం... అన్నింటి కన్నా ముఖ్యం ఊరికి దూరం గా ఉండడం.. ఇవ్వనీ చేయాలి. అడవిని ఆనందించాలి అంటే... అంత guts ఉండాలి.

నువ్వీ ఈ కథ ద్వారా నా మనోభావాలను తెలిపావు. అమ్మాయిలు చాలా ఎమోషనల్.. they take decisions on the spur of the moment అనడం నేను విన్నాను. ఊ..హూ.. Gals r that practical as well!! ఒక్కోసారి ఆ ప్రాక్టికాలటీ పేరుతో మనసైనవి దూరం కూడా చేసుకుంటారు. ఇందులో నువ్వు చూపించిన అమ్మాయి నాకు బాగా నచ్చింది.

కథగా ఇది నీ మొదటి ప్రయత్నం అని తెలిసి ఆశ్చర్యపడ్డాను.. చాలా బాగా రాశావు. కాకపోతే.. ఆ అమ్మాయి మీమాంసని ఇంకా చెప్పాల్సింది అనిపించింది.

చేజారిపోయిన క్షణాలు కోసం మనస్సెంత వెంపర్లాడుతుందో.. నాకు తెలుసు. కానీ ఆ కథ అలా ముగించకుండా ఉండాల్సింది. యాదృచ్చికం గా కలిసినా.. ఇరువురూ బయటపడటానికి ఇంకా కథను నడిపించాల్సింది. ఒకరికొకరు ఇష్టం..కానీ అది ఆ ఇంకొకరికి తెలీదు కదా!!

Sounding too critical? Well, friend= fan+ critic అని నిన్నే నా ఫ్రెండ్ చెప్పాడు. నువ్వేమంటావు?

ఏన్నో రోజులుగా చదువుదామనుకుని.. ఇవ్వాల్టికి చదివాను.. my monday went fine, because of ur story! Thanks!!

Kathi Mahesh Kumar said...

నాకు కథల గురించి పెద్దగా తెలియదు. నా మొదటి ప్రయత్నానికి చాలా విమర్శలే తెచ్చుకున్నాను.

ఒకటి మాత్రం చెప్పగలను, మీ కథ ఆద్యంతం చదివించింది. కాకపోతే ఆఖర్న రావల్సిన emotional high కాస్త తగ్గినట్లనిపించింది.

Srinivas said...

కామెడీ రాయడంలో మీరు చూపుతున్న ప్రతిభ కథలో కనిపడలేదు. కథలు రాయాలనుకుంటే మీరు ఇంకా శ్రమించాలి.

Anonymous said...

ప్రస్తుత పరిస్థితులు బాగానే రాశారు. నేను కూడా ఆ రఘు స్థానంలో ఉండేవాడినేమో నా కలలకి నేనే సమాధి కట్టకబోతే...
అయినా సరే పాతని మరచి కొత్తని ఆహ్వానించమంటుంది నా చిరకాల శత్రువు "కాలం".
మీ కధనం వచ్చే కధలో ఇంకా బాగుండాలని ఆశిస్తున్నా...

గీతాచార్య said...

Serindipity?

Excellently crafted story, but some integrity missed in the first episode.

Cute story with real touch. Kudos. Missed all this time. An interesting read. The ending is well made.